నాయకత్వం మూర్తీభవించిన ఒక వ్యక్తి నీకు అనూహ్యంగా కనిపించవచ్చు,
అదే ఆరంభం!
అదే ఆరంభం!
ఆ రోజునుంచి నీ పోలికలుగల మార్గదర్శకుల కోసం నీ కళ్ళు వెతుకుతాయి,
నువ్వు చెప్పాలనుకొని చెప్పలేకపోయిన మాటలు,
వినాలనుకొని వినలేకపోయిన సత్యాలు,
రాయాలనుకొని రాయలేకపోయిన సాహిత్యాలు,
వాటికవే స్పష్టమైన ఆలోచనలుగా నిన్ను వెతుక్కుంటూ వస్తాయి.
ఆదర్శాలను నువ్వు వెతుక్కుంటూ వచ్చావో,
ఆదర్శాలే నిన్ను తరుముతూ వచ్చాయో .. రెంటికి భేదం కనపడదు.
గుండెనిండా బరువైన బాధ్యత తెలుస్తుంది
ఆలోచన పదునెక్కుతుంది.. ఆవేశం ఎరుపెక్కుతుంది,
ఒంటరితనం, మౌనం, సిగ్గు, బిడియం, భయం, మొహమాటం..
ఇవేమి తెలియని అద్భుత చైతన్యం నిన్ను కదిలిస్తుంది, మాట్లాడిస్తుంది,
నువ్వు గర్జిస్తావు, పిడికిలి బిగించి అరుస్తావు,
ప్రశ్నిస్తావు, అరిపిస్తావు, వణికిస్తావు,
నువ్వు ఒకడివి కావనీ, సమూహ శక్తివని అపరోక్షానుభూతితో తెలుసుకుంటావు,
భౌతిక ప్రపంచం తనను తానూ మార్చుకోవాలని పూనుకుంది,
ఆ ఆవేశాన్ని వెలియిడ నిన్ను ఎంచుకున్నది, నువ్వు కదులుతావు, కదిలిస్తావు,
వంచుతావు, విరుచుతావు,
పేరుస్తావు, నిర్మిస్తావు,
ఒక చేత్తో ధ్వంసం చేస్తావు, మరో చేత్తో మొక్క నాటుతావు ..
ఒక చేత్తో పీక పిసికి నులిమేస్తావు, మరోచేత్తో ఆకాశంలో ముగ్గులేస్తావు,
నిన్ను అనుమానంగా చూసే కళ్ళు పదివేలు,
నీకై ఆశగా చూసే కళ్ళు పది కోట్లు!
ఆవులిస్తే నువ్వు బ్రతికిన పీనుగవు,
గాండ్రిస్తే నువ్వే ప్రజల నాయకుడవు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి