29, ఏప్రిల్ 2019, సోమవారం

ఫాసిజం వస్తోంది.

ఆకాశమంతా చస్తున్న జనాల అరుపులు ఉరుముతాయి,
మీడియా కప్పలు ఉత్సాహంతో బెకబెక మంటాయి,
మితవాద మిడతలు క్షుద్రమంత్రాలు వినిపిస్తాయి, 
ఏ కాగితం చుసినా దాని మీద ఒక అసత్యం రాసి ఉంటుంది,
ఏ గొంతుని కదిపినా భయంతో ఉలిక్కిపడుతుంది,
లేదంటే దయ్యంలా వికటహాసం చేస్తుంది!
అసత్యపు ప్రచారాల రణరొదలో అరిచి అలసి ఎండిన గొంతుకలు ఇంకిపోతాయి, 

చచ్చిపోతాయి, అగరొత్తుల్లా ఎగిరిపోతాయి,
దిగంతాలకవతల పిశాచగణాలు చేపట్టిన రహస్య యజ్ఞం నుంచి లేస్తున్న ద్వేషపు కావిరి ఆకాశాన్ని అలుముకుంటోంది,
భయంకర భయానక ఫాసిస్ట్ కారుమేఘం ఆకాశమంతా ఘనీభవిస్తోంది.
ఆమ్లాన్ని వర్షించబోతోంది. ఆపై ఈ దేశంలో కూర్చొని బొంచేసే వాడి చేతిలోని ప్రతి ముద్ద రక్తం వాసన వస్తుంది.

నవ్వుల పువ్వుల వసంతాల వెన్నల రాత్రుల కుసుమపరాగాల సౌరభానందంలో మునిగిపోయి,
ఎగువ మధ్యతరగతి కుటుంబ సుఖజీవన స్వప్నావస్థనే నిజమనుకొని శాశ్వతమనుకొని పరవశిస్తూ..
GOT మరియు Avengersల రంగుల వెలుగులతో కప్పబడిన కళ్ళతో
ఎప్పుడో ఒకసారి ఊసిపోక వార్తాపత్రికలు తిరగేసే
సుఖజీవన కాముకుల కళ్ళకి గబుక్కున గోచరించదీ సత్యం! వినిపించదీ ఘోరం!

జర్మనీలో గత శతాబ్దంలో..
హిట్లర్ ప్రజాస్వామికంగా ఎదుగుతున్న తరుణంలో అక్కడి ఎగువ మధ్యతరగతి సామజిక వర్గానికి చెందిన అనేక చదువరులు "మనదాకా వచ్చినప్పుడు సంగతి కదా .." అని కాళ్ళు తన్ని నిద్రించిన వారే. శుష్క వేదాంతం మాట్లాడిన సుఖజీవన కాముకులే! వాళ్ళ స్వార్థానికి ఫలితంగానే ప్రపంచంలోని మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు సిగ్గుపడాల్సినంత ఘోరమైన పర్యవసాలకు హిట్లర్ నియంతృత్వ పాలన కారణం అయింది. ఒక చారిత్రిక తప్పిదం ఒకసారి జరిగితే అది పొరపాటు. మళ్ళీ జరిగితే అది మహా పాపం.
ఫాసిజం ఉనికిని ఆదిలోనే గుర్తించటానికి కళ్ళకి కాస్త చరిత్ర తెలిసుండాలి. చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా ఫాసిజం ఒక నియంత పోలికలున్న వ్యక్తి కేంద్రంగానే వ్యాపిస్తుంది. ఇది కాలాతీత సత్యం. చాతనైతే చరిత్ర చదివి చావండి. లేకపోతే నెట్ఫ్లిక్ లో మునిగి ఏడవండి.