12, జూన్ 2018, మంగళవారం

కడవుల్

గ్రహాల చివరనున్న చిట్టచివరి గ్రహానికి అవతల అసహాయ శక్తి ఒకటి ఉన్నదంట!
మనిషికి అర్థంకాని, విడదీయరాని విడి కథయే దాని మర్మ మంట!

దానికి భయపడి, దాన్ని కనుగొని, దాన్ని స్తుతించి, ప్రాధేయపడి,
దాని కటాక్షం పొందటం మించిన దారి వేరు లేదంట!

చెయ్య తలచినదంతా ముందుగానే విధి తానే చేసి పెట్టినదంట ..
విధిని మీరదలచిన వాళ్ళ పట్ల కరుణతో కుట్ర పూని, ప్రేమతో ధ్వంసం చేసి పాతిపెట్టునంట!

గుడ్డిగా, చెవిటిగా, వెట్టిగా, వైకల్యంగా, శక్తిహీనంగా పిండాన్ని ఏర్పరచగల పవిత్ర శక్తి అంట!
కుష్టురోగం, పుట్టకురుపులు, చీముపొక్కులు, మూలశంకలు ఇవన్నీ దాని చిత్తమేనంట!
పుండుని తొలిచి బ్రతికే పురుగు పుణ్యం చేస్తే, పునీతయై పునర్జన్మం పొందవచ్చు నంట!

కోట్లకి పతులైన వారిని అతిగా బాధింపక, లాలించి పదిలముగ గతి చేర్చునంట!
కష్టజీవి కష్టాలను చలించక చూచుట, విధి సేయు విలాస మంట!

సమస్త జగత్తుని నడిపిస్తున్న ఆ పవిత్ర దైవ హస్తమే మన చేత యుద్ధములు కూడా చేయించునంట!
హత్యలు ఒనర్చి రక్తధారలు పారించిన రాజుల పుణ్యకథల యశస్సుని సర్వదా అది కాపాడునంట!

అప్పుడు 'అసురులను' చితిపిన ఆ పరాశక్తే ఇప్పుడు అణుబాంబుల చితి పేర్చి
పరదేశంలో పాపమెరుగని ప్రజలను పలహారం చేస్తున్నదంట!
పసివాణి మాంసం సమర్పించి మ్రొక్కిన ఆస్తికులకు వరములిచ్చి దీవించిన చరితగల ఆ పరబ్రహ్మమే!

నీ కన్నవారు, సొంతవారు, నీతో బంధం ఉన్నవారు, చదువు నేర్చినవారు, చదువు నేర్పెడి వారు..
అందరూ భయపెట్టగా ఆ శక్తేదో ఉందని నువ్వూ నమ్ము, ప్రశ్నించక నమ్మి మ్రొక్కు!

మునిగి మ్రొక్కు, బొట్టు పెట్టి మ్రొక్కు, గంట కొట్టి మ్రొక్కు,  హారతి ఇచ్చి మ్రొక్కు,
డప్పు కొట్టి మ్రొక్కు, మీ బుద్ధి చచ్చి చదున య్యేంత వరకు నొక్కి నొక్కి మ్రొక్కు!


------------------------------------------

కడవుల్ (கடவுள்) అంటే తమిళంలో దైవం అని అర్థం. ఆ పదాన్ని కాస్త విరిచి చూస్తే దానర్థం 'కడకి ఆవుల్' అని - అంటే 'చివరికి అవతల' - that, which is beyond the end - అని అర్థం వస్తుంది.

కమల్ హాసన్ రాసిన 'కడవుల్' అనే తమిళ కవితకు నా తెలుగు అనువాదం ఇది. వీలుకోసం ఒకటి రెండు పంక్తుల్ని తొలగించటం జరిగింది.


21, మే 2016, శనివారం

ప్రస్తుత సమాజంలో వివక్ష


(త్వరలో రాబోయే ఒక రచనకి ముందు 'నా మాట')


ఈ రోజుల్లో అంతర్జాలంలో గాని, పుస్తక దుఖానాల్లో గానీ.. 19వ శతాబ్దపు యూరోపియన్ సామ్రాజ్యవాద ఆటగాళ్ళ చేతుల్లో పావుల్లా నలిగిపోయిన ఆఫ్రికన్ దేశాల చరిత్రలకు సంబందించిన తెలుగు సాహిత్యం పెద్దగా కనిపించదుమన దేశ నగరాల్లో footpath మీద Mein Kampf పుస్తకాలు విరివిగా లభ్యం అవుతుంటాయి. దీన్ని చూసి నాకు అశ్చర్యంగా ఉంటుంది. హిట్లర్ తన ద్వేషపూరిత భావజాలన్ని సమర్ధించుకొంటూ రాసిన చెత్త మీద భారతీయుల కెందుకంత ఆసక్తి? మొన్నమొన్నటి దాకా జెర్మనీలోనే అచ్చుకు నోచుకోని ఈ పుస్తకానికి మన దేశంలో ఇంత ఆదరణ ఏంటి? హిట్లర్ ఆ రోజుల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాసుకున్న nonsenseని చదవాలని ఏమిటంత ఉత్సాహం? ఇంకొక పక్క మన దేశంతో పోల్చుకో దగ్గ ఇతివృత్తాలు కలిగినవైన మధ్య-ఆఫ్రికన్ దేశాల భూత వర్తమాన గతుల గురించి మన తరం భారతీయులు సరిపడ అక్కరు కనబరుస్తున్నారా? నా అనుభవాన్ని బట్టి చూస్తే లేదనిపిస్తుంది. విదేశాల్లోని నివసించే భారతీయులు వారికక్కడ తారసపడే నల్ల జాతీయులతో పెద్దగా స్నేహ సంబంధాలు ఏర్పరుచుకోరు; వాళ్ళతో తమని పోల్చి చూసుకోరు. వీలైనంత వరకు శ్వేతజాతీయుల్ని అనుకరించటం; వారి గుంపుల్లో కలిసిపోడానికి ప్రయత్నించడం; వారి attention కోసం ప్రాకులాడటం; అవకాశం చిక్కినప్పుడు భారతదేశం గురించి చిన్నో చితకో గొప్పలు చెప్పుకొని వాళ్ళ మెప్పు చూరగొనే ప్రయత్నం చేయడం; లేదంటే భారతదేశాన్ని తిట్టైనా వాళ్లకి దగ్గర కావాలని ప్రయత్నం చేయడం.. వంటివి స్పష్టంగా గమనిస్తాము. ఒక భారతీయ యువకుడు ఒక నల్లజాతి యువతిని ‘date’ చేయటం అనేది ఒక దిగజారుడు వ్యవహారంగా - నవ్వులపాలు చేసే విషయంగా భావిస్తారు (దీన్నే మన సినిమాల్లో కూడా చూపిస్తారు, అది చూసి మనం నవ్వేస్కుంటాం కూడా); ఇక ఒక భారతీయ యువతిగాని నల్ల జాతీయుడితో జత కట్టడం అనేది అసలే ఊహించలేము! దీనంతటినీ నేను అనుభవపూర్వకంగా చుసాను; చూసి.. బానిసత్వ ‘సౌఖ్యాన్ని’ వంట్లో నరనరాన్న సంతరించుకొని ఉన్న భారతీయులు జాతి జాతిగా Stockholm syndromeకి గురైపోయారా అని నా అంతరాలంలో నేను చాలా సార్లు  ప్రశ్నించుకున్నాను! నా ప్రశ్న సబబైనదే నని ఈ రోజుకీ నమ్ముతున్నాను. Globalization అంటే కేవలం తెల్లతోలు వ్యామోహమేనా? లేక వివక్ష అనేదాన్ని మనసు లోలోపల్నుండి, అది ఏ రూపంలో ఉన్నా కూడా, సమూలంగా తొలగించుకొని అన్ని జాతుల వాళ్ళనీ సహభ్రాతృత్వంతో సమానంగా చూడగలగడమా? ఒక జాతిని లోకువతో చూడటం ఎంత తప్పో, మరో జాతి మీద వ్యామోహం కలిగి ఉండటం కూడా అంతే తప్పు కదా? అసలు మనిషిని మనిషిగా చూడటం మానేసి ఈ జాతి ఆధారిత prejudiceలు ఏంటి? విశ్వమానవీయ భావాలనేవి ఎవరికి వాళ్ళు స్వయంకృషితో పెంపొందించుకోవల్సినవి అనుకోవడం చాల దురదృష్టం. ఇవి మనకి విద్యాబుద్ధులతో పాటే మన సమాజం నేర్పించి ఉండాల్సినవి. కాని మన పెంపకంలో మన ముందు తరం ఈ విషయాన్ని తగిన శ్రద్ధతో handle చేసింది అనిపించదు. అందుకనే IPL cricket cheerleaders అందరూ శ్వేతజాతీయులేయయినా, సిమెంటు కంపేనీ వాళ్ళు Build Beautiful అని perverse advertisements మన ముందుకి తెచ్చినా, fairness cream వాళ్లు తమ వికృత ప్రకటనలు మన మొహానికి రుద్దినా, మన కళ్ళెదురుగానే రైల్వే స్టేషన్లలో పట్టాల మీద మనిషి మలాన్ని ఉత్త చేతులతో ఎత్తి శుభ్రపరుస్తున్నా .. ఏది మనకి పెద్దగా అభ్యంతరకరంగా అనిపించవు. కాని శిలా శాసనాల మీద రాసిన కథల్నీ, క్రతువుల్ని, దేవుళ్ళ చరిత్రలనీ ఏమైనా అనే సాహసం ఎవరైనా చేస్తే మాత్రం క్షణం సహించము! ఏదేమైనా Status quoని కళ్ళు మూసుకొని accept చేయడం, వ్యాప్తిలో ఉన్న భావజాలాలను ప్రశ్నించకుండా ముందుకు కొనసాగటం అనేవి ముందు తరంవాళ్ళు మనకి మంచిగా నూరిపోసారు. మనలో చాలా మంది ఆలోచనలు మన కుటుంబాలకు, కుటుంబ గౌరవాలకూ పరిమితాలు అయిపోయేలాగా, ‘సమాజం, సామూహిక పురోగతి’ వంటి మాటలు పేద్ద out of syllabus jargon గా పరిగణించేలా మనల్ని తీర్చిదిద్దడం కూడా మన ముందుతరం తప్పిదమే నని నేను భావిస్తున్నాను. ఇదంతా చాలా దురదృష్టకరమని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మనిషి తనని తన పుట్టుకకు కారణమైన కుటుంబంతో మాత్రమే identify చేసుకోక సమస్థ మానవ చరిత్రకి కొనసాగింపుగా చుసికొన్నట్టైతే చరిత్రలో అన్యాయానికి, వివక్షకి గురైన జాతులు లేదా వర్గాల పట్ల సహజమైన సానుభూతి కలుగుతుంది. ఈ సానుభూతి కలగడానికి ఒక ప్రత్యేక సామాజిక నేపథ్యం కలిగి ఉండవలసిన అవసరం కూడా లేదని నేను నమ్ముతాను. గతంలోని తప్పులన్నీ సమిష్టి తప్పిదాలే, గతంలోని గొప్పలన్నీ సమిష్టి గొప్పలే అన్నట్టు భావించి వర్తమానంలో సమసమాజస్థాపన అనేది మన ముందున్న కర్తవ్యంగా ముందుకి సాగిపోవాలి. దొంగతనం, హింస వంటి వాటిలానే వివక్ష అనేది కూడా మెదడులో కలిగే ఒక మలినమైన ఆలోచనయనీ - అప్రయత్నంగానైనా అలాంటి ఆలోచన మెదడులో కలిగితే దాన్ని psychosis(మానసిక రుగ్మత)గా పరిగణించి ఆ మనిషికి వైద్య సహాయం అందించే ఏర్పాట్లు చేసే స్థాయికి మానవ సమాజాలు ఎదగాలి. ఎలాంటి సామాజిక అంశమైనా గాని.. ‘Neutrality’ దెబ్బతింటున్నదన్న ప్రతిసారీ ఇంట్లో, ఇంటి బయటా కూడా బహిరంగంగా చర్చలు జరిగటం వంటివి చూసినప్పుడు పిల్లల్లో ఈ వివక్ష దోరణి బాల్య దశ నుండే క్రమంగా తొలగిపోతుంది. మన తరమైనా ఈ ప్రయత్నం చేస్తే రాబోయే తరాలు విశాల దృక్పథాన్ని కలిగివుండే అవకాశం ఉంది. వాస్తవానికి  దీనంతిటినీ ఆచరణలో పెట్టడానికి మనం ఎంతో దూరంలో ఉన్నాము అన్నది విదితమే. మనుషుల్లో వివక్షపూరిత భావాలను తొలగించే పనిని సమాజం మూకుమ్మడిగా పూనుకొని ప్రయత్నంగా నిర్వహించాలి. ఈ ప్రయత్నం మన చట్టాల్లో, చట్టాల నిర్వాహణల్లో, మన పాలకుల భాష్యాల్లో, ప్రభుత్వ పథకాల్లో, సాహిత్యంలో, సినిమాల్లో, అన్నిటినీ మించి విద్యా వ్యవస్థలో అడుగడుగునా గోచరించాలి. ప్రయత్నంగా శ్రమిస్తేగానీ ఈ జాఢ్యం మనల్ని వదిలిపోదు.

10, ఫిబ్రవరి 2016, బుధవారం

జంగల్ బుక్!

అడవి మొత్తం కబురు తిరుగుతుంది, ఇప్పుడే తెలిసింది!
చడ్డి వెస్కొని ఓ పువ్వు పూచింది!
పుట్టీ పుట్టగానే దాని బోసిమొల చూస్కొని ఆ చిన్ని గువ్వ సిగ్గుపడిపోయిందంట  .. 
గుడ్డు లోపల ఉన్నంత కాలం దానికి ఏ గొడవలేకుండా ఉండిందంట ..
అసలు ఎందుకు బయటకి ఎందుకొచ్చానబ్బా? అని ఆలోచిస్తూ ఉండిపోయిందంట
అడవి మొత్తం కబురు తిరుగుతుంది, ఇప్పుడే తెలిసింది!
చడ్డి వెస్కొని ఓ పువ్వు పూచింది!అదో.. ఈ మధ్యన 'జంగల్ బుక్' సినిమా రిలీజ్ అవుతుందనే సరికి నా మస్తిష్కంలో జ్ఞాపకాలు వెనక్కి పరిగెత్తాయి. నా గుండు మీద nostalgia చినుకులు ఒకటికి రెంటికి మూడిటికి అనంతం వర్షించి తడిసి ముద్దైపోయాను!

అయితే, మంచో చెడో, కాలంతో పాటు చాల విషయాలు తెలిసినైగా మరి. పాత విషయాలేవి అప్పుడు కనిపించినట్టు ఇప్పుడిక కనిపించవు. ఒక రెండేళ్ళ క్రితమే One piece లాంటి ఆనిమేలు (animés) కనుగొని, చూసి, తరించి, పరవశంతో మూర్చిల్లిపోతిని కాని అప్పటికీ తెలియలేదు నాకు నా బాల్యంలోని అత్యంత సుందర జ్ఞాపకాల్లో ఒకటైన 'జంగల్ బుక్' కూడా ఒక జపనీస్ ఆనిమే నే అని! ప్రతి కళాఖండానికి ఒక విధాత ఉంటాడని, ఈ కళాఖండం దర్శకుని పేరు ఫుమియో కురోకావ ఊహించితినా నేను? టైటిల్స్ లో ఆయన పేరు ప్రతిసారి ఎలా చూడకుండా దాటి వేసాను! జపనీస్ భాషలో 'ల' కి 'ర' కి వ్యత్యాసం ఉండదు. అందుకే ఆ భాషలో దీన్ని జంగురు బుక్కు షోనేన్ మోగురి అని పిలిచారు. ఓహ్ షోనేన్ అంటే ఏమిటనా? అవి జపాన్లో 'బాలురు కోసం' తయారుచేయబడే ఒక తరహ కార్టూన్ల పేరు.. ఇక్కడ షోనేన్ అంటే 'సాహస బాలుడు' అని చెప్పుకోవచ్చు. 

అంతేనా? షేర్ఖాన్ కి నేపధ్య స్వరం నానా పటేకర్ అందించాడంట, శీర్షిక గీతాన్ని సాక్షాత్తు గుల్జార్ రచించారంట!  ఇవే విషయాలు నాకా రోజు చెప్పుంటే ఏమనే వాన్నో నేను?

ఈ జీవితముందే జీవితము.. అదొక మహా చమత్కార వృత్తాకార చలనము! 

16, అక్టోబర్ 2015, శుక్రవారం

నే.. నే..

సరిగ్గా మనం పుట్టిన సమయాన్నే జన్మించాడో మనిషి

నాలానే .. 
             ఇదేమి? అదేమీ? వారెవరు? వీరెవరు? నాకెవరు? నీకెవరు? నేనెవరు?
                                                .. అని ప్రశ్నల మీద నడకలు నేర్చుకున్నాడు. 
మనిద్దరికంటే ముందరనే .. 
             ఈ ప్రపంచమొక గాజుమేడ అనీ  
                                               .. ఇక్కడి గోడలన్నీ పారదర్శకాలనీ తెలుసుకున్నాడు.
అందరిలానే .. 
             గతం బింగించే పాశం నొప్పిస్తున్నా, భవిష్యత్తు భయం పుట్టిస్తున్నా, 
                                               .. వర్తమానంలో ఊపిరి అందితే చాలనుకున్నాడు. 
నీలానే .. 
             సాహసం లేని మార్గం మీద మమకారం కలుగక, 
                                               ..  ఖర్జూరాలని వెతుక్కొంటూ కఠినమైన ఎడారి మార్గం పట్టాడు. 
అలానే ..  
             ఎడారి మార్గాన కనిపించిన ఒయాసిస్ మీద మనసు పారేసుకున్నాడు .. 
                                               .. పూజలు చేసాడు, మోకరిల్లాడు ..  కవితలు రాసాడు. 
ఇలానే .. 
            ఈ క్షణం ఇదే రీతిలో నిన్నూ నన్నూ  ఇరికించి ఇద్దరికీ అర్థంకాని కవితేదో రాస్తున్నాడు. 

25, సెప్టెంబర్ 2015, శుక్రవారం

కవికి విన్నపం

శోక కవిత్వం రాయమాకు కవి.. నియంత్రించుకో!
వీలయితే ఓ అనాథ కవితని చేరదీసి దాని ముఖానికి నవ్వు అద్ది మాకివ్వు.
ఎలానో చెప్తాము విను ..
కళ్ళు మూసుకొని ప్రేయసిని తలుచుకో,
హృదయంలో ఆమె బింబాన్ని నింపుకో. ఇప్పుడు చూడు!
మెదడులో, మనోవాక్కులో, కవిత్వంలో.. అందం తానంతట అదే పరవళ్ళు తొక్కుతుంది!

భయం వలదు కవి .. ప్రేయసి బింబం పూర్తిగా నీ సొంతం!
బింబాన్ని శోక కవిత్వంతో తడి చేయకు ..
ఊరికే గుండెని నలిపి బింబం పైన వేలిముద్రలు పడనీయకు!
దృష్టి మాత్రం బింబం మీద లగ్నం చేసి కవిత రాసి చూడు
మంచి మంచి పదాలు వాటికవే ద్రోల్లుకొంటు వచ్చి నవ్వుకుంటూ చేరతాయి..
ప్రయత్నించి చూడు ..

మమ్ము బాధించకు కవీ! విన్నవించుకుంటున్నాము ..
నువ్వేదో ప్రపంచ భారమంతా మోస్తునట్టు.. మాకు నీ మీద జాలి కలిగించాలని చూడకు!
నీకు మనసులో నొప్పి కలిగితే దాన్ని కడుపులోకి దిగమింగు!
మా మీద మాత్రం నీ శోకాన్ని కక్కకు!
నీ ప్రేయసి కోసం రాస్తున్నావనుకొని ఒక నాలుగు పంక్తులు రాసి ఇటు వదులు
ఆపై నీ బాధని నీలోనే అరిగిపోనివ్వు.

గుండెలనిండా ఊపిరి పీల్చుకొని వదులు, నిన్న రాత్రి కలని జ్ఞాపకం తెచ్చుకో,
నిజంతో పోల్చుకోకు! ఆ జ్ఞాపకమే నిజమనుకో ..
ప్రేయసి తన కళ్ళతో నిన్ను పిలిచిన వైనం ఓసారి గుర్తు తెచ్చుకో
అరెరే కవి! ఆ ఊహకే నీ పెదవి మీద నవ్వు మెరిసిందే!
అరే! సిగ్గు కూడా పడుతున్నావా కవీ? ఆహ! ముఖం అంతా వెలిగిపోతుందే!
ఆ వెలుగేదో మాకు కూడా పంచిపెట్టు కవీ
మెమెల్లరూ సుఖించెదము నిన్ను అశీర్వదించెదము!

24, సెప్టెంబర్ 2015, గురువారం

ఎందుకు? ఏమిటి?

ఈ వీడియోలో Prof. Feynman చెప్పిన మాటలని తెలిగించాలని ప్రయత్నించాను. చాల శ్రమ అయిపోయేట్టు తోచింది. తెలుగించి సాధించేదేముందిలే అనిపించింది. Prof. Feynman ఆలోచన విదానము, మాటల్లో స్పష్టత చాల జాగ్రత్త గమనించాల్సి ఉంది. దీన్నే జీవితంలో అన్ని విషయాలపైకి అన్వయించుకొని ఎల్లరూ జీవితాన్ని అశ్వాదించుదురు గాక.

ఓ గణిత మేధావి!
ఒక్కో ఆలోచనా ఒక్కో మహా గణితాద్భుతం!
మాట మాటలోనూ సుస్వరం!
ఎంత జ్ఞానం ఎంత జ్ఞానం ఎంత జ్ఞానం!
అనంతం ముందు అసామాన్య వినమ్రత!
మాటలోని కటువైన స్పష్టత!
మెదడున కస్సుమని దిగే స్పష్టత!
అబద్ధం ఆడలేని నీ అమాయకత్వం!

మా మనసుల్లో నిన్నే చూస్తున్నాము,
చేతల్లో నిన్నే అనుకరిస్తున్నాము
నీ గురించే ఆలోచిస్తున్నాము
నువ్వు చూపించిన మార్గాన్నే నడుస్తున్నాము
నీ కలనే మా కలగా తపిస్తున్నాము.

ఒంటరిగా ఆలోచించమని మా తలలకు మమ్మల్ని వదిలేసినావు
మనసుని ఒప్పించుకోమని ఉపదిసించేవు.
మనసుని ఒప్పింప జేసే ప్రయత్నంలోనే మేము గణితాన్ని కనుగొన్నాము!
బలవంతుల్ని చేసావు మమ్ము మహానుభావా!
నీ ఋణమే ఈ అర్థవంతమైన ఆనందము!

ఊరేగింపులో భాజాభజంత్రీల్లో చివరి వరసలోని
సన్నాయి కిర్రు మందని ఏడ్చే వాళ్ళము మేము
ఆకాశ వీక్షణం చేయటం నేర్పించినావు మాకు పక్షిరాజుల ఓలే!
చూస్తున్నాము కొండలు కోనలు సముద్రాలు
అణువణువులో అర్థాన్ని! గణితాన్ని!
అగణితాద్భుత గణిత అద్భుతాలని!

---------------------
భౌతిక శాస్త్రవేత్త రిచర్డ్ ఫైన్మాన్ ని గుర్తు తెచ్చుకుంటూ.. 

22, సెప్టెంబర్ 2015, మంగళవారం

నస!

పడిపోద్ది పడిపోద్ది !
పడిపోయిందా?
ఓరిని! ఇంకా లేదా?

అద్దిగో!
పడిపోవాలి ఇంక మరి  ..
చూడు చూడు .. పడిపోతంది చూడు
హిహి
ఏంటి? ఇంకా పడలేదా?
పడద్ది పడద్ది చూస్తుండు ..

ఊరికే ఏం చెప్పట్లేదు!
అప్పుడు అలాగే మరి
ఇంకెప్పుడో కూడా అలాగే
అక్కడ అలాగే
ఇంకెక్కడో కూడా అలాగే
హిహి
పడిపోతందిగా అసలు, చుస్తన్నావా?

justu missu!
ఇందాకే పడిపోవల్సింది అసలు
కదండీ? అవును కదా?
హిహి
ఇందాక ఇంచుమించు పడిపోయిందనే అనేస్కున్నాంగా అసలు?
హిహి
fools!

సరే కాని, ఏంటి waiting ఆహ్?
మీరు కూడానా?
ఏంటి? మీరు కూడానా?!
హిహిహి
పిచ్చ నా కో!
ఓహ్ sorry!
మీ మంచి కోసమేనండీ!
మీ మీద అభిమానం అంతే ..
నాకేం లాభం చెప్పండీ?
ఇందాకటికి ఇప్పటికి తేడా చూడండి.. చూస్తున్నారా?
హిహి comedy!
complete smash అసలు చూస్తూ ఉండండి!

ఓడియమ్మ!
పడిపోయేదానికి ఎందుకురా గోల?
నిన్న గాలి కనుక ఈ రోజు వీచుంటేనా..
ఏ? కదా?
నిన్న?
మీరున్నారా?
గాలి?
నిన్నండీ ..
గాలి చూసారా మీరు?
ఈ రోజు ఏదో అదృష్టం అంతే
లేకపోతే ఇంత సేపా అసలు!
హిహి

ఏంటి హిందీ యా?
జరూర్ గిర్ జాయేగా!
ఏంటి foreign ఆహ్ మీరు?
It was falling and it will falling it almost falled అండీ .. just look and see?
నువ్వు లోకల్ ఆహ్ బాబూ?
ఏం పని పాట లేదా? పడిపొద్ది అదిప్పుడు ఎలానో ..
మ్మ్ .. ఏం బ్రాంచ్ తీసుకున్నావ్?
పర్లేదు ఇప్పుడు మళ్ళి boom వస్తుందిగా ..
focus చేయమ్మా చాలు.
ఇది ఇప్పుడు పడిపోవటం guaranty.
ఎందుకు time waste చేస్కుంటున్నావు?

finally!
చుస్తాన్నారా?
movement కనపడతందిగా అసలూ!
అదిగో ..
ఇంక smash యెహ్ ...
ఒకసారి పడిందనుకో ..
smash అలాంటి ఇలాంటి smash కాదు మరి
మటాష్ smash అనీ, ఒకటుంటదిలే..
మీరు విన్నారా ఎప్పుడైనా?
మహా smashu?
sorry, మటాష్ smashu ..
హిహి నేను చూడు నేను! మహా smash అంట!
ఏంటో అసలు నా jokes!
విన్నారా?
వినలేదా?
వినుదురు వినుదురు వినుదురు ..

చిలక్కి..
చిలక్కి చెప్పినట్టు చెప్పాను నేను
like one parrot I told అండీ..
వింటేగా
ఇప్పుడు చుడండి పడిపోవటం తధ్యం
మాష్టారు time ఎంత?
వాచీ లేదా? హిహి
ఈ రోజుల్లో అసలు వాచీలు ఎక్కడ వాడతన్నారు?
అందరు చెల్ ఫోనులే!
ఎంత ఉండి ఏం లాభం పడిపోద్దని తెలియట్లేదు

నీయమ్మ జీవితం మీ ఓపికలు మీరు!
ఎంత సేపు wait చేస్తార్రా?
అద్దిగో!
పడిపోవాలి ఇంక మరి  ..
చూడు చూడు .. పడిపోతంది చూడు
హిహి
ఏంటి? ఇంకా పడలేదా?

పడద్ది పడద్ది చూస్తుండు ..

అప్పుడు అలాగే మరి
ఊరికే ఏం చెప్పట్లేదు!
అప్పుడు కూడా అలాగే
అక్కడ అలాగే
ఇంకెక్కడో కూడా అలాగే
హిహి
పడిపోతందిగా అసలు, చుస్తాన్నవా?

justu missu!
ఇందాకే పడిపోవల్సింది అసలు
కదండీ? అవును కదా?
హిహి
ఇందాక ఇంచుమించు పడిపోయిందనే అనేస్కున్నాంగా అసలు?
హిహి
fools!

సరే కాని, ఏంటి waiting ఆహ్?
మీరు కూడానా?
ఏంటి? మీరు కూడానా?!
హిహిహి
పిచ్చ నా కో!
ఓహ్ sorry!
మీ మంచి కోసమేనండీ!
మీ మీద అభిమానం అంతే ..
ఇందాకటికి ఇప్పటికి తేడా చూడండి.. చూస్తున్నారా?
హిహి comedy!
complete smash అసలు చూస్తూ ఉండండి!


-----------------------------------------------------------------
నసనని లాభమని యసలనుకోను!
విసిగి కసిరిన విముక్తి యొసగదని తెలుసును. 
అటులని తీసియూ పారేయలేను!
చెవి కోసుకొని శ్రవణము కోల్పోయిన కలుగునేమో
కొసరైన సుఖము! అండ పిండ బ్రహ్మాండముల యన్నిటా తప్ప- 
ని సరిగా దాపరించు నస ప్రసాద విదాతలారా వంద వందనములు.19, సెప్టెంబర్ 2015, శనివారం

మధ్యరాత్రి మనసులో మార్పు!

ఒకనాడు ఎవరో ఏదో ఆలపిస్తున్నారు,
చీకట్లో నేనా శబ్దాలను యాచిస్తూ ఆలకిస్తున్నాను!
వింటున్న ఆ మాటల గురించే ఓ తపస్సులా యోచిస్తున్నాను,
దశలుగా ఆ మాటలతో ప్రేమలో పడుతూ వస్తున్నాను!
విని విని నేను వశం తప్పుతున్నాను,
నేను వింటున్నానన్న అక్కరు వారికే మాత్రము లేదు!

పిల్లనుగ్రోవి చెవిలో వారు ప్రేమగా ఊదుతున్న రహస్య మేమిటో నాకు పూర్తిగా అర్థమైతే కాలేదు ..
ఆ వెదురు బొంగుదీ నాదీ ఒకే జాతి!
లోనున్న వెలితి మాయిద్దరికీ సరిగ్గా సమానం ..
కళ్ళని చెమ్మ చేసే ఇలాంటి తీపి సంగీతంలో  కాలాన్ని- ఖాళీలని మర్చిపోతుంటాము ..
సుస్వర మనే పదార్థమే లేకుండుంటే, మేమిద్దర మేనాడో మరణిం చుండే వాళ్ళమేమో!

------
ఈ మధ్యరత్రివేల మనసులో ఏమిటీ కొత్త మార్పు? నిద్ర రాకనా?
లేక కరుణ లేని యీ చీకటి రాత్రి, వారి ఆలోచన నాలో సృష్టిస్తున్న మార్ప?
ఏదేమైనా, నాలో శోకాన్ని నయం చేయటానికి జరుగుతున్న ఈ మార్పును మించిన మందు లేదు.
పిల్లనగ్రోవిలా ఏడవటానికి, నాకు దానికున్నని కనులు లేవు!
-------------------------------------------------------------------------------

ప్రేరణ: తెలుగు వాళ్లకి 'సఖి'గా తెలిసిన తమిళ చిత్రం 'అలై పాయుదే' (అల ఎగిసెనే)లోని కవి వైరముత్తు గారు రాసిన 'ఎవనో ఒరువన్ వాసిక్కిరాణ్' అన్న పాటకి కాస్త దూరపు అనువాదం ఇది. తెలుగులో 'ప్రేమలే నేరమా  ఓ నా ప్రియ' అని వేటూరి రాసినదానికి  - దీనికి ఏ మాత్రం పోలిక లేదన్న విషయం గమనించగలరు. తమిళ మాతృకలోని నిరాకార వర్ణననల ప్రయోగం ఈ పాటని ప్రేమ - విరహం స్థాయికి మించి చాల ఎత్తుకి తీసుకెళ్లిందని నా అభిప్రాయం. 


11, ఆగస్టు 2015, మంగళవారం

ప్రేయసి తలపు

- ప్రాణానికి అత్యంత ప్రియమైన రాగం
                    ఆరోహణం ఎగసి ఎగసి శిఖరాగ్ర తీవ్రతకు చేరి అక్కడే ఆ పై చరియలలో గమకంగా ఊగిసిలాడుతున్న తరుణం!

- ఓ మహానుభావుడు అత్యంత శ్రద్ధగా రాసిన పుస్తకం చదువుతుండగా
                    ఇంకొక పుట దూరంలో మహాసత్యం ఒకటి బోధపదిపోతుందని స్పృహకి వస్తున్న తరుణం.

- తప్పు పొల్లుపోకుండా గుక్కతిప్పుకోకుండా కొనసాగుతున్న కవితా పఠణం..
                     తరువాతి పంక్తిలో వెంట్రుకలు నిక్కపోడుచుకొనే వర్ణన రాబోతుందని తెలిసి ఆత్రం..

- ఎప్పుడో ఆకతాయిగా నాటిన పిచ్చి విత్తనం
                     ఓ ఉదయం అనుకోకుండా చూసేసరికి నన్ను పలకరించి నవ్వుతున్న పచ్చదనం..

- ప్రపంచంలో ప్రతి అణువుకి రుణపడి ఉన్నాననిపిస్తూ 
                      ప్రతి అణువుకి నాతోనే పని యనిపిస్తూ లోలోపల నిరాడంభరత వేషంలో తలకెక్కుతున్న గర్వం. 

- తెల్లారితే ఇంటికి బుజ్జి కుక్కపిల్ల వస్తుందని తెలిసి 
                     ఉత్సాహంతో నిద్రపట్టక ఆనందంతో మనసు పెడుతున్న కలవరం..