మనిషి తన జీవితంలో అత్యంత శ్రద్ధగా మరియు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన విద్య ఏమైనా ఉందీ అంటే అది - స్పష్టంగా మాట్లాడగలగటం. మనిషిగా పుట్టి.., తన మనసులోని ఆలోచనలని పదాల రూపంలో పెట్టలేకపోవటం కంటే నిరుత్సాహకరమైనది, విషాదకరమైనది అయిన విషయం మరొకటి ఉండబోదు.
స్పషత అంటే ఏమిటి?
- లోపలి జ్ఞానాన్ని గౌరవిస్తూ.. మనసుని మోసగించకుండా పూర్తి నిజయతీతో మాట్లాడాలని పట్టి పట్టి ప్రయత్నించినప్పుడు స్పష్టీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మానసిక ఆరోగ్యం గలిగిన వారందరికీ జ్ఞానం ఒకే లాగ ఉంటుంది, అందుకనే అందరికి గణితం ఒకే లాగ అర్థమవుతుంది. ఒకరికి సరి అనిపించే గణిత తీర్మానం (theorem) జ్ఞానం పెట్టి చూసినప్పుడు మనుషులందరికీ ఒకే విధంగా సరి అనిపించి తీరుతుంది. తర్ఫీదు లేని కారణంగా అలా చూడలేకపోతే అది వేరే విషయం; కానీ ప్రయత్నించగా ప్రతి మనిషికి గణితం ఒకే లాగ అర్థమవుతుంది అనేది సత్యం. ఇందులో షరతులు లేవు. జ్ఞానం ఒక గణిత పదార్ధం, తర్కం అనేది ఆ లోపలి గణితాన్ని బయటి వాడుకభాషని కట్టిపెట్టే ఒక ఆధారం. మానవులు ఇంత వరకు కనుగొన్న గణితం అంతా ప్రతి ఒక్కరి మెదడుల్లోనూ పుట్టుకతోనే నిక్షిప్తమై యున్నదే. అయితే స్పష్టంగా ఆలోచించాలన్న ఈ తీవ్ర తపన ఉన్న కారణంగా గణిత శాస్త్రజ్ఞులు వాళ్ళ జ్ఞానంలోని లోతుల్ని తెలుసుకొని అక్షర రూపంలో (వాడుకభాషలో) ఆవిష్కరిస్తూ ఉంటారు; సామాన్యులు ఇది చెయ్యరు.. అదే వ్యత్యాసం. చెప్పొచ్చేదేమంటే పూర్తిగా తర్క నియమాలకు మర్యాద ఇస్తూ వాడుకభాషలో మాట్లాట్టమే స్పష్టంగా మాట్లాట్టం. ఇది ఎలా చెయ్యాలి అనేది మన జ్ఞానాన్ని అడిగితే అదే చెప్తుంది! నిజాయితీగా జ్ఞానాన్ని అడుగుతున్నామా లేదా అనేది ఆత్మసాక్షి పర్యవేక్షిస్తుంది! ఆత్మసాక్షి (honesty) లేని వాళ్లకి స్పష్టంగా మాట్లాట్టం అంటే ఏంటో కూడా అర్థం కాదు!స్పష్టంగా మాట్లాడితే లాభం ఏమిటీ?
- "నీ మనసులోని ఒక విషయాన్ని అక్షర రూపంలోకి సందిగ్ధత లేకుండా తర్జుమా చేయలేకపోతున్నావు అని తెలిస్తే.. ఆ విషయం అసలు నీకు అర్థమే కాలేదని అర్థం చేసుకో!" అని నా గురువుమిత్రుడు సోలమన్ ఉపదేశించిన మహా వాక్యం తరచూ గుర్తుకొస్తూ ఉంటుంది నాకు. ఈ వాక్యానికి converse కూడా సత్యమే. అంటే.. "సందిగ్ధత లేకుండా అక్షర రూపంలో ఒక విషయాన్ని వ్యక్త పరచగలిగిన నాడు నీకు ఆ విషయం బోధపడిందని అర్థం చేసుకో" అని. అంటే, ఎన్ని వాక్యాలు స్పష్టంగా రాయగలిగితే అన్ని విషయాలు అర్థమయినట్టు లెక్క! ఎన్ని అస్పష్ట మాటలు మాట్లాడితే అంత ఆత్మవంచన చేస్కుంటున్నామని లెక్క. జీవితంలో వేరే వ్యాపకం లేకపోయినా.. కేవలం మాటల్లో స్పష్టత కోసం ప్రాకులడినా చాలు, జ్ఞానానికి దారులు వాటికి అవే తెరుచుకుంటాయి! ఎందుకంటే, మాటల్లోని స్పష్టత కోసం చేసే ప్రయత్నాలు అనేకానేక ప్రశ్నలని లేవనెత్తుతాయి .. నిజాయితీగా ఆయా ప్రశ్నల్ని నివృత్తి చేసుకొని మళ్ళి మళ్ళి వాక్యాల్ని అమర్చే ప్రయత్నంలో మన లోపలి జ్ఞానం మనకే ఆవిష్కృతం అవుతుంది. 'అర్థం చేసుకోటం' అన్న ప్రక్రియలోని ఆనందానికి అలవాటు పడ్డ ప్రాణాలకి దాని లాభం ఏంటో ప్రత్యేకించి పరిచయం చేయాల్న? అర్థం చేసుకోటంలో ఆనందం చూడలేని మనిషుంటాడనుకోను. సాధ్యం కాదు. ప్రయత్నం చేయని దుర్భాగ్యులు అయితే ఉంటారు బహుశా.సమయం సందర్భం ఉండక్కర్లేదా?
- తర్కం విఫలం అయినప్పుడు (అర్థంపర్థం లేకుండా వాగినప్పుడు) అది సాధారణంగా (safe situationsలో) హాస్యంగా మారుతుంది. కాని తర్కం విఫలమైంది అన్న విషయం judge చేయటానికిగాను కాస్త తర్ఫీదు అవసరం. తర్ఫీదు వల్ల పొందిన మానసిక పరిపక్వత స్థాయితో పాటే sense of humor వైశాల్యం కూడా పెరుగుతుంది. ఉదాహరణకి కార్టూన్ బొమ్మలు ఫిజిక్సుకి అతీతంగా వంగిపోతుంటే సాగిపోతుంటే పిల్లలు నవ్వుతుంటారు.. ఏమంటే వాళ్ళకున్న జ్ఞానానికి అవి illogicalగా కనిపిస్తాయి, ఆ absurdityని చూసి పిల్లలు నవ్వేస్కుంటూ ఉంటారు. కాస్త ఎదిగిన వాళ్ళ జ్ఞానానికి అవి ఉత్త చేతి గీతలని తెలిసిపోయి absurdity మాయం అయిపోతుంది. అందుకనే నవ్వు రాదు. కాని, ఇంకాస్త జ్ఞానం పెంచుకుంటే ఆ బొమ్మలు గీసేవాణి చమత్కార శీలాన్ని గమనిస్తూ నవ్వుకోవచ్చు. అందుకనే అన్నీ తెలిసిన జ్ఞానులకి ఏది చుసిన నవ్వొచ్చేస్తుంటుంది! తర్కపరంగా సరియైన విషయాన్నీ అర్థం చేసుకోలేక, absurd అనుకొని నవ్వేస్తే అది వెలికితనం అవుతుంది. ఆలోచనలో (ఫలితంగా వాక్కులో) స్పష్టత పెరిగేకొద్దీ వెకిలితనం తగ్గుతూ వస్తుంది. ఒక చేత్తో ఈ వెకిలితనం నుంచి మనసుని రక్షించుకుంటూ మరొక చేత్తో హాస్యం అనిపిస్తున్న దాన్ని ఆస్వాదిస్తూ బ్రతకటం కత్తి మీద సాము లాంటిది. కాబట్టి, స్పష్టంగా మాట్లాట్టం అనే విద్యని బాగా పెంపొందించుకొని, అస్పష్ట ప్రేలాపనలోని comedyని ఆశ్వదించటం అనేది win-win వ్యూహం! అవును సమయానికి తగు మాటలాడవలెను మరి!మొత్తంగా?
- ఎంత విరుద్ధాభిప్రాయాలు ఉన్న వ్యక్తులైనా సరే, పూర్తి భిన్నమైన ఇతివృత్తాల నుంచి వచ్చిన వారైనా సరే.. కూర్చొని స్పష్టంగా మాట్లాడుకుంటే తర్కం సహాయంతో ఏకాభిప్రాయానికి వచ్చి తీరతారు. మానవులందరూ తర్కానికి ఏకీభవించటానికి గల కారణం పరిణామ క్రమంలో మిగిలిన జీవులన్నిటితో పోటీపడుతూ మనవ ప్రజ్ఞ రూపుదాల్చుకున్న తీరులోనే ఇమిడి యున్నదేమో ననిపిస్తుంది. బహుశా పరిణామ క్రమంలో మానవ మనుగడకి ఏకాభిప్రయాలు చేరుకోవటం అలవరచుకోడం అనే లక్షణం struggle for survivalలో ఎంతగానో ఉపకరించి ఉండాలి. ఏ సమాజాల్లో అయితే ప్రజలు తమని తాము స్పష్టంగా వ్యక్తపరుచుకొనే స్వేచ్చా వాతావరణం పరిస్థితులు కల్పించబడి ఉంటుందో, వాక్కులో హేతుబద్ధతని శ్రద్ధగా ఆలకించే సంస్కారంగా గల్గిన ప్రజలు ఉంటారో.. ఆయా సమాజాలు వైపరిత్యలను ఎదుర్కొని పురోగమిస్తాయి. తర్కానికి కట్టుబడి క్రమంగా నడుస్తాయన్న నమ్మకంతోనే కోర్టులు, చట్టసభలు అభిప్రాయ బేధాలను తొలగించే వ్యవస్థలుగా మానవులు నియమించుకున్నారు. ఈ వ్యవస్థల్లో జరిగే స్పష్టమైన తార్కిక చర్చలు వాదనలే ఎప్పటికైనా సమాజాల్ని ఉద్ధరించి మనుషుల్ని ఏకం చెయ్యాలి. వితర్క వితండ వాదనలు - భక్తిని భయాన్ని బేధాలని ప్రేరేపించి కృత్రిమమైన ఐక్యమత్యాన్ని తాత్కాలికంగా తీసుకురవోచ్చేమో కాని, సహజమైన ఏకత్వం జ్ఞానం వాళ్ళ గాక మరి దేని వల్లా సాధ్యం కాదు.
(ఈ తరహాలో ఆలోచించినప్పుడు - 'అసలు భూమి, భూమి మీద జీవం ఉణికి - వీటికి అతీతంగా 'తర్కం' అనే సత్యం ఆదినుంచి (?) ఒకటుండి ఉంటుందా? ఏక కన జీవితం నుంచి ఈ సత్యాన్ని explore మరియు exploit చేసుకుంటూ ప్రాణి చివరికి మానవ 'స్థితికి' పరిణామం చెంది ఉంటుందా? వంటి ప్రశ్నలు సైతం తలెత్తుతూ ఉంటాయి. కాని, "భూమి మీద జీవం ఉనికి ఆరంభానికి ముందు.." అనే ఆలోచన చేయనారంభించిన క్షణమే మనకి తెలిసి రావాలి, ఇదంతా ఆలోచిస్తుంది మానవ ప్రజ్ఞేనని.. అందుకనే బహుశా తర్కమే ultimate reality అని 'మనకి' అనిపిస్తుండొచ్చని. మెదడు చెడితేకాని illogical illusions వాస్తవాలుగా తోచవన్నది ఇంకొక సత్యం. మరైతే ఈ Illogical illusions కూడా logical realities లో subsetsగానే ఉంటాయన్నది నా అభిప్రాయం. దీన్ని మరొక వ్యాసంలో కూలంకషంగా, వీలైనంత స్పష్టంగా వ్యక్తపరచటానికి ప్రయత్నిస్తాను.)