29, అక్టోబర్ 2013, మంగళవారం

లోపలి యంత్రాంగం - 1

ఓ నా ప్రియాతి ప్రియమైన హృదయమా ఈ మాట ఒకసారి అలోచించి చూడు..

దీపం రెపరెప లాడుతునప్పుడే కాంతి శాశ్వతం కాదని జ్ఞానం మేల్కుంటుంది..
చలి నొప్పి నరాన్ని కొరుకుతున్న పోటులో సూర్యుని మీద అపార కాంక్ష కలుగుతుంది..
ప్రేయసి మీద నీకున్న ప్రేమ తను నిన్ను వదిలి వెళ్ళిన రోజే జ్ఞప్తికి వస్తుంది.
అందుకే వదిలి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోని ప్రేయసిని..
ఆ బాధలో, వ్యధలో.. చెదిరిన స్వప్నం.. మిగిల్చిన బూడిదలో నీ కన్నీళ్ళు పోసి
నీ ప్రేమని - నీ దైవత్వాన్ని సాక్షాత్కరింప జేసుకో!

కలత చెందిన నాడు ఒకప్పటి సుఖ వైభవం గుర్తొస్తుంది.. ఆస్వాదించు.
దారి తప్పిన చీకటి వేల వెళ్తున్న దారి మీద అనుమానం - ఇంటి మీద మమకారం!
మధ్యం చివరిబొట్టు తరువాత..
లోటా అడుక్కి చూసి మళ్లీ నీ కల నిజం కావాలని కోరుకుంటావు ..
కాని కలలు మెల్లగా నిజమవుతాయి, మిక్కిలి వేగంగా గనువవుతాయి..
తెలియనిదా నీకిది?

ఏమో.., ఏనాటికైనా నీవు తెలుసుకొనెదవేమో.. తాకగలిగిన ప్రతీది అశాశ్వతం ఎందుకు అవుతున్నదోనని?
కాని చూడు.. ప్రేయసి వదిలి వెళ్ళగా నీపై మిగిలిన బీటలు ఆమె ఆకరాన్నే గుర్తుకు తెస్తాయి..
ఏ గాలి పీల్చిన నాసికం ఆమె వాసనల్నే తెలుపుతుంది..
ఆమె భౌతికంగా దగ్గర లేకపోయేసరికి..  నీలోపల తెలియకుండానే ఆమె జ్ఞాపకాన్ని ఎంత పదిలం చేసావో తెలుస్తోంది..
మేఘాలు కమ్మిన రోజు కళ్ళు నక్షత్రాల కోసం వెదకినట్టు, ఒక్కో మినుకు ఒక్కో దివ్య దర్శనం!
ఒక్కో గాలితాకిడి ఒక మహామృదు అనంతానందభరితమైన స్పర్శ!
అందుకే వదిలి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోని ప్రేయసిని..

ప్రేయసి నెపం మాత్రమే. ఈ ప్రేమంతా తత్త్వతః అనాదిగా నీలోపలి ఉన్న యంత్రాంగం. నిస్సిగ్గుగా ఆస్వాదించు.


------------------------------------------------------------------------------

(నా ప్రేయసి కంటే నా ప్రేమ గొప్పది అన్న అహంకారంతో ఒకానొకప్పుడు రాసిన రాత ఇది. 
మరిప్పుడు అభిప్రాయం మారేనా? 
మ్మ్.. మారింది, తెలివి పరిణామం చెందింది..  
ప్రేయసి విలువ - ప్రేమ విలువ సమమైన నాడు ఈ వెలితి ఏ ఒక్క వైపు కనిపించబోదు.
ఆ సమతుల్యమే ఉంటే, ప్రేయసి కూడా ప్రేమని గుర్తిస్తే, గుర్తించి కరుణిస్తే .. విషాద సాహిత్యానికి జీవితంలో చోటు ఉండదు. అలాంటి ప్రేయసి వదిలిపోతే ఇక జీవితమే ఉండదు.)

1 కామెంట్‌: