10, ఏప్రిల్ 2015, శుక్రవారం

కీర్తి శేషం (కథ)

ప్రముఖ రచయిత సంజు లూకోస్  గారు అకాలంగా గతించటంతో సాహిత్య లోకం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. తన పుస్తకాల ముఖచిత్రాల మీద నవుతూ కనిపించిన ఆయన ముఖం చూసిన వాళ్ళెవరికి ఆయన ఇక లేరంటే నమ్మసఖ్యం కాలేకపోయింది, చాల మంది అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురైనారు. ఆయన స్వర్గస్థు లయిన నాటి నుండి ఓ వారం రోజుల వరకు వార్తా పత్రికలు, సాహిత్య పత్రికలూ మొదలైన వెవ్వేరు మాధ్యమాల్లో - భాషకి ఆయన చేసిన సేవలు కొనియాడాబడినాయి. ఆశక్తి రేకెత్తించే కథాంశాలు తీసుకోటం మొదలుకొని, ఆయన కథ చెప్పే తీరులోని ప్రత్యేక సరళత,  సరదాగా మాట్లాడే పాత్రలతో కథనం సాగించే విదానం సామాన్య జనాల్ని కట్టి పారేసాయి. అనూహ్య ప్రజాదారణ పొందాయి. దరిమిలా ఆయన పుస్తకాలు దారాలంగా అమ్ముడుపోయేవి. ఇప్పటికీ పుస్తక దుకాణాల్లో మొదటి వరసలను ఆక్రమించుకున్న లూకోస్ గారు యాభై ఆరేళ్ళు జీవించారు. ఆయనికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. కూతురు వివాహితయై ఫిజీ దేశంలో స్థిరపడగా..  ఆమె దగ్గరికే వెళ్లి జీవించాలని లూకోస్ గారి భార్య నిర్ణయించుకున్నారు. ఆవిడ దేశం విడిచి వెళ్ళే లోపు ఆవిడతో సంభాషించాలని విలేఖరులు - అనేక సంఘాల వాళ్ళు చాల ప్రయత్నించారు. కాని బంధువులు - స్నేహితులు చేసిన మనవి మేరకు ఆవిణ్ణి  ఇబ్బంది పెట్టకుండా ఊరుకున్నారు. 

భర్త చనిపోయిన రెండు వారాలకి లుకోస్ గారి భార్య మానసికంగా కొంత తేరుకుంది. బంధువులు క్రమంగా సెలవు తీసుకోగా ఇల్లు ఖాళీ అయింది. మధ్యాన్నం మత్తు నిద్ర తరువాత ఆ సాయంత్రం ఆవిడ గది విడిచి బయటకి వచ్చింది. ఇంట్లో ఆమె తప్ప ఎవరూ లేరు. లైటు వేసి చుట్టూ చూసింది.. ప్రయాణానికి ఏర్పాటులు పూర్తి అవుతున్నాయి. ఇల్లంతా మూటలు, పెట్టెలు ఉన్నాయి. అన్ని సంవత్సరాలుగా నివసిస్తున్న ఆ ఇంట్లోని గదులు ఎప్పుడూ కనిపించని విదంగా కనిపించాయి.  లుకోస్ గారి గదిలో చుట్టూ చిత్ర పటాలు తొలగించిన చోట్ల గోడల మీద సున్నం రంగు చిక్కగా కనిపిస్తుండటం ఆవిడ ప్రత్యేకంగా కొన్ని క్షణాల పాటు గమనించింది, అలమరాలో ఆయన సగం తిని విడిచిపెట్టిన బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఆవిడ గుర్తించింది. . వస్తువులన్నీ తొలగించగా గది చాల విశాలంగా కనిపిస్తుంది. గది మధ్యలో ఒక బల్ల, దాని మీద ఎవరూ తెరువని ఉత్తరాలు కట్టలుగా పద్దతిగా పేర్చి ఉన్నాయి. లూకోస్ గారి పేరు మీద, ఆవిడ పేరు మీద పెద్ద సంఖ్యలో ఉత్తరాలు ఉన్నాయి. సంతాపం తెలుపుతూ కొన్ని, ఇంటర్వ్యూల కోసం అభ్యర్దిస్తూ కొన్ని-  అనేక మంది ఉత్తరాలు రాసారు. ముఖ్యంగా లూకోస్ గారి గురించి వివరాలు అడుగుతూ ఎక్కువ శాతం ఉత్తరాలు వచ్చాయి. ఆవిడ ప్రత్యేకమైన ఉద్దేశ్యం ఏమి లేకుండా చేతికి అందిన ఒక్కో ఉత్తరం తీసి పైపైన చదివి పెడుతూ వెళ్తోంది.  ఒకదాన్ని మాత్రం ఆవిడ శ్రద్ధగా కొన్ని క్షణాల పాటు చూసింది. ఒక యువ రచయితల సంఘం తరపున రాస్తునట్టు తెలిపిన ఆ ఉత్తరంలో.. "మా యువలోకమంతా సాహిత్యబ్రహ్మగా కొలుచుకొనే అలాంటి మహానుభావుణికి ధర్మపత్నిగా అన్ని సంవత్సరాలు పాటు దగ్గరగా ఆ సాహిత్య సృష్టిని తిలకించిన మీ అనుభవం ఎలా ఉండి ఉంటుందో తెలుసుకోవాలన్నది మా కుతూహలం. ఆయన పూర్తి చేయకుండా వదిలిన సీరియల్స్ ని, మిగతా అసంపూరిత రచనలని చదవాలని తపిస్తున్నాము. మీరు వాటిని పూర్తి చేసే  అవకాశం కలదా? ఆయన రాసిన ఆణిముత్యాలు అనేకం మేము మళ్ళి మళ్ళి .." అంటూ కొనసాగింది.

దాన్ని చదవటం పూర్తి చేసి ఆవిడ కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు ఆలోచించింది. కుర్చీ లాక్కొని కూర్చొని, నీళ్ళ గ్లాసు పక్కకి జరిపి, యాదాలాపంగా బల్ల మీద కాగితం కలం తీసుకొని, ఆ ఉత్తరానికి ఈ విధంగా జవాబు రాయటం ప్రారంభించింది .. 

-----------


నమస్తే!



బయటకి నేనిలా సంభాషించింది ఎన్నడూ లేదు. అవసరం రాలేదు అనుకోవచ్చు. కాని మీరు ఎంతో ఆశతో లుకోస్ గారి మీద మచ్చలేని అభిమానంతో రాసిన లేఖ చూసి, ఒక రెండు మాటలు చెప్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో రాస్తున్నాను. 


ఏ మాత్రం సందేహం లేదు. మీ అభిమాన రచయితని గురించి మరింత లోతుగా తెలుసుకోవా లనుకొంటున్న మీ 'కుతూహలం' నేను చాల స్పష్టంగా అర్థంచేసుకోగలను. 


అయితే ఇది రాస్తున్న ఈ క్షణం  నాలో  మనస్పూర్తిగా  రెండు  సందేహాలు  మెదులుతున్నాయి - 'లుకోస్ గారి గురించి తెలుసుకొని మీరేం చేస్తారు?', 'అసలు తెలిసిన విషయాన్ని అర్థం చేసుకొనే స్థాయి పరిపక్వత మీ తలలకు ఉన్నదా?' అని. కచ్చితంగా చెప్పగలను, నేను రాయబోయే జవాబులో ఎలాంటి ఆశ్చర్యాలు మీరు ఊహించి ఉండరని. ఏమంటారా? ఊహించని సత్యం ఒకటి ఉంటుందని అంచనా వెయ్యగలిగే చైతన్యమే ఉంటే లుకోస్ గారి అభిమానులు ఎందుకు అవుతారు మీరు?! నాలుగు కాలక్షేపం మాటలకే పరవశించిపోగలిగే జనులకి పరమసత్యాలు పరమరహస్యాలు పరమభారం అయిపోతాయి!



సీరియల్స్, కథలు చదివినారు సరే.. చదివి చంకలు బాదుకున్నారు సరే.. 'ఈ మోస్తరు కథ మనము రాయలేమా?' అని ప్రశ్నించుకున్నారా మీరెప్పుడైనా? మీ సృజన పట్ల మీకే విపరీతమైన న్యూనత ఉండటం వల్ల 'మేము ప్రేక్షకులం' అని మీకు మీరే ఓ చిన్ని గిరి గీసుకొని కూర్చొని, వడ్డించే నాసిరకం సాహిత్యాన్ని కళ్ళకద్దుకొని సేవిస్తున్నారు. చాలదన్నట్టు ఆ అసంపూరిత రచనలని ఇప్పుడు నన్ను పూర్తి చేయమంటున్నారు! ఇదొక రకమైన దాశ్యం లాంటిది అని చెప్పవచ్చు ఇక! మనం తేలిగ్గా ఊహించలేని కొత్త జ్ఞానాన్ని ఎక్కడో ఉన్న ఆ అనంతం నుంచి స్వచ్చంగా తోడి తీసుకొచ్చి మానవాళికి నమ్రతతో సమర్పించే కళాకారుల్ని మనస్పూర్తిగా అభినందించటానికి,- నాలుగు వెకిలి కథల్ని తిరగేసి మరగేసి చెప్పే ఓ వాణిజ్య రాతగాడికి మోకరిల్లిపోయి 'ఫ్యాన్సు' అయిపొవటానికి వ్యత్యాసం తెలుసుకోలేని మానసిక దాశ్యం ఉంది జన సామాన్యంలో అంటాను. మానసిక దాశ్యం రెండు కారణాల వాళ్ళ ఉద్భవిస్తుంది 

మొదటిది: మానసిక బద్ధకం 
స్వీయజ్ఞానంతో సృజనాత్మకంగా ఆలోచించలేని జనాలు వాళ్ళకి తెలిసిన విషయాలే తిప్పి తిప్పి చెప్పే కళని చాల తేలికగా ఇష్టపడతారు. ఇదే బద్ధకం. పూర్తిగా కొత్త విషయాన్ని ఒక దానిని జీర్ణించుకొని ఆస్వాదించటానికి చైతన్యం కావాలి. అది లేని సమాజాల్లో పాత ఆవకాయి కథలే ఎప్పటికి చలామణీ అవుతూనే ఉంటాయి, అలాంటి సమాజాల్లో కళాధరణ తడిపొడి కళ్ళాపు లానే ఉంటుంది. సమాజం నిద్రలేచి ఆలోచించటం మొదలు పెడితే వాణిజ్య రాతగాళ్ళ భుక్తికి గండి పడుతుంది. 
రెండవది: భయం!
తెలియని దాని మీద భయం! సాహసం చేసే ఆలోచన చేయటం మాట సరేసరి - ఆలోచన చేసే సాహసం సైతం చేయలేనంత భయం! మెడకు చుట్టుకున్న సంకెళ్ళు తెగిపోతే దారి తప్పిపోతామేమోనని భయం! చేతికి కండలు పెరిగితే ఎలుక కన్నాల్లోకి దూరలేదేమోనని భయం! 


'లూకొస్ గారి సాహిత్య సృష్టిని దగ్గరగా తిలకించిన నా అనుభవం' చెప్పమని అడిగారు మీరు. ఆ వికృతాన్ని ఎలా వివరించేది? ఓ పరదేశి పుస్తకం లేదా సినిమా చూడటం, తర్జుమా చేసి దానికి పసుపు కుంకుమ దిద్ది మీ మొహలకేసి కొట్టడం. సమాజం ప్రశ్నించలేని కొన్ని clichéed pointsని చుక్కలుగా తీస్కోటం వాటిని పిచ్చి ముగ్గు వేసి కలపటం! ఆ కోలాహలాన్నే గొప్ప సాహిత్యం అనుకోని మీ పాఠకులు వేలం వెర్రి కొద్ది చదవటం. ఆయన బోధించిన నీతులేవి ఆయన నమ్మినవి కావు.. అరువుతెచ్చి మీకు అమ్మినవి మాత్రమే! ఆయన రాసిన ఒక్కో నవల వెనుక దాగియున్న వికృత నిజానికి నేను ప్రత్యక్ష సాక్షిని. టైటిల్ తగ్గా తత్త్వం, వేదిక తగ్గా ప్రసంగం, ఏ చెట్టుకి ఆ గొడుగు, ఏ కాలువకి ఆ మురుగు! ఒక తటస్థమైన అభిప్రాయం లేకుండా, లోతైన అవగాహనేమి లేకుండా, నిజాయితీ లేకుండా మిక్సీలో వేసి నలిపిన మసాలా హిట్ ఫార్ములాలు మీ లూకొస్ గారి రచనలు. ప్రతి వాక్యం వెనక కపటం, ఆత్మవంచన, జనాలని తేలిగ్గా ఆకట్టేకోవాలన్న కక్కుర్తి! చేసేవి పసలేని రచనలే అయినా మేధావాలు అందరికంటే ఎక్కువ డబ్బు సంపాదించి నా నెత్తిన పోసినాడు! ఈ చెత్తని జనాలు ఎలా చదువుతున్నారో అర్థంకాక జుట్టు పీక్కొనే దాన్ని నేను!ఇంత మంది వెర్రివాళ్ళని కోతి కొమ్మచ్చి ఆడించే కథలు చెప్పే బదులు సరైన శత్రువుని ఏర్పరుచుకొని ఎన్కౌంటర్ అయినా ఓ రచయిత జీవితం సఫలమైనట్టే తోస్తుండేది నాకు, ఆలోచించినప్పుడు. కాని లూకొస్ గారిలో కాస్త కూడా నమ్రత కనిపించేది కాదు! కాపీ కొట్టిన కథని తానే స్వయంగా రాసేసాననే భ్రమించే వాడాయన! నేను ఉన్నాగా? నేను చుసాగా? కూతురికి కూడా తెలుసుగా? మా వరకు దేనికి బయట బుర్రున్న వాళ్ళెవరికైన తెలుసునుగా? ఏమి ఈ భ్రమ? ఎక్కడిదీ ధైర్యం? డబ్బు బలం - పాపులర్ మీడియా ఇచ్చే కాకి గోల బలం! 



మానవులకి సహజంగా ఆరాధన అనే ఒక ప్రవృత్తి (instinct) ఉంటుంది. కామం, ఆకలి, దాహం లానే అది కూడా లోలోపల ఎప్పటికప్పుడు వెలితిని సృష్టిస్తూ ఉంటుంది. తమ తమ మానసిక స్థాయి మీద మానవులు ఏ స్థాయి ప్రమాణాలు గల పదార్థంతో ఆ వెలితిని పూరించుకుంటారూ, దేన్నీ ఆరాధిస్తారూ అనేవి ఆధార పడతాయి. నకిలీ దేవుళ్ళని, వెకిలి కళాకారుల్ని, ప్రజా-స్వాముల్ని ఆరాధించే సమాజాన్ని -  పరిణామ క్రమంలో ఆగిపోయి, ఒక విచిత్ర వికృత మానసిక పాతాళం వైపు జారిపోతున్న మనవ మూకగా అభివర్ణించ వచ్చును! 


నేను కల్పనా సాహిత్యానికి వ్యతిరేకం కాదు, కాలక్షేపం సాహిత్యానికి  కూడా వ్యతిరేకం కాదు.. కాని అమాయక జనాల మనసుల్ని దున్ని, hypocrisy విత్తులు నాటి, మొలకల్ని పెంచి పోషించి.. డబ్బు చేసుకొనే pretentious సూడో-intellects చేస్తున్న దోపిడీకి వ్యతిరేకిని. ఏమంటే ఈ జాడ్యం కేవలం కళకి మాత్రమే పరిమితం కాదు. మనుషుల్ని manipulate చేసి డబ్బు చేసుకోవటం ఆయనకి ఓ సరదా - ఒక వ్యసనం! ఆనాడు ఆ దొంగ రాజకీయ నాయకుడు ఆ పత్రిక స్థాపిస్తే, వాళ్ళ ఆదేశం మేరకు జనాల్ని ఆకట్టుకొనే రకం సంపాదకీయాలు రాసేవాడు. ఉన్న నిజాన్ని ఎడం చేత్తో బిగించి పట్టుకొని.. వక్రీకరించిన అబద్ధాని కుడి చేత్తో రాసి - మిమ్మల్ని నమ్మించి బర్రెల్ని చేసి - దొర చేత ప్రశంసలు పొంది - అంత డబ్బు తెచ్చి నా నెత్తిన పోసినాడు. దొరగారు చేయబోయే ప్రసంగాల కోసం కూడా రాత్రికి రాత్రి కాగితాలు కాగితాలు అబద్ధాలతో పంచ్ డైలాగ్లతో నింపి పంపించే వాడు. మీకేమో పంచ్ డైలాగులు వింటే పంచెలు, లాగూలు నిలవవాయే!



సామాన్య జనాలు ఇట్టే వసపరుచుకొనే అసామాన్య ఫాంటసీ పాత్రలను సృష్టించటము - చదువరిలో కాస్తంత ఊపు రప్పించే సన్నివేశాలు నలుగు గుప్పించటమూ - "పెద్దలను గౌరవింపుడి" లాంటి కచ్చితంగా హిట్ అయ్యేలాంటి వాదనలేని నీతులతో logical loopholesని insulate చేసి మెప్పించటమూ - ప్రతి పది పుటాలకు ద్వంద్వార్తలతో ఓ శృంగార వర్ణన ఇరికించటమూ - అతిశయమైన ఓ పతాక సన్నివేశంతో మీలోని adrenaline ఉరకలు వేయించి కథ ముగించటమూ. ఇది generic హిట్ ఫార్ములా. ఆయన కల్పించిన ఒక్కో కృత్రిమ పాత్ర తన కథల్లో ఆయా పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయాలు ఎంత అర్థహీణమైనవో తర్కవిరుద్ధమయినవో విరిచి విడమరిచి పెద్ద వ్యాసం రాయలన్నంత అసంతృప్తి నాలో ఉన్నది.



ఒక మాట తెలుసుకోండి. మీకు నచ్చేలాంటి సాహిత్యం రాస్తున్నామని చెప్పి మీ మీదకి నేరం నేట్టేయాలని చూస్తూనే మీకు కళని అమ్ముతున్న వాళ్ళు మిమ్మల్ని మరింత మానసిక సోమరుల్ని చేస్తున్నారు. మీలోని అవగాహనా లేమినీ, అవిటితనాన్నీ పెట్టుబడిగా పెట్టి డబ్బు, పలుకుబడి సంపాదిస్తున్నారు. నీతులు చెప్పే మార్గదర్శకులయిపోతున్నారు. నిజమైన జ్ఞాని ఎప్పుడూ మీకు తెలియని విషయం చెప్తాడు. తేలిగ్గా అర్థం చేసుకోలేని దాన్ని మీకు ఆవిష్కరిస్తాడు. ఆ ప్రక్రియలో తన మర్యాద పోగొట్టుకోటానికైన జంకడు. సులువైన శైలి, కాలక్షేపం అనేవి మార్గాలుగా ఉంటే ఉండొచ్చు గాని గమ్యాలుగా కాదు. జీవితం అనే మహా పెను enterprise లోని తళుకుబెళుకులతో పాటే మెలికలు బెనుకులు వణుకులు కునుకులు కన్నీళ్లు కూడా ఆవిష్కరించిన వాడు ఆత్మసాక్షిని కొంతైన గౌరవిస్తున్న వాస్తవిక రచయిత. అలాంటి కళాకారుల్ని పోషించండి. 



నా జీవితం మొత్తానికి నేను లూకోస్ గారితో తార్కికంగా ఒక్క వాదన చెయ్యలేకపోయినాను. వాదించటం అంటే ఆయన ఉద్దేశ్యంలో తిరుగుబాటు చేసేయటం! హేతుబద్ధంగా భావాలని వ్యక్తపరిస్తే అది పొగరుబోతుతనం! తన కథల్లో లాజికల్ తప్పిదాల్ని చూపిస్తే మహా impatience ఆయనకి. 


మేము కలిసి విదేశీ టీవీ చానల్స్ చూసే వాళ్ళం - అందులో జనాలు ఎలా మాట్లాడుతున్నారో గమనించే వాడు. మక్కికి మక్కి కాపీ కొట్టి ప్రసంగాలలో అట్లానే మాట్లాడే వాడు. మహా వక్తయని జనాలు పొగిడితే, నేను కూడా ఆయనతో పాటు అదే టీవీ చూసి ఉన్నానని మర్చిపోయే వాడో లేకపోతే నేను పిచ్చిదాన్ని అనుకొనే వాడో.. పొంగిపోయే వాడు! లాభాపేక్ష - లేదంటే కీర్తి - లేదంటే పొగడ్తలు  వస్తాయని నమ్మకం కుదర్చని ఏ పని ఆయన జీవితం మొత్తానికి చెయ్యలేదు. మోసం చేస్తున్నాడని తెలీదా ఆయనికి? లేదంటే లోని అంతరాత్మకి? నాకైతే అర్థంకాదు అలాంటి మనిషితో ఎందుకు కలిసి జీవించానా అని. బహుశా చెప్తే ఎవరూ అర్థం కూడా చేసుకోరని భయం వల్ల కావచ్చును. జనాల్ని చట్టప్రకారం manipulate చేసే హక్కు ఈ capitalist సమాజమే హక్కుగా కలిపిస్తుంది కదా! 



ఈ వికృతాలు అన్ని నా ఎదుట సిగ్గు లేకుండా చేసాడు. అంటే నాకు మనసు లేదనుకున్నాడు. ఏ మాత్రం మొహమాటం లేకుండా ఇంట్లో కుక్క ఎదురుగా బట్టలు మార్చుకుంటాం కదా.. దానికేం తెలుసులేననీ.. అలాగే నా ఎదురుగా రూపాలు మర్చుకోనేవాడు. నా నోటి నుంచి ఈ విషయాలేవీ ఎవరికీ చెప్పననుకున్నాడు. అంత ధైర్యం నేను చేయలేననుకున్నాడు. చెప్పలేను అనుకున్నాడు. నాకు చెప్పటం చాతకాదు అనుకున్నాడు. అన్నాడు కూడా! అదేమి ధైర్యమో అర్థం కూడా కాదు నాకు.. 



---------------------------------------------------------------------------------------------------------------------

ఇలా అంతా రాస్తూ, ఆవిడ ఆపి..
కలాన్ని కాగితం పక్కనబెట్టి  బల్ల మీద ముందుకు వాలి పడుకొని వెక్కి వెక్కి ఏడ్చింది.
నిశబ్దంగా ఒక పావుగంట గడిచింది.
నెమ్మదిగా లేచింది,
చెంగుతో కళ్ళు తుడుచుకుంది,
ముక్కు చీదుకుంది,
ఎండిన పెదాలు తడుపుకొంటూ  గ్లాసు నుంచి నీళ్ళు తాగింది.
అంత వరకు రాసినదంతా చించి పారేసి, లూకోస్ గారిని పొగుడుతూ నలుగు ముక్కల్లో ఓ లేఖ రాసి ముగించి, పంపించింది.

             ---------------------------------------------సమాప్తం--------------------------------------------------