16, అక్టోబర్ 2015, శుక్రవారం

నే.. నే..

సరిగ్గా మనం పుట్టిన సమయాన్నే జన్మించాడో మనిషి

నాలానే .. 
             ఇదేమి? అదేమీ? వారెవరు? వీరెవరు? నాకెవరు? నీకెవరు? నేనెవరు?
                                                .. అని ప్రశ్నల మీద నడకలు నేర్చుకున్నాడు. 
మనిద్దరికంటే ముందరనే .. 
             ఈ ప్రపంచమొక గాజుమేడ అనీ  
                                               .. ఇక్కడి గోడలన్నీ పారదర్శకాలనీ తెలుసుకున్నాడు.
అందరిలానే .. 
             గతం బింగించే పాశం నొప్పిస్తున్నా, భవిష్యత్తు భయం పుట్టిస్తున్నా, 
                                               .. వర్తమానంలో ఊపిరి అందితే చాలనుకున్నాడు. 
నీలానే .. 
             సాహసం లేని మార్గం మీద మమకారం కలుగక, 
                                               ..  ఖర్జూరాలని వెతుక్కొంటూ కఠినమైన ఎడారి మార్గం పట్టాడు. 
అలానే ..  
             ఎడారి మార్గాన కనిపించిన ఒయాసిస్ మీద మనసు పారేసుకున్నాడు .. 
                                               .. పూజలు చేసాడు, మోకరిల్లాడు ..  కవితలు రాసాడు. 
ఇలానే .. 
            ఈ క్షణం ఇదే రీతిలో నిన్నూ నన్నూ  ఇరికించి ఇద్దరికీ అర్థంకాని కవితేదో రాస్తున్నాడు. 

25, సెప్టెంబర్ 2015, శుక్రవారం

కవికి విన్నపం

శోక కవిత్వం రాయమాకు కవి.. నియంత్రించుకో!
వీలయితే ఓ అనాథ కవితని చేరదీసి దాని ముఖానికి నవ్వు అద్ది మాకివ్వు.
ఎలానో చెప్తాము విను ..
కళ్ళు మూసుకొని ప్రేయసిని తలుచుకో,
హృదయంలో ఆమె బింబాన్ని నింపుకో. ఇప్పుడు చూడు!
మెదడులో, మనోవాక్కులో, కవిత్వంలో.. అందం తానంతట అదే పరవళ్ళు తొక్కుతుంది!

భయం వలదు కవి .. ప్రేయసి బింబం పూర్తిగా నీ సొంతం!
బింబాన్ని శోక కవిత్వంతో తడి చేయకు ..
ఊరికే గుండెని నలిపి బింబం పైన వేలిముద్రలు పడనీయకు!
దృష్టి మాత్రం బింబం మీద లగ్నం చేసి కవిత రాసి చూడు
మంచి మంచి పదాలు వాటికవే ద్రోల్లుకొంటు వచ్చి నవ్వుకుంటూ చేరతాయి..
ప్రయత్నించి చూడు ..

మమ్ము బాధించకు కవీ! విన్నవించుకుంటున్నాము ..
నువ్వేదో ప్రపంచ భారమంతా మోస్తునట్టు.. మాకు నీ మీద జాలి కలిగించాలని చూడకు!
నీకు మనసులో నొప్పి కలిగితే దాన్ని కడుపులోకి దిగమింగు!
మా మీద మాత్రం నీ శోకాన్ని కక్కకు!
నీ ప్రేయసి కోసం రాస్తున్నావనుకొని ఒక నాలుగు పంక్తులు రాసి ఇటు వదులు
ఆపై నీ బాధని నీలోనే అరిగిపోనివ్వు.

గుండెలనిండా ఊపిరి పీల్చుకొని వదులు, నిన్న రాత్రి కలని జ్ఞాపకం తెచ్చుకో,
నిజంతో పోల్చుకోకు! ఆ జ్ఞాపకమే నిజమనుకో ..
ప్రేయసి తన కళ్ళతో నిన్ను పిలిచిన వైనం ఓసారి గుర్తు తెచ్చుకో
అరెరే కవి! ఆ ఊహకే నీ పెదవి మీద నవ్వు మెరిసిందే!
అరే! సిగ్గు కూడా పడుతున్నావా కవీ? ఆహ! ముఖం అంతా వెలిగిపోతుందే!
ఆ వెలుగేదో మాకు కూడా పంచిపెట్టు కవీ
మెమెల్లరూ సుఖించెదము నిన్ను అశీర్వదించెదము!

24, సెప్టెంబర్ 2015, గురువారం

ఎందుకు? ఏమిటి?

ఈ వీడియోలో Prof. Feynman చెప్పిన మాటలని తెలిగించాలని ప్రయత్నించాను. చాల శ్రమ అయిపోయేట్టు తోచింది. తెలుగించి సాధించేదేముందిలే అనిపించింది. Prof. Feynman ఆలోచన విదానము, మాటల్లో స్పష్టత చాల జాగ్రత్త గమనించాల్సి ఉంది. దీన్నే జీవితంలో అన్ని విషయాలపైకి అన్వయించుకొని ఎల్లరూ జీవితాన్ని అశ్వాదించుదురు గాక.

ఓ గణిత మేధావి!
ఒక్కో ఆలోచనా ఒక్కో మహా గణితాద్భుతం!
మాట మాటలోనూ సుస్వరం!
ఎంత జ్ఞానం ఎంత జ్ఞానం ఎంత జ్ఞానం!
అనంతం ముందు అసామాన్య వినమ్రత!
మాటలోని కటువైన స్పష్టత!
మెదడున కస్సుమని దిగే స్పష్టత!
అబద్ధం ఆడలేని నీ అమాయకత్వం!

మా మనసుల్లో నిన్నే చూస్తున్నాము,
చేతల్లో నిన్నే అనుకరిస్తున్నాము
నీ గురించే ఆలోచిస్తున్నాము
నువ్వు చూపించిన మార్గాన్నే నడుస్తున్నాము
నీ కలనే మా కలగా తపిస్తున్నాము.

ఒంటరిగా ఆలోచించమని మా తలలకు మమ్మల్ని వదిలేసినావు
మనసుని ఒప్పించుకోమని ఉపదిసించేవు.
మనసుని ఒప్పింప జేసే ప్రయత్నంలోనే మేము గణితాన్ని కనుగొన్నాము!
బలవంతుల్ని చేసావు మమ్ము మహానుభావా!
నీ ఋణమే ఈ అర్థవంతమైన ఆనందము!

ఊరేగింపులో భాజాభజంత్రీల్లో చివరి వరసలోని
సన్నాయి కిర్రు మందని ఏడ్చే వాళ్ళము మేము
ఆకాశ వీక్షణం చేయటం నేర్పించినావు మాకు పక్షిరాజుల ఓలే!
చూస్తున్నాము కొండలు కోనలు సముద్రాలు
అణువణువులో అర్థాన్ని! గణితాన్ని!
అగణితాద్భుత గణిత అద్భుతాలని!

---------------------
భౌతిక శాస్త్రవేత్త రిచర్డ్ ఫైన్మాన్ ని గుర్తు తెచ్చుకుంటూ.. 

22, సెప్టెంబర్ 2015, మంగళవారం

నస!

పడిపోద్ది పడిపోద్ది !
పడిపోయిందా?
ఓరిని! ఇంకా లేదా?

అద్దిగో!
పడిపోవాలి ఇంక మరి  ..
చూడు చూడు .. పడిపోతంది చూడు
హిహి
ఏంటి? ఇంకా పడలేదా?
పడద్ది పడద్ది చూస్తుండు ..

ఊరికే ఏం చెప్పట్లేదు!
అప్పుడు అలాగే మరి
ఇంకెప్పుడో కూడా అలాగే
అక్కడ అలాగే
ఇంకెక్కడో కూడా అలాగే
హిహి
పడిపోతందిగా అసలు, చుస్తన్నావా?

justu missu!
ఇందాకే పడిపోవల్సింది అసలు
కదండీ? అవును కదా?
హిహి
ఇందాక ఇంచుమించు పడిపోయిందనే అనేస్కున్నాంగా అసలు?
హిహి
fools!

సరే కాని, ఏంటి waiting ఆహ్?
మీరు కూడానా?
ఏంటి? మీరు కూడానా?!
హిహిహి
పిచ్చ నా కో!
ఓహ్ sorry!
మీ మంచి కోసమేనండీ!
మీ మీద అభిమానం అంతే ..
నాకేం లాభం చెప్పండీ?
ఇందాకటికి ఇప్పటికి తేడా చూడండి.. చూస్తున్నారా?
హిహి comedy!
complete smash అసలు చూస్తూ ఉండండి!

ఓడియమ్మ!
పడిపోయేదానికి ఎందుకురా గోల?
నిన్న గాలి కనుక ఈ రోజు వీచుంటేనా..
ఏ? కదా?
నిన్న?
మీరున్నారా?
గాలి?
నిన్నండీ ..
గాలి చూసారా మీరు?
ఈ రోజు ఏదో అదృష్టం అంతే
లేకపోతే ఇంత సేపా అసలు!
హిహి

ఏంటి హిందీ యా?
జరూర్ గిర్ జాయేగా!
ఏంటి foreign ఆహ్ మీరు?
It was falling and it will falling it almost falled అండీ .. just look and see?
నువ్వు లోకల్ ఆహ్ బాబూ?
ఏం పని పాట లేదా? పడిపొద్ది అదిప్పుడు ఎలానో ..
మ్మ్ .. ఏం బ్రాంచ్ తీసుకున్నావ్?
పర్లేదు ఇప్పుడు మళ్ళి boom వస్తుందిగా ..
focus చేయమ్మా చాలు.
ఇది ఇప్పుడు పడిపోవటం guaranty.
ఎందుకు time waste చేస్కుంటున్నావు?

finally!
చుస్తాన్నారా?
movement కనపడతందిగా అసలూ!
అదిగో ..
ఇంక smash యెహ్ ...
ఒకసారి పడిందనుకో ..
smash అలాంటి ఇలాంటి smash కాదు మరి
మటాష్ smash అనీ, ఒకటుంటదిలే..
మీరు విన్నారా ఎప్పుడైనా?
మహా smashu?
sorry, మటాష్ smashu ..
హిహి నేను చూడు నేను! మహా smash అంట!
ఏంటో అసలు నా jokes!
విన్నారా?
వినలేదా?
వినుదురు వినుదురు వినుదురు ..

చిలక్కి..
చిలక్కి చెప్పినట్టు చెప్పాను నేను
like one parrot I told అండీ..
వింటేగా
ఇప్పుడు చుడండి పడిపోవటం తధ్యం
మాష్టారు time ఎంత?
వాచీ లేదా? హిహి
ఈ రోజుల్లో అసలు వాచీలు ఎక్కడ వాడతన్నారు?
అందరు చెల్ ఫోనులే!
ఎంత ఉండి ఏం లాభం పడిపోద్దని తెలియట్లేదు

నీయమ్మ జీవితం మీ ఓపికలు మీరు!
ఎంత సేపు wait చేస్తార్రా?
అద్దిగో!
పడిపోవాలి ఇంక మరి  ..
చూడు చూడు .. పడిపోతంది చూడు
హిహి
ఏంటి? ఇంకా పడలేదా?

పడద్ది పడద్ది చూస్తుండు ..

అప్పుడు అలాగే మరి
ఊరికే ఏం చెప్పట్లేదు!
అప్పుడు కూడా అలాగే
అక్కడ అలాగే
ఇంకెక్కడో కూడా అలాగే
హిహి
పడిపోతందిగా అసలు, చుస్తాన్నవా?

justu missu!
ఇందాకే పడిపోవల్సింది అసలు
కదండీ? అవును కదా?
హిహి
ఇందాక ఇంచుమించు పడిపోయిందనే అనేస్కున్నాంగా అసలు?
హిహి
fools!

సరే కాని, ఏంటి waiting ఆహ్?
మీరు కూడానా?
ఏంటి? మీరు కూడానా?!
హిహిహి
పిచ్చ నా కో!
ఓహ్ sorry!
మీ మంచి కోసమేనండీ!
మీ మీద అభిమానం అంతే ..
ఇందాకటికి ఇప్పటికి తేడా చూడండి.. చూస్తున్నారా?
హిహి comedy!
complete smash అసలు చూస్తూ ఉండండి!


-----------------------------------------------------------------
నసనని లాభమని యసలనుకోను!
విసిగి కసిరిన విముక్తి యొసగదని తెలుసును. 
అటులని తీసియూ పారేయలేను!
చెవి కోసుకొని శ్రవణము కోల్పోయిన కలుగునేమో
కొసరైన సుఖము! అండ పిండ బ్రహ్మాండముల యన్నిటా తప్ప- 
ని సరిగా దాపరించు నస ప్రసాద విదాతలారా వంద వందనములు.19, సెప్టెంబర్ 2015, శనివారం

మధ్యరాత్రి మనసులో మార్పు!

ఒకనాడు ఎవరో ఏదో ఆలపిస్తున్నారు,
చీకట్లో నేనా శబ్దాలను యాచిస్తూ ఆలకిస్తున్నాను!
వింటున్న ఆ మాటల గురించే ఓ తపస్సులా యోచిస్తున్నాను,
దశలుగా ఆ మాటలతో ప్రేమలో పడుతూ వస్తున్నాను!
విని విని నేను వశం తప్పుతున్నాను,
నేను వింటున్నానన్న అక్కరు వారికే మాత్రము లేదు!

పిల్లనుగ్రోవి చెవిలో వారు ప్రేమగా ఊదుతున్న రహస్య మేమిటో నాకు పూర్తిగా అర్థమైతే కాలేదు ..
ఆ వెదురు బొంగుదీ నాదీ ఒకే జాతి!
లోనున్న వెలితి మాయిద్దరికీ సరిగ్గా సమానం ..
కళ్ళని చెమ్మ చేసే ఇలాంటి తీపి సంగీతంలో  కాలాన్ని- ఖాళీలని మర్చిపోతుంటాము ..
సుస్వర మనే పదార్థమే లేకుండుంటే, మేమిద్దర మేనాడో మరణిం చుండే వాళ్ళమేమో!

------
ఈ మధ్యరత్రివేల మనసులో ఏమిటీ కొత్త మార్పు? నిద్ర రాకనా?
లేక కరుణ లేని యీ చీకటి రాత్రి, వారి ఆలోచన నాలో సృష్టిస్తున్న మార్ప?
ఏదేమైనా, నాలో శోకాన్ని నయం చేయటానికి జరుగుతున్న ఈ మార్పును మించిన మందు లేదు.
పిల్లనగ్రోవిలా ఏడవటానికి, నాకు దానికున్నని కనులు లేవు!
-------------------------------------------------------------------------------

ప్రేరణ: తెలుగు వాళ్లకి 'సఖి'గా తెలిసిన తమిళ చిత్రం 'అలై పాయుదే' (అల ఎగిసెనే)లోని కవి వైరముత్తు గారు రాసిన 'ఎవనో ఒరువన్ వాసిక్కిరాణ్' అన్న పాటకి కాస్త దూరపు అనువాదం ఇది. తెలుగులో 'ప్రేమలే నేరమా  ఓ నా ప్రియ' అని వేటూరి రాసినదానికి  - దీనికి ఏ మాత్రం పోలిక లేదన్న విషయం గమనించగలరు. తమిళ మాతృకలోని నిరాకార వర్ణననల ప్రయోగం ఈ పాటని ప్రేమ - విరహం స్థాయికి మించి చాల ఎత్తుకి తీసుకెళ్లిందని నా అభిప్రాయం. 


11, ఆగస్టు 2015, మంగళవారం

ప్రేయసి తలపు

- ప్రాణానికి అత్యంత ప్రియమైన రాగం
                    ఆరోహణం ఎగసి ఎగసి శిఖరాగ్ర తీవ్రతకు చేరి అక్కడే ఆ పై చరియలలో గమకంగా ఊగిసిలాడుతున్న తరుణం!

- ఓ మహానుభావుడు అత్యంత శ్రద్ధగా రాసిన పుస్తకం చదువుతుండగా
                    ఇంకొక పుట దూరంలో మహాసత్యం ఒకటి బోధపదిపోతుందని స్పృహకి వస్తున్న తరుణం.

- తప్పు పొల్లుపోకుండా గుక్కతిప్పుకోకుండా కొనసాగుతున్న కవితా పఠణం..
                     తరువాతి పంక్తిలో వెంట్రుకలు నిక్కపోడుచుకొనే వర్ణన రాబోతుందని తెలిసి ఆత్రం..

- ఎప్పుడో ఆకతాయిగా నాటిన పిచ్చి విత్తనం
                     ఓ ఉదయం అనుకోకుండా చూసేసరికి నన్ను పలకరించి నవ్వుతున్న పచ్చదనం..

- ప్రపంచంలో ప్రతి అణువుకి రుణపడి ఉన్నాననిపిస్తూ 
                      ప్రతి అణువుకి నాతోనే పని యనిపిస్తూ లోలోపల నిరాడంభరత వేషంలో తలకెక్కుతున్న గర్వం. 

- తెల్లారితే ఇంటికి బుజ్జి కుక్కపిల్ల వస్తుందని తెలిసి 
                     ఉత్సాహంతో నిద్రపట్టక ఆనందంతో మనసు పెడుతున్న కలవరం.. 

14, జులై 2015, మంగళవారం

స్పష్టంగా ఒక నాలుగు మాటలు

మనిషి తన జీవితంలో అత్యంత శ్రద్ధగా మరియు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన విద్య ఏమైనా ఉందీ అంటే అది  - స్పష్టంగా మాట్లాడగలగటం. మనిషిగా పుట్టి.., తన మనసులోని ఆలోచనలని పదాల రూపంలో పెట్టలేకపోవటం కంటే నిరుత్సాహకరమైనది, విషాదకరమైనది అయిన  విషయం మరొకటి ఉండబోదు.

స్పషత అంటే ఏమిటి? 

- లోపలి జ్ఞానాన్ని గౌరవిస్తూ.. మనసుని మోసగించకుండా పూర్తి నిజయతీతో మాట్లాడాలని పట్టి పట్టి ప్రయత్నించినప్పుడు స్పష్టీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మానసిక ఆరోగ్యం గలిగిన వారందరికీ జ్ఞానం ఒకే లాగ ఉంటుంది, అందుకనే అందరికి గణితం ఒకే లాగ అర్థమవుతుంది. ఒకరికి సరి అనిపించే గణిత తీర్మానం (theorem) జ్ఞానం పెట్టి చూసినప్పుడు మనుషులందరికీ ఒకే విధంగా సరి అనిపించి తీరుతుంది. తర్ఫీదు లేని కారణంగా అలా చూడలేకపోతే అది వేరే విషయం; కానీ ప్రయత్నించగా ప్రతి మనిషికి గణితం ఒకే లాగ అర్థమవుతుంది అనేది సత్యం. ఇందులో షరతులు లేవు. జ్ఞానం ఒక గణిత పదార్ధం, తర్కం అనేది ఆ లోపలి గణితాన్ని బయటి వాడుకభాషని కట్టిపెట్టే ఒక ఆధారం. మానవులు ఇంత వరకు కనుగొన్న గణితం అంతా ప్రతి ఒక్కరి మెదడుల్లోనూ పుట్టుకతోనే నిక్షిప్తమై యున్నదే. అయితే స్పష్టంగా ఆలోచించాలన్న ఈ తీవ్ర తపన ఉన్న కారణంగా గణిత శాస్త్రజ్ఞులు వాళ్ళ జ్ఞానంలోని లోతుల్ని తెలుసుకొని అక్షర రూపంలో (వాడుకభాషలో) ఆవిష్కరిస్తూ ఉంటారు; సామాన్యులు ఇది చెయ్యరు.. అదే వ్యత్యాసం. చెప్పొచ్చేదేమంటే పూర్తిగా తర్క నియమాలకు మర్యాద ఇస్తూ  వాడుకభాషలో మాట్లాట్టమే స్పష్టంగా మాట్లాట్టం. ఇది ఎలా చెయ్యాలి అనేది మన జ్ఞానాన్ని అడిగితే అదే చెప్తుంది! నిజాయితీగా జ్ఞానాన్ని అడుగుతున్నామా లేదా అనేది ఆత్మసాక్షి పర్యవేక్షిస్తుంది! ఆత్మసాక్షి (honesty) లేని వాళ్లకి స్పష్టంగా మాట్లాట్టం అంటే ఏంటో కూడా అర్థం కాదు!

స్పష్టంగా మాట్లాడితే లాభం ఏమిటీ?

- "నీ మనసులోని ఒక విషయాన్ని  అక్షర రూపంలోకి సందిగ్ధత లేకుండా తర్జుమా చేయలేకపోతున్నావు అని తెలిస్తే..  ఆ విషయం అసలు నీకు అర్థమే కాలేదని అర్థం చేసుకో!" అని నా గురువుమిత్రుడు సోలమన్ ఉపదేశించిన మహా వాక్యం తరచూ గుర్తుకొస్తూ ఉంటుంది నాకు. ఈ వాక్యానికి converse  కూడా సత్యమే. అంటే.. "సందిగ్ధత లేకుండా అక్షర రూపంలో ఒక విషయాన్ని వ్యక్త పరచగలిగిన నాడు నీకు ఆ విషయం బోధపడిందని అర్థం చేసుకో" అని. అంటే, ఎన్ని వాక్యాలు స్పష్టంగా రాయగలిగితే అన్ని విషయాలు అర్థమయినట్టు లెక్క! ఎన్ని అస్పష్ట మాటలు మాట్లాడితే అంత ఆత్మవంచన చేస్కుంటున్నామని లెక్క. జీవితంలో వేరే వ్యాపకం లేకపోయినా.. కేవలం మాటల్లో స్పష్టత కోసం ప్రాకులడినా చాలు, జ్ఞానానికి దారులు వాటికి అవే తెరుచుకుంటాయి! ఎందుకంటే, మాటల్లోని స్పష్టత కోసం చేసే ప్రయత్నాలు అనేకానేక ప్రశ్నలని లేవనెత్తుతాయి .. నిజాయితీగా ఆయా ప్రశ్నల్ని నివృత్తి చేసుకొని మళ్ళి మళ్ళి వాక్యాల్ని అమర్చే ప్రయత్నంలో మన లోపలి జ్ఞానం మనకే ఆవిష్కృతం అవుతుంది. 'అర్థం చేసుకోటం' అన్న ప్రక్రియలోని ఆనందానికి అలవాటు పడ్డ ప్రాణాలకి దాని లాభం ఏంటో ప్రత్యేకించి పరిచయం చేయాల్న? అర్థం చేసుకోటంలో ఆనందం చూడలేని మనిషుంటాడనుకోను. సాధ్యం కాదు. ప్రయత్నం చేయని దుర్భాగ్యులు అయితే ఉంటారు బహుశా.

సమయం సందర్భం ఉండక్కర్లేదా?

- తర్కం విఫలం అయినప్పుడు (అర్థంపర్థం లేకుండా వాగినప్పుడు) అది సాధారణంగా (safe situationsలో) హాస్యంగా మారుతుంది. కాని తర్కం విఫలమైంది అన్న విషయం judge చేయటానికిగాను కాస్త తర్ఫీదు అవసరం. తర్ఫీదు వల్ల పొందిన మానసిక పరిపక్వత స్థాయితో పాటే sense of humor వైశాల్యం కూడా పెరుగుతుంది. ఉదాహరణకి కార్టూన్ బొమ్మలు ఫిజిక్సుకి అతీతంగా వంగిపోతుంటే సాగిపోతుంటే పిల్లలు నవ్వుతుంటారు.. ఏమంటే వాళ్ళకున్న జ్ఞానానికి అవి illogicalగా కనిపిస్తాయి, ఆ absurdityని చూసి పిల్లలు నవ్వేస్కుంటూ ఉంటారు. కాస్త ఎదిగిన వాళ్ళ జ్ఞానానికి అవి ఉత్త చేతి గీతలని తెలిసిపోయి absurdity మాయం అయిపోతుంది. అందుకనే నవ్వు రాదు. కాని, ఇంకాస్త జ్ఞానం పెంచుకుంటే ఆ బొమ్మలు గీసేవాణి చమత్కార శీలాన్ని గమనిస్తూ నవ్వుకోవచ్చు. అందుకనే అన్నీ తెలిసిన జ్ఞానులకి ఏది చుసిన నవ్వొచ్చేస్తుంటుంది! తర్కపరంగా సరియైన విషయాన్నీ అర్థం చేసుకోలేక, absurd అనుకొని నవ్వేస్తే అది వెలికితనం అవుతుంది. ఆలోచనలో (ఫలితంగా వాక్కులో) స్పష్టత పెరిగేకొద్దీ వెకిలితనం తగ్గుతూ వస్తుంది. ఒక చేత్తో ఈ వెకిలితనం నుంచి మనసుని రక్షించుకుంటూ మరొక చేత్తో హాస్యం అనిపిస్తున్న దాన్ని ఆస్వాదిస్తూ  బ్రతకటం కత్తి మీద సాము లాంటిది. కాబట్టి, స్పష్టంగా మాట్లాట్టం అనే విద్యని బాగా పెంపొందించుకొని, అస్పష్ట ప్రేలాపనలోని comedyని ఆశ్వదించటం అనేది win-win వ్యూహం!  అవును సమయానికి తగు మాటలాడవలెను మరి!

మొత్తంగా?

- ఎంత విరుద్ధాభిప్రాయాలు ఉన్న వ్యక్తులైనా సరే, పూర్తి భిన్నమైన ఇతివృత్తాల నుంచి వచ్చిన వారైనా సరే..  కూర్చొని స్పష్టంగా మాట్లాడుకుంటే తర్కం సహాయంతో ఏకాభిప్రాయానికి వచ్చి తీరతారు. మానవులందరూ తర్కానికి ఏకీభవించటానికి గల కారణం పరిణామ క్రమంలో మిగిలిన జీవులన్నిటితో పోటీపడుతూ మనవ ప్రజ్ఞ రూపుదాల్చుకున్న తీరులోనే ఇమిడి యున్నదేమో ననిపిస్తుంది. బహుశా పరిణామ క్రమంలో మానవ మనుగడకి ఏకాభిప్రయాలు చేరుకోవటం అలవరచుకోడం అనే లక్షణం struggle for survivalలో ఎంతగానో ఉపకరించి ఉండాలి. ఏ సమాజాల్లో అయితే ప్రజలు తమని తాము స్పష్టంగా వ్యక్తపరుచుకొనే స్వేచ్చా వాతావరణం పరిస్థితులు కల్పించబడి ఉంటుందో, వాక్కులో హేతుబద్ధతని  శ్రద్ధగా ఆలకించే సంస్కారంగా గల్గిన ప్రజలు ఉంటారో.. ఆయా సమాజాలు వైపరిత్యలను ఎదుర్కొని పురోగమిస్తాయి. తర్కానికి కట్టుబడి క్రమంగా నడుస్తాయన్న నమ్మకంతోనే కోర్టులు, చట్టసభలు అభిప్రాయ బేధాలను తొలగించే వ్యవస్థలుగా మానవులు నియమించుకున్నారు. ఈ వ్యవస్థల్లో జరిగే స్పష్టమైన తార్కిక చర్చలు వాదనలే ఎప్పటికైనా సమాజాల్ని ఉద్ధరించి మనుషుల్ని ఏకం చెయ్యాలి. వితర్క వితండ వాదనలు - భక్తిని భయాన్ని బేధాలని ప్రేరేపించి  కృత్రిమమైన ఐక్యమత్యాన్ని తాత్కాలికంగా తీసుకురవోచ్చేమో కాని, సహజమైన ఏకత్వం జ్ఞానం వాళ్ళ గాక మరి దేని వల్లా సాధ్యం కాదు.

(ఈ తరహాలో ఆలోచించినప్పుడు - 'అసలు భూమి, భూమి మీద జీవం ఉణికి - వీటికి అతీతంగా 'తర్కం' అనే సత్యం ఆదినుంచి (?) ఒకటుండి ఉంటుందా? ఏక కన జీవితం నుంచి ఈ సత్యాన్ని explore మరియు exploit చేసుకుంటూ ప్రాణి చివరికి మానవ 'స్థితికి' పరిణామం చెంది ఉంటుందా? వంటి ప్రశ్నలు సైతం తలెత్తుతూ ఉంటాయి. కాని, "భూమి మీద జీవం ఉనికి ఆరంభానికి ముందు.." అనే ఆలోచన చేయనారంభించిన  క్షణమే మనకి తెలిసి రావాలి, ఇదంతా ఆలోచిస్తుంది మానవ ప్రజ్ఞేనని.. అందుకనే బహుశా తర్కమే ultimate reality అని  'మనకి' అనిపిస్తుండొచ్చని. మెదడు చెడితేకాని illogical illusions వాస్తవాలుగా తోచవన్నది ఇంకొక సత్యం. మరైతే ఈ Illogical illusions కూడా logical realities లో subsetsగానే ఉంటాయన్నది నా అభిప్రాయం. దీన్ని మరొక వ్యాసంలో కూలంకషంగా, వీలైనంత స్పష్టంగా వ్యక్తపరచటానికి ప్రయత్నిస్తాను.)

చివరిగా?

- స్పష్టంగా మాట్లాట్టం ఏమంత సులువు కాదు. వాడుక భాష మీద దృడమైన పట్టు చాల అవసరం (అసలు దీనికే ఒక జీవితకాలం కృషి అవసరమవుతూ ఉంటుంది). ముఖ్యంగా సరైన పదాల ఎన్నిక, వ్యాకరణ ప్రయోగం, తర్క నియమాలు..  వీటిని చాల నేర్పుగా ఉపయోగించుకొని మాటలోని స్పష్టతని fortify చేసుకోవాలి. అంతకంటే ముందు ఆత్మసాక్షికి ఆ ఆలోచనని బాగా నిశితంగా పరీక్షించే అవకాశం, సమయం కల్పించాలి. అలోచించి నిదానంగా మాట్లాడినా పర్లేదు, అర్థవంతంగా స్పష్టంగా మాట్లాడాలి. ఒక సారి చెప్పిన మాట సంతృప్తికరంగా అనిపించకపోతే మరమ్మత్తు చేసి మళ్ళి చెప్పవచ్చును. తప్పేమీ లేదు. మన అజ్ఞానాన్ని మనమైన క్షమించుకోలేకపోతే  ఇంకెవరు క్షమిస్తారు? ఇలా ప్రయత్నించగా ప్రయత్నించగా .. ఏదోక రోజు జీవితంలో అర్థం చేసుకున్నామని మనల్ని మనం సంతృప్తి పరుచుకోటానికి  ఖచ్చితంగా స్పష్టంగా ఒక నాలుగు మాటలు మిగులుతాయి. నాణ్యమైన జీవితం జీవిస్తే ఈ నాలుగు మాటల్లోనే మొత్తం జీవిత పరమర్థాన్నే ఇమిడ్చే స్థాయి జ్ఞానం బోధపడుతుందేమో? ఎవరికి  యెరుక? జీవితం మొత్తం వాక్కులో ఆలోచనలో స్పష్టత కోసం ప్రాకులాడటానికి మించిన పవిత్రమైన, ఉన్నతమైన, సాటిలేని  కార్యం మరొకటి ఉందనుకోను. 

12, జూన్ 2015, శుక్రవారం

ప్రేయసి నవ్వు

ఏమన్నావు..? ప్రేయసి నవ్వు మీద కవిత్వం రాద్దునా?
పదాలు నువ్విస్తావా మరి?
ఎలాంటి పదాలు కావాల్న? సరే చెప్తాను విను -
            - symmetry, simplicity, complexity: అన్నిటినీ కలిపి ఒకే పదంలో ఇమిడ్చి ఇయ్యగలవా?
            - beauty, beauty, beauty, beauty, beauty: ఒకే పదంలో అన్ని సార్లు 'అందం' ప్రతిధ్వనించి వినిపించాలి. అలాంటివి వెవ్వేరు పదాలు  ఒక అరడజను.
            - అంతం + ఆరంభం: రెండు అర్థాలు ఒకేసారి ఉండే పదాలు ఒక రెండు.
            - నెలవంకనీ చుక్కనీ కలిపి ఏమంటారు? ఒకే పదంలో చెప్పాలి! అదొక పదం కావాలి. వీలైతే ఓ పర్యాయపదం.
            - 'కరడుకట్టిన కారుణ్యం' - వినటానికి ఎలా ఉంది? అలాంటి పదం ఒకటి.
            - బలమైన తుమ్ము తర్వాత కళ్ళలో ఉండే ప్రశాంతత ఉంటుందే? దాన్ని కవిత్వంలో ఇమిడిపోయే లాంటి అందమైన పదంగా మార్చి కావాలి.
            - ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి, నిలువుగా, తలక్రిందులుగా - ఎలా చుసిన ఒకే అందం ఇచ్చే చమత్కారం పదాలు ఓ 888 కావాలోయి!
            - చిన్నప్పుడు గుర్తుందా? చీకట్లో వర్షం పడుతుంటే ఒక పెద్ద మెరుపు వచ్చేది .. ఉన్నట్టుండి అంతవరకు చీకట్లో ఉన్న ప్రపంచం క్షణం పాటు పగలు లాగ కనిపించేది? అప్పుడు మనసులో కలిగిందాన్ని ఏమని వర్ణించాలి? భయమా? ఆశ్చర్యమా? ఏదో అందం అర్థమైందన్న సంబరమా? అలాంటి భావనల్ని వర్ణించే పదం కలదా?
            - నీటి అడుగున ఊపిరి బిగబట్టి, ఒక నిమిషం వరకు అలానే బిగబట్టి, ఇంకొక నిమిషం కుడా బిగపట్టి, మూడో నిమిషం కూడా బిగబట్ట ప్రయత్నించి, ఇక ఆపుకోలేక  గబాలున పైకి వచ్చి అంత శ్వాసని ఒకేసారి పీలుస్తున్నప్పుడు ఊపిరి మీద తప్ప వేరే దేని మీదకి దృష్టి పోనీ అనుభూతి తెలుసునా నీకు? దాన్నేమంటారు?
            - మొదటిసారి సముద్రం అలల చివర్న సాహసంగా తొక్కి.. నీళ్ళు చల్లగా ఉన్నాయని ఎవరికైనా చెప్పాలనిపించే అత్యుత్సాహం. ఆ భావనని సరిగా అభివర్ణించే పదం.
            - కరుణకు పరవశించి పోయే బుజ్జి కుక్కపిల్ల పశుత్వంలోని అమాయకత్వము! దీనికో పదం కలదా? అది చివరిగా నా మనసుని వర్ణించుకోటానికి!

నా ప్రేయసి నవ్వుని వర్ణించాలనుకోవటం సూర్యకిరణాన్ని విరిచి జేబులో పెట్టుకోవాలనుకున్నంత వెర్రి ప్రయాస!
ఆ నవ్వు  వెలుతురులో photosynthesis చేసుకొని, గుండె దాహం తిరటానికి సరిపడా cardio-hydrates సమకూర్చుకొంటే దానికదే ఒక ముగింపు!

10, ఏప్రిల్ 2015, శుక్రవారం

కీర్తి శేషం (కథ)

ప్రముఖ రచయిత సంజు లూకోస్  గారు అకాలంగా గతించటంతో సాహిత్య లోకం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. తన పుస్తకాల ముఖచిత్రాల మీద నవుతూ కనిపించిన ఆయన ముఖం చూసిన వాళ్ళెవరికి ఆయన ఇక లేరంటే నమ్మసఖ్యం కాలేకపోయింది, చాల మంది అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురైనారు. ఆయన స్వర్గస్థు లయిన నాటి నుండి ఓ వారం రోజుల వరకు వార్తా పత్రికలు, సాహిత్య పత్రికలూ మొదలైన వెవ్వేరు మాధ్యమాల్లో - భాషకి ఆయన చేసిన సేవలు కొనియాడాబడినాయి. ఆశక్తి రేకెత్తించే కథాంశాలు తీసుకోటం మొదలుకొని, ఆయన కథ చెప్పే తీరులోని ప్రత్యేక సరళత,  సరదాగా మాట్లాడే పాత్రలతో కథనం సాగించే విదానం సామాన్య జనాల్ని కట్టి పారేసాయి. అనూహ్య ప్రజాదారణ పొందాయి. దరిమిలా ఆయన పుస్తకాలు దారాలంగా అమ్ముడుపోయేవి. ఇప్పటికీ పుస్తక దుకాణాల్లో మొదటి వరసలను ఆక్రమించుకున్న లూకోస్ గారు యాభై ఆరేళ్ళు జీవించారు. ఆయనికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. కూతురు వివాహితయై ఫిజీ దేశంలో స్థిరపడగా..  ఆమె దగ్గరికే వెళ్లి జీవించాలని లూకోస్ గారి భార్య నిర్ణయించుకున్నారు. ఆవిడ దేశం విడిచి వెళ్ళే లోపు ఆవిడతో సంభాషించాలని విలేఖరులు - అనేక సంఘాల వాళ్ళు చాల ప్రయత్నించారు. కాని బంధువులు - స్నేహితులు చేసిన మనవి మేరకు ఆవిణ్ణి  ఇబ్బంది పెట్టకుండా ఊరుకున్నారు. 

భర్త చనిపోయిన రెండు వారాలకి లుకోస్ గారి భార్య మానసికంగా కొంత తేరుకుంది. బంధువులు క్రమంగా సెలవు తీసుకోగా ఇల్లు ఖాళీ అయింది. మధ్యాన్నం మత్తు నిద్ర తరువాత ఆ సాయంత్రం ఆవిడ గది విడిచి బయటకి వచ్చింది. ఇంట్లో ఆమె తప్ప ఎవరూ లేరు. లైటు వేసి చుట్టూ చూసింది.. ప్రయాణానికి ఏర్పాటులు పూర్తి అవుతున్నాయి. ఇల్లంతా మూటలు, పెట్టెలు ఉన్నాయి. అన్ని సంవత్సరాలుగా నివసిస్తున్న ఆ ఇంట్లోని గదులు ఎప్పుడూ కనిపించని విదంగా కనిపించాయి.  లుకోస్ గారి గదిలో చుట్టూ చిత్ర పటాలు తొలగించిన చోట్ల గోడల మీద సున్నం రంగు చిక్కగా కనిపిస్తుండటం ఆవిడ ప్రత్యేకంగా కొన్ని క్షణాల పాటు గమనించింది, అలమరాలో ఆయన సగం తిని విడిచిపెట్టిన బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఆవిడ గుర్తించింది. . వస్తువులన్నీ తొలగించగా గది చాల విశాలంగా కనిపిస్తుంది. గది మధ్యలో ఒక బల్ల, దాని మీద ఎవరూ తెరువని ఉత్తరాలు కట్టలుగా పద్దతిగా పేర్చి ఉన్నాయి. లూకోస్ గారి పేరు మీద, ఆవిడ పేరు మీద పెద్ద సంఖ్యలో ఉత్తరాలు ఉన్నాయి. సంతాపం తెలుపుతూ కొన్ని, ఇంటర్వ్యూల కోసం అభ్యర్దిస్తూ కొన్ని-  అనేక మంది ఉత్తరాలు రాసారు. ముఖ్యంగా లూకోస్ గారి గురించి వివరాలు అడుగుతూ ఎక్కువ శాతం ఉత్తరాలు వచ్చాయి. ఆవిడ ప్రత్యేకమైన ఉద్దేశ్యం ఏమి లేకుండా చేతికి అందిన ఒక్కో ఉత్తరం తీసి పైపైన చదివి పెడుతూ వెళ్తోంది.  ఒకదాన్ని మాత్రం ఆవిడ శ్రద్ధగా కొన్ని క్షణాల పాటు చూసింది. ఒక యువ రచయితల సంఘం తరపున రాస్తునట్టు తెలిపిన ఆ ఉత్తరంలో.. "మా యువలోకమంతా సాహిత్యబ్రహ్మగా కొలుచుకొనే అలాంటి మహానుభావుణికి ధర్మపత్నిగా అన్ని సంవత్సరాలు పాటు దగ్గరగా ఆ సాహిత్య సృష్టిని తిలకించిన మీ అనుభవం ఎలా ఉండి ఉంటుందో తెలుసుకోవాలన్నది మా కుతూహలం. ఆయన పూర్తి చేయకుండా వదిలిన సీరియల్స్ ని, మిగతా అసంపూరిత రచనలని చదవాలని తపిస్తున్నాము. మీరు వాటిని పూర్తి చేసే  అవకాశం కలదా? ఆయన రాసిన ఆణిముత్యాలు అనేకం మేము మళ్ళి మళ్ళి .." అంటూ కొనసాగింది.

దాన్ని చదవటం పూర్తి చేసి ఆవిడ కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు ఆలోచించింది. కుర్చీ లాక్కొని కూర్చొని, నీళ్ళ గ్లాసు పక్కకి జరిపి, యాదాలాపంగా బల్ల మీద కాగితం కలం తీసుకొని, ఆ ఉత్తరానికి ఈ విధంగా జవాబు రాయటం ప్రారంభించింది .. 

-----------


నమస్తే!బయటకి నేనిలా సంభాషించింది ఎన్నడూ లేదు. అవసరం రాలేదు అనుకోవచ్చు. కాని మీరు ఎంతో ఆశతో లుకోస్ గారి మీద మచ్చలేని అభిమానంతో రాసిన లేఖ చూసి, ఒక రెండు మాటలు చెప్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో రాస్తున్నాను. 


ఏ మాత్రం సందేహం లేదు. మీ అభిమాన రచయితని గురించి మరింత లోతుగా తెలుసుకోవా లనుకొంటున్న మీ 'కుతూహలం' నేను చాల స్పష్టంగా అర్థంచేసుకోగలను. 


అయితే ఇది రాస్తున్న ఈ క్షణం  నాలో  మనస్పూర్తిగా  రెండు  సందేహాలు  మెదులుతున్నాయి - 'లుకోస్ గారి గురించి తెలుసుకొని మీరేం చేస్తారు?', 'అసలు తెలిసిన విషయాన్ని అర్థం చేసుకొనే స్థాయి పరిపక్వత మీ తలలకు ఉన్నదా?' అని. కచ్చితంగా చెప్పగలను, నేను రాయబోయే జవాబులో ఎలాంటి ఆశ్చర్యాలు మీరు ఊహించి ఉండరని. ఏమంటారా? ఊహించని సత్యం ఒకటి ఉంటుందని అంచనా వెయ్యగలిగే చైతన్యమే ఉంటే లుకోస్ గారి అభిమానులు ఎందుకు అవుతారు మీరు?! నాలుగు కాలక్షేపం మాటలకే పరవశించిపోగలిగే జనులకి పరమసత్యాలు పరమరహస్యాలు పరమభారం అయిపోతాయి!సీరియల్స్, కథలు చదివినారు సరే.. చదివి చంకలు బాదుకున్నారు సరే.. 'ఈ మోస్తరు కథ మనము రాయలేమా?' అని ప్రశ్నించుకున్నారా మీరెప్పుడైనా? మీ సృజన పట్ల మీకే విపరీతమైన న్యూనత ఉండటం వల్ల 'మేము ప్రేక్షకులం' అని మీకు మీరే ఓ చిన్ని గిరి గీసుకొని కూర్చొని, వడ్డించే నాసిరకం సాహిత్యాన్ని కళ్ళకద్దుకొని సేవిస్తున్నారు. చాలదన్నట్టు ఆ అసంపూరిత రచనలని ఇప్పుడు నన్ను పూర్తి చేయమంటున్నారు! ఇదొక రకమైన దాశ్యం లాంటిది అని చెప్పవచ్చు ఇక! మనం తేలిగ్గా ఊహించలేని కొత్త జ్ఞానాన్ని ఎక్కడో ఉన్న ఆ అనంతం నుంచి స్వచ్చంగా తోడి తీసుకొచ్చి మానవాళికి నమ్రతతో సమర్పించే కళాకారుల్ని మనస్పూర్తిగా అభినందించటానికి,- నాలుగు వెకిలి కథల్ని తిరగేసి మరగేసి చెప్పే ఓ వాణిజ్య రాతగాడికి మోకరిల్లిపోయి 'ఫ్యాన్సు' అయిపొవటానికి వ్యత్యాసం తెలుసుకోలేని మానసిక దాశ్యం ఉంది జన సామాన్యంలో అంటాను. మానసిక దాశ్యం రెండు కారణాల వాళ్ళ ఉద్భవిస్తుంది 

మొదటిది: మానసిక బద్ధకం 
స్వీయజ్ఞానంతో సృజనాత్మకంగా ఆలోచించలేని జనాలు వాళ్ళకి తెలిసిన విషయాలే తిప్పి తిప్పి చెప్పే కళని చాల తేలికగా ఇష్టపడతారు. ఇదే బద్ధకం. పూర్తిగా కొత్త విషయాన్ని ఒక దానిని జీర్ణించుకొని ఆస్వాదించటానికి చైతన్యం కావాలి. అది లేని సమాజాల్లో పాత ఆవకాయి కథలే ఎప్పటికి చలామణీ అవుతూనే ఉంటాయి, అలాంటి సమాజాల్లో కళాధరణ తడిపొడి కళ్ళాపు లానే ఉంటుంది. సమాజం నిద్రలేచి ఆలోచించటం మొదలు పెడితే వాణిజ్య రాతగాళ్ళ భుక్తికి గండి పడుతుంది. 
రెండవది: భయం!
తెలియని దాని మీద భయం! సాహసం చేసే ఆలోచన చేయటం మాట సరేసరి - ఆలోచన చేసే సాహసం సైతం చేయలేనంత భయం! మెడకు చుట్టుకున్న సంకెళ్ళు తెగిపోతే దారి తప్పిపోతామేమోనని భయం! చేతికి కండలు పెరిగితే ఎలుక కన్నాల్లోకి దూరలేదేమోనని భయం! 


'లూకొస్ గారి సాహిత్య సృష్టిని దగ్గరగా తిలకించిన నా అనుభవం' చెప్పమని అడిగారు మీరు. ఆ వికృతాన్ని ఎలా వివరించేది? ఓ పరదేశి పుస్తకం లేదా సినిమా చూడటం, తర్జుమా చేసి దానికి పసుపు కుంకుమ దిద్ది మీ మొహలకేసి కొట్టడం. సమాజం ప్రశ్నించలేని కొన్ని clichéed pointsని చుక్కలుగా తీస్కోటం వాటిని పిచ్చి ముగ్గు వేసి కలపటం! ఆ కోలాహలాన్నే గొప్ప సాహిత్యం అనుకోని మీ పాఠకులు వేలం వెర్రి కొద్ది చదవటం. ఆయన బోధించిన నీతులేవి ఆయన నమ్మినవి కావు.. అరువుతెచ్చి మీకు అమ్మినవి మాత్రమే! ఆయన రాసిన ఒక్కో నవల వెనుక దాగియున్న వికృత నిజానికి నేను ప్రత్యక్ష సాక్షిని. టైటిల్ తగ్గా తత్త్వం, వేదిక తగ్గా ప్రసంగం, ఏ చెట్టుకి ఆ గొడుగు, ఏ కాలువకి ఆ మురుగు! ఒక తటస్థమైన అభిప్రాయం లేకుండా, లోతైన అవగాహనేమి లేకుండా, నిజాయితీ లేకుండా మిక్సీలో వేసి నలిపిన మసాలా హిట్ ఫార్ములాలు మీ లూకొస్ గారి రచనలు. ప్రతి వాక్యం వెనక కపటం, ఆత్మవంచన, జనాలని తేలిగ్గా ఆకట్టేకోవాలన్న కక్కుర్తి! చేసేవి పసలేని రచనలే అయినా మేధావాలు అందరికంటే ఎక్కువ డబ్బు సంపాదించి నా నెత్తిన పోసినాడు! ఈ చెత్తని జనాలు ఎలా చదువుతున్నారో అర్థంకాక జుట్టు పీక్కొనే దాన్ని నేను!ఇంత మంది వెర్రివాళ్ళని కోతి కొమ్మచ్చి ఆడించే కథలు చెప్పే బదులు సరైన శత్రువుని ఏర్పరుచుకొని ఎన్కౌంటర్ అయినా ఓ రచయిత జీవితం సఫలమైనట్టే తోస్తుండేది నాకు, ఆలోచించినప్పుడు. కాని లూకొస్ గారిలో కాస్త కూడా నమ్రత కనిపించేది కాదు! కాపీ కొట్టిన కథని తానే స్వయంగా రాసేసాననే భ్రమించే వాడాయన! నేను ఉన్నాగా? నేను చుసాగా? కూతురికి కూడా తెలుసుగా? మా వరకు దేనికి బయట బుర్రున్న వాళ్ళెవరికైన తెలుసునుగా? ఏమి ఈ భ్రమ? ఎక్కడిదీ ధైర్యం? డబ్బు బలం - పాపులర్ మీడియా ఇచ్చే కాకి గోల బలం! మానవులకి సహజంగా ఆరాధన అనే ఒక ప్రవృత్తి (instinct) ఉంటుంది. కామం, ఆకలి, దాహం లానే అది కూడా లోలోపల ఎప్పటికప్పుడు వెలితిని సృష్టిస్తూ ఉంటుంది. తమ తమ మానసిక స్థాయి మీద మానవులు ఏ స్థాయి ప్రమాణాలు గల పదార్థంతో ఆ వెలితిని పూరించుకుంటారూ, దేన్నీ ఆరాధిస్తారూ అనేవి ఆధార పడతాయి. నకిలీ దేవుళ్ళని, వెకిలి కళాకారుల్ని, ప్రజా-స్వాముల్ని ఆరాధించే సమాజాన్ని -  పరిణామ క్రమంలో ఆగిపోయి, ఒక విచిత్ర వికృత మానసిక పాతాళం వైపు జారిపోతున్న మనవ మూకగా అభివర్ణించ వచ్చును! 


నేను కల్పనా సాహిత్యానికి వ్యతిరేకం కాదు, కాలక్షేపం సాహిత్యానికి  కూడా వ్యతిరేకం కాదు.. కాని అమాయక జనాల మనసుల్ని దున్ని, hypocrisy విత్తులు నాటి, మొలకల్ని పెంచి పోషించి.. డబ్బు చేసుకొనే pretentious సూడో-intellects చేస్తున్న దోపిడీకి వ్యతిరేకిని. ఏమంటే ఈ జాడ్యం కేవలం కళకి మాత్రమే పరిమితం కాదు. మనుషుల్ని manipulate చేసి డబ్బు చేసుకోవటం ఆయనకి ఓ సరదా - ఒక వ్యసనం! ఆనాడు ఆ దొంగ రాజకీయ నాయకుడు ఆ పత్రిక స్థాపిస్తే, వాళ్ళ ఆదేశం మేరకు జనాల్ని ఆకట్టుకొనే రకం సంపాదకీయాలు రాసేవాడు. ఉన్న నిజాన్ని ఎడం చేత్తో బిగించి పట్టుకొని.. వక్రీకరించిన అబద్ధాని కుడి చేత్తో రాసి - మిమ్మల్ని నమ్మించి బర్రెల్ని చేసి - దొర చేత ప్రశంసలు పొంది - అంత డబ్బు తెచ్చి నా నెత్తిన పోసినాడు. దొరగారు చేయబోయే ప్రసంగాల కోసం కూడా రాత్రికి రాత్రి కాగితాలు కాగితాలు అబద్ధాలతో పంచ్ డైలాగ్లతో నింపి పంపించే వాడు. మీకేమో పంచ్ డైలాగులు వింటే పంచెలు, లాగూలు నిలవవాయే!సామాన్య జనాలు ఇట్టే వసపరుచుకొనే అసామాన్య ఫాంటసీ పాత్రలను సృష్టించటము - చదువరిలో కాస్తంత ఊపు రప్పించే సన్నివేశాలు నలుగు గుప్పించటమూ - "పెద్దలను గౌరవింపుడి" లాంటి కచ్చితంగా హిట్ అయ్యేలాంటి వాదనలేని నీతులతో logical loopholesని insulate చేసి మెప్పించటమూ - ప్రతి పది పుటాలకు ద్వంద్వార్తలతో ఓ శృంగార వర్ణన ఇరికించటమూ - అతిశయమైన ఓ పతాక సన్నివేశంతో మీలోని adrenaline ఉరకలు వేయించి కథ ముగించటమూ. ఇది generic హిట్ ఫార్ములా. ఆయన కల్పించిన ఒక్కో కృత్రిమ పాత్ర తన కథల్లో ఆయా పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయాలు ఎంత అర్థహీణమైనవో తర్కవిరుద్ధమయినవో విరిచి విడమరిచి పెద్ద వ్యాసం రాయలన్నంత అసంతృప్తి నాలో ఉన్నది.ఒక మాట తెలుసుకోండి. మీకు నచ్చేలాంటి సాహిత్యం రాస్తున్నామని చెప్పి మీ మీదకి నేరం నేట్టేయాలని చూస్తూనే మీకు కళని అమ్ముతున్న వాళ్ళు మిమ్మల్ని మరింత మానసిక సోమరుల్ని చేస్తున్నారు. మీలోని అవగాహనా లేమినీ, అవిటితనాన్నీ పెట్టుబడిగా పెట్టి డబ్బు, పలుకుబడి సంపాదిస్తున్నారు. నీతులు చెప్పే మార్గదర్శకులయిపోతున్నారు. నిజమైన జ్ఞాని ఎప్పుడూ మీకు తెలియని విషయం చెప్తాడు. తేలిగ్గా అర్థం చేసుకోలేని దాన్ని మీకు ఆవిష్కరిస్తాడు. ఆ ప్రక్రియలో తన మర్యాద పోగొట్టుకోటానికైన జంకడు. సులువైన శైలి, కాలక్షేపం అనేవి మార్గాలుగా ఉంటే ఉండొచ్చు గాని గమ్యాలుగా కాదు. జీవితం అనే మహా పెను enterprise లోని తళుకుబెళుకులతో పాటే మెలికలు బెనుకులు వణుకులు కునుకులు కన్నీళ్లు కూడా ఆవిష్కరించిన వాడు ఆత్మసాక్షిని కొంతైన గౌరవిస్తున్న వాస్తవిక రచయిత. అలాంటి కళాకారుల్ని పోషించండి. నా జీవితం మొత్తానికి నేను లూకోస్ గారితో తార్కికంగా ఒక్క వాదన చెయ్యలేకపోయినాను. వాదించటం అంటే ఆయన ఉద్దేశ్యంలో తిరుగుబాటు చేసేయటం! హేతుబద్ధంగా భావాలని వ్యక్తపరిస్తే అది పొగరుబోతుతనం! తన కథల్లో లాజికల్ తప్పిదాల్ని చూపిస్తే మహా impatience ఆయనకి. 


మేము కలిసి విదేశీ టీవీ చానల్స్ చూసే వాళ్ళం - అందులో జనాలు ఎలా మాట్లాడుతున్నారో గమనించే వాడు. మక్కికి మక్కి కాపీ కొట్టి ప్రసంగాలలో అట్లానే మాట్లాడే వాడు. మహా వక్తయని జనాలు పొగిడితే, నేను కూడా ఆయనతో పాటు అదే టీవీ చూసి ఉన్నానని మర్చిపోయే వాడో లేకపోతే నేను పిచ్చిదాన్ని అనుకొనే వాడో.. పొంగిపోయే వాడు! లాభాపేక్ష - లేదంటే కీర్తి - లేదంటే పొగడ్తలు  వస్తాయని నమ్మకం కుదర్చని ఏ పని ఆయన జీవితం మొత్తానికి చెయ్యలేదు. మోసం చేస్తున్నాడని తెలీదా ఆయనికి? లేదంటే లోని అంతరాత్మకి? నాకైతే అర్థంకాదు అలాంటి మనిషితో ఎందుకు కలిసి జీవించానా అని. బహుశా చెప్తే ఎవరూ అర్థం కూడా చేసుకోరని భయం వల్ల కావచ్చును. జనాల్ని చట్టప్రకారం manipulate చేసే హక్కు ఈ capitalist సమాజమే హక్కుగా కలిపిస్తుంది కదా! ఈ వికృతాలు అన్ని నా ఎదుట సిగ్గు లేకుండా చేసాడు. అంటే నాకు మనసు లేదనుకున్నాడు. ఏ మాత్రం మొహమాటం లేకుండా ఇంట్లో కుక్క ఎదురుగా బట్టలు మార్చుకుంటాం కదా.. దానికేం తెలుసులేననీ.. అలాగే నా ఎదురుగా రూపాలు మర్చుకోనేవాడు. నా నోటి నుంచి ఈ విషయాలేవీ ఎవరికీ చెప్పననుకున్నాడు. అంత ధైర్యం నేను చేయలేననుకున్నాడు. చెప్పలేను అనుకున్నాడు. నాకు చెప్పటం చాతకాదు అనుకున్నాడు. అన్నాడు కూడా! అదేమి ధైర్యమో అర్థం కూడా కాదు నాకు.. ---------------------------------------------------------------------------------------------------------------------

ఇలా అంతా రాస్తూ, ఆవిడ ఆపి..
కలాన్ని కాగితం పక్కనబెట్టి  బల్ల మీద ముందుకు వాలి పడుకొని వెక్కి వెక్కి ఏడ్చింది.
నిశబ్దంగా ఒక పావుగంట గడిచింది.
నెమ్మదిగా లేచింది,
చెంగుతో కళ్ళు తుడుచుకుంది,
ముక్కు చీదుకుంది,
ఎండిన పెదాలు తడుపుకొంటూ  గ్లాసు నుంచి నీళ్ళు తాగింది.
అంత వరకు రాసినదంతా చించి పారేసి, లూకోస్ గారిని పొగుడుతూ నలుగు ముక్కల్లో ఓ లేఖ రాసి ముగించి, పంపించింది.

             ---------------------------------------------సమాప్తం--------------------------------------------------

2, మార్చి 2015, సోమవారం

జీవిత కష్టాలు

ఏమంటే ఏం చెప్తాము.. ఒకొక్కరిదీ ఒక్కో కష్టం.

- స్టైలిష్ యువకుడా? జోక్స్ వేసే యువకుడా? తేల్చుకోలేక పోతుంది పడుచుపిల్ల.

- caste ఫీలింగు, కన్న కూతురి మీద ownership ఫీలింగు - కడుపులో కత్తులాట ఆడుతున్నాయి పెద్దాయనకి.

- పదో తరగతి పాస్ అయిపోతే జీవితం పూలబాట అయిపోతుందని నలభై ఏళ్ళ క్రితం చెప్తే నమ్మిన ఆ ఆద్మీ, ఈ రోజు పిల్లల పెళ్లిల్లు చేసేస్తేనయినా ఆ పూలబాట ఏదో ఎదురుతుందేమో నని చూస్తున్నాడు.

- ఎక్కడో సుఖంగా జీవిస్తున్న మనుషుల మీద ప్రతీకారంతో  కలంతో కర్కశంగా కారాలు నూరుతూ కవితలు రాసేస్తున్నాడు ఓ ఆవేశ పూరిత కవి.

- DSLR ఫోటోగ్రఫీలో పూర్తిగా మునిగిపోయి తేలటం మర్చిపొయినాడు ఓ యువకుడు!

- భగవంతుని ఇజ్జత్ కాపాడటం కోసం బయలుదేరుతున్నాడో మతోన్మాది. భక్తుడు.

- భాషోద్ధరణ చేయలేక చేతులెత్తేయలని  decide చేస్తున్నాడు ఓ యువ రచయిత.

- "అమ్మాయికి పెళ్లి చెయ్యరా?" అని చచ్చిపోతున్నాడు సంవత్సరికం భోజనాలకు మాత్రం దాపరించే శ్రేయోభిలాషి.

- సరైన ఫిగర్ ని లైన్ లో పెట్టి నలుగురికీ మగతనం చాటి చెప్పుకోవాలని చూస్తున్నాడు యువక్!

- "బోధించిన సన్మార్గ వచనముల బొంకు జేసి దా పట్టిన పట్టు సాధించెనే ఓ మనసా" అని పాడుకుంటాడు త్యాగరాజు.

- స్నేహితుణి exact salary figure తెలియక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు ambitious man ఒక్కడు!

- కష్టం లేకుంటే సుఖం లేదనీ, సుఖం లేకుంటే కష్టం లేదని ఏదేదో చెప్పేస్తున్నాడు సోక్రటీస్.

- "జీవితంలో కావాల్సింది ఇంత కంటే ఏమున్నది?" అని సిన్సియర్ గా ప్రశ్నించుకొంటున్నాడు ప్రేయసిని కౌగిలించుకున్న ప్రేమికుడు.

- "జీవితంలో కావాల్సింది ఇంత కంటే ఏమున్నది?" అని సిన్సియర్ గా ప్రశ్నించుకొంటుంది ప్రేమికుని కౌగిట్లోని ప్రేయసి.

- వెధవలా ఏడుస్తున్నాడు అప్పుడే పుట్టిన పిల్లగాడు.

- వెకిలి మొహం వేస్కోని చూస్తున్నాడు కుర్రవాడు, వెర్రివాడు!

- బుగ్గలో చింతపండు చప్పరిస్తూ, ఆకాశం వైపు చూసి ఆలోచిస్తున్నాడు భవిష్యత్తు కథా నాయకుడు!

- వయొలిన్ నేర్చుకోంటోంది ఎదురుకాలపు మార్గదర్శకుని తల్లి!

- వెకిలి వీరుడి కోసం కల కంటూ మత్తులో మూలుగుతోంది ఓ కన్నె పిల్ల.

- జత కోసం కీచురాళ్ళ జాగారం, లైట్ వెలగంగానే బొద్దింకల ప్రాణభయం.

- "తలుపు కిర్రు మనలా? బానిస పీనుగు మొర్రో మనలా? షావుకారు ముసలాయన హరీ మనలా? దద్దోజనంలో తాలింపు చిటపట లాడలా? వెధవది అన్నీ శబ్దాలేగా ఒకటి శృతి మరొకటి అపశృతినా?" అంటున్నాడు తత్త్వవేత్త.

11, ఫిబ్రవరి 2015, బుధవారం

ప్రశ్నలు - ఉదాహరణలు.

1)
నువ్వంటే నాకు  సిగ్గో - భయమో అర్థం కాదు!
నా పట్ల నీకు కోపమో -  చులకనో అంతు చిక్కదు.
నీ నుంచి నేను ఉద్భవించానో, లేక నా ఊహలో నువ్వు ఘనీభావించావో తేల్చుకొనే వీలు లేదు.
ప్రశ్నిస్తున్నావో, పరిక్షిస్తున్నవో, అర్థం కానీ సమాధానాలు చెప్పి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావో?

2)
లోభానికి - భక్తికీ మధ్యన ఎన్ని అడ్డ చారలు గీసినావు?
ప్రేమకి - వ్యాపారానికి మధ్యన ఎన్ని పరదాలు పరిచినావు?
అద్దంలో తన కండలు చూస్కొని మురిసిపోయే యువకుడికి - పుత్రోత్సాహంతో పొంగిపోయె ముసలాయనకి
                                                            మధ్య చత్వారంలో ఎన్ని పాయింట్ల  వ్యత్యాసం కూర్చినావు?
చీకటికి - చీకటికి  మధ్యన ఎన్ని ఉదయాలు అమర్చినావు?

3)
సముద్ర గర్భంలో జీవరాసుల రంగుల వెనకాల మర్మం ఏమిటీ?

సికాడా ఈగలకి ప్రధాన సంఖ్యలకి సంబంధం ఏమిటీ?

ఒక్కో జాతి తేనెటీగకి ఒక్కో పువ్వు మక్కువ అవుతుందా?

గడ్డి తనను తానూ రక్షించుకుంటుందా?

రోబోటిక్స్ జీవసస్త్రానికి ఎలా తోడ్బడుతుంది?

29, జనవరి 2015, గురువారం

కళా-రుచి, రుచి-కళ

వాక్యానికి మొదటి అక్షరం రాయనారంభించినప్పుడే చివరన చుక్క పెట్టాలని  తెలియనివాడు / మర్చిపోయినవాడు / ఒప్పుకోలేని వాడు / నమ్మలేని వాడు - వాక్యాన్ని పిచ్చి వంకరలు తిప్పుతాడు, వెర్రి వాగుడు వాగుతాడు!
ఎప్పటికైనా అంతమయ్యే వాక్యమే అర్థవంతమైన వాక్యం.

చుక్కని చూసి భయపడటంలో రుచి లేదు,
చుక్క ఎక్కడ పెట్టినా అక్కడికి ఒక అర్థముండేలా అందమైన లోతైన పదాలని కూర్చడం రుచి.
ఈ రుచిలోని వ్యత్యాసాలే జ్ఞానంలోని వ్యత్యాసాలుగా రూపుదాల్చుకుంటాయి..
ఈ జ్ఞానమే తిరిగి వాక్యార్థంలో ప్రతిబింబిస్తుంది, కళని తెస్తుంది.

ప్రతి ఒకరికి ఒక్కో వక్యాన్ని రాసే అవకాసం దొరికింది, తమ తమ జీవిత వాక్యాన్ని ఎలా తీర్చి దిద్దుతారు అన్నది తమతమ కళా-రుచి, రుచి-కళ.