నా చిన్నప్పటి విద్యాభ్యాసమంతా చదువుల కొట్టుల్లోనే సాగింది. చదువుల కొట్టులంటే నా ఉద్దేశ్యం ప్రయివేటు విద్యాసమస్థలని. 1997లో నేను ఏడవ తరగతికి రావటంతో నన్ను కాస్త పెద్ద కొట్టుకి తోలారు, అక్కడ B అనే మందలో కూర్చోబెట్టారు. అక్కడ సహాధ్యాయులందరు ఎంగిలీసులో మాట్లాడేస్తూ, సాక్సులు-షూసులు వేసుకొని, ఫేక్ టైలు మెడకు కట్టుకొని, అట్టలేసున్న పుస్తకాల మీద సూపర్ హీరో లేబుల్ స్టిక్కర్లు అంటించుకొని, మిక్కీ మౌస్ కంపాస్ బాక్సులుతో, WWF హీరోల స్టిక్కర్ల exchangingలో వింతగా కనపడ్డారు. వింతకీ - గొప్పకీ ఆశ్చర్యపోవడం తప్ప వేరువేరుగా స్పందించడం తెలియని రోజులవి. క్లాసు రూములో బిక్కు బిక్కుమంటూ కూర్చున్న నా దగ్గరికి కొంత మంది పిల్లలు వచ్చారు. అందులో తేజా అనే boy "ఒరేయ్, నీకు క్లాస్ లో ఏ రాంక్ వస్తది?" అని అడిగాడు. మాటలో బోలెడంత కాన్ఫిడెన్సు! నాకేం చెప్పాలో తెలీలేదు - ఫస్టు రాంక్ వస్తుందని అబద్ధాలు చెప్పాను. "అయితే నువ్వు నాకు పోటీ!" అని boy వెళ్ళిపోయాడు. నాకు ఏమనుకోవాలో అర్థం కాలేదు. ఏమనుకొని ఉండాల్సిందో ఆలోచిస్తే ఈనాటికి అర్థం కాదు!
వాస్తవానికి ఆరవ తరగతి పాస్ అయ్యేనాటికి వార్షిక పరీక్షల్లో ఏం ర్యాంకు వచ్చిందో అమ్మతోడు నిజంగా నాకు గుర్తులేదు. కానీ అంతవరకు కొట్టులో ఆహ్లాదంగా నేర్చుకున్న అనేకానేక విషయాలు తెలుసునన్న విషయం మాత్రం బాగా గుర్తుంది.
Rectilinear propagation of light తెలుసు,
variable arithmetics తెలుసు,
కెమిస్ట్రీలో elementకి compoundకి వ్యత్యాసం తెలుసు,
plains and plateaus గురించి తెలుసు,
నిజానికి సోక్రటీసు కథ కూడా అప్పటికి తెలుసు!
అన్నిటికంటే స్పష్టంగా ఎకనామిక్స్ లో చదువుకున్న law of diminishing marginal utility తెలుసు. నాకు బాగా గుర్తు 1996లో, కాకినాడలో, ఈశ్వర్ నగర్లో, మోహన్ కాన్వెంట్ అనే ఒక కొట్టులో ఆరవ తరగతి గదిలో మధ్యాహ్నం వేల సోషల్ క్లాసులో ఒక టీచరు ఎకనామిక్స్ మొదటి పాఠం చదువుతూ "human wants are unlimited" అని (వాచక పుస్తకం నుంచి నేరుగా చదివి) ఆరంభించింది. ఆ వాక్యం విన్న కాసేపటివరకు నాకు కాలం ఆగిపోయినట్టే అనిపించింది. ఆ రోజు సాయంత్రం ఇంటికి పోయికూడా ఆ వాక్యాన్ని గురించే ఆలోచించడం నాకు ఇంకా గుర్తుంది. ఇంగ్లీషులో ట్రోజన్ వార్ సప్లిమెంటరీ పుస్తకంలో తరచి తరచి చదివిన గ్రీకు దేవతల గురించి, ఆచిల్లెస్, ఉలిస్సెస్ లాంటి వీరుల గురించి తెలుసు. హేరా, ఆఫ్రొడైట్, ఆతెన దేవతలు ఆపిల్ పండుకోసం పెట్టుకున్న పోటీ ఏకంగా యుద్ధానికే దారి తీసిందని ఆశ్చర్య పోవటం కూడా తెలుసు. అప్పటికి నా వయసు పదకొండు. టెక్స్టు పుస్తకాల్లోని ఆదర్శాలకు స్పందిస్తూ పెరుగుతూ వస్తున్నా కౌమార బాలున్ని. అందానికి, సంగీతానికి స్పందించడమే అప్పటికి నేను ఎరుగుదును గాని, ఈ ర్యాంకింగ్ సిస్టం ఏంటో ఆనాడు అర్థం కాలేదు, ఇప్పటికీ అర్థం కాలేదు. మనిషికి మనిషికి మధ్య ఈ పోటీ దేనికో ఇరవై మూడు సంవత్సరాల తర్వాత కూడా నాకు ప్రశ్నగానే మిగిలిపోయింది. సంపాదించుకున్న జ్ఞానానికి కొలమానాలు పెట్టుకొని వాటిని మెడలో వేలాడేసుకొని, బ్రతికుండడానికి అరహత చూపించుకుంటూ, ఋజువు చేసుకుంటూ, నటిస్తూ భయపడుతూ, భయపెడుతూ కాసులు పోగేసుకొని బ్రతికి చచ్చే ఈ నాగరిక జీవితానికి ఎందుకో ఇంత హైపూ? Primordial soup లో యాదృచ్చికంగా కదిలిన ఆ మొదటి ఏకకణ జీవీకే తెలియాలి ఈనాడు మనుషులు చేరుకున్న ఈ దశని గురించి!
ఈ మధ్యనే నేను ఒక కొత్త కొట్టులో సహాయ ఆచార్యుడిగా కొలువులో చేరాను. జాయిన్ అయిన రెండో రోజు భోజనాల గదిలో సహాధ్యాపకులు/ఆచార్యులు నన్ను చూసీ చూడగానే ఎక్కడ నుంచి పీహెచ్డీ? ఎక్కడ నుంచి పీహెచ్డీ? ఎక్కడ నుంచి మాస్టర్స్? అని అడిగి నా విలువని అంచనా వేయటం మొదలెట్టారు. "జీవితమో గిరిగీసిన సున్నా!" అనుకున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి