వ్యాసం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వ్యాసం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, జులై 2015, మంగళవారం

స్పష్టంగా ఒక నాలుగు మాటలు

మనిషి తన జీవితంలో అత్యంత శ్రద్ధగా మరియు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన విద్య ఏమైనా ఉందీ అంటే అది  - స్పష్టంగా మాట్లాడగలగటం. మనిషిగా పుట్టి.., తన మనసులోని ఆలోచనలని పదాల రూపంలో పెట్టలేకపోవటం కంటే నిరుత్సాహకరమైనది, విషాదకరమైనది అయిన  విషయం మరొకటి ఉండబోదు.

స్పషత అంటే ఏమిటి? 

- లోపలి జ్ఞానాన్ని గౌరవిస్తూ.. మనసుని మోసగించకుండా పూర్తి నిజయతీతో మాట్లాడాలని పట్టి పట్టి ప్రయత్నించినప్పుడు స్పష్టీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మానసిక ఆరోగ్యం గలిగిన వారందరికీ జ్ఞానం ఒకే లాగ ఉంటుంది, అందుకనే అందరికి గణితం ఒకే లాగ అర్థమవుతుంది. ఒకరికి సరి అనిపించే గణిత తీర్మానం (theorem) జ్ఞానం పెట్టి చూసినప్పుడు మనుషులందరికీ ఒకే విధంగా సరి అనిపించి తీరుతుంది. తర్ఫీదు లేని కారణంగా అలా చూడలేకపోతే అది వేరే విషయం; కానీ ప్రయత్నించగా ప్రతి మనిషికి గణితం ఒకే లాగ అర్థమవుతుంది అనేది సత్యం. ఇందులో షరతులు లేవు. జ్ఞానం ఒక గణిత పదార్ధం, తర్కం అనేది ఆ లోపలి గణితాన్ని బయటి వాడుకభాషని కట్టిపెట్టే ఒక ఆధారం. మానవులు ఇంత వరకు కనుగొన్న గణితం అంతా ప్రతి ఒక్కరి మెదడుల్లోనూ పుట్టుకతోనే నిక్షిప్తమై యున్నదే. అయితే స్పష్టంగా ఆలోచించాలన్న ఈ తీవ్ర తపన ఉన్న కారణంగా గణిత శాస్త్రజ్ఞులు వాళ్ళ జ్ఞానంలోని లోతుల్ని తెలుసుకొని అక్షర రూపంలో (వాడుకభాషలో) ఆవిష్కరిస్తూ ఉంటారు; సామాన్యులు ఇది చెయ్యరు.. అదే వ్యత్యాసం. చెప్పొచ్చేదేమంటే పూర్తిగా తర్క నియమాలకు మర్యాద ఇస్తూ  వాడుకభాషలో మాట్లాట్టమే స్పష్టంగా మాట్లాట్టం. ఇది ఎలా చెయ్యాలి అనేది మన జ్ఞానాన్ని అడిగితే అదే చెప్తుంది! నిజాయితీగా జ్ఞానాన్ని అడుగుతున్నామా లేదా అనేది ఆత్మసాక్షి పర్యవేక్షిస్తుంది! ఆత్మసాక్షి (honesty) లేని వాళ్లకి స్పష్టంగా మాట్లాట్టం అంటే ఏంటో కూడా అర్థం కాదు!

స్పష్టంగా మాట్లాడితే లాభం ఏమిటీ?

- "నీ మనసులోని ఒక విషయాన్ని  అక్షర రూపంలోకి సందిగ్ధత లేకుండా తర్జుమా చేయలేకపోతున్నావు అని తెలిస్తే..  ఆ విషయం అసలు నీకు అర్థమే కాలేదని అర్థం చేసుకో!" అని నా గురువుమిత్రుడు సోలమన్ ఉపదేశించిన మహా వాక్యం తరచూ గుర్తుకొస్తూ ఉంటుంది నాకు. ఈ వాక్యానికి converse  కూడా సత్యమే. అంటే.. "సందిగ్ధత లేకుండా అక్షర రూపంలో ఒక విషయాన్ని వ్యక్త పరచగలిగిన నాడు నీకు ఆ విషయం బోధపడిందని అర్థం చేసుకో" అని. అంటే, ఎన్ని వాక్యాలు స్పష్టంగా రాయగలిగితే అన్ని విషయాలు అర్థమయినట్టు లెక్క! ఎన్ని అస్పష్ట మాటలు మాట్లాడితే అంత ఆత్మవంచన చేస్కుంటున్నామని లెక్క. జీవితంలో వేరే వ్యాపకం లేకపోయినా.. కేవలం మాటల్లో స్పష్టత కోసం ప్రాకులడినా చాలు, జ్ఞానానికి దారులు వాటికి అవే తెరుచుకుంటాయి! ఎందుకంటే, మాటల్లోని స్పష్టత కోసం చేసే ప్రయత్నాలు అనేకానేక ప్రశ్నలని లేవనెత్తుతాయి .. నిజాయితీగా ఆయా ప్రశ్నల్ని నివృత్తి చేసుకొని మళ్ళి మళ్ళి వాక్యాల్ని అమర్చే ప్రయత్నంలో మన లోపలి జ్ఞానం మనకే ఆవిష్కృతం అవుతుంది. 'అర్థం చేసుకోటం' అన్న ప్రక్రియలోని ఆనందానికి అలవాటు పడ్డ ప్రాణాలకి దాని లాభం ఏంటో ప్రత్యేకించి పరిచయం చేయాల్న? అర్థం చేసుకోటంలో ఆనందం చూడలేని మనిషుంటాడనుకోను. సాధ్యం కాదు. ప్రయత్నం చేయని దుర్భాగ్యులు అయితే ఉంటారు బహుశా.

సమయం సందర్భం ఉండక్కర్లేదా?

- తర్కం విఫలం అయినప్పుడు (అర్థంపర్థం లేకుండా వాగినప్పుడు) అది సాధారణంగా (safe situationsలో) హాస్యంగా మారుతుంది. కాని తర్కం విఫలమైంది అన్న విషయం judge చేయటానికిగాను కాస్త తర్ఫీదు అవసరం. తర్ఫీదు వల్ల పొందిన మానసిక పరిపక్వత స్థాయితో పాటే sense of humor వైశాల్యం కూడా పెరుగుతుంది. ఉదాహరణకి కార్టూన్ బొమ్మలు ఫిజిక్సుకి అతీతంగా వంగిపోతుంటే సాగిపోతుంటే పిల్లలు నవ్వుతుంటారు.. ఏమంటే వాళ్ళకున్న జ్ఞానానికి అవి illogicalగా కనిపిస్తాయి, ఆ absurdityని చూసి పిల్లలు నవ్వేస్కుంటూ ఉంటారు. కాస్త ఎదిగిన వాళ్ళ జ్ఞానానికి అవి ఉత్త చేతి గీతలని తెలిసిపోయి absurdity మాయం అయిపోతుంది. అందుకనే నవ్వు రాదు. కాని, ఇంకాస్త జ్ఞానం పెంచుకుంటే ఆ బొమ్మలు గీసేవాణి చమత్కార శీలాన్ని గమనిస్తూ నవ్వుకోవచ్చు. అందుకనే అన్నీ తెలిసిన జ్ఞానులకి ఏది చుసిన నవ్వొచ్చేస్తుంటుంది! తర్కపరంగా సరియైన విషయాన్నీ అర్థం చేసుకోలేక, absurd అనుకొని నవ్వేస్తే అది వెలికితనం అవుతుంది. ఆలోచనలో (ఫలితంగా వాక్కులో) స్పష్టత పెరిగేకొద్దీ వెకిలితనం తగ్గుతూ వస్తుంది. ఒక చేత్తో ఈ వెకిలితనం నుంచి మనసుని రక్షించుకుంటూ మరొక చేత్తో హాస్యం అనిపిస్తున్న దాన్ని ఆస్వాదిస్తూ  బ్రతకటం కత్తి మీద సాము లాంటిది. కాబట్టి, స్పష్టంగా మాట్లాట్టం అనే విద్యని బాగా పెంపొందించుకొని, అస్పష్ట ప్రేలాపనలోని comedyని ఆశ్వదించటం అనేది win-win వ్యూహం!  అవును సమయానికి తగు మాటలాడవలెను మరి!

మొత్తంగా?

- ఎంత విరుద్ధాభిప్రాయాలు ఉన్న వ్యక్తులైనా సరే, పూర్తి భిన్నమైన ఇతివృత్తాల నుంచి వచ్చిన వారైనా సరే..  కూర్చొని స్పష్టంగా మాట్లాడుకుంటే తర్కం సహాయంతో ఏకాభిప్రాయానికి వచ్చి తీరతారు. మానవులందరూ తర్కానికి ఏకీభవించటానికి గల కారణం పరిణామ క్రమంలో మిగిలిన జీవులన్నిటితో పోటీపడుతూ మనవ ప్రజ్ఞ రూపుదాల్చుకున్న తీరులోనే ఇమిడి యున్నదేమో ననిపిస్తుంది. బహుశా పరిణామ క్రమంలో మానవ మనుగడకి ఏకాభిప్రయాలు చేరుకోవటం అలవరచుకోడం అనే లక్షణం struggle for survivalలో ఎంతగానో ఉపకరించి ఉండాలి. ఏ సమాజాల్లో అయితే ప్రజలు తమని తాము స్పష్టంగా వ్యక్తపరుచుకొనే స్వేచ్చా వాతావరణం పరిస్థితులు కల్పించబడి ఉంటుందో, వాక్కులో హేతుబద్ధతని  శ్రద్ధగా ఆలకించే సంస్కారంగా గల్గిన ప్రజలు ఉంటారో.. ఆయా సమాజాలు వైపరిత్యలను ఎదుర్కొని పురోగమిస్తాయి. తర్కానికి కట్టుబడి క్రమంగా నడుస్తాయన్న నమ్మకంతోనే కోర్టులు, చట్టసభలు అభిప్రాయ బేధాలను తొలగించే వ్యవస్థలుగా మానవులు నియమించుకున్నారు. ఈ వ్యవస్థల్లో జరిగే స్పష్టమైన తార్కిక చర్చలు వాదనలే ఎప్పటికైనా సమాజాల్ని ఉద్ధరించి మనుషుల్ని ఏకం చెయ్యాలి. వితర్క వితండ వాదనలు - భక్తిని భయాన్ని బేధాలని ప్రేరేపించి  కృత్రిమమైన ఐక్యమత్యాన్ని తాత్కాలికంగా తీసుకురవోచ్చేమో కాని, సహజమైన ఏకత్వం జ్ఞానం వాళ్ళ గాక మరి దేని వల్లా సాధ్యం కాదు.

(ఈ తరహాలో ఆలోచించినప్పుడు - 'అసలు భూమి, భూమి మీద జీవం ఉణికి - వీటికి అతీతంగా 'తర్కం' అనే సత్యం ఆదినుంచి (?) ఒకటుండి ఉంటుందా? ఏక కన జీవితం నుంచి ఈ సత్యాన్ని explore మరియు exploit చేసుకుంటూ ప్రాణి చివరికి మానవ 'స్థితికి' పరిణామం చెంది ఉంటుందా? వంటి ప్రశ్నలు సైతం తలెత్తుతూ ఉంటాయి. కాని, "భూమి మీద జీవం ఉనికి ఆరంభానికి ముందు.." అనే ఆలోచన చేయనారంభించిన  క్షణమే మనకి తెలిసి రావాలి, ఇదంతా ఆలోచిస్తుంది మానవ ప్రజ్ఞేనని.. అందుకనే బహుశా తర్కమే ultimate reality అని  'మనకి' అనిపిస్తుండొచ్చని. మెదడు చెడితేకాని illogical illusions వాస్తవాలుగా తోచవన్నది ఇంకొక సత్యం. మరైతే ఈ Illogical illusions కూడా logical realities లో subsetsగానే ఉంటాయన్నది నా అభిప్రాయం. దీన్ని మరొక వ్యాసంలో కూలంకషంగా, వీలైనంత స్పష్టంగా వ్యక్తపరచటానికి ప్రయత్నిస్తాను.)

చివరిగా?

- స్పష్టంగా మాట్లాట్టం ఏమంత సులువు కాదు. వాడుక భాష మీద దృడమైన పట్టు చాల అవసరం (అసలు దీనికే ఒక జీవితకాలం కృషి అవసరమవుతూ ఉంటుంది). ముఖ్యంగా సరైన పదాల ఎన్నిక, వ్యాకరణ ప్రయోగం, తర్క నియమాలు..  వీటిని చాల నేర్పుగా ఉపయోగించుకొని మాటలోని స్పష్టతని fortify చేసుకోవాలి. అంతకంటే ముందు ఆత్మసాక్షికి ఆ ఆలోచనని బాగా నిశితంగా పరీక్షించే అవకాశం, సమయం కల్పించాలి. అలోచించి నిదానంగా మాట్లాడినా పర్లేదు, అర్థవంతంగా స్పష్టంగా మాట్లాడాలి. ఒక సారి చెప్పిన మాట సంతృప్తికరంగా అనిపించకపోతే మరమ్మత్తు చేసి మళ్ళి చెప్పవచ్చును. తప్పేమీ లేదు. మన అజ్ఞానాన్ని మనమైన క్షమించుకోలేకపోతే  ఇంకెవరు క్షమిస్తారు? ఇలా ప్రయత్నించగా ప్రయత్నించగా .. ఏదోక రోజు జీవితంలో అర్థం చేసుకున్నామని మనల్ని మనం సంతృప్తి పరుచుకోటానికి  ఖచ్చితంగా స్పష్టంగా ఒక నాలుగు మాటలు మిగులుతాయి. నాణ్యమైన జీవితం జీవిస్తే ఈ నాలుగు మాటల్లోనే మొత్తం జీవిత పరమర్థాన్నే ఇమిడ్చే స్థాయి జ్ఞానం బోధపడుతుందేమో? ఎవరికి  యెరుక? జీవితం మొత్తం వాక్కులో ఆలోచనలో స్పష్టత కోసం ప్రాకులాడటానికి మించిన పవిత్రమైన, ఉన్నతమైన, సాటిలేని  కార్యం మరొకటి ఉందనుకోను. 

21, జూన్ 2014, శనివారం

అనువాదాలు - అపార్థాలు - 3


పాటలు: కవి వైరముత్తు, తిరువయాఱు తియాగరాజ స్వామిగళ్!


తెలుగు వాళ్ళు పరభాషీయుల దగ్గర పరువు నిలబెట్టుకోవాల్సిన సందర్భంలో చివరి అస్త్రంగా ప్రయోగించేది సాగర సంగమం సినిమా గురించి ప్రస్తావించటం. ఆ చిత్రంలో "తకిట తదిమి తకిట తదిమి తందానా" అనే పాట తమకి అర్థమైందని ఎవరైనా తెలుగు వాళ్ళు తేలిగ్గా చెప్పేస్తే నా కళ్ళు వాళ్ళని skepticalగా చూస్తాయి.

... హృదయలయల జతుల గతుల తిల్లాన .. (ఏ తిల్లానాని వర్ణిస్తున్నాడు కవి?)

... ఏటిలోని అలలవంటి కంటిలోని కలలు కదిపి 
గుండియలను అందియలుగా చేసి .. (చేసి? ఎవరు  చేసి? చేసి ఏం చేసారు?)

.. పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం 
సప్తగిరులు గా వెలిసే సుస్వరాల గోపురం ... (ఎవరిని 'నువ్వు' అంటున్నాడు? మనుసునా? ..నిజమేనా?)

.. అలరులు కురియగ నాడెనదే అలకల కులుకుల అలమేల్ మంగ..  (ఉన్నట్టుండి అన్నమాచార్య ప్రస్థావన ఏంటి? యాధృచ్చిక ప్రయోగమా? ఏమైనా కారణం ఉందా?)

నా మట్టుకు నాకు వేటూరి గారు రాసిన పంక్తులు అర్థం చేసుకోవటానికి (పైన పెర్కొన్నటువంటి ప్రశ్నలకి హేతుబద్దమైన సమాధానాలకి రావటానికి) రెండు దశాబ్దల కాలం పైగానే పట్టింది అంటే అబద్ధం లేదు. తెలుగు పాటని తెలుగు వాళ్ళకి అర్థమయ్యే లాగా (ఏ ఇంగ్లీషులోనో) వివరించటంకంటే దురదృష్టం లేదు. ఆ కార్యం నేనైతే తలన పెట్టుకోదలచ లేదు.
అర్థం చేసుకోవాలనుకున్న వాళ్ళు కష్టమైనా అర్థం చేసుకుంటారు.  అర్థమైపోయిందని నటించే వాళ్ళకు, సరిపెట్టుకొనే వాళ్ళకు, అసలు అంత అర్థమైపోవాల్సింది ఏముందని తీసిపారేసే వాళ్ళకు నేను చెప్పేదేమీ లేదు.

చిత్రంలోని ఇతివృతాన్ని బట్టి ఈ పాట - ఒక విఫల నాట్యకళాకారుడు మద్యం త్రాగి ప్రేలాపిస్తున్నట్టుగా ఉండాలి, కాని పదాల్లో లోతైన జీవితానుభం ధ్వనించాలి, భావం వైరాగ్యంతో  నిండి ఉండాలి, గట్టి తత్త్వం వినపడాలి - కాని మద్యం త్రాగి ప్రేలాపిస్తున్నట్టుగా ఉండాలి! అలాంటి మహా కఠినమైన సమస్యని ఈ పాట ద్వారా వేటూరి గారు అద్భుతంగా పూరించారు. దాన్ని అరవనాట తమిళ కవి వైరముత్తు గారు దత్తతు తీసుకొని వేరే విధంగా తీర్చి దిద్దారు. ఒకప్పుడు త్యాగరాజులు వారు తెలుగులో గీతాలు ఆలపిస్తే వాటిని అర్థం చేసుకొని మరి తమిళనాట ఆలపించిన రోజులు కలవు. ఈనాడు తెలుగు పాటని తమిళించటం చాల చాల అరుదైన మాటయిపోయింది. తెలుగునాట శక్తివంతమైన సినిమాలు ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చుండుంటే వేటూరి గారివి మరిన్ని పాటలని వైరముత్తు లాంటి వాళ్ళు ఎలా దత్తతు తీసుకొని ఉందురో ముచ్చటగా చూసుండే వాళ్ళం. కాని దురదృష్టం -  అరువు తెచ్చుకున్నంత మోతాదులో అప్పివ్వ లేకపోయాము.

వైరముత్తు గారి చేత అనువదింపబడిన వేటూరి మార్కు తెలుగు పాటని మరల తెలుగించి అందిస్తున్నాను. వేటూరి గారి ఉపమానాల complexityలో పది శాతం కూడా వైరముత్తు గారు అందుకోలేదు (అందుకోవాలనుకోలేదో?). సరళికృతం (simplify) చేస్తూనే మాతృకని గౌరవిస్తూ సందర్భానుసారంగా పాటని నడిపించారు.

పల్లవి:
తకిట తదిమి తకిట తదిమి తందానా 
ఇదయ ఒలియిన్ జతియిల్ ఎనదు తిల్లానా 
ఇరుదయమ్ అడిక్కడి ఇరన్దదు ఎన్బేనా?
ఎన్ కదై ఎళుదిడ మరుక్కుదు ఎన్ పేనా!
* (చురుదియుమ్ లయముమ్ ఓన్-ఱు సేర.. ) *

తకిట తదిమి తకిట తదిమి తందానా 
హృదయం చప్పుడుకి జతగా నా తిల్లాన
గుండె మాటిమాటికి (కొట్టుకున్న ప్రతిసారి కొంత)  చనిపోతుందని చెప్పెదనా?
* (శృతిని లయను ఒకటిగా చేర్చి.. ) *
నా కథ రాయటానికి నిరాకరిస్తోంది నా కలం!

చరణం 1:
ఉలగ వాళ్ క్కై నటనం - నీ ఒప్పుక్కొండ పయనం
అదు ముడియంబోదు తొడంగుం - నీ తొడంగుమ్బోదు ముడియుం

భౌతిక జీవితం ఓ నటనం  - నువ్వు ఒపుకొని ప్రారంభించిన పయనం
అది ముగిసినప్పుడు నువ్వు ప్రారంభం అవుదువు - నువ్వు ప్రారంభం అయినప్పుడు అది ముగియును!

మనిదన్ దినముమ్ అలైయిల్ అలైయుమ్ కుమిళి
తెరియుం తెరిన్దుమ్ మనమే కలంగాదిరు నీ.. 
తాలం ఇంగు తప్పవిల్లై
యార్ మీదుం తప్పు ఇల్లై 
కాల్ గల్ పోన పాదై ఎందన్ ఎల్లై!

మనుషుడు నిత్యం అలలో కదిలేటి బుడగ 
తెలిసి తెలిసి మనసా బాధ పడకు నువ్వు!
ఇక్కడ తాలం ఏమి తప్పలేదు.. 
ఎవరి మీద తప్పు లేదు 
కాళ్ళు ఒకప్పుడు పయనించిన మార్గమే (నా గతమే) నాకు హద్దు!

చరణం 2
పళయ కాలం మరందు - నీ పరందదెన్న పిరిందు?
ఇరవుతోరుం అళుదు - ఎన్ ఇరండుం కన్నుం పళుదు!

(మనసా..)
గడిచిన రోజుల్ని (గతాన్ని) మరువు  - నువ్వు పొందునది ఏంటి విరిగిపోయి?
రాత్రి మొత్తం ఏడ్చి - నా కళ్ళైతే బాగు పడ్డాయి! (ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నాయి!)

ఇదు ఒరు రగసియ నాడకమే 
అలైగలిల్ కులున్గిడుం ఓడం నానే!
పావం ఉండు బావం ఇల్లై 
వాళ్ క్కై ఓడు కోబం ఇల్లై 
కాదల్ ఎన్నై కాదలిక్క విల్లై! 

ఇది ఒక రహస్య నాటకమే
అలలు కుదిపిన ఓడను నేనే!
ఆలోచనలో పాపం ఏది లేదు.. 
జీవితం నన్ను కోపగించుకోలేదు.. 
ప్రేమ నన్ను ప్రేమించలేదు!

15, జూన్ 2014, ఆదివారం

అనువాదాలు - అపార్థాలు - 2

గత టపాలో నేను అరవటం చాల అరిచాను కాని, నా బాధని ఎంత వరకు అర్థమయ్యేలా వ్యక్తప-అరిచాను అనేది తెలీకుండా ఉంది. అందుకనే మరొక సారి ప్రయత్నించ దలచాను.

క్లుప్తంగా చెప్పాలి అంటే, సినిమా సంగీత సాహిత్యాన్ని గురించి ప్రస్తావిస్తూ:

1. భావాన్ని  అశ్వాదించటం కంటే.. వినటానికి బాగుంటే చాలు అన్న ధోరణి తెలుగు ప్రజల్లో బాగా ఇంకిపోయింది అని ఆవేదన వ్యక్తపరిచే ప్రయత్నం చేశాను.

2. జనాల్లో అభిరుచి కరువవటంతో రచయితలూ పైపై మేరుగులున్న సాహిత్యాన్ని బడాయి పదప్రయోగాల ముసుగులో colorful packing చేసి delivery చేస్తున్నారు అని ఆరోపించాను.

3. అటు జనాల్లో, ఇటు రచయితల్లో - సంస్కృత పద ప్రయోగాల (అర్థం కాకపోయినా పర్లేదు చెప్పేది sanskritize చేసి చెప్పు అనే ధోరణి) పట్ల మోజు చాల స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. వాడుక పదాలు, నిత్యజీవితంలోని సామాన్యులు తారస పడే విషయాలతో పాటలు రాయపడటం చాల అరుదు అయిపోతుంది. ప్రస్తుత ధోరణి లెక్కన చుస్తే
"దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా?" 
"కోటి నదులు ధనుష్కోటిలోనుండగ ఏటికి తిరిగెదవే ఓ మనసా?"
అని ఎవరైనా రాస్తారా? రాస్తే దాన్ని జనాలు మరి-మరి వింటారా? అనేది నాకు ప్రశ్నార్థకం. నేను hypercritical గా మాట్లాడుతున్నాను అని ఎవరైనా అంటే, స్వాగతం. నా సందేహం నాది మరి.

4. ఇరండాం ఉలగమ్ అనే తమిళ సినిమాలో ఒక పాటలో వైరముత్తు గారు ఈ విధంగా రాసుకున్నారు:
"నాన్ ఎట్టు దిక్కుం అలైగిరేన్.. నీ ఇల్లై ఎండ్రు పోవద?
అడి పట్ట్రి ఎరియుం కాటులె నాన్ పట్టాంపూచి ఆవదా?"
పదానికి పదం తర్జుమా :
"నేను ఎనిమిది దిక్కులూ తిరుగుతున్నాను.. నువ్వు లేవని వెళ్ళిపోవుటనా?
నిప్పు అంటుకొని రాగిపోతున్న అడవిలో నేను సీతకోకచిలుక అవ్వుటనా?"

నిత్య జీవితంలో మాట్లాడుకొనే భాషతో అద్భుతమైన భావావేశాన్ని వ్యక్త పరిచేటువంటి ఇలాంటి సాహిత్యాన్ని తెలుగులో వింటామా/వింటాన? అనేది ప్రశ్న. (ఎంకి పాటలు విని చాల కాలం ఆ సుబ్బారావు ఎవడో ఏమి చదువుకోని పామరుడు అయుంటాడు అనుకొనేవాడిని. నా తర్ఫీదు అలాంటిది మరి! చదివేస్తే ఉన్న తెలుగు పోవాలని కదా లెక్క మరి? తమిళ నాట విద్యాభ్యాసం చేసినందుకో ఏమో నండూరి సుబ్బారావు గారు సుబ్బారావు అయిపొయినారు!)

5. వినటానికి కూసింత కష్టంగా అనిపించినా కూడా భావానికి ప్రాధాన్యం ఇచ్చి పదాలను తన పాండిత్యంతో ఏరి ఏరి ఎన్నిక చేసి మరీ అద్భుత సాహిత్యాన్ని అందించిన వేటూరి గారిని కొనియాడటం నా ప్రధాన ఉద్దేశ్యం. వీలు చేసుకొని ఈ బ్లాగ్ ఒకసారి చూడమని నా ప్రార్థన: http://jhummandinadam.blogspot.fr/2010/10/blog-post.html. ఆ బ్లాగ్ నుంచి ఒక అనువాదాన్ని కాపీ కొట్టి ఇక్కడ పెడుతున్నాను. వేటూరి గారు అనువాదం చేయటానికి ఎంత శ్రమ తీసుకున్నారో అర్థం చేసుకో గలుగుతారు. వాస్తవానికి branded imported సరుకు అనగానే, రెహమాన్ సంగీతం అనగానే వంకలు వెతక్కుండా చప్పరించగలరు మన తెలుగు వాళ్ళు. అయినా కూడా ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తించిన తీరుని కొనియడక ఉండలేను.

చిత్రం : విలన్ ౨౦౧౦
గాయకులు : అనురాధా శ్రీరాం, నరేష్ అయ్యర్
సంగీతం : ఏ ఆర్ రహ్మాన్
రచన : వేటూరి

======================================
తమిళ పాట - తెలుగు అనువాదము - తెలుగు పాట:
======================================
కాట్టుచ్ చిఱుక్కి కాట్టుచ్ చిఱుక్కి యార్ కాట్టుచ్ చిఱుక్కి ఇవ?
మళై కొడుప్పాళో? ఇడి ఇడిప్పాళో? మాయమాయ్ పోవాళో?

ఆడవి పోరి అడవిపోరి ఎవరి అడవి పోరి ఇది?
వర్షం ఇస్తుందో? ఉరుములా ఉరుముతుందో? లేక మాయమై పోతుందా?
 

కానల చిలక కానల చిలక ఏ కాన చిలక ఇది (విన సొంపుగా ఉన్నది తెలుగు వర్షన్ పల్లవే)
చినుకౌతుందో పిడుగౌతుందో మాయమైపోతుందో 


ఈక్కి మిన్నల్ అడిక్కుదడి  యాత్తే
ఈరక్కొల తుడిక్కుదడి  యాత్తే

పుల్ల మెరుపు మెరిసెనే - అమ్మో
కాలేయం అల్లాడెనులే - అమ్మో

కులుకుమని మెరుపొస్తే - వస్తే (భావం అదే; పదప్రయోగం వేరే)
ఉలికిపడి నేనుంటే - ఉంటే (భావం అదే; పదప్రయోగం వేరే)


నచ్చుమనం మచ్చినియోడు మచ్చినియోడు మరుగుదడి
అవ నెత్తియిల్ వచ్చ పొట్టుల  ఎన్ నెంజాంకుళియే ఒట్టుదే
అవ పార్వైయిల్ ఎలుంబుగ పల్పొడి ఆచ్చే

విషపూరిత మనసు మరదలుతోటి మరదలితోటి సోలుతున్నదిలే
దాని నుదుట పెట్టిన బొట్టులో నా గుండెకాయే అంటుకున్నదిలే
దాని చూపులో ఎముకలు దంతపొడి అయ్యనే (ఇక్కడ వైరముత్తు భావమే గొప్పగా ఉన్నది)
 

ఎందుకో చెప్పగరాని తప్పుడు వాంఛ కలిగినదే (కొత్త భావము)
అది పెట్టిన ఎర్రనిబొట్టది, నా గుండెకు గుచ్చుకుపోయెనే  (భావం అదే; పదప్రయోగం వేరే)
కొస చూపుకు ఎముకలు పొడిపొడి ఆయెనే  


యారో ఎవళో యారో ఎవళో యార్ కాట్టుచ్ చిఱుక్కి ఇవ?
మళై కొడుప్పాళో? ఇడి ఇడిప్పాళో? మాయమాయ్ పోవాళో?

ఎవరో ఎవతో ఎవరో ఎవతో  ఎవరి అడవి పోరి ఇది?
వర్షం ఇస్తుందో? ఉరుములా ఉరుముతుందో? లేక మాయమై పోతుందా?
ఏవరో ఎవరో ఈ చిలకెవరో ఎక్కడి చిలక ఇది
చినుకౌతుందో పిడుగౌతుందో మాయమైపోతుందో 


తండై అణింజవ కొండై సరింజదుం అండసరాసరం పోచ్చు
వండు తొడాముగం కండు వనాందరం వాంగుదే పెరుమూచ్చు

అందెలు తొడిగినమగువ కొప్పు జారగ అండబ్రహ్మాండము కూలెను
తుమ్మెదతాకని (పువ్వుపోలిన) ముఖము చూసి వనాంతరం నిట్టూర్చెను
 

కాలికి సిరులు గాలికి కురులు కన్నలోకమే సై సై (మిత్రులెవరైనా ఈ లైన్ కి అర్థము చెప్తే బాగుండు)
తుమ్మెదలంటని కమ్మని మోమును కన్న వనాలే హాయ్ హాయ్ (భావం అదే; పదప్రయోగం వేరే)


చరణం 1
ఉచ్చందల వగిడు వళి ఒత్త మనం అలైయుదడి
ఒదట్టువరి పళ్ళత్తుల ఉసిరు విళుందు తవిక్కుదడి
పాళాప్పోన మనసు పసియెడుత్తు కొణ్డ పత్తియత్త ముఱిక్కుదడి

నుదుటి పాపిటదారిలో ఏకాకిలా (నా) మనసు తిరుగుతున్నది
అదరమదతలోని(lip-wrinkle) పల్లములో (నా) ప్రాణం పడి అలమటిస్తున్నది
పాశిన మనసు ఆకలిగొని పూనిన పథ్యాన్ని మరిచెనులే
 

పరువాలపాపిటిలో తిరిగాను ఒంటరిగా (భావం అదే; పదప్రయోగం వేరే)
అధరాల కనుమలలో పడికొట్టుకుంటున్నా (భావం అదే; పదప్రయోగం వేరే)
ఎటూపోని మనసు గురిసడలి విరహముతో పొగలినది (కొత్త భావము)


పాఱాంగల్ల సుమందు వళి మఱందు  ఒరు నత్తక్కుట్టి నగరుదడి
కెణ్డక్కాలు సెవప్పుం మూక్కు వనప్పుం  ఎన్నక్ కిఱుక్కును సిరిక్కుదడి

బండరాయిని మోస్తూ దారితప్పి ఒక నత్తపిల్ల పాకుతున్నది
(నీ)పిక్కల ఎఱుపూ ముక్కు సొగసూ నన్ను పిచ్చోడని నువ్వుతున్నాయి
 

కొండంతబరువు, గుండె చెరువు ఓ నత్తగుల్ల బతుకు ఇది (వినుచుండగా తెలుగు భావమో ఇంపుగా/గొప్పగా ఉన్నది)
ఎర్రని మడమ ముక్కు సొగసు పిచ్చివాణ్ణిచేసి నవ్వుతున్నవి (వినుచుండగా తెలుగు భావమో ఇంపుగా/గొప్పగా ఉన్నది)


చరణం 2
ఏర్ కిళిచ్చ తడత్తు వళి నీర్ కిళిచ్చు పోవదు పోల్ (Typical వైరముత్తు భావం)
నీ కిళిచ్చ కోట్టు వళి నీళుదడి ఎంపొళప్పు 

నాగలి గీసిన సాలులో నీరు దూసుకెళ్ళినట్టు
నువ్వు గీసిన గీటులో సాగెను నాబ్రతుకు
 

నాగేటి సాలులలో సాగేటి నీరనుకో
నీగీటుదాటని నా మనసంత నీదనుకో


ఊరాన్ కాట్టు కనియే ఒన్న నెనచ్చు నెంజు సప్పుక్కొట్టిత్ తుడిక్కుదడి
యాత్తే ఇదు సరియా ఇల్ల తవఱా నెంజిల్ కత్తిచ్ సణ్డై నడక్కుదడి
ఒన్న మున్న నిఱుత్తి ఎన్న నడత్తి కెట్ట విది వందు సిరిక్కుదడి(ఈ లైన్ లు తమిళంలో బావున్నాయి)

పరాయివారి అడవిఫలమా నిన్ను తలచి మది లొట్టెలేసి తపించెనే
అమ్మో ఇది ధర్మమో అధర్మమో తెలియక మదిలో కత్తి యుద్ధము జరిగుతున్నది
నిన్ను ముందునిలిపించి నన్ను (నీవైపు) నడిపించి కుళ్ళిన విధి నవ్వుతున్నది
 

పొరుగింటి సొగసు చూసి మనసు కాస్త గట్టు దాటి పోయినది  (భావమూ; ప్రయోగమూ వేరే)
ఓలమ్మొ ఇది తప్పో, లేక ఒప్పో - లోన కత్తిపోరు సాగుతున్నది
నన్ను నిలబెట్టి  విడగొట్టి చెడ్డ విధి వెర్రిగా నవ్వింది. 



6. ఇక పొతే అసలు ఈ గోల అంతా దేనికి అంటారా?
  - పాలు - నీళ్ళని వేరు చేసి చూపించటానికి అంటాను.

7. అది చెయ్యటానికి నేనెవరిని అంటారా?
  - లెంపలేస్కోని.. మళ్ళి ఇంకొక టపా రాస్తాను.

29, ఏప్రిల్ 2013, సోమవారం

ఎవరు? నేనా?

అది కాదు నేను చెప్తుంది.
ఇంకొకసారి చెప్తాను విను.
ఈ సారి శ్రద్ధగా విను.
నేను చెప్పేది ఉచితమా-కాదా? అర్థవంతమా-కాదా? అవసరమా-కాదా? ఇవన్నీ తర్వాత లెక్కలు వేసుకో. అదీ కలిసే వేద్దాం. ప్రస్థుతానికి నేను చెప్తుంది మాత్రం విని అర్థం చేసుకోడానికి ప్రయత్నించు.

ఆస్తికుడు చెప్పినట్టు సర్వం దైవనిర్ణితమనే అనుకుందాం, కాసేపు. 'సర్వం' అంటే ఎంత పెద్ద మాటో అర్థమవుతుంది  కదా నీకు? సర్వం అంటే సర్వం! దైవాన్ని నమ్ముతున్నాననీ, దైవాన్ని పట్ల భయభక్తులు కలవాణ్ణనీ చెప్పుకోనేవాడికి  ఆ దైవం మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ఈ సర్వానికి పరిధులు విదించజాలడు. సర్వం అంటే సర్వం అంతే. షరతలు ఏం ఇక వర్తించవు! ఆకాశం చివరి ఎక్కడో ఉన్న నక్షత్ర మండలంలో ఏ దుమ్ము రేణువు ఏ క్షణానికి ఏ దిశగా కదలాలి, ఈ పాలపుంతలో అణువంత ఈ భూమి మీద ఒక మనిషి ఎవరికి - ఎప్పుడు - ఎలా పుట్టాలి, పుట్టిన మరు క్షణం ఏ కాళు - ఏ దిశలో - ఎంత వేగంతో - ఎలా  కదపాలి మొదలుకొని,  ఆయుష్షు అయిపోయిన వేళ చచ్చే క్షణం చివరి గుటక ఎలా వెయ్యాలి, కళ్ళు ఏ దిక్కువైపు - ఎలా తేలవేయ్యాలి వరకు మొత్తం ప్రతి భౌతిక-ఆంతరంగిక  క్రియనీ దైవం నిర్ణయించి నిన్ను- నన్ను  వదిలాడనే కదా అర్థం? మనసులో మెదిలే ప్రతి చినుకంత ఆలోచన, చెడైనా - మంచైనా, ప్రతి చినుకంత ఆలోచన ఏదైనా.. భగవాన్ ప్రమేయం లేకుండా రాలేదనే కదా అర్థం? ఇక దైవాన్ని నమ్మటం - నమ్మకపోవటం,  భగవాన్ని ప్రార్థించటం - ప్రార్థించకపోవటం ఇవన్ని భగవాన్ ఆదేశం వళ్ళ తామంతట తాము సాగిపోతున్న ప్రక్రియలే కానీ నువ్వు - నేను అలోచించి - నిర్ణయించి - శరీరంతో తాదాత్మ్యం చెంది చేయగలిగే పని అంటూ ఏమైనా మిగిలి ఉందా అసలు?  "భగవంతుడు ఉన్నాడు" అన్నది hypothesis అయితే ఇవన్ని కచ్చితంగా దాన్ని అనుసరించి తీరాలి. ఒకవేళ అలా కాకుండా దైవప్రమేయం లేకుండా మనకి ఆలోచన చేసే స్వేచ్చ ఉంది అనుకో, అలాంటి పరిస్థితి దైవశక్తికి, దైవం ఉనికికే సవాలుగా మారగలదు. ఉదాహరణకి నా ఆలోచన మీద దైవానికి జ్ఞానం లేదనుకో - కేవలం నా భౌతిక కర్మలు 'చూసి' మాత్రమే దైవం నన్ను అర్థం చేసుకోగలడు అనుకో.. దైవాన్ని అందరం వెర్రి వెదవని చేసి ఆడించొచ్చు, ఏమంటావ్? అంతేగా? ఆలోచన ఎంత కుటిలమైనది అయినా గట్టిగా స్నానం చేసి గుడికి వెళ్ళి నాటకం ఆడగానే దైవం వెర్రి మొహం వేసుకొని దీవిస్తాడని అర్థం వస్తుంది. 'లేదు ఆలోచన చేయటం వరకు మనచేతిలోనే ఉందీ, ఆపై  అది దైవానికి వెంటనే తెలిసిపోతుంది' అన్నావనుకో, భగవాన్ని మనం ఆశ్చర్య పరచగలం అనేకదా అర్థం? అంటే భగవాన్ తన విశ్వప్రణాళికని మనం (తెలిసో-తెలియకో) మార్పిస్తున్నామనేగా అర్థం? అంటే భగవాన్కి కూడా భవిష్యత్ కొత్తగానే ఉంటుందని అర్థం! ఏదేమైనా మన ఆలోచన దైవం అదీనంలో లేకపోతే అలాంటి సగం శక్తి కల దైవ-నమూనా సృష్టిని పూర్తిగా కాక పాక్షికంగా మాత్రమే వివరిస్తుందని అర్థం వస్తుంది. అంటే అలాంటి సందర్భంలో దైవం అన్న hypothesis పూర్తిగా మనకి సమాధానాలు ఇవ్వలేకపోతుంది అని, సైద్ధాంతికంగా ఆస్తికత్వం చతికల పడే పరిస్థితి వస్తుందని తేలిగ్గా నిరూపించవచ్చు. కాబట్టి ఆస్తికత్వం నిజమైతే, అంటే ఈ చుట్టూ సాగుతున్న ఈ సృష్టికి దైవం అనేది సమాధానం అయినట్లయితే.., నేను, నా సుఖం, నా ఆకలి, నా దురద, నా కామం, నా ఆలోచన, నేను చేసే పని, నా చేత చేయబడే పనీ, నేను వినేది, విననిది, చూసేది, చూడనిది, చుడలేనిది ఇవేవి నా ప్రమేయం లేకుండా నేను పొందుతున్న అనుభూతులు మాత్రమే. 'నేను ఉన్నాను' అన్న భావన మొదటిసారి 'నాకు' కలిగిన క్షణం నుంచి ఈ క్షణం వరకు 'నేను' చేసిందేమీ లేదు, చేయబోయేది ఏమిలేదు, చేయగలిగేదీ ఏమి లేదు. ప్రతి చినుకంత ఆలోచన దైవం కలిగిస్తున్నదే!

ఈ గతిలేని ఉక్కిరి-బిక్కిరి పరిస్థితి ఎందుకో మానవ హృదయానికి (అహానికి) నచ్చదు. దైవం సర్వాన్ని నడిపిస్తున్నాడు అన్న hypothesisని కాసేపు పక్కన పెట్టి భౌతికవాదం వైపు చూసాం అనుకో, దూరనుంచి 'మన జన్మలు మరీ అంత దిక్కులేనివి కావేమో?!'  అన్న ఒక ఆశాకిరణం కనిపించినట్టు అనిపిస్తుంది. కాస్త దగ్గరకి వెళ్లి చూద్దాం.

భౌతికవాదం ఏం చెప్తుంది? నువ్వూ నేనూ ఈ భూమి మీద చాల కాలం క్రితం ఏక కణ జీవులుగా అవతారం దాల్చక మునుపే భూమికి మాత్రమే పరిమితంకాకుండా అనంతం వరకు విశ్వమంతా వ్యపించి ఉన్న ఈ భౌతిక పదార్థం కొన్ని సిద్ధాంతాలను అనుసరించి నడుస్తుందనీ, ఈ సిద్ధాంతాలను అన్నిటిని అర్థం చేస్కున్న వేళ జీవం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకోవచ్చును అనీ,  అత్యంత నిగూఢంగా దాగి ఉన్న ఈ భౌతిక శాస్త్ర సిద్ధాంతాలను ప్రయోగాలతో - తర్కంతో చేదించి బయట ఉన్న ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవటం వల్ల మొత్తం సృష్టిని అర్థం చెసుకొవచ్చునూ అనీ చెప్తుంది. అది ఒక ఆశ. ఒక నమ్మకం. ఒక్క assumption. ఒక చిన్న ధైర్యం. అసలు భౌతిక సత్యం తెలుసుకొనే విధంగా మన (ఆ మాటకి వస్తే ఏ గ్రాహం మీద ఏ జీవిదైన..) మేధస్సు నిర్మించబదిందా-లేదా అన్నది మనకి తెలియదు.. కాని ఏమీ తెలియని రాతియుగం నుంచి ఇప్పటి వరకు మనం అర్థం చేసుకోగలిగినది చుస్తే ఆ ఆశ బలపడక మానదు. ఈ సిద్ధాంతాలను కనుగొనే పనిలో భౌతికశాస్త్రం అధ్యయనం చేస్తున్నవాడికి తాను దేన్నీ గుడ్డిగా నమ్మటం లేదనీ, స్వయంకృషి చేసి, స్వంతమైన తెలివితో - ప్రయత్నంగా సృష్టి రహస్యాలను చేదిస్తునట్టు భావన కలుగుతుంది. కాని ఇందులో ఉన్న చిక్కు చూడు ఇప్పుడు. భౌతికశాస్త్రం సిద్ధాంతాలు మనవ మేధస్సు పెరిగేకొద్దీ మరింత మరింత క్లిష్టతరంగా మారుతూ రావొచ్చు గాక, సృష్టి నిర్మాణం మీద మరింత మరింత లోతు వరకూ అవగాహన మానవుడు సంపాదిస్తే సంపాదించవచ్చు గాక. నిజానికి నా సమస్య సిద్ధాంతాల రూపాంతరం కారణంగానో  - వాటి క్లిష్టత వల్లనో అవిర్భవిస్తుంది కాదు. సిద్ధాంతాలు ఏమైనా కానివ్వు..  "కొన్ని గణిత సిద్ధాంతాలు ఈ విశ్వాన్ని మొత్తం వివరించ గలవు" అన్న hypothesisతోనే  'నా' గొంతులో వేలక్కాయి పడుతుంది! అలాంటి పరిస్థితిలో నేను 'నేను' అని ప్రియంగా పిలుచుకొనే ఈ భౌతికకాయం ఒక రసాయినిక చర్య మాత్రమే అని అర్థం వస్తుంది. నా శరీరం చూడు, నా మెదడులో 99% నీరే ఉంది, అనేకానేక ఖనిజాలు ఒక క్రమంలో ఏర్పాటు కాగా (అన్నీ మా ఉళ్ళో దొరికే పదార్థాలే!) ఆ రసాయన ప్రక్రియ నుంచి 'నేను' అనే భావన, నా ఆలోచన కూడా భౌతిక ప్రక్రియలుగా  ఉద్భవించాయి అని అర్థం వస్తుంది.  అంతరిక్షంలోకి విసరబడిన ఒక రాకెట్ భవిష్యత్ గమనం మొత్తం ప్రారంభ పరామితుల మీద, కొన్ని సూత్రాల మీద ఆధారపడిన రీతిగానే ఈ విశ్వంలో జరిగే ప్రతీ భౌతిక ప్రక్రియా మహా విస్ఫోటనం నాడు ప్రారంభ పరిస్థితుల పర్యవసనంగానే పరిణమిస్తుంది తప్ప కొత్తగా  ప్రత్యక్షమై 'ఒక తెలివి' వచ్చి చేస్తున్న మార్పు ఏమి లేదు (ఒక వేళ చేస్తునట్టు అనిపించినా ఆ తెలివీ ఈ భౌతిక ప్రక్రియలో భాగమే అవుతుంది). సరైన పాళ్ళలో, సరైన పరిస్థితుల్లో, సరైన పదార్థాలు కలిపినప్పుడు ఫలితంగా అవతరించిన జీవి ఎలా ఆలోచించాలి, ఎలా పరిభ్రమించాలి, ఎలా చావాలి అన్నీ పూర్తిగా ఈ భౌతిక సిద్ధాంతాలు నిర్ణయించేసాయి. ఇక మన ఆలోచన కుడా ఒక గణిత సూత్రం ద్వారా రాబట్ట గలిగే అంతటి అల్పమైన ప్రక్రియ మాత్రమే అవుతుంది! వాస్తవానికి మనం ఎంత భౌతిక శాస్త్రం అర్థం చేసుకోగలం, దాన్ని ఎలా దృశ్యమానం చేసుకోగలం..   అన్నవాటికి పరిమితులు కుడా ఈ సిద్ధాంతాలే నిర్మించేసి ఉంటాయని అర్థం వస్తుంది!

రెంటిలో దేన్ని నిజం అనుకున్నా శరేరంతో తాదాత్మ్యం చెందటంలో అర్థం లేదని స్పష్టంగా తెలిసే పోతుంది.
ఇప్పుడు చెప్పు, ఇదంతా చెప్పింది ఎవరు? నేనా? దైవమా? లేక అంతా (ఇంకా కనుక్కోబడని) ఏదో ఒక గణిత సూత్రమ్ ఫలితమా?

============================================================




* తాదాత్మ్యం = 'నేను చేసే కర్తనూ, అనుభవించే భోక్తను' అని ప్రతి జీవి మనసులో ఉండే భావన.

3, మార్చి 2013, ఆదివారం

మనిషి మాట్లాడాలి

- మనిషి మాట్లాడాలి. 

+ ఏం? ఎందుకు పాపం?
 -  సామరస్యం కుదిరేదాకా

+ ఎవరితో?
- లోకంతో 

+ ఏం పని? ఎందుకు సామరస్యం?
- తనని తన మానాన వదలదుగా లోకం..  పేగుబంధం, స్నేహబంధం , తాళిబంధం, రుణ బంధం, కర్మ బంధం, పోలీస్ బంధం! ఒకటా రెండా, పీకకు పెనవేసుకొని ఎన్ని వేర్లు మనిషికి? వాడిని వాడికి ఇష్టం వచ్చిన చేత్తో తిన్నిచ్చారా?

+ ఏం పని? ఎందుకు సామరస్యం?
- అక్కడికే వస్తున్నా. తన స్వేచ్చని హరించే పని మానుకోమని, తనకంటూ చాల లోతైన ఆలోచన - ప్రపంచం పట్ల ఒక్క విలక్షణ దృక్పథం - అవగాహన ఉన్నాయని లోకానికి చెప్పి, మానసికంగా విముక్తుడు అయేంతవరకు మనిషి మాట్లాడుతూనే ఉండాలి . 

+ ఆలోచనా అవగాహనా కలిగి ఉండటం వరకు బాగానే ఉంది. అవి వాళ్లకి చెప్పి నువ్వు విముక్తుడవు అవటం ఏమిటి? ఎక్కడో తార్కిక లోపం కనపడుతుంది. హారర్ నవల రాసి ఎవరి నుంచి ఎవరు విముక్తులు అవుతున్నారు?
- క్షమించాలి, మన వాదన కొనసాగించే ముందు కొంత స్పష్టతను స్థాపించటం ముఖ్యం. మన పదజాలంలో కొంత తారతమ్యత ఉంది. నేను చెప్తుంది వాణిజ్య పరమైన లబ్ధిని ఆశించి రాసే "విజయనకి వీలైనన్ని మెట్లు" లాంటి చెత్త రచనా-ప్రసంగాలు చెయ్యాలని కదు. అసలు అది నా దృష్టిలోనే లేదు! నేను చెప్పేది నిజమైన జ్ఞానం పొందిన వ్యక్తులు తమ జ్ఞానాన్ని రచనల్లో పొందుపరిచి లోకంతో మాట్లాడి తీరాలి అని. తద్వారా లోకానికి మార్గదర్శకులు కాగలుగుతారు. 

+ కాబట్టి జ్ఞానవంతుడు మాట్లాడాలి అను, బాగుంటుంది. కాకపోతే ప్రతివాడు జ్ఞానవంతుడనే అనుకుంటాడు కాబట్టి, అవున్లే, ప్రతివాడు మాట్లాడాలి అనటంలో కొంత అర్థం లేకపోలేదు! ఇంతకీ నిజమైన జ్ఞానం అంటే?
- జీవితానికి సంబంధించిన అనేకానేక మర్మాలను, మౌలిక సందేహాలను, సృష్టిలోని  అత్యంత మౌలికమైన అంశాలను, మనో-ఆంతరంగిక మౌలిక భావనలను, మున్నగు వాటిని నిశితంగా తటస్థ దృష్టితో పరిశీలన చేయగ మనసుకు స్పురించిన సత్యాలను నిజమైన జ్ఞానం అంటున్నాను.

+ ఒక మాటలో చెప్పాలంటే నీకు నచ్చిన ఒక రకం జ్ఞానాన్ని మౌలికం అని, నిజమైనది అని పిలిచేస్తున్నావు. 'విజయానికి ముప్పై ఆరు మెట్లు' రచయిత మీద నీ వ్యతిరేకత ఏమిటి?
- 'విజయానికి ఇంచక్కా బోలెడు మెట్లు' రచయత మీద నాకు ఏం వ్యతిరేకత లేదు. నా మట్టుకు నేను నా ఆత్మని అలాంటి మాలిన్యం నుంచి రక్షించుకుంటూ ఉంటాను. దుమ్ము మీద, పుప్పొడి మీద నాకు వ్యతిరేకత ఏముంది? నా కంట్లో మాత్రం పడనివ్వను అంతే. 
ఇకపోతే సత్యాన్వేషణ అనే ఒక మహా గొప్ప ఆశయాన్ని ఒక వ్యక్తిగత కాలక్షేపంగా చిన్నది చేసి మాట్లాట్టం సబబు అనుకొను. నాకు నచ్చినా, నచ్చకపోయినా 'జీవితం ఏమిటి-ఎందుకు?' అన్న ప్రశ్నకి సమాధానం వెతుక్కోటంలోనే మానవ జన్మకి అర్థం ఉంది. ఆ ప్రశ్నకి సమాధానం కోసమే సమస్థ ప్రాణికోటి ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు అధిరోహిస్తూ ఆ సర్వోత్తమ పురోగతి వైపు పరిణామం చెందుతోంది. 

+ వినటానికి వినసోంపుగా, ఊహించటానికి గమ్మత్తుగాను, ఆలోచించటానికి అర్థం లేకుండానూ  ఉన్నాయ్ నీ మాటలు! నువ్వు చెప్పిన theory లో ఎన్ని అంచనాలు - పూర్వానుమనాలు (assumptions) ఉన్నాయో నీ చేవులికి వినిపిస్తుందా? సత్యం తెలిస్తే గాని ఈ ప్రాణికోటికి విముక్తి లేదు అన్నావు, మనం ఇప్పటికే విముక్తులం అంటాడు utilitarian. వాడి దాడికి తట్టుకోగలదా నీ వాదన? నువ్వు చెప్పేదాన్ని వాదన అని కూడా పరిభాషించలేను. ఒక వాదనలో ఉండాల్సిన పరిపూర్ణత లేనే లేదే?
- చర్చని పక్క దోవ పట్టిస్తున్నాను అనుకోవద్దు. వాస్తవానికి assumptions లేకుండా ఏ జ్ఞానం సాధ్యం కదు. ఎందుకంటే ఒక విషయం అర్థం చేసుకుంటున్నాము అన్న భావన మనలో కలగాలి అంటే మనం అంటూ ఒకళ్ళం ఉన్నాము అన్న assumption (అహం-భావన) అందులో అతర్లీనంగా లేకపోలేదు కదా? ఆధునిక భౌతిక శాస్త్రం అయినా, ప్రాచీన అద్వైతం అయినా కొన్ని ప్రతిపాదనల మీద ఆధారపడకుండా ముందుకు సాగలేవు. ఆధారం experimentation నుంచి ఉద్భవిస్తుంది. ఈ రోజుకీ ప్రతి భౌతిక శాస్త్రవేత్తకీ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అని నమ్మకం కుదరటానికి experimentation తప్ప వేరే మార్గం లేదు. ఈ రోజుకి పరమాత్మ ఉనికిని స్పర్సించాలంటే కళ్ళు ముసుకోడం ఒకటే మార్గం. 
మానవుడు ఎటువంటి శ్రమ, intellectual కసరత్తు చేయకుండానే utilitarianగా పుడతాడు. అన్ని తన సుఖం కోసమే నిర్మించబడ్డాయని, ఈ భూమి మీద ఈ శరీరంతో తను చేసే కార్యాలన్నీ అర్థవంతమైనవే అనీ..  ప్రతీ  రాబందు,  క్రిమి, పంది, కుందేలు, మనిషి, ఆవుదూడ లోకం నుంచి వీలైనంత జుర్రుకుందాం అన్న లక్ష్యంతోనే జీవితం ప్రారంభిస్తారు. కాబట్టి ఒక utilitarianని ప్రశ్నించటం అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవటంతో సమానం. మనలోని utilitarian మనల్ని ఎక్కడికి తీసుకువెళ్ళడు. ఇక్కడే, ఈ భూమి మీదే, ఈ మట్టి-మశానం శరీరంతోనే నీ జీవితం అని ఇక్కడే కుదేసి కట్టి పారేస్తాడు. నిజమైన జ్ఞానం మనల్ని విముక్తుల్ని చేస్తుంది. 

+ మనవ మేధస్సుకి ఎన్ని assumptions సాధ్యం అవుతాయో అన్ని theories పుట్టుకొస్తాయి అన్న అర్థం ఉంది నువ్వు అన్నదాంట్లో. అనట్టు విముక్తి దేని నుంచి? 
- మాయ నుంచి. మాయానిర్మితమైన ఈ లోకం నుంచి. 

+ మాయ నుంచి విముక్తి కావాలంటే కళ్ళు-నోరు ముసుకోవాలా లేక మాయకి ఉత్తరాలు రాయాలా? అసలు లోకమే మాయ అయినప్పుడు దాని పోకడ-పకోడా వ్యవహారాలతో నీకేం పని? స్వేచ్చని ఆశించటం utilitarian ఆరాటం కాదనగలవా? కమందునికి ఎడతెరిపి లేని వస్తు లాభం నుంచి కలిగే సుఖంలో ఉన్న utilityనీకు విముక్తి కోసం చేసే పోరాటంలో లభిస్తుందేమో  అంటాను.  కాదనగలవా? సమర్ధించుకుంటావా? సమర్ధించుకోవటం కుడా utilitarian ఆరాటమే అంటాను! ఏం అంటావ్? 
- ... 

+ సంఘం నుంచి తెగతెంపులు చేసుకుంటేనే గాని సుఖం లేదంటావ్. ఆ లోపే లోకం మాయ అంటున్నావ్. నీ సువార్తలో ప్రశ్న ఉందా - సమాధానం ఉందా?  మనిషి మాట్లాడతాడు సరే, వినేవాళ్ళు ఎవరు  లేకపోతే మాటేంటి? అయినా మాట్లాడుతూనే ఉంటావా? నీ రచనలు ఎవరు చదవరని తెలిసినా రాసి నదిలో పరేస్తావా? పరేయగల పరిపక్వత ఉందా నీలో?! అది లేనంత వరకు 'విజయానికి ఇంకొక మెట్టు' రచయతకి నీకు ఏ మాత్రం బేధం లేదంటాను. నీ రచనలు అన్ని అల్పమైన ప్రతీకార చర్యలుగా, పిరికితనం చిహ్నాలుగా పరిగనిస్తాను అంటాను. ఏమంటావ్? 
- .... 

+ మాట్లాడేది అంతా వినేవాళ్ళని ఉద్దేశ్యించినదే కదా? మాయతో  మహా శ్రమ పడీ మాటలాడే వాడికి మాయ నుంచి విముక్తి ఉందా?
-  మహోత్తమా! మిమ్మల్ని ఇంతకంటే మాటల గారడీ చేసి వంచించలెను! ఒప్పుకుంటాను. సత్యశోధన మీద లక్ష్యం పెట్టినవాడికి అసలు మాట్లాడే పనే లేదు. రాయాల్సిన అవసరమే లేదు. రాసే ప్రక్రియ పూర్తిగా జనాకర్షణ కోసమే! జనాకర్షణ కోసం చేసేపనులు అత్యంత అల్పమైనవి. దానికి మించిన ఆత్మ వంచన ఉందనుకోను.  చదవబడదు అని తెలిసి ఎవడైనా ఏ రచనైనా చేస్తాడా? సూన్యంలోకి చూస్తు ఎవడు అరుచుకుంటాడు? దైవంతో మాట్లాడుతున్నాను అని చెప్పేవాడు కూడా Mr.దైవం నుంచి ఎదోక రోజు తిరిగి ఏదోక ఉపయోగపడే సంకేతం వస్తుందనే  నమ్మకం తోనే మాట్లాడతాడు. 
ఆర్యా! నా కళ్ళు తెరిపించారు.. నా అజ్ఞానం తొలగింది. సత్యశోధన మీద నా చిత్తం-దృష్టి పూర్తిగా నిలిపి అల్పజనమనోరంజకమైన నా ఈ లేకి రచనలు నిలిపివేస్తాను.  నా కలం మీద ఒట్టు. ఇక మాట్లాడను! ఒక వేల నా జిహ్వకండూతిని అధిగమించలేక ఇంకొకసారి  మాట్లాడానా, నా నీచత్వాన్ని చూసి జ్ఞానం ఎప్పటికి నా దరి చేరదు గాక! దయచేసి నన్ను ఆ విధంగా శపించండి.