26, జూన్ 2021, శనివారం

ఏంటీ వెధవ గోల?

'వెదవ' అనే పదాని కర్థం ఏంటి?
తెలుగోల్లల్లో ఈ పదం తెలియని వాళ్ళుగానీ, ఏదో సందర్భంలో వాడని వాళ్ళుగానీ, తిడితే మొహం మాడ్చుకోని వాళ్ళుగానీ ఉండరని చెప్పొచ్చు. కానీ మరి దాని కర్థ మేంటని అడిగితే మాత్రం వెదవ మొహాలు వేస్తారు.
అసహనంగా "అసలు అర్థం అంటే ఏంటి?" అని అడిగారు నన్ను కొంత మంది. పాయింటే మరి! తిడుతున్న వాడికి, తిట్టుంచుకుంటున్న వాడికి ఇద్దరికీ అంత చక్కగా అర్థమవుతున్న పదం -- నాకేదో నక్కావల్సిన విధంగా అర్థం కాకపోతే వాళ్ళ క్కూడా అర్థం కాలేదని తెల్చేస్తే అది సబబా? (అన్నట్టు.. సబబు అనేది ఉర్దూ పదం.) కాకపోవొచ్చు. కాకపోతే.. "అర్థమంటే ఇది" అని నేనొక పారాగ్రాఫ్ రాసి వివరించిన దానికీ, "ఆర్థమంటే meaning" అర్థం చేసుకోండి .. అని తేల్చేసిన దానికి వ్యత్యాసం లేదా? పదానికి అర్థం వేరు భావం వేరు. అర్థం అనేది చాలా వస్తుపరమైన (objective) విషయం, భావం అనేది వ్యక్తిపరమైన (subjective) విషయం. ఫలానా భావాన్ని వ్యక్తపరచటానికి ఫలానా పదం ఫలానా విధంగా ఎందుకు వాడబడుతుంది? దానికి ఆ రూపం ఎలా వచ్చింది? దానికి మాతృక ఏమిటి? అని అడగటం ఇక్కడ మన ఉద్దేశ్యం. వెదవ అంటే fool అని శంకరనారాయణలో ఉందని అది దానికి అర్థం అయిపోదు. (అన్నట్టు..ఫలానా అనేది ఉర్దూ పదం)
మొన్నీ మధ్య మర్యాదస్తుల డిక్షనరీ ఒకటి తిరగేస్తూ ఏ మాత్రం తెలుగు పదాలున్నాయో చూద్దామని వెతుకుతూ పోతూ ఉన్నా. దైవ భాష సంస్కృత పదాలు కాళ్ళు, చేతులు, తొడలు, తోండాలు బార్ల చాచి పడుకొనుంటే అక్కడక్కడ కొన్ని తెలుగు పదాలు మొహమాటంగా సిగ్గు పడుతూ (నేను ఫోటోల్లో పెడతాను చూడండి.. 'తూ నా బ్రతుకు' అన్నట్టో మొహం..? సరిగ్గా అలాగే) బిక్కుబిక్కుమని కుర్చోనున్నాయి. 'వెదవ' పదాని కైతే అసలు చోటే లేదు డిక్షనరీలో. సంస్కారుల సాంగత్యం అంటే మాటలా మరీ? నువ్వు తెలుగోడివే అయుండొచ్చు, కానీ సంస్కారం లేకపోతే సంస్కృతం రాకపోతే ఎలా?
చిన్నప్పు డంతా దేవుళ్ళ భాష లోని 'విధవ' కాస్త కాలక్రమేణా 'వెదవ' అయిందని, నిజానికి అది 'వెధవ' అని చెప్పి మమ్మల్ని యదవల్ని చేశారు బళ్ళో తెగులు పంతుళ్లు - భళ్ళో థెగులు ఫంథుళ్లుహు! ఇంకొంత మంది ఏహంగా యాదవ కులాన్ని involve చేసి కథలల్లి చెప్పారు.
బళ్ళో నేర్చుకున్నది సమస్తం ఆవిరయ్యిన తర్వాత చివరికి బోధపడిన విషయం ఏమంటే: తమిళ్ భాషలో - ఉదవి (உதவி) అంటే సహాయం - ఉదవాదదు (உதவாதது) అంటే సహాయం చేయనిది / పనికి రానిది అని - ఉదవాక్కారన్ (உதவாக்காரன்) అంటే పనికిరాని వాడు. కాబట్టి తెలుగులోని వెదవ అనే పదానికి అసలైన మాతృక తమిళ్ పదం ఉదవాక్కారన్ అని నేను చెప్తున్నాను. ఆ రకంగా చూస్తే వెదవ అంటే అర్థం పనికిరానివాడు అని. దీనికి విధవతో ఏం సంబంధం లేదు.