9, డిసెంబర్ 2013, సోమవారం

లోపలి యంత్రాంగం -2

It is amazing how complete is the delusion that beauty is goodness.
- Leo Tolstoy, The Kreutzer Sonata

అందం అంటే
     .. ఒక లెక్క
     .. ఒక వరస 
     .. ఒక పద్ధతి 
     .. ఒక కూర్పు 
     .. నిగూఢంగా దాగి ఉన్న ఒక గణిత నియమం 
     .. అనంతమైన ఈ అస్తవ్యస్తతలో ఒక చిన్న చమత్కారం
     .. రొద మధ్యలో ఒక సుస్వరం

అస్థిపంజరం, మాంసం ముద్దలతో తయారైన భౌతిక శరీరం మీద micron మందం గల నశ్వరమైన ఒక అద్భుత మాయా పొర. అమాయక కంటికి మాత్రమే తెలిసేది జ్ఞానానికి అందనిది! విజ్ఞ్యతని అణచి పశుత్వానికి కట్టి పారేసే ఒక మహా మంత్రం. అందం పట్ల కలిగిన ప్రతి వ్యామోహం ఏదోక నాడు నిస్పృహగా గణువు అయ్యేదే, ఈ విషయం బోధపడటానికి ఎంత కాలం-అనుభవం కావాలి? చచ్చినా పర్లేదు.. అందాన్ని తాకగలిగితే చాలు అన్న ఆరాధన-ఆకలి కలగటానికి మనసులో బోల్డంత స్వచ్చత కావాలి. ఆ అమాయకపు ఆవేశం నుంచి పుట్టిన ప్రాణిరాసులమే కదా మన పశు-పక్ష-వృక్షాదులం అంతా.. 

ఆ నాటి నుంచి ఈ నాటి వరకు ప్రాణికి ప్రాణి చెప్తూ పంపిస్తున్న రహస్య సందేశం ఒకటే: "అందం కోసం ప్రాకులాడు.. అందం కోసం చుట్టూ వెతుకు, అందం కోసం చస్తూ బ్రతుకు! విశ్వ రహస్యాలని నీకు అందం అన్వయిస్తుంది.. అందం అంటే ఒక లెక్క, ఒక వరస.. విశ్వం గణితం మాట్లాడుతుంది.. వెతుకు harmony వైపు పరిగెత్తు.. అందుకో, సృష్టి ప్రణాళిక నీకు అర్థం అయిన కాకపోయినా నువ్వు అందం వైపుకి పరిగెత్తి పోరాడి ప్రాణశక్తిని హస్తాన్తరితం చెయ్యి.. నీ పని పూర్తి అయినట్టే!"

అందం అంటే 
    .. ప్రేయసి జుట్టు (blonde, brunette, red..)
    .. స్త్రీ కళ్ళు, చెంపల మీదకి విస్తరించిన నూగు జుట్టు 
    .. చెక్కిలి మృదుత్వం 
    .. స్త్రీ గొంతు, మెడ, భుజాలు.. 
    .. స్త్రీ యద, నడుము మృదుత్వం, మృదుత్వం, మృదుత్వం.. 
    .. తొడలు, పిరుదలు, మృదుత్వం, ఆశ్చర్యం, మృదుత్వం.. 
    .. సువాసన, పల్ల వరుస, నవ్వు, వెలుతురు! ఆనందం!
    .. గాలానికి వేలాడుతున్న ఒక రుచికరమైన ఎర! శ్వాస ఎలానూ శాశ్వతం కాదు కాబట్టి ఎరని చప్పరించి చనిపోతే ఇహ లోకంలో అయినా జన్మకి అర్థం మిగులుతుంది. 

అందం నిజమా? - తెలీదు .. 
అందం అవసరమా? - తెలీదు.. 
అందం శాశ్వతమా? - కాదు. కాబట్టే అందం! 
మరి హృదయం? - దానికి దీనికి సంబంధం ఏంటి?


29, అక్టోబర్ 2013, మంగళవారం

లోపలి యంత్రాంగం - 1

ఓ నా ప్రియాతి ప్రియమైన హృదయమా ఈ మాట ఒకసారి అలోచించి చూడు..

దీపం రెపరెప లాడుతునప్పుడే కాంతి శాశ్వతం కాదని జ్ఞానం మేల్కుంటుంది..
చలి నొప్పి నరాన్ని కొరుకుతున్న పోటులో సూర్యుని మీద అపార కాంక్ష కలుగుతుంది..
ప్రేయసి మీద నీకున్న ప్రేమ తను నిన్ను వదిలి వెళ్ళిన రోజే జ్ఞప్తికి వస్తుంది.
అందుకే వదిలి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోని ప్రేయసిని..
ఆ బాధలో, వ్యధలో.. చెదిరిన స్వప్నం.. మిగిల్చిన బూడిదలో నీ కన్నీళ్ళు పోసి
నీ ప్రేమని - నీ దైవత్వాన్ని సాక్షాత్కరింప జేసుకో!

కలత చెందిన నాడు ఒకప్పటి సుఖ వైభవం గుర్తొస్తుంది.. ఆస్వాదించు.
దారి తప్పిన చీకటి వేల వెళ్తున్న దారి మీద అనుమానం - ఇంటి మీద మమకారం!
మధ్యం చివరిబొట్టు తరువాత..
లోటా అడుక్కి చూసి మళ్లీ నీ కల నిజం కావాలని కోరుకుంటావు ..
కాని కలలు మెల్లగా నిజమవుతాయి, మిక్కిలి వేగంగా గనువవుతాయి..
తెలియనిదా నీకిది?

ఏమో.., ఏనాటికైనా నీవు తెలుసుకొనెదవేమో.. తాకగలిగిన ప్రతీది అశాశ్వతం ఎందుకు అవుతున్నదోనని?
కాని చూడు.. ప్రేయసి వదిలి వెళ్ళగా నీపై మిగిలిన బీటలు ఆమె ఆకరాన్నే గుర్తుకు తెస్తాయి..
ఏ గాలి పీల్చిన నాసికం ఆమె వాసనల్నే తెలుపుతుంది..
ఆమె భౌతికంగా దగ్గర లేకపోయేసరికి..  నీలోపల తెలియకుండానే ఆమె జ్ఞాపకాన్ని ఎంత పదిలం చేసావో తెలుస్తోంది..
మేఘాలు కమ్మిన రోజు కళ్ళు నక్షత్రాల కోసం వెదకినట్టు, ఒక్కో మినుకు ఒక్కో దివ్య దర్శనం!
ఒక్కో గాలితాకిడి ఒక మహామృదు అనంతానందభరితమైన స్పర్శ!
అందుకే వదిలి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోని ప్రేయసిని..

ప్రేయసి నెపం మాత్రమే. ఈ ప్రేమంతా తత్త్వతః అనాదిగా నీలోపలి ఉన్న యంత్రాంగం. నిస్సిగ్గుగా ఆస్వాదించు.


------------------------------------------------------------------------------

(నా ప్రేయసి కంటే నా ప్రేమ గొప్పది అన్న అహంకారంతో ఒకానొకప్పుడు రాసిన రాత ఇది. 
మరిప్పుడు అభిప్రాయం మారేనా? 
మ్మ్.. మారింది, తెలివి పరిణామం చెందింది..  
ప్రేయసి విలువ - ప్రేమ విలువ సమమైన నాడు ఈ వెలితి ఏ ఒక్క వైపు కనిపించబోదు.
ఆ సమతుల్యమే ఉంటే, ప్రేయసి కూడా ప్రేమని గుర్తిస్తే, గుర్తించి కరుణిస్తే .. విషాద సాహిత్యానికి జీవితంలో చోటు ఉండదు. అలాంటి ప్రేయసి వదిలిపోతే ఇక జీవితమే ఉండదు.)

8, అక్టోబర్ 2013, మంగళవారం

ఓ ప్రేమ కవి గోల!

దేహం ఓ వత్తి, ప్రేమ అది దహించగా వెలువడే వేడిమి..  
జీవితం పారే నది, ప్రేమ విలీనం కావాల్సిన సాగరం..  
జన్మ ఎత్తటం పాపం, ప్రేమ ప్రాయశ్చితం! 
హృదయం శిల, ప్రేమ శిల్పం!
పుట్టుక విత్తనం, ప్రేమ ఫలం
లోకం ద్వైతం, ప్రేమ అద్వైతం! 
సర్వం సూన్యం, ప్రేమ అనంతం! 
జన్మ మాయ, ప్రేమ అమరం!
విశ్వంలో ప్రేమ ఒకటే ఒకటి, ప్రేమని అనుభవించే శరీరాలు మారుతూ పోవును!




మూలం: వైరముత్తు - "యాక్కై తిరి"

29, ఏప్రిల్ 2013, సోమవారం

ఎవరు? నేనా?

అది కాదు నేను చెప్తుంది.
ఇంకొకసారి చెప్తాను విను.
ఈ సారి శ్రద్ధగా విను.
నేను చెప్పేది ఉచితమా-కాదా? అర్థవంతమా-కాదా? అవసరమా-కాదా? ఇవన్నీ తర్వాత లెక్కలు వేసుకో. అదీ కలిసే వేద్దాం. ప్రస్థుతానికి నేను చెప్తుంది మాత్రం విని అర్థం చేసుకోడానికి ప్రయత్నించు.

ఆస్తికుడు చెప్పినట్టు సర్వం దైవనిర్ణితమనే అనుకుందాం, కాసేపు. 'సర్వం' అంటే ఎంత పెద్ద మాటో అర్థమవుతుంది  కదా నీకు? సర్వం అంటే సర్వం! దైవాన్ని నమ్ముతున్నాననీ, దైవాన్ని పట్ల భయభక్తులు కలవాణ్ణనీ చెప్పుకోనేవాడికి  ఆ దైవం మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ఈ సర్వానికి పరిధులు విదించజాలడు. సర్వం అంటే సర్వం అంతే. షరతలు ఏం ఇక వర్తించవు! ఆకాశం చివరి ఎక్కడో ఉన్న నక్షత్ర మండలంలో ఏ దుమ్ము రేణువు ఏ క్షణానికి ఏ దిశగా కదలాలి, ఈ పాలపుంతలో అణువంత ఈ భూమి మీద ఒక మనిషి ఎవరికి - ఎప్పుడు - ఎలా పుట్టాలి, పుట్టిన మరు క్షణం ఏ కాళు - ఏ దిశలో - ఎంత వేగంతో - ఎలా  కదపాలి మొదలుకొని,  ఆయుష్షు అయిపోయిన వేళ చచ్చే క్షణం చివరి గుటక ఎలా వెయ్యాలి, కళ్ళు ఏ దిక్కువైపు - ఎలా తేలవేయ్యాలి వరకు మొత్తం ప్రతి భౌతిక-ఆంతరంగిక  క్రియనీ దైవం నిర్ణయించి నిన్ను- నన్ను  వదిలాడనే కదా అర్థం? మనసులో మెదిలే ప్రతి చినుకంత ఆలోచన, చెడైనా - మంచైనా, ప్రతి చినుకంత ఆలోచన ఏదైనా.. భగవాన్ ప్రమేయం లేకుండా రాలేదనే కదా అర్థం? ఇక దైవాన్ని నమ్మటం - నమ్మకపోవటం,  భగవాన్ని ప్రార్థించటం - ప్రార్థించకపోవటం ఇవన్ని భగవాన్ ఆదేశం వళ్ళ తామంతట తాము సాగిపోతున్న ప్రక్రియలే కానీ నువ్వు - నేను అలోచించి - నిర్ణయించి - శరీరంతో తాదాత్మ్యం చెంది చేయగలిగే పని అంటూ ఏమైనా మిగిలి ఉందా అసలు?  "భగవంతుడు ఉన్నాడు" అన్నది hypothesis అయితే ఇవన్ని కచ్చితంగా దాన్ని అనుసరించి తీరాలి. ఒకవేళ అలా కాకుండా దైవప్రమేయం లేకుండా మనకి ఆలోచన చేసే స్వేచ్చ ఉంది అనుకో, అలాంటి పరిస్థితి దైవశక్తికి, దైవం ఉనికికే సవాలుగా మారగలదు. ఉదాహరణకి నా ఆలోచన మీద దైవానికి జ్ఞానం లేదనుకో - కేవలం నా భౌతిక కర్మలు 'చూసి' మాత్రమే దైవం నన్ను అర్థం చేసుకోగలడు అనుకో.. దైవాన్ని అందరం వెర్రి వెదవని చేసి ఆడించొచ్చు, ఏమంటావ్? అంతేగా? ఆలోచన ఎంత కుటిలమైనది అయినా గట్టిగా స్నానం చేసి గుడికి వెళ్ళి నాటకం ఆడగానే దైవం వెర్రి మొహం వేసుకొని దీవిస్తాడని అర్థం వస్తుంది. 'లేదు ఆలోచన చేయటం వరకు మనచేతిలోనే ఉందీ, ఆపై  అది దైవానికి వెంటనే తెలిసిపోతుంది' అన్నావనుకో, భగవాన్ని మనం ఆశ్చర్య పరచగలం అనేకదా అర్థం? అంటే భగవాన్ తన విశ్వప్రణాళికని మనం (తెలిసో-తెలియకో) మార్పిస్తున్నామనేగా అర్థం? అంటే భగవాన్కి కూడా భవిష్యత్ కొత్తగానే ఉంటుందని అర్థం! ఏదేమైనా మన ఆలోచన దైవం అదీనంలో లేకపోతే అలాంటి సగం శక్తి కల దైవ-నమూనా సృష్టిని పూర్తిగా కాక పాక్షికంగా మాత్రమే వివరిస్తుందని అర్థం వస్తుంది. అంటే అలాంటి సందర్భంలో దైవం అన్న hypothesis పూర్తిగా మనకి సమాధానాలు ఇవ్వలేకపోతుంది అని, సైద్ధాంతికంగా ఆస్తికత్వం చతికల పడే పరిస్థితి వస్తుందని తేలిగ్గా నిరూపించవచ్చు. కాబట్టి ఆస్తికత్వం నిజమైతే, అంటే ఈ చుట్టూ సాగుతున్న ఈ సృష్టికి దైవం అనేది సమాధానం అయినట్లయితే.., నేను, నా సుఖం, నా ఆకలి, నా దురద, నా కామం, నా ఆలోచన, నేను చేసే పని, నా చేత చేయబడే పనీ, నేను వినేది, విననిది, చూసేది, చూడనిది, చుడలేనిది ఇవేవి నా ప్రమేయం లేకుండా నేను పొందుతున్న అనుభూతులు మాత్రమే. 'నేను ఉన్నాను' అన్న భావన మొదటిసారి 'నాకు' కలిగిన క్షణం నుంచి ఈ క్షణం వరకు 'నేను' చేసిందేమీ లేదు, చేయబోయేది ఏమిలేదు, చేయగలిగేదీ ఏమి లేదు. ప్రతి చినుకంత ఆలోచన దైవం కలిగిస్తున్నదే!

ఈ గతిలేని ఉక్కిరి-బిక్కిరి పరిస్థితి ఎందుకో మానవ హృదయానికి (అహానికి) నచ్చదు. దైవం సర్వాన్ని నడిపిస్తున్నాడు అన్న hypothesisని కాసేపు పక్కన పెట్టి భౌతికవాదం వైపు చూసాం అనుకో, దూరనుంచి 'మన జన్మలు మరీ అంత దిక్కులేనివి కావేమో?!'  అన్న ఒక ఆశాకిరణం కనిపించినట్టు అనిపిస్తుంది. కాస్త దగ్గరకి వెళ్లి చూద్దాం.

భౌతికవాదం ఏం చెప్తుంది? నువ్వూ నేనూ ఈ భూమి మీద చాల కాలం క్రితం ఏక కణ జీవులుగా అవతారం దాల్చక మునుపే భూమికి మాత్రమే పరిమితంకాకుండా అనంతం వరకు విశ్వమంతా వ్యపించి ఉన్న ఈ భౌతిక పదార్థం కొన్ని సిద్ధాంతాలను అనుసరించి నడుస్తుందనీ, ఈ సిద్ధాంతాలను అన్నిటిని అర్థం చేస్కున్న వేళ జీవం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకోవచ్చును అనీ,  అత్యంత నిగూఢంగా దాగి ఉన్న ఈ భౌతిక శాస్త్ర సిద్ధాంతాలను ప్రయోగాలతో - తర్కంతో చేదించి బయట ఉన్న ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవటం వల్ల మొత్తం సృష్టిని అర్థం చెసుకొవచ్చునూ అనీ చెప్తుంది. అది ఒక ఆశ. ఒక నమ్మకం. ఒక్క assumption. ఒక చిన్న ధైర్యం. అసలు భౌతిక సత్యం తెలుసుకొనే విధంగా మన (ఆ మాటకి వస్తే ఏ గ్రాహం మీద ఏ జీవిదైన..) మేధస్సు నిర్మించబదిందా-లేదా అన్నది మనకి తెలియదు.. కాని ఏమీ తెలియని రాతియుగం నుంచి ఇప్పటి వరకు మనం అర్థం చేసుకోగలిగినది చుస్తే ఆ ఆశ బలపడక మానదు. ఈ సిద్ధాంతాలను కనుగొనే పనిలో భౌతికశాస్త్రం అధ్యయనం చేస్తున్నవాడికి తాను దేన్నీ గుడ్డిగా నమ్మటం లేదనీ, స్వయంకృషి చేసి, స్వంతమైన తెలివితో - ప్రయత్నంగా సృష్టి రహస్యాలను చేదిస్తునట్టు భావన కలుగుతుంది. కాని ఇందులో ఉన్న చిక్కు చూడు ఇప్పుడు. భౌతికశాస్త్రం సిద్ధాంతాలు మనవ మేధస్సు పెరిగేకొద్దీ మరింత మరింత క్లిష్టతరంగా మారుతూ రావొచ్చు గాక, సృష్టి నిర్మాణం మీద మరింత మరింత లోతు వరకూ అవగాహన మానవుడు సంపాదిస్తే సంపాదించవచ్చు గాక. నిజానికి నా సమస్య సిద్ధాంతాల రూపాంతరం కారణంగానో  - వాటి క్లిష్టత వల్లనో అవిర్భవిస్తుంది కాదు. సిద్ధాంతాలు ఏమైనా కానివ్వు..  "కొన్ని గణిత సిద్ధాంతాలు ఈ విశ్వాన్ని మొత్తం వివరించ గలవు" అన్న hypothesisతోనే  'నా' గొంతులో వేలక్కాయి పడుతుంది! అలాంటి పరిస్థితిలో నేను 'నేను' అని ప్రియంగా పిలుచుకొనే ఈ భౌతికకాయం ఒక రసాయినిక చర్య మాత్రమే అని అర్థం వస్తుంది. నా శరీరం చూడు, నా మెదడులో 99% నీరే ఉంది, అనేకానేక ఖనిజాలు ఒక క్రమంలో ఏర్పాటు కాగా (అన్నీ మా ఉళ్ళో దొరికే పదార్థాలే!) ఆ రసాయన ప్రక్రియ నుంచి 'నేను' అనే భావన, నా ఆలోచన కూడా భౌతిక ప్రక్రియలుగా  ఉద్భవించాయి అని అర్థం వస్తుంది.  అంతరిక్షంలోకి విసరబడిన ఒక రాకెట్ భవిష్యత్ గమనం మొత్తం ప్రారంభ పరామితుల మీద, కొన్ని సూత్రాల మీద ఆధారపడిన రీతిగానే ఈ విశ్వంలో జరిగే ప్రతీ భౌతిక ప్రక్రియా మహా విస్ఫోటనం నాడు ప్రారంభ పరిస్థితుల పర్యవసనంగానే పరిణమిస్తుంది తప్ప కొత్తగా  ప్రత్యక్షమై 'ఒక తెలివి' వచ్చి చేస్తున్న మార్పు ఏమి లేదు (ఒక వేళ చేస్తునట్టు అనిపించినా ఆ తెలివీ ఈ భౌతిక ప్రక్రియలో భాగమే అవుతుంది). సరైన పాళ్ళలో, సరైన పరిస్థితుల్లో, సరైన పదార్థాలు కలిపినప్పుడు ఫలితంగా అవతరించిన జీవి ఎలా ఆలోచించాలి, ఎలా పరిభ్రమించాలి, ఎలా చావాలి అన్నీ పూర్తిగా ఈ భౌతిక సిద్ధాంతాలు నిర్ణయించేసాయి. ఇక మన ఆలోచన కుడా ఒక గణిత సూత్రం ద్వారా రాబట్ట గలిగే అంతటి అల్పమైన ప్రక్రియ మాత్రమే అవుతుంది! వాస్తవానికి మనం ఎంత భౌతిక శాస్త్రం అర్థం చేసుకోగలం, దాన్ని ఎలా దృశ్యమానం చేసుకోగలం..   అన్నవాటికి పరిమితులు కుడా ఈ సిద్ధాంతాలే నిర్మించేసి ఉంటాయని అర్థం వస్తుంది!

రెంటిలో దేన్ని నిజం అనుకున్నా శరేరంతో తాదాత్మ్యం చెందటంలో అర్థం లేదని స్పష్టంగా తెలిసే పోతుంది.
ఇప్పుడు చెప్పు, ఇదంతా చెప్పింది ఎవరు? నేనా? దైవమా? లేక అంతా (ఇంకా కనుక్కోబడని) ఏదో ఒక గణిత సూత్రమ్ ఫలితమా?

============================================================




* తాదాత్మ్యం = 'నేను చేసే కర్తనూ, అనుభవించే భోక్తను' అని ప్రతి జీవి మనసులో ఉండే భావన.

31, మార్చి 2013, ఆదివారం

సౌకర్యవంతమైన మతం

రండి రండి రండి మా మతంలో చేరండి.
చాల సులువు.
సత్యశోధన గోంగూర కాదు. డైరెక్ట్ సక్సెస్ మీద ఉంటుంది మా దృష్టి.

వివరంగా చెప్తాను వినండి. 
1. మా మతంలో అర్థంకాని తికమక చెత్త ఏమి ఉండదు. 
2. సత్యాన్వేషణ , ఉపనిషత్తులు, లోకం ఉందా లేదా? నిజామా మాయా? ఉంటె ఎలా సాధ్యం అయింది? లేకపోతే ఎందుకు ఉందనిపిస్తుంది? పనికిమాలిన తర్కం..  ఏవిటి ఇదంతా? స్కూల్లో లెక్కలు చేసి దొబ్బించుకుంది చాలదా? అంత అలోచించి బుర్ర పగల గొట్టుకోవాల్సిన అవసరమా? 
3. safe + simple + guaranty success  అనేది మన నినాదం. 
4. భగవాన్ని ప్రసన్నం చేస్కోడం అంటే మహారాష్ట్రకి a/c టికెట్  బుక్ చేసామా, చటుక్కున executive queue లోకి దూరామ, లటుక్కున భగవాన్ని ప్రసన్నం చేసుకున్నామ. అంతే it is that simple!


-----------
యోగి: నిజమైన భక్తి అంటే భగవంతుని కోసం పరిగెట్టడం కాదు. "నేను ఎవరు?" అన్న ప్రశ్నని బలంగా కలిగి ఉండటాన్నే భక్తీ అని ఉపనిషత్తులు నిర్వచించాయి. అన్ని చోట్ల భగవంతున్ని చుడగలటం. సర్వం భగవత్నిర్మితం అని బోధపరుచుకోవటం. మాట నోటితో చెప్పటం వేరు, బోధపరుచుకోవటం వేరు. పూర్తిగా బోధపడిన తర్వాత చెప్పనవసరమే ఉండదు!

నేను: ఎక్కడ చూడమంటున్నావ్ బాసు దైవాన్ని?  పక్కింటి వాళ్ళ కుళ్ళు చూపుల్లో, వీధి కుక్కల రొధలో, నల్ల మొహాలు వేసుకొని చూసే ముష్టి వాళ్ళ కరువు చూపుల్లో - కంపు నోళ్ళలో - మురికి పల్ల సందుల్లో.. ఎక్కడ? కాకుల అరుపుల్లో, ఆవు పేడలో, మనిషి పేడలో.. ఎక్కడ చూడమంటున్నావ్? తత్త్వం బోధపరుచుకోవటాలు తలకాయి నొప్పులు చేసే సమయం లేదు నాకు.  ఏదో నా బ్రతుక్కి ఒక ఉద్యోగం, comfortable sex కోసం మాంచి పిట-పిట లాడే ఫిగర్ కలిగిన ఒక భార్య, నా వీర్యంతో, నేను పెట్టిన తిండితో నిర్మించబడి నా మీద భయభక్తులు కలిగిన ఒకరిద్దరు పిల్లలు. ఇవన్ని కాపాడుకోవటానికి ఒక accessible god. అది చాలు నాకు. I am busy dying everyday, man.
---------- 

హ్యాపీగా ఒక వారం రోజులు vacation తీసుకొని ఫ్యామిలి బంధాలు, కాస్త showoffకి సరిపడా మంచి బట్టలు, మంచి comfortable inner-wear, నగలు, luggageలు అన్ని pack చేసుకొని comfortableగా స్వామి వారి ఊరికి చేరుకోవాలి ముందు. ఆ ఊరు latitude-longitude location దగ్గర పడుతుండగానే ఏదో మహత్యం జరిగిపోతున్న buildup ఇస్తుంది మనసు. ఎంత ఆహ్లాదకరమో! పెళ్ళాం నగలు అన్ని బద్రంగా ఉన్నాయో లేదో కూడా మరిపింప చేసే లాంటి భక్తి పరిమళం ఉంది ఆ గాలిలో. (మీరు మరీను, ఊరికే వెటకారానికి అన్నా గాని దూల దీర్చుకొని మరీ కొన్న నగల సంగతి మర్చిపోతానా చెప్పండి?). Mr. స్వామి సిమెంట్, కాంక్రీట్, వైట్ వాష్, స్టీల్ అండ్ ఐరన్ తో నిర్మించబడిన ఆలయంలో ఆసీనులై ఉన్నారు. ఆలయం చుట్టూ మనలాంటి భక్తులు. కానీ అల అని competitive worldలో everything has to be competed for కదా? అందరికి onsite కావాలి, కాని first-come-first-serve strategy ఇదంతా. 

ఆలయం చుట్టూ ఉండే competitive క్యూ గురించి వర్ణించి రాయాలంటే ప్రత్యేకంగా ఒక వ్యాసం పడుతుంది.  క్యూలో భక్తజనులు అనేక పనుల్లో తనువూ మనసు నిమగ్నం చేసి ఉంచుతారు. చమటలు, maazaలు, భక్తి-ప్రేరేపిత-దుర్ఘందభరిత-కుస్మితములు, బొంట్రోతుతో వాదనలు, గొడవలు, చీరలు, oglers తాపత్రయం, కొత్త పెళ్లి జంట పవిత్రమైన legal సరసాలు. ఒకటా రెండా అది భక్త జన పరివారం. 

క్యూ.. గుడి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, ఒక్కోసరి భగవాన్ విగ్రహానికి వెనక భాగానికి చాల చేరువకు కూడా వెళ్తుంది. అప్పటికీ దర్శనం అయిన లెక్కలోకి రాదు. నేరుగా లోపలికంటే వెళ్లిపోవాల్సిందే. ఎక్కడ ఆగకుడదు. అంటే అక్కడ వరకు భగవంతుడు లేడు అని అర్థం. డైరెక్ట్ విగ్రహానికి ఎంత దగ్గరికి వీలైతే అంత దగ్గరికి వెళ్ళిపోయి ఆ పంతులు చేత బూతు తిట్టించుకొని మరీ protestతో భక్తిని చాటుకోవాల్సిందే. విగ్రహాన్ని పదిలంగా మనసులో పెట్టుకుంటే దర్శనం పూర్తి అయినట్టు. ఆ తర్వాత ఎడతెరిపి లేకుండా meditation చేశానే!!

------------------
యోగి: భగవత్ దర్శనం అనేది ఒక అనుభూతి. ఆ అనుభూతిని చేరుకోవటమే మనవ జన్మ పరమావధి. ఆ అనుభూతికి 'తరవాత' అన్న ప్రశ్న ఉండదు. అన్ని ప్రశ్నలకి సమాధానం అపోరక్షనుభూతి ద్వార పోదటంతో మాయ తొలగిపోయి భ్రహ్మంతో చిత్తం ఏకమైపోతుంది. అద్వైత స్థితిని చేరుకున్నాక ఇంక నువ్వు-నేను, అది-అదికానిది, ఇది-ఇదికానిది, వేటికి అర్థం ఉండదు. 

నమ్మకం అనేది ఉత్త పనికిమాలిన మాట. దేన్నీ గుడ్డిగా నమ్మవలదు. తర్కంతోనే ఈ చిక్కుముడి విప్పబడుతుంది. దేన్ని నమ్మి దేన్ని సమర్పించేస్కోని దేన్ని పొందుదామని ఆశగా చూస్తున్నావ్ మహారాష్ట్ర భగవాన్ రాతి విగ్రహం వైపు? ఇవ్వటానికి-తీస్కోతనికి నాది అని చెప్పుకోడానికి ఏమున్నది నీ దగ్గర, విగ్రహం దగ్గర? నీ శరీరం అనుకొనేది నువ్వు నీ జీవితం అంతా కరువు కొద్ది తిన్న తిండి. నువ్వు దేన్నైతే అనునిత్యం కామిస్తున్నావో, దేని కోసం ప్రార్థనలు చేస్తున్నావో ఆ స్త్రీ చెక్కిలి వెనక ఉన్న మాంసం ముద్ద  గతంలో చెట్టుకి పండుగా, దానికి ముందు మట్టిలో పెంటగా, దానికంటే ముందు ఏ జంతువు కడుపులోనో మురుగుతున్న మలంగా ఇలా సృష్టి ఆరంభం నుంచి రూపాలు మారుతూనే ఉంది. ఈ భౌతిక పదార్థాన్ని నువ్వు ఇవ్వలేవు తీసుకోలేవు అనుభవించనూ లేవు. సౌకర్యవంతమైన మతాన్ని పాటించే వాళ్ళు ఈ జన్మకి ఈ చుట్టూ కనిపించే మృత పదార్థాన్ని మించి ఉన్నతమైనది ఏది ఆశించే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు అని అర్థం. 

అర్థం-పర్థం లేకుండా ఏర్పడిన 'జన్మ' అని పిలవబడే ఈ ప్రశ్నల వలయం నుంచి విముక్తి పొందటానికి ఉపనిషత్తులు అనేక మార్గాలు బోధించాయి. ఒక్కో మార్గాన్ని ఒక్కో యోగం అని పిలిచారు. మళ్లీ చెప్తున్నా, ఈ యోగాలన్ని భౌతిక భ్రమ నుంచి ఆత్మని తప్పించటానికి మార్గాలు మాత్రమే కానీ నువ్వు పోయాక నీ శవానికి బంగారు సమాధి నిర్మించుకోడానికో,  ఇక్కడే మట్టిమసానంలో చచ్చి-కుళ్ళి-లేచి-పడే  ఈ శరీరానికి సేవ చేస్కోడానికో చిట్కాలు కావు ఇవి. ఈ అనేకములైన యోగాల్లో, హఠ యోగం ఒకటి.  హఠమ్ అంటే అణగ త్రొక్కుట అని అర్థం ఉంది. ధ్యానం అనే  ప్రక్రియ ద్వారా ఇంద్రియప్రలోభం వల్ల సృష్టించబడిన ఈ మాయాపొరని అణగ త్రొక్కే మార్గం విచారించబడింది. ఇక పోతే ... 

నేను: బాసు, ఆపు! ఆపేయి!! మాకు wikipedia ఉంది. మేము చూసుకుంటాం. ఈ మాత్రం matter మాకు తెలియక కాదు. meditation అంటే చేట భారతం విప్పేసావు. నాకు తెలిసినంత వరకు meditation అనేది successకి secret. శరీరంలో ఉండే circlesని ఏకదమ్ అదుపులో పెట్టి BP, sugar, hyper tension  etc రోగాల పని పట్టడానికి easy shortcut. నాకు వ్యక్తిగతంగా mind  concentration పెంచుకోడంలో చాల బాగా సహాయపడింది.  సంపాదించుకున్న concentrationని ఒకొకళ్ళు ఒకోదానికి వాడుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. బాసు this is democracy! చేసేది rape అవని, business management అవని - concentrationతో చేయాలంటే meditation is the method.
-----------------------

ఇంకా కొన్ని comforts చర్చిస్తాను వినండి. 
- నిత్యం భక్తి moodలో ఉండాలంటే కష్టపడిపోయి శాస్త్రీయ సంగీతం నేర్చుకోనక్కర్లేదు,  క్లిష్టమైన సంస్కృత శ్రుతులు, స్మృతులు, కావ్యాలు చదివి అర్థం చేస్కొని తల పగలుగోట్టుకోనక్కర్లేదు. Dead easy. మీ భక్తికి కావాల్సిన important songs అన్నిటిని professional singers తో చక్కగా already మీకు అలవాటు ఐన ట్యూన్స్ లో  రికార్డు చేసిన dvds అందుబాటులో ఉన్నాయ్. కారులో పెట్టుకోండి. భక్తే భక్తి. 
- భగవాన్ సాంగ్ తో calling bells ఉన్నాయ్. పెట్టుకోండి. మంచి జరుగుతుంది. 
- భగవాన్ హారతి live టీవిలో ప్రసారం అవుతుంది. టీవీలోంచే  దర్శనం చేస్కోవచ్చు. 
- జల్ది-five-చరితం అని ఒక పుస్తకం ఉంది. భగవాన్ చరిత్రని ఐదు chaptersలో సులువైన, సరళమైన, సూటైన పదజాలంతో అన్ని భాషల్లో రాసి ఉంచారు. జీవితంలో కష్టం వచ్చిందా? డింగ్-డాంగ్-డిష్! పుస్తకం తీసి పూర్తిగా చదివెయ్యండి. ఇక సక్సస్సే సక్సస్సు! అదే కథ ఎన్ని సార్లు చదివితే అంత సుఖం. 
customization అనేది మన మతంలో అడుగు అడుగునా ఉంటుంది. మన భగవాన్ పేరుని ఏ దేవుడు అంటే ఆ దేవుడు పక్కన అంటించుకోండి. సనాతన ధర్మం అని పిలవబడే దానికి మన నూతన ధర్మానికి చక్కటి glueగా ఈ liaisons  సహపడతాయి. 
- కులాలు, పరువులు, కట్నాలు, కష్టాయాలు ఇవన్నీ మాములే సుమా! 

----------------
యోగి: హఠ యోగం ప్రకారం - యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణం, ధ్యానం, సమాధి - అన్న ప్రక్రియ ద్వారా మోక్షసాధన సాధ్యముతుందని చెప్పబడింది. ఇప్పుడు ఈ ఒక్కో దశని గురించి వివరిస్తాను. 
నేను: నీ వివరణ మడిచి గోచిలో పెట్టుకోవయ్య బాబు. 
----------------

అహింస పాటించాలి అనుకుంటున్నారా? గురువారం, శనివారం  non-vegetarian తినటం మానేయండి. అది మొదటి మెట్టు, అదే చివరి మెట్టు. బుధవారం రాత్రి తిన్న మాంసం కడుపులో కుళ్ళనియండి ఏం కాదు. మిగిలిన ఐదు రోజులు కుమ్మిన కుమ్ముడు కుమ్మకుండా కుమ్మి కుమ్మి కుమ్మండి. వితండ వాదం చేసే తార్కికులు వచ్చి హేళన చేస్తే "అహింస అని కాదు. కేవలం ఒక అలవాటు మాత్రమే. self control కోసం" అని చెప్పండి. ఇంకా ఎక్కువ మాట్లాడితే "నా అలవాట్లు నా ఇష్టం అని చెప్పండి!" తార్కికుడు మళ్ళి మాట్లాడలేడు. మాట దాటి వెయ్యటం బాగా నేర్చుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ తర్కపరమైన చర్చల్లోకి దిగవద్దు. "ఏదో బాబు మాకు మీ అంత తెలివితేటలు లేవులే ఊరుకో" అనే బ్రహ్మాస్త్రమ్ అందుబాటులో ఉంచుకోండి. ముఖ్యంగా ఎందుకంటే మనమేదో మనకి additional సౌఖ్యం చేకురుతుందేమో అన్న ఆశతో భగవాన్ని నమ్ముతున్నాం కాని మనకి మాత్రం ఏం తెలుసు? అందుకని నోరు అదుపులో ఉంచుకొని freedom of belief ని exploit చేస్కొండి. 

భగవాన్ పేరుతోటి ఏం త్యాగాలూ చేయొద్దు. మీ పని వత్తిడి, మీ ఆరాట-పోరాటలు భగవాన్ కి బాగా తెలుసు. అవకాసం వచ్చినప్పుడు మాత్రం లోకల్ భగవాన్ గుడికి వెళ్ళండి. గుడికి వెళ్లి, ఆఫీసు కోరికలు, బెడ్ రూమ్ కోరికలు, బాత్రూం కోరికలు అన్ని కోరుకోండి. ఇబ్బడి-ముబ్బడి గా ధనం ఉనప్పుడు మాంచి దౌర్భాగ్యపు రూపం గలిగిన ముష్టివాళ్ళని నలుగురిని choose చేసుకొని కాస్త దానం చేసి అల్పనందానికి గురి అవ్వండి. ఊరికే దేన్నీ త్యజించాల్సిన పని లేదు. లాభం లేదు అని తెలిస్తే మీ శరీరాన్ని మనసుని ఊరికే కష్టపెట్టుకోవద్దు. భగవాన్ మనల్ని కష్టపడమని చెప్తాడా? లేదు. comfortableగా ఉండమని చెప్తాడు. ఈ comfort కొనసాగటానికే ఈ భక్తీ వగైరా. అసలు మన comfortsకి ఏం ధోక లేదని తెలిసింది అనుకోండి, ఇంకా భక్తి దేనికి? భగవాన్ దేనికి? నేను చెప్తుంది ఏంటో మీకు-నాకు మాత్రమే తెలుసు. భగవాన్ కి కూడా తెలీదు. మహిమగల భగవాన్ అండీ, వీలైనంత జుర్రుకుందాం రండి. 



==============================================

పై వ్యాసం రాసి మీ మనసులు బాధపెట్టి ఉంటే నాకు అదే చాలు

3, మార్చి 2013, ఆదివారం

మనిషి మాట్లాడాలి

- మనిషి మాట్లాడాలి. 

+ ఏం? ఎందుకు పాపం?
 -  సామరస్యం కుదిరేదాకా

+ ఎవరితో?
- లోకంతో 

+ ఏం పని? ఎందుకు సామరస్యం?
- తనని తన మానాన వదలదుగా లోకం..  పేగుబంధం, స్నేహబంధం , తాళిబంధం, రుణ బంధం, కర్మ బంధం, పోలీస్ బంధం! ఒకటా రెండా, పీకకు పెనవేసుకొని ఎన్ని వేర్లు మనిషికి? వాడిని వాడికి ఇష్టం వచ్చిన చేత్తో తిన్నిచ్చారా?

+ ఏం పని? ఎందుకు సామరస్యం?
- అక్కడికే వస్తున్నా. తన స్వేచ్చని హరించే పని మానుకోమని, తనకంటూ చాల లోతైన ఆలోచన - ప్రపంచం పట్ల ఒక్క విలక్షణ దృక్పథం - అవగాహన ఉన్నాయని లోకానికి చెప్పి, మానసికంగా విముక్తుడు అయేంతవరకు మనిషి మాట్లాడుతూనే ఉండాలి . 

+ ఆలోచనా అవగాహనా కలిగి ఉండటం వరకు బాగానే ఉంది. అవి వాళ్లకి చెప్పి నువ్వు విముక్తుడవు అవటం ఏమిటి? ఎక్కడో తార్కిక లోపం కనపడుతుంది. హారర్ నవల రాసి ఎవరి నుంచి ఎవరు విముక్తులు అవుతున్నారు?
- క్షమించాలి, మన వాదన కొనసాగించే ముందు కొంత స్పష్టతను స్థాపించటం ముఖ్యం. మన పదజాలంలో కొంత తారతమ్యత ఉంది. నేను చెప్తుంది వాణిజ్య పరమైన లబ్ధిని ఆశించి రాసే "విజయనకి వీలైనన్ని మెట్లు" లాంటి చెత్త రచనా-ప్రసంగాలు చెయ్యాలని కదు. అసలు అది నా దృష్టిలోనే లేదు! నేను చెప్పేది నిజమైన జ్ఞానం పొందిన వ్యక్తులు తమ జ్ఞానాన్ని రచనల్లో పొందుపరిచి లోకంతో మాట్లాడి తీరాలి అని. తద్వారా లోకానికి మార్గదర్శకులు కాగలుగుతారు. 

+ కాబట్టి జ్ఞానవంతుడు మాట్లాడాలి అను, బాగుంటుంది. కాకపోతే ప్రతివాడు జ్ఞానవంతుడనే అనుకుంటాడు కాబట్టి, అవున్లే, ప్రతివాడు మాట్లాడాలి అనటంలో కొంత అర్థం లేకపోలేదు! ఇంతకీ నిజమైన జ్ఞానం అంటే?
- జీవితానికి సంబంధించిన అనేకానేక మర్మాలను, మౌలిక సందేహాలను, సృష్టిలోని  అత్యంత మౌలికమైన అంశాలను, మనో-ఆంతరంగిక మౌలిక భావనలను, మున్నగు వాటిని నిశితంగా తటస్థ దృష్టితో పరిశీలన చేయగ మనసుకు స్పురించిన సత్యాలను నిజమైన జ్ఞానం అంటున్నాను.

+ ఒక మాటలో చెప్పాలంటే నీకు నచ్చిన ఒక రకం జ్ఞానాన్ని మౌలికం అని, నిజమైనది అని పిలిచేస్తున్నావు. 'విజయానికి ముప్పై ఆరు మెట్లు' రచయిత మీద నీ వ్యతిరేకత ఏమిటి?
- 'విజయానికి ఇంచక్కా బోలెడు మెట్లు' రచయత మీద నాకు ఏం వ్యతిరేకత లేదు. నా మట్టుకు నేను నా ఆత్మని అలాంటి మాలిన్యం నుంచి రక్షించుకుంటూ ఉంటాను. దుమ్ము మీద, పుప్పొడి మీద నాకు వ్యతిరేకత ఏముంది? నా కంట్లో మాత్రం పడనివ్వను అంతే. 
ఇకపోతే సత్యాన్వేషణ అనే ఒక మహా గొప్ప ఆశయాన్ని ఒక వ్యక్తిగత కాలక్షేపంగా చిన్నది చేసి మాట్లాట్టం సబబు అనుకొను. నాకు నచ్చినా, నచ్చకపోయినా 'జీవితం ఏమిటి-ఎందుకు?' అన్న ప్రశ్నకి సమాధానం వెతుక్కోటంలోనే మానవ జన్మకి అర్థం ఉంది. ఆ ప్రశ్నకి సమాధానం కోసమే సమస్థ ప్రాణికోటి ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు అధిరోహిస్తూ ఆ సర్వోత్తమ పురోగతి వైపు పరిణామం చెందుతోంది. 

+ వినటానికి వినసోంపుగా, ఊహించటానికి గమ్మత్తుగాను, ఆలోచించటానికి అర్థం లేకుండానూ  ఉన్నాయ్ నీ మాటలు! నువ్వు చెప్పిన theory లో ఎన్ని అంచనాలు - పూర్వానుమనాలు (assumptions) ఉన్నాయో నీ చేవులికి వినిపిస్తుందా? సత్యం తెలిస్తే గాని ఈ ప్రాణికోటికి విముక్తి లేదు అన్నావు, మనం ఇప్పటికే విముక్తులం అంటాడు utilitarian. వాడి దాడికి తట్టుకోగలదా నీ వాదన? నువ్వు చెప్పేదాన్ని వాదన అని కూడా పరిభాషించలేను. ఒక వాదనలో ఉండాల్సిన పరిపూర్ణత లేనే లేదే?
- చర్చని పక్క దోవ పట్టిస్తున్నాను అనుకోవద్దు. వాస్తవానికి assumptions లేకుండా ఏ జ్ఞానం సాధ్యం కదు. ఎందుకంటే ఒక విషయం అర్థం చేసుకుంటున్నాము అన్న భావన మనలో కలగాలి అంటే మనం అంటూ ఒకళ్ళం ఉన్నాము అన్న assumption (అహం-భావన) అందులో అతర్లీనంగా లేకపోలేదు కదా? ఆధునిక భౌతిక శాస్త్రం అయినా, ప్రాచీన అద్వైతం అయినా కొన్ని ప్రతిపాదనల మీద ఆధారపడకుండా ముందుకు సాగలేవు. ఆధారం experimentation నుంచి ఉద్భవిస్తుంది. ఈ రోజుకీ ప్రతి భౌతిక శాస్త్రవేత్తకీ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అని నమ్మకం కుదరటానికి experimentation తప్ప వేరే మార్గం లేదు. ఈ రోజుకి పరమాత్మ ఉనికిని స్పర్సించాలంటే కళ్ళు ముసుకోడం ఒకటే మార్గం. 
మానవుడు ఎటువంటి శ్రమ, intellectual కసరత్తు చేయకుండానే utilitarianగా పుడతాడు. అన్ని తన సుఖం కోసమే నిర్మించబడ్డాయని, ఈ భూమి మీద ఈ శరీరంతో తను చేసే కార్యాలన్నీ అర్థవంతమైనవే అనీ..  ప్రతీ  రాబందు,  క్రిమి, పంది, కుందేలు, మనిషి, ఆవుదూడ లోకం నుంచి వీలైనంత జుర్రుకుందాం అన్న లక్ష్యంతోనే జీవితం ప్రారంభిస్తారు. కాబట్టి ఒక utilitarianని ప్రశ్నించటం అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవటంతో సమానం. మనలోని utilitarian మనల్ని ఎక్కడికి తీసుకువెళ్ళడు. ఇక్కడే, ఈ భూమి మీదే, ఈ మట్టి-మశానం శరీరంతోనే నీ జీవితం అని ఇక్కడే కుదేసి కట్టి పారేస్తాడు. నిజమైన జ్ఞానం మనల్ని విముక్తుల్ని చేస్తుంది. 

+ మనవ మేధస్సుకి ఎన్ని assumptions సాధ్యం అవుతాయో అన్ని theories పుట్టుకొస్తాయి అన్న అర్థం ఉంది నువ్వు అన్నదాంట్లో. అనట్టు విముక్తి దేని నుంచి? 
- మాయ నుంచి. మాయానిర్మితమైన ఈ లోకం నుంచి. 

+ మాయ నుంచి విముక్తి కావాలంటే కళ్ళు-నోరు ముసుకోవాలా లేక మాయకి ఉత్తరాలు రాయాలా? అసలు లోకమే మాయ అయినప్పుడు దాని పోకడ-పకోడా వ్యవహారాలతో నీకేం పని? స్వేచ్చని ఆశించటం utilitarian ఆరాటం కాదనగలవా? కమందునికి ఎడతెరిపి లేని వస్తు లాభం నుంచి కలిగే సుఖంలో ఉన్న utilityనీకు విముక్తి కోసం చేసే పోరాటంలో లభిస్తుందేమో  అంటాను.  కాదనగలవా? సమర్ధించుకుంటావా? సమర్ధించుకోవటం కుడా utilitarian ఆరాటమే అంటాను! ఏం అంటావ్? 
- ... 

+ సంఘం నుంచి తెగతెంపులు చేసుకుంటేనే గాని సుఖం లేదంటావ్. ఆ లోపే లోకం మాయ అంటున్నావ్. నీ సువార్తలో ప్రశ్న ఉందా - సమాధానం ఉందా?  మనిషి మాట్లాడతాడు సరే, వినేవాళ్ళు ఎవరు  లేకపోతే మాటేంటి? అయినా మాట్లాడుతూనే ఉంటావా? నీ రచనలు ఎవరు చదవరని తెలిసినా రాసి నదిలో పరేస్తావా? పరేయగల పరిపక్వత ఉందా నీలో?! అది లేనంత వరకు 'విజయానికి ఇంకొక మెట్టు' రచయతకి నీకు ఏ మాత్రం బేధం లేదంటాను. నీ రచనలు అన్ని అల్పమైన ప్రతీకార చర్యలుగా, పిరికితనం చిహ్నాలుగా పరిగనిస్తాను అంటాను. ఏమంటావ్? 
- .... 

+ మాట్లాడేది అంతా వినేవాళ్ళని ఉద్దేశ్యించినదే కదా? మాయతో  మహా శ్రమ పడీ మాటలాడే వాడికి మాయ నుంచి విముక్తి ఉందా?
-  మహోత్తమా! మిమ్మల్ని ఇంతకంటే మాటల గారడీ చేసి వంచించలెను! ఒప్పుకుంటాను. సత్యశోధన మీద లక్ష్యం పెట్టినవాడికి అసలు మాట్లాడే పనే లేదు. రాయాల్సిన అవసరమే లేదు. రాసే ప్రక్రియ పూర్తిగా జనాకర్షణ కోసమే! జనాకర్షణ కోసం చేసేపనులు అత్యంత అల్పమైనవి. దానికి మించిన ఆత్మ వంచన ఉందనుకోను.  చదవబడదు అని తెలిసి ఎవడైనా ఏ రచనైనా చేస్తాడా? సూన్యంలోకి చూస్తు ఎవడు అరుచుకుంటాడు? దైవంతో మాట్లాడుతున్నాను అని చెప్పేవాడు కూడా Mr.దైవం నుంచి ఎదోక రోజు తిరిగి ఏదోక ఉపయోగపడే సంకేతం వస్తుందనే  నమ్మకం తోనే మాట్లాడతాడు. 
ఆర్యా! నా కళ్ళు తెరిపించారు.. నా అజ్ఞానం తొలగింది. సత్యశోధన మీద నా చిత్తం-దృష్టి పూర్తిగా నిలిపి అల్పజనమనోరంజకమైన నా ఈ లేకి రచనలు నిలిపివేస్తాను.  నా కలం మీద ఒట్టు. ఇక మాట్లాడను! ఒక వేల నా జిహ్వకండూతిని అధిగమించలేక ఇంకొకసారి  మాట్లాడానా, నా నీచత్వాన్ని చూసి జ్ఞానం ఎప్పటికి నా దరి చేరదు గాక! దయచేసి నన్ను ఆ విధంగా శపించండి.