7, డిసెంబర్ 2018, శుక్రవారం

తెలుగులో వందేమాతరం

([సంస్కృతంలో] శుభ్రం = తెలుపు, జ్యోత్స్న = వెన్నల, యామిని = రాత్రి, ద్రుమం = చెట్టు, దళం = కొమ్మ, సస్య = మొక్క) "శుభ్రజ్యోత్స్న పులకిత యామిని" తెల్లటి వెన్నెలతో మెరిసే రాత్రి వంటి దానవు .. "ఫుల్లొ కుసుమిత ద్రుమ దళ శోభిని" పూలు పూచిన చెట్టు కొమ్మవంటి అందము కలదానవు .. "సుహాసిని, సుమధుర భాషిణి" అందమైన నవ్వు కలదానవు, చక్కటి నుడి పలికెడి దానవు .. "సుఖదాం, వరదాం మాతరం" సుఖాన్ని వరంగా పొందిన దానవు "వందేమాతరం" అమ్మా నీకు మ్రొక్కెద! "సుజలాం, సుఫలాం, మలయజ సీతలాం, సస్యశ్యామలాం" మంచి నీరు, పండ్లూ, చల్లటి గాలి, చిక్కటి మొక్కలతో నిండినదానవు, "వందేమాతరం" అమ్మా నీకు మ్రొక్కెద! ------------------------ బంకించంద్ర, దుర్గా మాతని ఆరాధిస్తూ రాసుకున్న కావ్యంలోని ఒక ముక్క ఇది. క్రమేపి జాతీయగేయంగా మార్చబడింది.
ఆ మధ్య వాడెవడో తలకి మాసిన దేశభక్తుడు జాతీయగేయం పాడబూని "సునామి బినామీ" అనుకొంటూ ఆముదం గింజలు నమిలి అజీర్తి చేసి కక్కుకుంటున్న అడ్డగాడిదలాగా కూస్తున్న వీడియో చూసాను. కొందరు విరేచనం వచ్చినా దేశభక్తి వచ్చినా ఆపుకోలేరు. వాళ్ళ హావా నడుస్తోందీనాడు. సంస్కృతం విని దాన్ని తెలుగు అనుకోవటం, సంస్కృతం నుండే తెలుగు వచ్చిందని వాళ్ళని వాళ్ళు నమ్మించుకోవటం తెలుగువాళ్ళ పంధా! ఒక్క ముక్క కూడా అర్థం కాట్లేదని మనసుకి తెలుస్తూనే ఉంటుంది, కానీ "ఏమోలే కులంతక్కువ పామర జన్మ, ఎందుకొచ్చింది" అని సరిపెట్టుకుని లెంపలేసుకుంటారు. (వాస్తావనికి బెంగాలీ వాళ్ళని కూడా అక్కడి పండిత వర్గం సంస్కృతమే బెంగాలి భాష మూలం అని నమ్మించింది. పరిశీలించి చూస్తే ఈ జాడ్యం దేశమంతా పాకిపోయింది. దాని గురించి మళ్ళీ చర్చించొచ్చు.) ఈ గేయాన్ని కనీసం ఒకసారైనా అర్థం చేసుకుందామనుకొనే తెలుగు వాళ్ళ కోసం నాకు తెలిసిన కాస్త జ్ఞానాన్ని పోగేసి ఇలా తర్జుమ చేసాను. తప్పులుంటే మన్నించండి, అసలు దైవభాషని తెలుగించాలన్న ప్రయత్నమే నేరమనుకుంటే క్షమించండి.

12, జూన్ 2018, మంగళవారం

కడవుల్

గ్రహాల చివరనున్న చిట్టచివరి గ్రహానికి అవతల అసహాయ శక్తి ఒకటి ఉన్నదంట!
మనిషికి అర్థంకాని, విడదీయరాని విడి కథయే దాని మర్మ మంట!

దానికి భయపడి, దాన్ని కనుగొని, దాన్ని స్తుతించి, ప్రాధేయపడి,
దాని కటాక్షం పొందటం మించిన దారి వేరు లేదంట!

చెయ్య తలచినదంతా ముందుగానే విధి తానే చేసి పెట్టినదంట ..
విధిని మీరదలచిన వాళ్ళ పట్ల కరుణతో కుట్ర పూని, ప్రేమతో ధ్వంసం చేసి పాతిపెట్టునంట!

గుడ్డిగా, చెవిటిగా, వెట్టిగా, వైకల్యంగా, శక్తిహీనంగా పిండాన్ని ఏర్పరచగల పవిత్ర శక్తి అంట!
కుష్టురోగం, పుట్టకురుపులు, చీముపొక్కులు, మూలశంకలు ఇవన్నీ దాని చిత్తమేనంట!
పుండుని తొలిచి బ్రతికే పురుగు పుణ్యం చేస్తే, పునీతయై పునర్జన్మం పొందవచ్చు నంట!

కోట్లకి పతులైన వారిని అతిగా బాధింపక, లాలించి పదిలముగ గతి చేర్చునంట!
కష్టజీవి కష్టాలను చలించక చూచుట, విధి సేయు విలాస మంట!

సమస్త జగత్తుని నడిపిస్తున్న ఆ పవిత్ర దైవ హస్తమే మన చేత యుద్ధములు కూడా చేయించునంట!
హత్యలు ఒనర్చి రక్తధారలు పారించిన రాజుల పుణ్యకథల యశస్సుని సర్వదా అది కాపాడునంట!

అప్పుడు 'అసురులను' చితిపిన ఆ పరాశక్తే ఇప్పుడు అణుబాంబుల చితి పేర్చి
పరదేశంలో పాపమెరుగని ప్రజలను పలహారం చేస్తున్నదంట!
పసివాణి మాంసం సమర్పించి మ్రొక్కిన ఆస్తికులకు వరములిచ్చి దీవించిన చరితగల ఆ పరబ్రహ్మమే!

నీ కన్నవారు, సొంతవారు, నీతో బంధం ఉన్నవారు, చదువు నేర్చినవారు, చదువు నేర్పెడి వారు..
అందరూ భయపెట్టగా ఆ శక్తేదో ఉందని నువ్వూ నమ్ము, ప్రశ్నించక నమ్మి మ్రొక్కు!

మునిగి మ్రొక్కు, బొట్టు పెట్టి మ్రొక్కు, గంట కొట్టి మ్రొక్కు,  హారతి ఇచ్చి మ్రొక్కు,
డప్పు కొట్టి మ్రొక్కు, మీ బుద్ధి చచ్చి చదున య్యేంత వరకు నొక్కి నొక్కి మ్రొక్కు!


------------------------------------------

కడవుల్ (கடவுள்) అంటే తమిళంలో దైవం అని అర్థం. ఆ పదాన్ని కాస్త విరిచి చూస్తే దానర్థం 'కడకి ఆవుల్' అని - అంటే 'చివరికి అవతల' - that, which is beyond the end - అని అర్థం వస్తుంది.

కమల్ హాసన్ రాసిన 'కడవుల్' అనే తమిళ కవితకు నా తెలుగు అనువాదం ఇది. వీలుకోసం ఒకటి రెండు పంక్తుల్ని తొలగించటం జరిగింది.