1, డిసెంబర్ 2019, ఆదివారం

అత్యాచార ఆచారాన్ని అర్థం చేసుకుందాం - 1

అన్ని అత్యాచారాలకి నేపథ్యం ఒకటే లాగ ఉండదు. మనం ఈ రోజుల్లో పత్రికల్లో తరచూ చూసే అత్యాచారాలని ప్రధానంగా రెండు మూడు రకాలుగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. 

మొదటి రకం అత్యాచారం, ఆధిపత్యాన్ని ప్రకటించుకొనే  చర్యగా చేసేది: 
తరచూ దళిత మరియు ఆదివాసి స్త్రీల మీద అగ్రకుల పెత్తందార్లు సలిపే అత్యాచారాలూ, అమాయక నాగరికుల మీద ఆర్మీ వాల్లు తలపెట్టే దారుణాలూ మెదలైనవి ఈ కోవలోకి వస్తాయి. ఈ రకం సంఘటనల పట్ల ఎగువ మధ్యతరగతి సమాజం నుంచి పెద్దగా ప్రతిఘటన కనిపించదు వినిపించదు పైపెచ్చు పరోక్షంగా ఆమోదిస్తుంది కూడా! ఈ తరహా వార్తలకి విలువ లేకపోవడం కారణంగా sensationalise చేసే పదార్థం లేకపోవడం కారణంగా మీడియా కూడా పెద్దగా పట్టించుకోదు. ఎక్కడైనా ఒక పత్రికలో ఏదైనా ఒక రోజు ఇలాంటి చర్చ లేవదీసినప్పటికీ ఆ తరువాత ఎవరో కొంతమంది మానవ హక్కుల సంఘాల వాళ్ళని మినహాయిస్తే ప్రధానస్రవంతి సమాజంలోని జనాలు చూసీ చూడనట్టు దాటివేస్తారు, నామమాత్రం కూడా ఖాతరు చేయరు. 

రెండవ రకం అత్యాచారం, ఒక ప్రతీకార చర్యగా చేసేది: 
ఇక్కడ ప్రతీకారానికి కనీసం రెండు కారణాలు ముఖ్యంగా గుర్తించాలి.

1) ఒక రకం ప్రతీకారం స్త్రీల పట్ల పురుషల మెదళ్ళోకి చొప్పించబడుతున్న తేలిక భావన నుంచి ఉత్పన్నమవుతుంది. స్త్రీ అంటే "ఒక నీఛమైన, నిత్యం అవకాశవాదంతో మసిలే, అబద్ధాలాడే, మోసపూరిత ప్రవృత్తి కలిగిన, కోర్కెలు అణుచుకోలేని, తక్కువ రకం మనిషి" అని నమ్మే పురుషాహంకార ధోరణి ఇంటా బయటా వ్యాప్తిలో ఉంది. స్త్రీ.. అయితే దేవత అవ్వాలి లేకపోతే దొంగలంజ అవ్వాలి! మంచి లక్షణాలతో పాటు లోపాలూ బలహీనతలూ  సంతరించుకున్న మాములు మనిషిగా మాత్రం ఉండలేదు! ఈ రకమైన పురుషాహంకార ధోరణి చదువరుల్లోనూ, సమాజంలో ఆర్థిక స్థితికి అతీతంగా అన్ని స్థాయిల్లోనూ చూస్తాము. దీనినంతటికీ కారణం నూటికి నూరుపాళ్లు మతం కేంద్రంగా నిర్మితమైన సమాజమే (ఈ విషయంలో ఏ మతము తక్కువ కాదు) అనిపిస్తుంది. అలాంటి సమాజం ఆమోదించే కథలు, సినిమాలు, పురాణాలు అన్నీ దీనికి అనుకూలంగానే ఉంటాయి. ఆడదాని చేత అవమానించ బడటం, ఆడదానిలా ప్రవర్తించటం, ఆడదాని చేత తిరస్కరించబడటం, ఆడదానిలా భయపడటం, ఆడదానిలా మాటమార్చటం ఇవన్నీ పౌరుషంలేని తనానికి చిహ్నాలని చిన్న వయసు నుంచి పిల్లలకి నూరిపోసిన నేరం ఎవ్వరిది? అవమానానికి ప్రతిచర్యగా శారీరక హింస చేయాలని పిల్లలకి నేర్పిస్తున్నది ఎవరూ? 

2) ఇక రెండోరకం ప్రతీకారం పూర్తిగా వర్గ విద్వేషల నుంచి ఉత్పన్నమవుతుంది. 
డబ్బు కలిగి ఉండటానికీ ‘అందమైన’ స్త్రీలను 'అనుభవించ' గలగడానికి మధ్యన స్పష్టమైన సంబంధం ఉంది అన్న ‘భావన మరియు నిజం’, ఈ రెండూ సమాజంలో చలామణి  అవుతున్నంత కాలం స్త్రీ ఒక వస్తువుగానూ ఆస్తిగానూ  పరిగణించబడుతుంది - నిజానికి వస్తువే అవుతుంది కూడా. మార్కెట్టులోని వస్తువుకీ తనకీ మధ్య అసాధ్యమైన అంతరం కనిపించినప్పుడు 'పేద' వ్యక్తిలో దొంగలించాలన్న కోరిక ఉత్పన్నమవుతుంది. దొంగతనం చేయకూడదన్న ఆదర్శం మాటల్లోనే కానీ చేతల్లో ఎప్పుడూ ఈ సమాజం చూపించింది లేదే? దొంగతనం చేసి పట్టుపడని వాళ్ళు రాజ్యాలు ఏలుతున్న జమానా కాదా ఇది? ప్రభుత్వాల ఆమోదంతో జరుగుతున్న justified దొంగతనాల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలా మనం? దొంగతనం చేసి దొరికిపోయిన వాడు పిచ్చివాడు, పట్టుపడని వాడు నేర్పరి - ప్రస్తుత సమాజంలో నిశ్శబ్దంగా ఒప్పుకోబడ్డ నీతి కాదా ఇది? సమాజంలో అసహజమైన అసమానతలు ఉన్నంత కాలం దొంగతనం చేయాల్సిన 'అవసరం' ఉంటూనే ఉంటుంది. ట్రైనులో ప్రయాణం చేస్తున్నప్పుడు నగలు ధరించవద్దు అని మాటి మాటికీ ప్రకటనలు చేస్తుంటారు ఎందుకనీ? బ్రతకడానికి డబ్బు ఉంటే కానీ సాధ్యం కానీ పరిస్థితుల్లో అందరూ మనుషుల్లానే స్త్రీ కూడా డబ్బు గీసే చట్రంలో ఇరుక్కు పోవాల్సి వస్తుంది. వస్తువుగా మారిపోవాల్సి వస్తుంది. ప్రకృతి సిద్ధంగా మనసుకి నచ్చిన వ్యక్తితో కాక మార్కెట్టులో బ్రతకటానికి కావాల్సిన పెట్టుబడి ఉన్న వ్యక్తిని మనసు చంపుకొని మనసారా ఇష్టపడాల్సిన పరిస్థితి! జీవిత భాగస్వామిని ఎంచుకొనే స్వేచ్ఛ ఉన్నప్పటికీ మార్కెట్టు సంకెళ్ళ నుంచి స్వేచ్ఛకి స్త్రీ నోచుకోలేదు. స్వతహాగా స్త్రీకి కులం అంతస్తు జాతి బేధాలు లేకుండా ప్రేమించే హృదయం ఉంటుంది - ప్రస్తుతం మార్కెట్టు అద్దాల వెనుక mannequinలా పడి ఉంది. దొంగకి దాన్ని చూస్తే ఆశ, కోరిక, ద్వేషం. రేప్ చేసి దొరక్కుండా పోతే అదొక సాహసం!