22, సెప్టెంబర్ 2019, ఆదివారం

నీ వెఱ్ఱి గాని ..


కుంపట్లో కాలుతున్న బొగ్గుకైనా చిగురు రాగలదు
కానీ, కుల పురుగుల మనసుల్లో మాత్రం పశ్చాత్తాపం కలుగదు.
ఆవిరి చిమ్ముతూ ద్వేషాన్ని మరిగించే కర్కశ కాష్టిక్ కుండలు వీళ్ళ గుండెలు!
ఆస్తుల అయస్కాంత ప్రహరీలల్లో బందీలైన కూపస్తు వంశోద్ధారకులు!
వీధిలోకి పోయి వాస్తవమేంటో చూద్దామంటే నాన్నగారు తిడతారు!
జాలి పడటం పురుష లక్షణం కాదని తాతగారు కోప్పడతారు.
మార్కెట్టులో మాటకారితనం చూపకపోతే మావగారు పిల్లనియ్యరు..
పెరట్లో కప్పెట్టిన కోడి పెంటలోని పురుగుల్లాంటి పరాన్నభుక్కు జీవులు!
రక్తసంబంధం అనే primal instinctని మించి ఎదగలేని కుంచిత మనస్కులు..
వీరిలో మానవత్వం చిగురించేనా,
వీరికి వివక్ష అంటే అర్థ మయ్యేనా,
వీరొచ్చిప్పుడు దేశాన్ని ఉద్ధరించేనా!

4, సెప్టెంబర్ 2019, బుధవారం

మార్కెట్ వీధిలో

మార్కెట్ వీధిలో..
తప్పులన్నీ క్షమించబడతాయి
అన్ని నేరాలు కప్పివేయబడతాయి
..
ఘోరం, ఖూనీ, దోపిడీ,
దౌర్జన్యం, అన్యాయం,
కుట్ర, కట్టుకథ, నిర్దాక్షిణ్యం,
అన్నీ ఆమోదించబడతాయి
పూజించబడతాయి, దీవించబడతాయి
..
ప్రతిభావాద దీపాల చీకట్ల క్రింద
పొట్టలుకొట్టే విద్య పట్టాదారులు
సూట్లు వేస్కొని సంచరిస్తారు
అర్థంకాని భాషలో గార్గోయిల్స్ లా మొరుగుతారు
జనాల కళ్ళల్లో confetti కొడతారు
..
వీధినంతా అజ్ఞానపు పొగ వ్యాపించింది
లౌడ్ స్పీకర్లలో అబద్ధం మారుమోగుతుంది
పులిసిన గాలి పీలుస్తూ బ్రతుకుతున్న
మానవ యంత్రాలకు ఆకలవుతుంది,
సైతాను నాలుక తలలో తొలుస్తుంది,
అద్దె చూలులో పురుడు పోసుకున్న బిడ్డను చూసి
మార్కెట్ తన కార్నివోరస్ పళ్లతో ఇకిలిస్తుంది
తళుకుబెళుకు మెరుపుల ఆర్భాటం మధ్య
మార్కెట్ వీధుల్లో మరొక సాయంత్రం గడుస్తుంది.