18, అక్టోబర్ 2014, శనివారం

ఓ మార్గదర్శి!

రక రకాల ఆనందాలు ఒకేసారి పొంగుతున్నాయి మనసులో !
ఏ ఆనందం దేనికోసమో అర్థం కావట్లేదు ! ఒక దాని కొకటి పోలికలు లేకుండా ఉన్నాయి రంగులు !
నీ చేయి గెట్టిగా పట్టుకోనివ్వు .. నువ్వు ఎటు పరిగెడితే అటు నీతోనే నేనొస్తాను ..

జీవితోదయాన గాలి వెచ్చగా తగిలి .. చలి తొలగి మేనంతా పరమానందం అయింది!
బద్ధకం విడిచి ఒళ్ళు విరుచుకున్నాను ..
ఊపిరిలో జీవం నిండి హృదయం పరవశం అయింది!
ఉలిక్కి పడి వేగం పెంచి పరిగెత్తాను ..
అడుగులో అడుగు వేసుకొంటూ, క్షణానికి క్షణం వేగంతో,
కాళ్ళకింది భూమిని వెనక్కి నెడుతూ పరిగెత్తుతున్నాను..
కనిపిస్తావు కాని అందవు!
నీకు అలసట ఉండదు. మా లాగ వెర్రి వ్యామోహాలు ఉండవు!
నీ గురి మహోన్నతమైనది!

నిన్ను అందుకొనే ప్రయత్నంలో నా మూర్ఖపు వలువలు,
అజ్ఞానులు పొగుడ్తూ బహుకరించిన కుచ్చు టోపీలూ ..
అహంకారం, మూర్ఖత్వం, మూఢత్వం ..
వీటన్నిటిని అన్ని దిశలకూ విసిరేస్తూనే ఉన్నాను ..
కాని ఇంకా నా పరుగులో నీ పరుగు అంత స్పష్టత లేదు! నీ గురి నాక్కూడా ప్రసాదించవేమని?
అవును.. నీకేం పని?!
ఓ తార్కిక! ఓ హేతుక! ఓ సంవాది! ఓ గణిత మేధావి!
నీవుగా నీవుండటానికి నీకెలా ఉంటుంది?

ఆకారంలో, వికారంలో, అలంకారంలో, కూర్పులో, ప్రళయంలో అన్నింటా ఆనందమే యని తెలుస్తున్నది
కంటి ముందు, కంటి వెనుక,
ఆకాశంలో, మనసులోపల,
గణితం కానిది ఏది లేదు యని తెలుస్తున్నది ..

ఇంకొంత కాలం, ఇంకాస్త ప్రయత్నం ..
మహాశయా నీ వేగాన్ని నేను చేరుకొనెదను!
నీ చూపు పదునైనది!
నీ దృష్టి నిర్మలమైనది!
నీ పరుగు తిరుగులేనిది!
నీ లెక్క తప్పుపట్టలేనిది!!
అబద్ధాన్ని ఖండించే నీ తర్కం విశిష్టత వర్ణించలేనిది ..
ఓ తార్కిక! ఓ హేతుక! ఓ సంవాది! ఓ గణిత మేధావి!


--------
తార్కిక  = logician.
హేతుక   = rationalist.
సంవాది  = one who makes rational arguments.
గణిత మేధావి = god!

11, అక్టోబర్ 2014, శనివారం

జోల పాట?


పిల్ల గాలుల్ని ఎదిరించి నిలిచిందియని శాశ్వతం అనుకోనేవు!
చమురు యండక మానదు, దీపం ఆరక మానదు.
జీవితం కథ - తెర పడక తప్పలేదు ..

ఒక విసురు, అయ్యగారు!
ఒక విసురుతో .. పోగేసుకున్నది మొత్తం పొగలాగు మారి స్వేఛ్చగా ఎగిరిపాయింది.
ఇన్నాళ్ళు కంఠానికి బిగుసుకొని బాధించిన ఊపిరి-ఉచ్చు నీకు విముక్తినిచ్చి పోయింది!
మొదటి నుంచి.. లోపల ఎడతెరిపి లేకుండా పొడుస్తున్న హృదయస్పందన కూడా నిన్నిక బాధించబోదు!
అలసట లేదు, అనారోగ్యం లేదు, చింత-భయం-భ్రాంతి లేదు.
ఇక వచ్చి బజ్జో మిత్రమా!

ఉదయం - మధ్యాహ్నం - సాయంత్రం లేదు ..
నిత్యం శాశ్వతమైనది చీకటి మాత్రమే ..
చీకట్లో మెదలగలిగేవి జ్ఞాపకాలు మాత్రమే.

----
సృష్టి ఏదో ఉద్దేశ్యంతో ఉత్సవ స్ఫూర్తితో పాట పాడుతోంది ..
ఆ మహా గానంలో ఒక గమకానివి నీవు!
గానం ఇంకా కొనసాగుతుంది, కాని దానిలో నీ పాత్ర అయిపొయింది ..
అయిపోయిన నీ పాత్రని స్మరించకు ..
అద్దె కొంప మీది మమకారం వీడి సొంత ఇంటికి చేరుకో మిత్రమా!
దిగులు వలదు ..
వెలుతురు చూసీ చూసీ నీ కళ్ళు అలసిపోయాయి చూడు ..
ఇక వచ్చి బజ్జో!

ఉదయం - మధ్యాహ్నం - సాయంత్రం లేదు ..
నిత్యం శాశ్వతమైనది చీకటి మాత్రమే ..
చీకట్లో మెదలగలిగేది జ్ఞాపకం మాత్రమే.

ప్రేరణ (గుల్జార్ రచనికి పూర్తి అనువాదం కాదు):5, అక్టోబర్ 2014, ఆదివారం

రెండు రకములు

లోకంలో రెండు విపరీత రకముల  మనుషులు గలరు ..
1) జీవితాన్ని ఓ దరకాస్తు పత్రంగా - ఓ templateగా భావించు వారు.
2) జీవితాన్ని ఓ తెల్ల కాగితంగా జూచు వారు.

1) వ్యక్తిత్వానికి శరీరం తొడిగితే వ్యక్తి యవుతాడని నమ్ము వారు.
2) వ్యక్తికి బట్టలు తొడిగితే వ్యక్తిత్వం అవుతుందని నమ్ము వారు.

1) తమ మనసుకి నచ్చితే కుంకుడుకాయని సైతం నిశబ్దంగా ఆస్వాదిస్తూ నమిలి మింగువారు.
2) నలుగురి పొగడ్తల కోసం చీకట్లో నల్లద్దాలు పెట్టుకొని పోవు వారు.

1) లోకమంతా నిద్రపోతుందని భావించే అవకాశవాదులు.
2) నిద్రపోతుంది తమేనేమో యని ఉలిక్కి పడుతూ గడిపే యదార్థవాదులు

1) అబద్ధాలతో స్వచ్చమైన ప్రేమని జీవితాంతం సంపాదించుకొని ఆస్వాదించగల నేర్పరులు.
2) నిజాలు చెప్పి కనీస కరుణకు నోచుకోలేని naive souls కొందరు!

1) భయంతో బందీలు - భక్తులు కొందరు!
2) భక్తీతో కొందరు భయ - బందీ విముక్తులు.

1) ఆకాశమంత అజ్ఞానం ముందు తలదించుకొను వినమ్రులు.
2) అణువంత జ్ఞానంతో ఆకాశమంత దర్పం కలిగిన వారు.

1) "సుఖి ఎవరో?" అని ప్రశ్నించు వారు.
2) తామే సుఖియని లోకాన్ని ఒప్పించ జూచు వారు.

1) పరమ పావనులు, ఘనులు, శాశ్వతులు, కమలభవ సుఖము సదానుభవులు!
2) కులం మతం రంగూ పౌరుషం కోసం మైత్రిని సైతం విడనాడ నిరాకరించని వారు.

1) ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారు.
2) అందరూ ఏడిస్తే కాని తమ సుఖాన్ని కనుగోలేని వారు.

1) కృతజ్ఞతల కోసం సహాయము చేయువారు.
2) సహయము చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా కార్యాన్ని సలిపే వారు!

1) ప్రశ్నని ఆప్యాయంగా చేరదీయువారు, సమాధానం వంక అనుమానంతో జూచు వారు.
2) ప్రశ్న- సమాధానం - తర్కం - వాదం - ప్రక్రియ వంటి వాటికి అతీతంగా సరళంగా "క్లాసులు పీకే" వారు.

1) ఒంటరిగానైనా, నమ్మటం ముఖ్యం కొందరికి.
2) కనీసం ఒకరినైనా, నమ్మించటం ముఖ్యం కొందరికి.

లోకంలో రెండు విపరీత రకముల మనుషులు గలరు ..
1) మనుషుల్ని రెండు మూడు రకాలుగా విభజించి అర్థం చేసుకొని,  వ్యంగ్యంగా వ్యాసాలు రాసే వారు  ..
2) ప్రతి మనిషి కనుపాపలోను తమ ప్రతిబింబాన్ని మాత్రమే జూచువారు!