సరిగ్గా మనం పుట్టిన సమయాన్నే జన్మించాడో మనిషి
నాలానే ..
ఇదేమి? అదేమీ? వారెవరు? వీరెవరు? నాకెవరు? నీకెవరు? నేనెవరు?
.. అని ప్రశ్నల మీద నడకలు నేర్చుకున్నాడు.
మనిద్దరికంటే ముందరనే ..
ఈ ప్రపంచమొక గాజుమేడ అనీ
.. ఇక్కడి గోడలన్నీ పారదర్శకాలనీ తెలుసుకున్నాడు.
అందరిలానే ..
గతం బింగించే పాశం నొప్పిస్తున్నా, భవిష్యత్తు భయం పుట్టిస్తున్నా,
.. వర్తమానంలో ఊపిరి అందితే చాలనుకున్నాడు.
నీలానే ..
సాహసం లేని మార్గం మీద మమకారం కలుగక,
.. ఖర్జూరాలని వెతుక్కొంటూ కఠినమైన ఎడారి మార్గం పట్టాడు.
అలానే ..
ఎడారి మార్గాన కనిపించిన ఒయాసిస్ మీద మనసు పారేసుకున్నాడు ..
.. పూజలు చేసాడు, మోకరిల్లాడు .. కవితలు రాసాడు.
ఇలానే ..
ఈ క్షణం ఇదే రీతిలో నిన్నూ నన్నూ ఇరికించి ఇద్దరికీ అర్థంకాని కవితేదో రాస్తున్నాడు.