2, మార్చి 2015, సోమవారం

జీవిత కష్టాలు

ఏమంటే ఏం చెప్తాము.. ఒకొక్కరిదీ ఒక్కో కష్టం.

- స్టైలిష్ యువకుడా? జోక్స్ వేసే యువకుడా? తేల్చుకోలేక పోతుంది పడుచుపిల్ల.

- caste ఫీలింగు, కన్న కూతురి మీద ownership ఫీలింగు - కడుపులో కత్తులాట ఆడుతున్నాయి పెద్దాయనకి.

- పదో తరగతి పాస్ అయిపోతే జీవితం పూలబాట అయిపోతుందని నలభై ఏళ్ళ క్రితం చెప్తే నమ్మిన ఆ ఆద్మీ, ఈ రోజు పిల్లల పెళ్లిల్లు చేసేస్తేనయినా ఆ పూలబాట ఏదో ఎదురుతుందేమో నని చూస్తున్నాడు.

- ఎక్కడో సుఖంగా జీవిస్తున్న మనుషుల మీద ప్రతీకారంతో  కలంతో కర్కశంగా కారాలు నూరుతూ కవితలు రాసేస్తున్నాడు ఓ ఆవేశ పూరిత కవి.

- DSLR ఫోటోగ్రఫీలో పూర్తిగా మునిగిపోయి తేలటం మర్చిపొయినాడు ఓ యువకుడు!

- భగవంతుని ఇజ్జత్ కాపాడటం కోసం బయలుదేరుతున్నాడో మతోన్మాది. భక్తుడు.

- భాషోద్ధరణ చేయలేక చేతులెత్తేయలని  decide చేస్తున్నాడు ఓ యువ రచయిత.

- "అమ్మాయికి పెళ్లి చెయ్యరా?" అని చచ్చిపోతున్నాడు సంవత్సరికం భోజనాలకు మాత్రం దాపరించే శ్రేయోభిలాషి.

- సరైన ఫిగర్ ని లైన్ లో పెట్టి నలుగురికీ మగతనం చాటి చెప్పుకోవాలని చూస్తున్నాడు యువక్!

- "బోధించిన సన్మార్గ వచనముల బొంకు జేసి దా పట్టిన పట్టు సాధించెనే ఓ మనసా" అని పాడుకుంటాడు త్యాగరాజు.

- స్నేహితుణి exact salary figure తెలియక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు ambitious man ఒక్కడు!

- కష్టం లేకుంటే సుఖం లేదనీ, సుఖం లేకుంటే కష్టం లేదని ఏదేదో చెప్పేస్తున్నాడు సోక్రటీస్.

- "జీవితంలో కావాల్సింది ఇంత కంటే ఏమున్నది?" అని సిన్సియర్ గా ప్రశ్నించుకొంటున్నాడు ప్రేయసిని కౌగిలించుకున్న ప్రేమికుడు.

- "జీవితంలో కావాల్సింది ఇంత కంటే ఏమున్నది?" అని సిన్సియర్ గా ప్రశ్నించుకొంటుంది ప్రేమికుని కౌగిట్లోని ప్రేయసి.

- వెధవలా ఏడుస్తున్నాడు అప్పుడే పుట్టిన పిల్లగాడు.

- వెకిలి మొహం వేస్కోని చూస్తున్నాడు కుర్రవాడు, వెర్రివాడు!

- బుగ్గలో చింతపండు చప్పరిస్తూ, ఆకాశం వైపు చూసి ఆలోచిస్తున్నాడు భవిష్యత్తు కథా నాయకుడు!

- వయొలిన్ నేర్చుకోంటోంది ఎదురుకాలపు మార్గదర్శకుని తల్లి!

- వెకిలి వీరుడి కోసం కల కంటూ మత్తులో మూలుగుతోంది ఓ కన్నె పిల్ల.

- జత కోసం కీచురాళ్ళ జాగారం, లైట్ వెలగంగానే బొద్దింకల ప్రాణభయం.

- "తలుపు కిర్రు మనలా? బానిస పీనుగు మొర్రో మనలా? షావుకారు ముసలాయన హరీ మనలా? దద్దోజనంలో తాలింపు చిటపట లాడలా? వెధవది అన్నీ శబ్దాలేగా ఒకటి శృతి మరొకటి అపశృతినా?" అంటున్నాడు తత్త్వవేత్త.