పెట్టుబడి ఎదుగుదలకి దోహదమైన అంశాలు కాలక్రమంలో ఎలా రూపాంతరం చెందుతాయి?
'సామూహిక సొత్తు' (collective property) అనేది అందరికీ చెందిన సంపద అనుకుంటే, దానికి భిన్నంగా 'వ్యక్తిగత సొత్తు' (private property) అనేది ఒక వ్యక్తికి మాత్రమే చెదిందవుతుంది. ఈ రెండూ పరస్పరం విరుద్ధమైన విషయాలు. అయితే 'వ్యక్తిగత సొత్తు' అనే దాంట్లో కూడా వేర్వేరు రకాలు ఉంటాయి. ఎలాగ? ఒక వ్యక్తి సరిగ్గా తాను చేసిన శ్రమకి సమమైన ఆస్తి పొంది ఉన్నట్లైతే అది ఒక రకం అవుతుంది, అంతే ఆస్తిని వేరొక వ్యక్తి అసలు శ్రమే లేకుండా పొందగలిగుంటే అది వేరే రకం అవుతుంది. కాబట్టి వ్యక్తి చేసే శ్రమకీ, ప్రతిఫలంగా పొందిన ఆస్తికీ మధ్యన అంతరం ఉండే అవకాశం ఉన్నందువళ్ళ ఈ అంతరాన్నిబట్టి 'వ్యక్తిగత సొత్తు'కి వేర్వేరు స్వభావాలు ఉంటాయి. ఈ స్వభావం కాలక్రమేణ ఎలా మారుతూ వస్తుందో చుద్దాము.
ఉత్పత్తి ప్రథమ దశల్లో ఉన్న కాలంలో ఈ 'వ్యక్తిగత సొత్తు' అనేది నిజానికి సమాజ అభివృద్ధికి సహకరిస్తుంది. వేట, వ్యవసాయం వంటి వాటికి ఉపయొగపడే ప్రాథమిక పని ముట్ల తయారీకీ, చిన్న చిన్న చేతి వృత్తి పరిశ్రమలు వగైరా వాటి అభివృద్ధికీ మొదట్లో ఈ 'వ్యక్తిగత సొత్తు' అనేది అవసరమవుతుంది. అంతే గాక శ్రమ చేసేవాణి వ్యక్తిత్వ వికశానికి, స్వేచ్ఛగా ప్రకృతిని అన్వేషించే వెసులుబాటు కల్పించడంలోనూ ఇది దోహదపడుతుంది. ఈ రకమైన ప్రథమ దశ ఉత్పత్తి విధానంలో ప్రతి వ్యక్తికీ కొంత భూమి ఉంటుంది, కొన్ని సొంత పని ముట్లు ఉంటాయి, వీటిని ఉపయోగించి ఉత్పత్తి చేసుకున్న అహారం ఇత్యాదులు సరాసరి అతని పోషణ వరకూ సరిపోతుంటాయి, వ్యక్తి ఎంత శ్రమిస్తే అంత ప్రతిఫలం దక్కుతుందనమాట. నిజానికి ఈ దశలో చూసినప్పుడు 'వ్యక్తిగత సొత్తు' అనేది ప్రమాదకారిగా గాక ఉపకారిగా కనిపిస్తుంది. ఈ విధానంలో పెద్ద మొత్తంలో ఉత్పత్తి జరిగే అవకాశమే ఉండదు. అంటే ఉదాహరణకి చెప్పుకోవలంటే అలాంటి సమాజంలో ఏ సందర్భంలోనూ లక్షల కిలోల ధాన్యాన్ని ఒకే చోటకి చేరవేయాల్సిన అవసరమూ, అవకాశమూ ఉండదు. అదే రకంగా వందలాది మంది మూకుమ్మడిగా శ్రమించి, పరస్పరం సహకరించుకొని ఉమ్మడిగా ఆస్తిని కేంద్రీకరించే అవసరమూ ఉండదు, అసలు అందుకు అవకాశమే ఉండదు. కాలక్రమంలో ఈ తత్త్వమే ఈ విధానానికి ప్రగతి నిరోధకంగా, పెద్ద ఆటంకంగా తయారయి కూర్చుంటుంది. ప్రధానంగా వరదలూ, కరువూ, మొదలైన ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు తట్టుకొని బ్రతకడానికి సరిపడ మిగులుని సృష్టించే వీలు ఈ విధానంలో ఉండకపోవడం వలన ఈ రకం ఉత్పత్తి విధానంలో మనుషులు విడివిడిగా ఒంటరిగా ప్రకృతి దయాదాక్షిణ్యాల మీద అధారపడి జీవించాల్సిందే ననమాట.
ఆశలు వెల్లువెత్తుతాయి, కొత్త కోర్కెలు చిగురిస్తాయి, మనుగడ కోసం మానవుడు చేసే పోరాటంలో కొత్త సత్యాలు బోధపడతాయి! ఉదాహరణకి వందమంది విడివిడిగా వాళ్ళ వాళ్ళ సొంత భూముల్లో వ్యవసాయం చేయటానికీ, అదే వందమంది మూకుమ్మడిగా ఒకేసారి మొత్తం భూమి సాగుచేయటానికి సమర్ధతపరంగా వ్యత్యాసం ఉంటుందన్న సత్యం1 అనుభవపూర్వకంగా అవగతమౌతుంది. కానీ పైన చెప్పుకున్నట్లు ఈ రకమైన శ్రమకేంద్రీకరణ అనేది సాధ్యంకాకుండా 'వ్యక్తిగత సొత్తు' అనే పునాదుల మీద నిర్మితమైన ప్రథమ దశ ఉత్పత్తి విధానం అనేది ఒక తలనొప్పిగా అడ్డొస్తుంది. ప్రగతి నిరోధకంగా దాపరించిన ఈ పాత విధానం నాశనం అయ్యితీరాలి, నాశనం అయ్యితీరుతుంది. దాని నాశనంతో కొత్త మార్పులు రూపుదిద్దుకుంటాయి. అన్నాళ్ళూ విడివిడిగా అనేకమంది 'వ్యక్తిగత సొత్తు'గా ఉన్న భూమి మరియు ఇతర ఉత్పత్తి సాధనాలు ఇప్పుడు కొద్దిమంది చేతుల్లోకొచ్చి చేరతాయి. ఉత్పత్తి ప్రక్రియ సమాజిక లక్షణాలను (social character) సంతరించుకుంటుంది, ఉత్పత్తి సాధనాలు (భూమి, నీరూ, పనిముట్లు మొదలైనవి) మాత్రం కొద్దిమంది చేతుల్లో చిక్కుకొనుంటాయి. అత్యంత అమానవీయమైన రీతిలో, అత్యంత దారుణమైన రీతిలో, దాక్షిణ్యమనేదే లేకుండా, కక్కుర్తిగా ప్రకృతి వనరులు దోచుకోబడతాయి క్రమక్రమంగా కొద్దిమంది 'వ్యక్తిగత సొత్తు'గా మార్చబడతాయి. అలా సత్తాతో సొంతం చేసుకున్న 'వ్యక్తిగత సొత్తు'కి గతంలో మాదిరిగా కాక బిన్న లక్షణాలు ఉంటాయి. ఎలాగ? ఈ తరహా సొత్తులో ప్రకృతి వనరులు మాత్రమే కాక మానవ శ్రమశక్తి కూడా మిళితమై ఉంటుంది - జీతగాళ్ళగా శ్రమ చేసేవాళ్ళు ఈ వ్యవస్థలో అంతర్భాగంగా బంధీలై ఉంటారు. ఆ కాలానికి ఈ పరివర్తనే విప్లవాత్మకమైనదిగా చెల్లుతుంది; దీన్ని వ్యతిరేకించేవాళ్ళు ఛాందసులవుతారు.
క్రమంగా ఈ సమాజ పరివర్తన పూర్తవుతుంది, పాత విధానం ఆనవాల్లు లేకుండా తగలబడుతుంది, ఒక కొత్త పెట్టుపడీదారి ఉత్పత్తి విధానం వేళ్ళూనుకొని దృఢంగా స్థిరపడుతుంది. ఈ క్రమంలో అది ఒక కొత్త వర్గం మనుషుల్ని సృష్టిస్తుంది. వీళ్ళే కార్మికులు - శారీరక శ్రమ మినహాయిస్తే 'వ్యక్తిగత సొత్తు' అని చెప్పుకోడానికి మరే పదార్థం లేని వాళ్ళు. శ్రమ చేయటానికి అవసరమయ్యే ఉత్పత్తి సాధనాలు (భూమి, పరికరాలు వగైరా) సర్వం పెట్టుబడి రూపంలో యజమాని యొక్క 'వ్యక్తిగత సొత్తు'గా ఉంటాయి. ఉత్పత్తి సాధనాలతో కలిస్తేనే శ్రమకి విలువుంటుంది కాబట్టి కార్మికులు తప్పక బ్రతుకుతెరువు కోసం పెట్టుబడి చుట్టూ చేరతారు. వీళ్ళు చేసే సామూహిక శ్రమ పెట్టుబడితో మిళితమైనప్పుడు ఉత్పత్తి సాధ్యమవుతుంది. మునుపటి విధానంలోలా కాక (శ్రమ కేంద్రీకరణం కారణంగా) ఇప్పుడు మరింత సమర్ధవంతంగా ఉత్పత్తి జరుగుతుంది. ఉదాహరణ చెప్పుకోవాలంటే: చరిత్రలో మొదటి సారి లక్షల కిలోల ధాన్యం ఒకే చోట పోగవటానికి అవసరమూ అవకాశమూ రెండూ ఊంటాయి, బోలెడంత మిగులు కూడా సృష్టించబడుతుంది. వందల వేల మంది కార్మికులు పొద్దూ రాత్రి మూకుమ్మడిగా, క్రమశిక్షణతో, పరస్పర సహకారంతో, శ్రమ విభజన చేసుకుంటూ, కర్మాగారాల్లో పని చేస్తుంటారు. గతంలో ఎవరి మానాన వాళ్ళు బ్రతికేవాళ్ళు ఇప్పుడు ఒక సమూహంగా బ్రతకాల్సివస్తుంది. గతంలో మాదిరిగా గాక ఇక్కడ ప్రతి శ్రామికుడు తనవంతు చేసే శ్రమని (తన వ్యక్తిగత అవసరానికి కాక) ఒక ఉమ్మడి పాత్రలో దారపోస్తాడు. ఇలా పోగుచేసిన శ్రమ యొక్క ఫలితాన్ని ఎంత నొక్కిపెట్టుకుంటే పెట్టుబడిదారుడు అంత లాభపడతాడు.
పెట్టుబడిదారీ విధానం బాగా అభివృద్ధి చెందిన తరువాతి దశలో శ్రామికుల శ్రమని దోచుకోవటం అనేది సమాజ నిర్వాహణలో అనివార్య ప్రక్రియగా మారిపోయుంటుంది కాబట్టి ఇంక అది బయటకి దోపిడీగా కనించదు; అమోదనీయమైన సహజమైన విషయంగా చలామణి అవుతుంటుంది. అలాంటి ఉత్పత్తి విధానంలో ఇక ఎవరు ఎవరినుంచి కొత్త తరహాలో దోపిడీ చెయ్యాలని చూస్తారు? దానికి సమాధానం పెట్టుబడిదారీ విధానంలోనే నిక్షిప్తమై ఉంది. ఒకప్పుడు శ్రమని కేంద్రీకరించి పెట్టుబడిగా మార్చిన రీతిలో ఇప్పుడు పెట్టుబడినే కేంద్రీకరించాలని చూసే పెద్ద పెట్టుబడిదారులు అవతారం ఎత్తుతారు. చిన్న పెట్టుబడిదారులను దోచుకొని పెట్టుపడిని తమ 'వ్యక్తిగత సొత్తు'లో విలీనం చేసుకుంటారు. ఒక్క పెద్ద పెట్టుబడిదారుడు పదుల వందల వేల మంది పెట్టుబడిదారుల్ని కొల్లగొడతాడు. ఇదొక నిరంతర ప్రక్రియగా కొనసాగుతూపోతుంది. ప్రపంచంలో వేళ్ళ మీద లెక్కించదగినంత చిన్న సంఖ్యలో ఈ వ్యాపారస్తులు మిగులుతారు వీళ్ళ చేతిలో పెట్టుబడి (ప్రకృతి వనరులు + పోగువేయబడ్డ తరతరాల మానవ శ్రమ శక్తి) కేంద్రీకృతమై ఉంటుంది. జాతి, దేశం, ఖండలులాంటి అవాంతరాలను దాటుకొని ఈ స్వైరవిహారం కొనసాగుతుంది. ఈ దశలో 'వ్యక్తిగత సొత్తు' ఒక భయాన్ని కలిగించే భూతంలా, పెను వైపరిత్యంలా కనిపిస్తుంది.
ఈ మొత్తం ప్రక్రియలో పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం శ్రామికుల్ని మరింత నైపుణ్యంతో, క్రమశిక్షణతో పనిచేయగల, శ్రమతో మేధస్సుతో అత్యంత సమర్ధవంతంగా సంపద సృష్టించగల ఒక సమూహంగా తీర్చిదిద్దుతుంది. గతంలో లాగ విడివిడిగా ఊళ్ళకీ, ఫ్యాక్టరీలకీ పరిమితమై కాక ప్రపంచం జ్ఞానాన్ని పొందుతారు - తద్వార పెట్టుబడియొక్క అంతర్జాతీయతని వీళ్ళు స్వీయానుభవంతో తెలుసుకుంటారు. ప్రపంచంలోని అన్ని జాతుల, దేశాల, ఖండాల కార్మికులు పెద్ద సంఖ్యలో ఏకమవుతారు. మరోపక్క పెద్ద పెట్టుబడీదారుల సంఖ్య కృశించి కృశించి చివరికి ఏకఛత్రాధిపత్యం కిందకి సమస్త పెట్టుబడీ లాగబడుతుంది. పిసినారితనం, అణచివేత, బానిసత్వం, వికారమైన పరిస్థితుల్లో బ్రతకాల్సిన దుర్దశ, సిగ్గులేని దోపిడీ లాంటివి కార్మిక సమాజం తల మీద తాండవం చేస్తాయి. కాని మరోపక్క ఈ దరిద్రావస్థలోనే స్వేచ్ఛాకాంక్ష కూడా అభివృద్ధి అవుతుంది - విప్లవ స్ఫూర్తి, పోరాడే తెగువ కూడా దినం దినం పెరుగుతూ వస్తాయి. ఐక్యమత్యంలోని శక్తిని నరనరాల్లో జీర్ణించుకొని ఉన్న కార్మికులు మూకుమ్మడిగా తిరగబడి ఈ ఏకఛత్రాధిపత్యాన్ని ముక్కలు ముక్కలుగా పగలుకొడతారు. ఈ విప్లవాత్మకమైన పరివర్తనకి భీతిల్లిపోయిన మోనార్కులు 'దౌర్జన్యం, దోపిడీ!' అని అర్తనాదాలు చేస్తారు! అవును ఇది దొపిడీనే, దోపిడీ దారుల నుంచి తరతరాలుగా దోచుకోబడ్డ వాళ్ళు చేసే అంతిమ దోపిడీ! శ్రమని కేంద్రీకరించడానికి, పరిశ్రమలు నిర్మించటానికీ పెట్టుబడీదారీ విధానానికి పట్టినంత సమయం కంటే చాల తక్కువ సమయంలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది.
ఆ తర్వాత ఏం జరగాలి? మళ్ళి పూర్వపు ప్రాథమిక ఉత్పత్తి విధానం పునరావృతం అవుతుందా? ముమ్మాటికీ కాదు. ఒక స్థిరమైన systemలో మార్పు తేవాలంటే (ఆ స్థిరత్వానికి వ్యతిరేకంగా ఉండే) ఒక చర్యని దాని మీద ప్రయోగించాల్సి వస్తుంది; ఫలితంగా అది వేరే రకం స్థిరత్వానికి చేరుకోవచ్చు. ఇప్పుడ మళ్లీ ఈ కొత్త స్థిరత్వానికి వ్యతిరేకంగా చర్య చేస్తే అది తిరిగి పాత స్థిరత్వాన్ని కాక వేరే కొత్త స్థిరత్వానికి చేరుకుంటుంది2. పైన చెప్పుకున్నట్లు చారిత్రకంగా మొదటిరకం ఉత్పత్తి విధానాన్ని కూలదోస్తూ పెట్టుపడిదారీ విధానం ఉద్భవించింది - ఇది మొదటి చర్య. ఆ చర్యని వ్యతిరేకిస్తూ చేసే విప్లవం దానికి ప్రతిచర్య. ఈ చర్య ప్రతిచర్యల తర్వాత మిగిలేది 'పాత' కాదు 'కొత్త'! విప్లవం తర్వాత 'వ్యక్తిగత సొత్తు' అంతిమంగా 'సామూహిక సొత్తు'గా మారుతుంది. మనుషులు పూర్వంలా ఎవరి కోసం వాళ్ళు కాక సమూహంగా తమ కోసం తాము శ్రమిస్తారు. ఈ కొత్త ప్రపంచంలో ఉత్పత్తి సాధనాలు, శ్రమ, అంతిమంగా ఉత్పత్తి అన్నీ సమూహానికి చెందుతాయి.
కార్ల మార్క్స్ రాసిన పెట్టుబడి గ్రంథంలో, మొదటి సంపుటిలోని 32వ చాప్టరుకి స్వేచ్ఛానువాదం
1. గతితార్కిక భౌతికవాద సూత్రల్లో ఒకటి: పరిమాణత్మక మార్పులు స్వాభావిక మార్పులకి దారితీస్తాయి - Quantitative changes lead to qualitative changes.1
2. గతితార్కిక భౌతికవాద సూత్రల్లో ఒకటి: అభావం అభావం చెందినప్పుడు మిగిలేది శూన్యం కాదు - Negation of negation is not nothing, the net is a non-zero change.2