29, ఏప్రిల్ 2013, సోమవారం

ఎవరు? నేనా?

అది కాదు నేను చెప్తుంది.
ఇంకొకసారి చెప్తాను విను.
ఈ సారి శ్రద్ధగా విను.
నేను చెప్పేది ఉచితమా-కాదా? అర్థవంతమా-కాదా? అవసరమా-కాదా? ఇవన్నీ తర్వాత లెక్కలు వేసుకో. అదీ కలిసే వేద్దాం. ప్రస్థుతానికి నేను చెప్తుంది మాత్రం విని అర్థం చేసుకోడానికి ప్రయత్నించు.

ఆస్తికుడు చెప్పినట్టు సర్వం దైవనిర్ణితమనే అనుకుందాం, కాసేపు. 'సర్వం' అంటే ఎంత పెద్ద మాటో అర్థమవుతుంది  కదా నీకు? సర్వం అంటే సర్వం! దైవాన్ని నమ్ముతున్నాననీ, దైవాన్ని పట్ల భయభక్తులు కలవాణ్ణనీ చెప్పుకోనేవాడికి  ఆ దైవం మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ఈ సర్వానికి పరిధులు విదించజాలడు. సర్వం అంటే సర్వం అంతే. షరతలు ఏం ఇక వర్తించవు! ఆకాశం చివరి ఎక్కడో ఉన్న నక్షత్ర మండలంలో ఏ దుమ్ము రేణువు ఏ క్షణానికి ఏ దిశగా కదలాలి, ఈ పాలపుంతలో అణువంత ఈ భూమి మీద ఒక మనిషి ఎవరికి - ఎప్పుడు - ఎలా పుట్టాలి, పుట్టిన మరు క్షణం ఏ కాళు - ఏ దిశలో - ఎంత వేగంతో - ఎలా  కదపాలి మొదలుకొని,  ఆయుష్షు అయిపోయిన వేళ చచ్చే క్షణం చివరి గుటక ఎలా వెయ్యాలి, కళ్ళు ఏ దిక్కువైపు - ఎలా తేలవేయ్యాలి వరకు మొత్తం ప్రతి భౌతిక-ఆంతరంగిక  క్రియనీ దైవం నిర్ణయించి నిన్ను- నన్ను  వదిలాడనే కదా అర్థం? మనసులో మెదిలే ప్రతి చినుకంత ఆలోచన, చెడైనా - మంచైనా, ప్రతి చినుకంత ఆలోచన ఏదైనా.. భగవాన్ ప్రమేయం లేకుండా రాలేదనే కదా అర్థం? ఇక దైవాన్ని నమ్మటం - నమ్మకపోవటం,  భగవాన్ని ప్రార్థించటం - ప్రార్థించకపోవటం ఇవన్ని భగవాన్ ఆదేశం వళ్ళ తామంతట తాము సాగిపోతున్న ప్రక్రియలే కానీ నువ్వు - నేను అలోచించి - నిర్ణయించి - శరీరంతో తాదాత్మ్యం చెంది చేయగలిగే పని అంటూ ఏమైనా మిగిలి ఉందా అసలు?  "భగవంతుడు ఉన్నాడు" అన్నది hypothesis అయితే ఇవన్ని కచ్చితంగా దాన్ని అనుసరించి తీరాలి. ఒకవేళ అలా కాకుండా దైవప్రమేయం లేకుండా మనకి ఆలోచన చేసే స్వేచ్చ ఉంది అనుకో, అలాంటి పరిస్థితి దైవశక్తికి, దైవం ఉనికికే సవాలుగా మారగలదు. ఉదాహరణకి నా ఆలోచన మీద దైవానికి జ్ఞానం లేదనుకో - కేవలం నా భౌతిక కర్మలు 'చూసి' మాత్రమే దైవం నన్ను అర్థం చేసుకోగలడు అనుకో.. దైవాన్ని అందరం వెర్రి వెదవని చేసి ఆడించొచ్చు, ఏమంటావ్? అంతేగా? ఆలోచన ఎంత కుటిలమైనది అయినా గట్టిగా స్నానం చేసి గుడికి వెళ్ళి నాటకం ఆడగానే దైవం వెర్రి మొహం వేసుకొని దీవిస్తాడని అర్థం వస్తుంది. 'లేదు ఆలోచన చేయటం వరకు మనచేతిలోనే ఉందీ, ఆపై  అది దైవానికి వెంటనే తెలిసిపోతుంది' అన్నావనుకో, భగవాన్ని మనం ఆశ్చర్య పరచగలం అనేకదా అర్థం? అంటే భగవాన్ తన విశ్వప్రణాళికని మనం (తెలిసో-తెలియకో) మార్పిస్తున్నామనేగా అర్థం? అంటే భగవాన్కి కూడా భవిష్యత్ కొత్తగానే ఉంటుందని అర్థం! ఏదేమైనా మన ఆలోచన దైవం అదీనంలో లేకపోతే అలాంటి సగం శక్తి కల దైవ-నమూనా సృష్టిని పూర్తిగా కాక పాక్షికంగా మాత్రమే వివరిస్తుందని అర్థం వస్తుంది. అంటే అలాంటి సందర్భంలో దైవం అన్న hypothesis పూర్తిగా మనకి సమాధానాలు ఇవ్వలేకపోతుంది అని, సైద్ధాంతికంగా ఆస్తికత్వం చతికల పడే పరిస్థితి వస్తుందని తేలిగ్గా నిరూపించవచ్చు. కాబట్టి ఆస్తికత్వం నిజమైతే, అంటే ఈ చుట్టూ సాగుతున్న ఈ సృష్టికి దైవం అనేది సమాధానం అయినట్లయితే.., నేను, నా సుఖం, నా ఆకలి, నా దురద, నా కామం, నా ఆలోచన, నేను చేసే పని, నా చేత చేయబడే పనీ, నేను వినేది, విననిది, చూసేది, చూడనిది, చుడలేనిది ఇవేవి నా ప్రమేయం లేకుండా నేను పొందుతున్న అనుభూతులు మాత్రమే. 'నేను ఉన్నాను' అన్న భావన మొదటిసారి 'నాకు' కలిగిన క్షణం నుంచి ఈ క్షణం వరకు 'నేను' చేసిందేమీ లేదు, చేయబోయేది ఏమిలేదు, చేయగలిగేదీ ఏమి లేదు. ప్రతి చినుకంత ఆలోచన దైవం కలిగిస్తున్నదే!

ఈ గతిలేని ఉక్కిరి-బిక్కిరి పరిస్థితి ఎందుకో మానవ హృదయానికి (అహానికి) నచ్చదు. దైవం సర్వాన్ని నడిపిస్తున్నాడు అన్న hypothesisని కాసేపు పక్కన పెట్టి భౌతికవాదం వైపు చూసాం అనుకో, దూరనుంచి 'మన జన్మలు మరీ అంత దిక్కులేనివి కావేమో?!'  అన్న ఒక ఆశాకిరణం కనిపించినట్టు అనిపిస్తుంది. కాస్త దగ్గరకి వెళ్లి చూద్దాం.

భౌతికవాదం ఏం చెప్తుంది? నువ్వూ నేనూ ఈ భూమి మీద చాల కాలం క్రితం ఏక కణ జీవులుగా అవతారం దాల్చక మునుపే భూమికి మాత్రమే పరిమితంకాకుండా అనంతం వరకు విశ్వమంతా వ్యపించి ఉన్న ఈ భౌతిక పదార్థం కొన్ని సిద్ధాంతాలను అనుసరించి నడుస్తుందనీ, ఈ సిద్ధాంతాలను అన్నిటిని అర్థం చేస్కున్న వేళ జీవం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకోవచ్చును అనీ,  అత్యంత నిగూఢంగా దాగి ఉన్న ఈ భౌతిక శాస్త్ర సిద్ధాంతాలను ప్రయోగాలతో - తర్కంతో చేదించి బయట ఉన్న ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవటం వల్ల మొత్తం సృష్టిని అర్థం చెసుకొవచ్చునూ అనీ చెప్తుంది. అది ఒక ఆశ. ఒక నమ్మకం. ఒక్క assumption. ఒక చిన్న ధైర్యం. అసలు భౌతిక సత్యం తెలుసుకొనే విధంగా మన (ఆ మాటకి వస్తే ఏ గ్రాహం మీద ఏ జీవిదైన..) మేధస్సు నిర్మించబదిందా-లేదా అన్నది మనకి తెలియదు.. కాని ఏమీ తెలియని రాతియుగం నుంచి ఇప్పటి వరకు మనం అర్థం చేసుకోగలిగినది చుస్తే ఆ ఆశ బలపడక మానదు. ఈ సిద్ధాంతాలను కనుగొనే పనిలో భౌతికశాస్త్రం అధ్యయనం చేస్తున్నవాడికి తాను దేన్నీ గుడ్డిగా నమ్మటం లేదనీ, స్వయంకృషి చేసి, స్వంతమైన తెలివితో - ప్రయత్నంగా సృష్టి రహస్యాలను చేదిస్తునట్టు భావన కలుగుతుంది. కాని ఇందులో ఉన్న చిక్కు చూడు ఇప్పుడు. భౌతికశాస్త్రం సిద్ధాంతాలు మనవ మేధస్సు పెరిగేకొద్దీ మరింత మరింత క్లిష్టతరంగా మారుతూ రావొచ్చు గాక, సృష్టి నిర్మాణం మీద మరింత మరింత లోతు వరకూ అవగాహన మానవుడు సంపాదిస్తే సంపాదించవచ్చు గాక. నిజానికి నా సమస్య సిద్ధాంతాల రూపాంతరం కారణంగానో  - వాటి క్లిష్టత వల్లనో అవిర్భవిస్తుంది కాదు. సిద్ధాంతాలు ఏమైనా కానివ్వు..  "కొన్ని గణిత సిద్ధాంతాలు ఈ విశ్వాన్ని మొత్తం వివరించ గలవు" అన్న hypothesisతోనే  'నా' గొంతులో వేలక్కాయి పడుతుంది! అలాంటి పరిస్థితిలో నేను 'నేను' అని ప్రియంగా పిలుచుకొనే ఈ భౌతికకాయం ఒక రసాయినిక చర్య మాత్రమే అని అర్థం వస్తుంది. నా శరీరం చూడు, నా మెదడులో 99% నీరే ఉంది, అనేకానేక ఖనిజాలు ఒక క్రమంలో ఏర్పాటు కాగా (అన్నీ మా ఉళ్ళో దొరికే పదార్థాలే!) ఆ రసాయన ప్రక్రియ నుంచి 'నేను' అనే భావన, నా ఆలోచన కూడా భౌతిక ప్రక్రియలుగా  ఉద్భవించాయి అని అర్థం వస్తుంది.  అంతరిక్షంలోకి విసరబడిన ఒక రాకెట్ భవిష్యత్ గమనం మొత్తం ప్రారంభ పరామితుల మీద, కొన్ని సూత్రాల మీద ఆధారపడిన రీతిగానే ఈ విశ్వంలో జరిగే ప్రతీ భౌతిక ప్రక్రియా మహా విస్ఫోటనం నాడు ప్రారంభ పరిస్థితుల పర్యవసనంగానే పరిణమిస్తుంది తప్ప కొత్తగా  ప్రత్యక్షమై 'ఒక తెలివి' వచ్చి చేస్తున్న మార్పు ఏమి లేదు (ఒక వేళ చేస్తునట్టు అనిపించినా ఆ తెలివీ ఈ భౌతిక ప్రక్రియలో భాగమే అవుతుంది). సరైన పాళ్ళలో, సరైన పరిస్థితుల్లో, సరైన పదార్థాలు కలిపినప్పుడు ఫలితంగా అవతరించిన జీవి ఎలా ఆలోచించాలి, ఎలా పరిభ్రమించాలి, ఎలా చావాలి అన్నీ పూర్తిగా ఈ భౌతిక సిద్ధాంతాలు నిర్ణయించేసాయి. ఇక మన ఆలోచన కుడా ఒక గణిత సూత్రం ద్వారా రాబట్ట గలిగే అంతటి అల్పమైన ప్రక్రియ మాత్రమే అవుతుంది! వాస్తవానికి మనం ఎంత భౌతిక శాస్త్రం అర్థం చేసుకోగలం, దాన్ని ఎలా దృశ్యమానం చేసుకోగలం..   అన్నవాటికి పరిమితులు కుడా ఈ సిద్ధాంతాలే నిర్మించేసి ఉంటాయని అర్థం వస్తుంది!

రెంటిలో దేన్ని నిజం అనుకున్నా శరేరంతో తాదాత్మ్యం చెందటంలో అర్థం లేదని స్పష్టంగా తెలిసే పోతుంది.
ఇప్పుడు చెప్పు, ఇదంతా చెప్పింది ఎవరు? నేనా? దైవమా? లేక అంతా (ఇంకా కనుక్కోబడని) ఏదో ఒక గణిత సూత్రమ్ ఫలితమా?

============================================================
* తాదాత్మ్యం = 'నేను చేసే కర్తనూ, అనుభవించే భోక్తను' అని ప్రతి జీవి మనసులో ఉండే భావన.