24, ఫిబ్రవరి 2014, సోమవారం

కల - జ్ఞాపకం!


శైశవాన.. కోరికంటే అర్థం కాని ప్రాయాన..
చిగురించింది నాలో ఒక నాడు ఒక ఆశ!
నా ప్రజ్ఞని చీల్చుకొని మొలిచిన ఆ చిగురు
ఆ నాటి నుంచి నాతోటే .. తీగలా, సుందరవనంలా,
ఓ అతిశయ ద్వీపంలా ఎదుగుతూ నా మనసున విస్తరించింది..
పరసతం కానీయకుండా, ఆ బింబాన్ని గుండె నిండా బద్రపరుచుకునే వాణ్ని ..
ప్రతి నిద్రలో ఒకే స్వప్నం కంటూ జీవించే వాణ్ని!

ఈనాడు జాగృతావస్థలో లోకం దుమ్ముదుమ్ముగా నిస్తేజంగా ఉంది..
కానీ భవిష్యత్తులో ఒకనాడు ప్రపంచాన్ని-కాలాన్ని సవాలు చేసి మరీ నా కలల ద్వీపాన్ని చేరి తీరతాను!

ప్రపంచ పరిణామ క్రమం నుంచి నన్నొకణ్ణి తప్పించు చాలు..
నా శైశవ అజ్ఞానాన్నే తిరిగి నాకు ప్రశాదించు చాలు ..
నెరవేరే వరకు చిన్నప్పటి నా  కల-జ్ఞాపకం పదిలంగా ఉంటే అదే చాలు!

----
శైశవాన.. గానం అంటే అర్థం కాని ప్రాయాన..
ఒక రహస్య రాగంలో నా కలని ఆలపించాలని తపించి,
తీవ్రంగా ఆయాస పడేది నా హృదయం.
గుప్పెటితో హృదయాన్ని సముదాయించి
ఎందరో అనుకరించిన ఆ అద్భుత రాగాన్ని మళ్ళి మళ్ళి పాడుతూనే ఉండే వాణ్ని..
పాడిన ప్రతిసారి మెరుగు పరుచుకుంటున్నానని నమ్ముతూ జీవించే వాణ్ని!

ఈనాడు, రాగాలాపన చేసీ చేసీ ఆయాస పడుతున్నాను ..
కాని ఇప్పటికీ నా కల ఒకరూ అర్థం చేసుకో లేకున్నారు ..

కాలాన్ని వెనక్కి తిప్పగలిగే శక్తే ఉంటే ..
కన్నీటితో స్నేహం చేసిన నా బాల్యావస్థకు నన్ను ఈడ్చుకొని పోయి కుదేలు చెయ్యి చాలు!!
ఒంటరితనం నన్ను జయించలేదని ధైర్యం ఉంటే చాలు!

ప్రపంచ పరిణామ క్రమం నుంచి నన్నొకణ్ణి తప్పించు చాలు..
నా శైశవ అజ్ఞానాన్నే తిరిగి తిరిగి తిరిగి నాకు ప్రశాదించు చాలు ..
నెరవేరే వరకు చిన్నప్పటి నా  కల-జ్ఞాపకం పదిలంగా ఉంటే అదే చాలు!
ఒంటరితనం నన్ను జయించలేదని ధైర్యం ప్రశాదించు చాలు !ప్రేరణ: One Piece - 'Memories' జపనీస్ మరియు ఆంగ్ల అనువాదాలు.