7, మే 2019, మంగళవారం

కేయాస్

ఈ దేశంలోని ప్రజలని చూడు!
నుదుర్లు చిట్లిన ముఖాలను చూడు
జారిన జవసత్వాలనూ,
కలలు ఇంకిన గాజు కళ్ళనూ,
వంగిపోయిన నడుములూ, ఎండిపోయిన పెదాలనూ చూడు
బెణికిన కాళ్ళనూ, చచ్చిన కోర్కెలను, కుళ్ళిన ఆత్మలను ..
వీధంతా తెగి పడియున్న నాల్కలనూ,
అరవలేని గొంతుకులను, కదల్లేని యువకులనూ,
గర్భాల్లో వణుకుతున్న పిండాలనూ చూడు
కన్నవాళ్ళ మీద క్రోధంతో హర్తాళ్ చేస్తున్న శిశువుల ఏడ్పులు విను
కారుతున్న చీమిడి ముక్కులను చూడు
చుట్టూ మూగిన రక్కసి ఈగలను చూడు
మెదళ్లను తొలుస్తున్న భయాలను,
పరలోక పీడకలలో వణుకుతున్న భక్తులను,
ఆలోచించలేని అర్భక మూకలనూ చూడు
పేలవమైన వాళ్ళ నినాదాలు విను
కులభూతం చేస్తున్న స్వైరవిహారం చూడు,
కులరధాన్ని కాళ్ళరిగేలా లాగుతున్న దళిత-బహుజనులను చూడు,
దోమకన్నా, చీమకన్నా ఏ మాత్రం మెరుగుకాని వీరి జీవితాదర్శాలను చూడు.
-----
బాగుపడిపోయిన పెద్దోళ్ళని చూడు!

పెట్టి పుట్టుకున్న వాళ్ళ కర్మబలం చూడు!

వాళ్ళ కళ్ళల్లోని కామం చూడు, కుట్ర చూడు,
అందమైన రిఫైన్డ్ accent విను.
అమాయకంగా చేసే వారి అన్యాయాలు చూడు, 

మాటల్లోని అసహనం విను, 

లెక్కతప్పని వారి జీవిత గమనాలని చూడు,
అందమైన so called సొగసు చూడు,

నడకలోని bounce గమనించు!

వాళ్ళ రాజకీయ చతురత చూడు,

కరడుగట్టిన వాళ్ళ పట్టుదల చూడు,

అందమైన అబద్ధాలు చూడు,

Subscription తీసుకొని HDలో చూడు!
------
ఈ దేశంలో గొడ్డలికీ, కొడవలికీ తుప్పు పట్టింది,
చరిత్ర చచ్చి భూతాల్లో కలిసిపోయింది,
పళ్లూడిన ముసలి ధర్మదేవత నిద్ర నటిస్తోంది,
బతుకు బజారు పాలైంది.
పైసలుంటే కొను, లేకుంటే చావు - నాలుగు వైపులా ప్రచారం వినిపిస్తోంది.