30, నవంబర్ 2014, ఆదివారం

ఇది 1965 నాటి మాట!

మన సంస్కృతి 
- దేవరకొండ బాలగంగాధర తిలక్ (అమృతం కురిసిన రాత్రి). 

మన సంస్కృతి నశించిపోతూందన్న
మన పెద్దల విచారానికి
మనవాడు పిలకమాని క్రాపింగ్ పెట్టుకున్నాడనేది ఆధారం
మనగలిగినదీ
కాలానికి నిలబడ గలిగినదీ వద్దన్నా పోదు
మరణించిన అవ్వ నగలు
మన కాలేజీ అమ్మాయి ఎంత పోరినా పెట్టుకోదు
యుగయుగానికీ స్వభావం మారుతుంది
అగుపించని ప్రభావానికి లొంగుతుంది
అంతమాత్రాన మనని మనం చిన్నబుచ్చుకున్నట్లు ఊహించకు
సంతత సమన్వయావిష్కృత వినూత్న వేషం ధరించడానికి జంకకు
మాధుర్యం, సౌందర్యం, కవితా
మాధ్వీక చషకంలో రంగరించి పంచిపెట్టిన
ప్రాచేతస కాళిదాస కవిసమ్రాటులనీ
ఊహా వ్యూహోత్కర భేదనచణ
ఉపనిషదర్ధ మహోదధినిహిత మహిత రత్నరాసుల్నీ
పోగొట్టుకునే బుద్ధిహీనుడెవరు?
ఎటొచ్చీ
విధవలకీ వ్యాకరణానికీ మనుశిక్షాస్మృతికీ గౌరవంలేదని
వీరికి లోపల దిగులు
వర్తమానావర్త ఝంఝావీచికలికి కాళ్ళు తేలిపోయే వీళ్ళేం చెప్పగలరు?
అందరూ లోకంలో శప్తులూ పాపులూ
మనం మాత్రం భగవదంశ సంభూతులమని వీరి నమ్మిక
సూర్యుడూ చంద్రుడూ దేవతలూ దేవుళ్ళూ
కేవలం వీరికే తమ వోటిచ్చినట్లు వీరి అహమిక
ఇది కూపస్థమండూకోపనిషత్తు
ఇది జాతికీ ప్రగతికీ కనబడని విపత్తు
మనవేషం , మన భాషా , మన సంస్కృతీ
ఆదినుండీ , ద్రవిడ బర్బర యవన తురుష్క హూణునుండీ,
ఇచ్చినదీ పుచ్చుకున్నదీ ఎంతైనా ఉన్నదనీ
అయిదు ఖండాల మానవ సంస్కృతి
అఖండ వసుధైక రూపాన్ని ధరిస్తోందనీ,
భవిష్యత్ సింహద్వారం
తెరుస్తోందనీ,
గ్రహించలేరు పాపం వీరు
ఆలోచించలేని మంచివాళ్ళు
ఏ దేశ సంస్కృతి అయినా ఏనాడు కాదొక స్థిరబిందువు
నైక నదీనదాలు అదృశ్యంగా కలిసిన అంతస్సింధువు.


25, నవంబర్ 2014, మంగళవారం

కార్యసాధకా!

నీ మాట వినేవాళ్ళు లేకపొతే, నీతో రాకపోతే ..
                      ఒంటరి గా అడుగు వెయ్యి!

అందరూ భయపడితే, ముఖం దాచేసుకుంటే, పిరికిగా గోడచాటున దాక్కోనేస్తే ..
                       ప్రాణ మిత్రమా ..
                       ఆత్మసాక్షిని గుప్పెట్లో పట్టుకొని, మనసులోని మాటని నోరు తెరచి చెప్పు!

అందరూ తిరిగి వెళ్ళిపోతే, నిన్ను ఒంటరిని చేసి కారడవి చీకట్లో వదిలేసి పోతే?
                        సఖా ..
                        ముళ్ళ మీద అడుగులు వేసుకుంటూ
                        రక్తం కారుతున్న పాదాలను ఈడ్చుకుంటూ మార్గం చేసుకుంటూ ముందుకు సాగు!

దీపం వెలుగక పొతే,
చీకటిలో, గాడ్పులో, తుఫాను వానలో, గూటికి దిక్కుతెలియని స్థితిలో ఉంటే  ..
                        ఓ కార్యసాధకా!
                        మబ్బుల మధ్యన వజ్రాయుధాన్ని పెకలించి తీసి నీ హృదయాన్ని అంటించుకో!
                        దాన్ని ఉజ్జ్వలంగా వెలుగని! ఆ తీవ్ర జ్వాలలో స్వయంగా  ప్రకాశించు!

---------------------------

ఇది టాగోర్ రాసిన  'ఏక్ల చోలో రే' అనబడు బెంగాలీ గీతానికి (ఇంచుమించు) తెలుగు అనువాదం. 2005 కాలంలో తోటి బెంగాలీ మిత్రులు పాడుకుంటుంటే  అయిష్టంగా విన్నది! అప్పటికి బెంగాలీ  భాష ((మరియు దాని గొప్పదనం) కనీసం ఇప్పుడంత కూడా) తెలియననప్పటికీ ఆ గీతం చాల శక్తివంతమైనదిగా ఆ రోజే నా చెవులకు వినిపించింది. హ్రస్వదృష్టితో చుస్తే బిందెడు నైరాశ్యం, కాస్త నిశితంగా చుస్తే సముద్రమంత స్ఫూర్తి ఈ పాటలో వినిపిస్తాయి. ఒంటరితనంలోని realityని, inevitabilityని, blissని, permanencyని ఆహ్వానించలేని వాళ్ళు ఒంటరితనానికి దూరం పరిగెట్టి పరిగెట్టి జనారణ్యంలో చిక్కుకొని ఒంటరులు అవుతుంటారు. నూతిలోకి నేరుగా పడే రాయి ఒకటైతే కాస్త శబ్దం చేసి పడే రాయ మరొకటి.