19, సెప్టెంబర్ 2015, శనివారం

మధ్యరాత్రి మనసులో మార్పు!

ఒకనాడు ఎవరో ఏదో ఆలపిస్తున్నారు,
చీకట్లో నేనా శబ్దాలను యాచిస్తూ ఆలకిస్తున్నాను!
వింటున్న ఆ మాటల గురించే ఓ తపస్సులా యోచిస్తున్నాను,
దశలుగా ఆ మాటలతో ప్రేమలో పడుతూ వస్తున్నాను!
విని విని నేను వశం తప్పుతున్నాను,
నేను వింటున్నానన్న అక్కరు వారికే మాత్రము లేదు!

పిల్లనుగ్రోవి చెవిలో వారు ప్రేమగా ఊదుతున్న రహస్య మేమిటో నాకు పూర్తిగా అర్థమైతే కాలేదు ..
ఆ వెదురు బొంగుదీ నాదీ ఒకే జాతి!
లోనున్న వెలితి మాయిద్దరికీ సరిగ్గా సమానం ..
కళ్ళని చెమ్మ చేసే ఇలాంటి తీపి సంగీతంలో  కాలాన్ని- ఖాళీలని మర్చిపోతుంటాము ..
సుస్వర మనే పదార్థమే లేకుండుంటే, మేమిద్దర మేనాడో మరణిం చుండే వాళ్ళమేమో!

------
ఈ మధ్యరత్రివేల మనసులో ఏమిటీ కొత్త మార్పు? నిద్ర రాకనా?
లేక కరుణ లేని యీ చీకటి రాత్రి, వారి ఆలోచన నాలో సృష్టిస్తున్న మార్ప?
ఏదేమైనా, నాలో శోకాన్ని నయం చేయటానికి జరుగుతున్న ఈ మార్పును మించిన మందు లేదు.
పిల్లనగ్రోవిలా ఏడవటానికి, నాకు దానికున్నని కనులు లేవు!
-------------------------------------------------------------------------------

ప్రేరణ: తెలుగు వాళ్లకి 'సఖి'గా తెలిసిన తమిళ చిత్రం 'అలై పాయుదే' (అల ఎగిసెనే)లోని కవి వైరముత్తు గారు రాసిన 'ఎవనో ఒరువన్ వాసిక్కిరాణ్' అన్న పాటకి కాస్త దూరపు అనువాదం ఇది. తెలుగులో 'ప్రేమలే నేరమా  ఓ నా ప్రియ' అని వేటూరి రాసినదానికి  - దీనికి ఏ మాత్రం పోలిక లేదన్న విషయం గమనించగలరు. తమిళ మాతృకలోని నిరాకార వర్ణననల ప్రయోగం ఈ పాటని ప్రేమ - విరహం స్థాయికి మించి చాల ఎత్తుకి తీసుకెళ్లిందని నా అభిప్రాయం. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి