4, జనవరి 2014, శనివారం

వైపరీత్యం (కథ)

పాతికేళ్ళ వయసు నాటికి జీజోకి స్త్రీ పరిచయాలు లేవు, చేతిలో డబ్బు లేదు, కుటుంబం లేదు, పెద్దగా స్నేహితులు కూడా లేరు. యువకుడైన జీజోకి గొప్ప ఆశయసాధన - ఏదోటి సాధించాలన్న తీవ్ర తపన  వంటివి ఉండేవని చెప్పే వీలు ఏమాత్రం లేదు. వాటికి పూర్తి విరుద్ధమైన లక్షణాలు - మూడవిశ్వాసాలు అనేకం ఉండేవి. అనుకోకుండా చేసిన కొన్ని పనులు 'కలిసి రావటం' వల్లనే జీవితంలో అప్పుడప్పుడు లాభం/ఆనందం/సుఖం  'కలిసి వస్తుంటాయని' చాల బలంగా నమ్ముతుండేవాడు. అన్ని విధాల 'కలిసొచ్చే' కార్యం ఏదుంటుందో ఆ మహా రహస్యాన్ని ఏ నాటికైనా కనుక్కోవాలని నిత్యం అప్రయత్నంగా అన్వేషిస్తుండేవాడు. జీవితంలో సుఖాలని అనుభవిస్తున్న వాళ్ళంతా ఏదో రోజు తెలిసో తెలీకో కలిసొచ్చే పని చేసి తీరుంటారని నమ్మేవాడు. కష్టం తగ్గా ఫలితం లభిస్తుంది అన్న ఆలోచన రుచించేది కాదు. జీజోని పట్టి పీడించిన మానసిక కష్టాల్లో ప్రప్రథమమైనది స్త్రీ వాంఛ. స్త్రీ నుంచి పొందగలిగే శారీరక-మానసిక సుఖాన్ని గురించి రోజు మొత్తం ఆలోచిస్తూ ఉండే వాడు. 'అసలు స్త్రీని ఆకర్షించటం అంటే ఏమిటి? స్త్రీని కళ్ళలో కళ్ళు పెట్టి చూసి చుంబించగలిగే ధైర్యం ఎలా వస్తుంది? వివాహితలైన స్త్రీలను సైతం సునాయాసంగా లోబరుచుకో గలిగిన వాళ్ళని కళ్లారా చూస్తాము .. వాళ్ళంతా ఆ విద్యని ఎలా నేర్చుకొని ఉంటారు? వాళ్ళు ఎంత అదృష్టవంతులో వాళ్ళకి ఎరుకనా? కొంతకొంత మందికి ఎందుకంత అదృష్టం? ఇంకో వైపు స్త్రీలను కొట్టి హింసించే వాళ్ళుంటారే.. వాళ్ళకేం పోయే కాలమో? స్త్రీని తకగలిగే అదృష్టమే లేక చస్తుంటే! పురుషుడి దయ కోసం ఏడ్చే స్త్రీలు ఉంటారే వాళ్ళకేం కర్మ? స్త్రీ కోరుకుంటే దొరకని ప్రేమా? అంతంత సౌందర్యవంతులైన  స్త్రీలు కొందరు పోయి పడుపు వృత్తిని ఎంచుకుంటారెందుకో! నా వైపు చూసి ఒక్క నవ్వు నవ్వితే రక్తం ఓడ్చి సుఖ పెట్టనా? జన్మకి దాసుణ్ణి కానా? ఈ జన్మ మొత్తానికి ఏ స్త్రీ అయినా నన్ను చూసి సిగ్గు పడుతుందా? నన్ను పురుషుడిగా గుర్తిస్తుందా?..' అన్న తరహాలో ఆలోచిస్తూ రాత్రులు గడిపేసేవాడు. 'స్నేహాలు - బంధాలు - స్త్రీలు - స్త్రీలు - స్త్రీలు - భోగం - భోగం - సుఖం' అనుకొంటూ నిద్రలోకి జారుకొనే వాడు. సమాజంలో ధనికుల మీద, అనేకులైన స్త్రీలను అనుభవించారని చెప్పబడిన శృంగార పురుషుల మీద తీవ్ర అసూయ-ద్వేషం  గుండె నిండా కలిగి ఉండేవాడు. యుక్తవయసు నాటికి  జీజో వ్యక్తిత్వ చిత్రణ ఇది.


పాకశాస్త్రం మీద కల సహజాసక్తి తోడవటం వల్ల జీవనోపాధి నిమిత్తం జీజో ఒక వియత్నామీస్ అల్పాహారశాలలో  ప్రథాన వంట వాడైన హ్యూన్ వద్ద సహాయక వంటవాడిగా చిన్నజీతానికి పని చేస్తుండే వాడు. ముభావంగా పరధ్యానంగా ఉన్నప్పటికీ జీజో పైన హ్యూన్ కి   కొంత మంచి అభిప్రాయం ఉండేది. ఆ రెస్టారెంట్లో "బున్-బో" అనే ఒక వంటకం అత్యదికంగా అమ్ముడు అవుతూ ఉండేది. హ్యూన్ వియత్నాంలో  నేర్చుకున్న ఈ వంటకాన్ని చాల సంవత్సరాల క్రితం ఈ దేశానికి తీసుకొచ్చి ఒక్క అల్పాహారశాల ఏర్పరుచుకొని ఒక మాదిరి పలుకుబడితో కాలం గడుపుతుండే వాడు.  వయసు మీద పడటం వాళ్ళ హ్యూన్ ఆదేశాలు ఇవ్వటం మినహాయిస్తే బున్-బో తయారీ ఇంచు-మించు మొత్తంగా జీజో చేతిలోనే సాగేది. వంటకం మొత్తానికి కీలకమైనది మిరప-చింతపండు-నిమ్మ గడ్డి-రహస్య మూలికలతో తాయారు చేయబడిన రసం! ఈ మిశ్రమం పక్కాగా కుదిరితే వంటకం తరువాయి తయారీ అంత సునాయాసంగానే చేసేయవచ్చు. కాలక్రమేనా జిజో బున్-బో నిపుణుడు అయినాడు. యాంత్రికంగా బున్-బోలు తాయారు చేస్కుంటూ ఉండేవాడు. కానీ కలిసొచ్చే కాలం వచ్చి దశ తిరిగిపోవాలని ఆశించటం మినహాయిస్తే జీవితం ఇంతకంటే మెరుగు పడటానికి ప్రయత్నాలు ఏమి చేసేవాడు కాదు.
నగరంలోని ధనికులు, పరదేశి వంటల ప్రియులు అనేకులు రెస్టారెంట్ని సందర్శించే వారు. తరచూ వచ్చే వినియోగదారులు కొంతమంది గురించి వంటగదిలో పనివాళ్ళు గోస్సిప్స్ మాట్లాడుకొంటూ ఉండేవాళ్ళు. జీజో చెవులు అప్పగించి శ్రద్దగా వింటుంటే వాడు. ఈ కబుర్ల ద్వారానే సమస్త వార్త-విశేషాలు జీజోకి తెలుస్తుండేవి. ఒక రోజు సాయంత్రం విన్సెంట్ తంగరాజ్ అని పిలువబడే ఒక పెద్ద పారిశ్రామికవేత్త హోటల్ కి విచ్చేసాడు. బున్-బో కోసం ఆర్డర్ చేసాడు. సమయానికి హ్యూన్ హోటల్లో లేకపోవటంతో బున్-బో తయారీ పని జీజో చేతిలోకి వచ్చి పడింది. విన్సెంట్ తన విలాసవంతమైన, ఖరీదైన జీవన శైలికి పేరు మోసిన వాడు. లెక్కలేని ధనం, అనేక మంది పడుచు స్త్రీలు (ఒక చిన్న తరహ సినీనటితో సహా) తన సాంతం చేస్కొని ఏ మాత్రం ఒడుదుడుకులు లేకుండా దర్జాగా జీవనం సాగించే విన్సెంట్ ని గురించి జీజో చాల సార్లు విన్నాడు. యాంత్రికంగా బున్-బో తాయారు చేస్తూ ఆ విన్న విషయాలు ఆలోచిస్తూ ఉన్నాడు. అసలే ఎందుకో ఆ రోజు ఉదయం శకునం బాలేదన్న భావనలో తిక్కగా ఉన్న జీజోకి చాల చిత్రమైన ఆలోచన తట్టింది! అలా వంటగది పైకప్పు  వైపు చూస్తూ గరిట తిప్పుతూ ఆలోచిస్తూ ఉండిపోయాడు.. సర్వర్ ఇంకొకసారి పిలిచేసరికి ఉలిక్కిపడి.. బున్-బో రసం గిన్నె దగ్గరికి తీసుకొని ఎవరూ చూడకుండా గబ్బుక్కున్న "తూ!" అని అందులో ఉమ్మేసి వంటకం పూర్తి చేసి సర్వర్ కి అప్పగించి, డ్రెస్సింగ్ రూం లో బట్టలు మార్చుకొని, మేనేజర్ దగ్గరికి పరిగెట్టి సాయంత్రానికి సెలవు తీసుకొని .., వేగంగా కంగారుగా ఇంటికి వెళ్ళిపోయాడు!!
ఇంటికి చేరుకున్నాక కంగారుగా గదిలోకి వెళ్లి తలుపులు ముసేస్కోని, కిటికీ తలుపులు కూడా బందిచేసి గోడకి వేలాడి ఉన్న అద్దంలో ముఖం చుస్కున్నాడు. ఒక రెండు క్షణాలు అలా చుస్కున్నాక .. ఒక విస్ఫోటనంలా తన్నుకుంటూ నవ్వు వచేసింది. కడుపు చేత పట్టుకొని నెల మీద పది ద్రోల్లి ద్రోల్లి దిండుని నోటితో కరిచేసి ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి ఆయేంత వరకు పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నాడు. ముఖం కందిపోయింది, నవ్వి నవ్వి కళ్ళ చివర నీళ్ళు వచ్చేసాయి, చెవులు వేడెక్కిపోయాయి. రాత్రికి మద్యం తాగేసి వళ్ళు తెలియకుండా ప్రశాంతంగా మత్తుగా పడుకొన్నాడు!
మర్నాడు ఉదయం సమయానికి హోటల్ కి వెళ్ళి రోజు లానే తన పని తను చేస్కుంటూ ఉన్నాడు. తోటి వంటవాడు ఒకడు జీజోని గమనించి దగరికి వచ్చి "ఏమైంది నిన్న? మాట చెప్పకుండా వేల్లిపోయావ్? ఆ విన్సెంట్ గారు నీ కోసం అడిగారు. హ్యూన్ గారు కూడా అడిగారు.." అన్నాడు. జీజో గొంతులో వేలక్కాయి పడింది! మొహం అంత చమటలు పట్టినాయి. ఉద్యోగం పోవటం ఖాయం అని తెలిసిపోతుంది. అరి చేతులు అరి కాళ్ళు చల్లగా అయిపోయాయి. చతికిల పడి నేల మీద కూర్చొని పోయాడు. కాసేపు అలోచించగా.. ఏం  సమస్య వచ్చినా ససేమిరా బుకాయించటం మించిన ఆత్మరక్షణ మరోటి లేదని ధైర్యం చెప్పుకొని .. నిబ్బరం చేసుకొని లేచి మళ్ళి పని కొనసాగించాడు. ఒక గంటలో హ్యూన్ గారు గదిలోకి వచ్చి జీజో పక్కన నుంచొని తన వైపు చూస్తూ ఉన్నారు. జీజో భయంతో వణుకుతూ గమనించనట్టే తన పని తను చేస్తూ ఉన్నాడు. నిశబ్దాన్ని పట-పట విరుస్తున్న స్వరంతో హ్యూన్ "జీజో , ఇది విను.. విన్సెంట్ తంగరాజ్  నిన్ననీ బున్-బో తిని ముగ్ధుడు అయాడు. వాళ్ళ స్నేహితులు తెరవబోయే ఒక హోటల్ లో బున్-బో తయారికి వంటవాణ్ని వెతుకుతున్నాడని.. వాళ్ళకి నచ్చితే నిన్ను తీసుకుంటారని చెప్పాడు. నాకు అభ్యంతరం లేదని చెప్పాను. రేపే వాళ్ళు వస్తున్నారు..  నీకు ఉద్దేశ్యం ఉంటె రేపు మరొకసారి నీ  ప్రతిభ చూపించుకో.." అన్నాడు!
అనవసరంగా పాల్పడిన వెకిలి చేష్టకి బాధపడ్డాడు జీజో. ఇకముందు ఇలాంటి పనికిమాలిన కోపాన్ని అనుచుకోవాలని తనని తాను మందలించుకున్నాడు. తరువాతి రోజు చాల శ్రద్ధగా శుచిగా బున్-బో వంటకాన్ని తాయారు చేసి విన్సెంట్ వెంట తీసుకొచ్చిన వ్యాపారవేత్తలకి వడ్డించాడు. ఎలా అయినా వాళ్ళ మెప్పు పొందాలని చాల ఆరాట పడ్డాడు. అయితే తిన్న వాల్లెవరికీ  వంటకం రుచించ లేదు. ముందు రోజు మైమరచిపోయి తిన్న విన్సెంట్ కూడా తీవ్ర నిరాశకి గురిఅయినాడు. కేవలం ఒకసారి రుచి చూసే ఈ జీజోని ప్రోత్సహించేయలనుకోటం తన పొరపాటు అన్నట్టు ప్రవర్తించాడు. విచ్చేసిన వ్యాపారవేత్తలు పెదవి విరిచి వెళ్ళిపోగా విన్సెంట్ కి  కూడా కొంత మొహం చెల్లకుండా పోయింది. జీజోని ఈ సంఘటన చాల బాధించింది.. మనసు మొత్తం పెట్టి చేసిన వంటకంలో ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థం కాలేదు. ఓ వారం రోజులు పూర్తిగా దిగాలు పడిపోయాడు. డబ్బున్న వాళ్ళ వ్యవహారాలు ఇలానే ఉంటాయి అనుకున్నాడు. ఆశ కలిగించినందుకు విన్సెంట్ కి శాపాలు పెట్టాడు. కొన్నాళ్ళకి ఏదో కలిసి రాలేదనుకొని సరిపెట్టుకొని.. క్రమంగా మర్చిపోసాగాడు.
ఒక నెల  గడిచాక విన్సెంట్ ఒక స్నేహితునితో పాటు మళ్ళి దర్శనం ఇచ్చాడు.  జీజోని పిలిచి ఇద్దరికీ బున్-బో తాయారు చేసి పట్టుకు రమ్మన్నాడు. జీజో విసుగ్గా యాంత్రికంగా రెండు బున్-బో గిన్నెలు సిద్ధం చేసి రెంటిలోనూ ఉమ్మేసి, వంట పూర్తి చేసి వడ్డించాడు. అద్భుతం!! విన్సెంట్ మరియు తన మిత్రుడు ఈసారి మైమరిచి పోయారు! గిన్నె నాకి నాకి మరీ బున్-బోని తిని ఆస్వాదించారు! జీజోని పిలిచి విన్సెంట్ ఈ విధంగా అన్నాడు "చూడు జీజో , నీ వంటకంలో ఏదో మంత్రం ఉందని మొదటి సారే గమనించాను. రెండోసారి నిరాశ పరిచినప్పటికీ .. బహుశా ఒత్తిడి వల్ల అలా  తేడా చేసుంటావు అనిపించింది. నా ఆలోచన సరైంది. అద్భుతం! అమోఘం! నీకు చాల భవిష్యత్తు ఉంది.. నా స్నేహితుడి రెస్టారంట్లో పని చేస్తావా? ప్రథాన వంటవాడి జీతం! ఆలోచించుకో! ఒక వారంలో ఈ చిరునామాకి వచ్చి సంప్రదించు."
******************************************************************************
నమ్మసఖ్యం కాని ఆ నాటి ఆ నాటకీయ పరిణామంతో జీజో జీవితం మొత్తం మారిపోయింది. అనూహ్య మలుపులు తిరిగిపాయింది. టూకీగా చెప్పాలంటే: సంవత్సరం గడిచేలోపు జీజోకి పెళ్లి అయింది! కామావేశం చల్లారింది, చాల ప్రశ్నలకి సమాధానాలు కూడా దొరికాయి, చేతి నిండా డబ్బు ఉంది, కుటుంబం ఏర్పడింది, స్నేహితులు ఉన్నారు. జీవితంలో నిలకడ వచ్చేసరికి కామ వాంఛ ఎలానో మరి అదుపు అయింది! అయిదు సంవత్సరాలు గడిచేసరికి సొంతంగా రెస్టారంట్ స్థాపించాడు.. నగరంలో చాల పేరు గడించాడు. పది సంవత్సరాలు గడిచే సరికి స్కూల్ కి వెళ్ళే పిల్లలు ముగ్గురున్నారు, వ్యాపారం అద్భుతంగా కష్టం అనేది తెలీకుండా అనర్గళంగా సాగిపోతుంది. మొత్తానికి తరువాతి పాతిక సంవత్సరాల్లో, జీజో మాటల్లో చెప్పాలంటే, జీవితం పైన అదుపు కోల్పోయినంత స్థాయిలో అదృష్టం పీకకు చుట్టుకుంది. ఏది ఏమైనా అలవాటుపడిపోయిన ఈ సౌఖ్యన్ని ఇక వదులుకోలేడని త్వరగానే అర్థం చేసుకున్నాడు. బున్-బో తయారీలో ఉమ్మటం మాత్రం ఒక్క రోజు కూడా మానుకొనే ధైర్యం చెయ్యలేకపోయాడు!
యాభై ఏళ్ళ వయసు నాటికి జీజో, పేరున్న మర్యాదగల వ్యాపారవేత్తగా మారినాడు. ఆయన్ని నమ్ముకొని పదిహేను - ఇరవై కుటుంబాలు బ్రతుకుతున్నాయి. ఎగువ తరగతికి చెందిన వాళ్లతో స్నేహాలు పెనవేసుకున్నాయి. భార్య, పిల్లలు ఖరీదైన జీవితాన్ని గడుపుతున్నారు. పిల్లలు తనకి అర్థం కూడా కాని చదువుల్లో, కార్యకలాపాలలో మునిగిపోయి ఉన్నారు. రెస్టారంట్ ఖ్యాతి ఊహకు మించిన స్థాయికి చేరుకుంది. వియత్నాం, థాయ్, కంబోడియన్ వంటకాలు నగర జనాలని అమితంగా ఆకర్షించసాగాయి. వంటల పట్టికలో బున్-బో కి మాత్రం ప్రత్యేక స్థానం ఉంది.. హోటల్ కి వచ్చిన వాళ్ళు ఎవరైనా బున్-బో ని ఒకసారైన రుచి చూడకుండా వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇది వరకు లాగా చిన్న మొత్తాలలో కాకుండా భారి మొత్తంలో బున్-బో రహస్య మిశ్రమం జీజో వ్యక్తిగతంగా తాయారు చేసి సహాయక వంటగాళ్ళకి అందించే వాడు. వ్యక్తిగతంగా తాయారు చేయటం అంటే ఏమి చేసి ఉంటాడో మీరు ఊహించ గలరు!
అంతా బాగానే సాగుతోంది కాని.. వయసు పెరిగే కొద్ది జీజోలో కొంత పరివర్తన రాసాగింది. జీవితంలో జరిగింది-జరుగుతంది స్ప్ర్హలోకి వస్తుంది.. కొద్ది కొద్దిగా ఆత్మ పరిశీలన మేల్కొంటోంది. పదే-పదే తలలో మెదిలే ప్రశ్నలే ఆయన్ని హింసించ సాగాయి. 'ఈ ఉమ్ము వేసి జనాలకి తిండి పెట్టడం ఏంటి? చేస్తుంది మహా పాపం కాదా? కాని మార్గం ఏమున్నది? కలిసిరాక కలిసిరాక ఏదో కలిసొచ్చింది. ఇప్పుడు ఈ సంపదని తన మీద ఆధార పడి ఉన్న జనాల్ని ఎలా వదులుకోనేది? పాతిక సంవత్సరాలుగా చేస్తున్న ఈ పనిని అకస్మాత్తుగా మానుకొంటే ఏం తీవ్ర పరిణామాలు వస్తాయో!' అని ఆలోచిస్తూ ఉండే వాడు. పరమ మూఢ భక్తుడిగా మారి పోయాడు. నోటికి వచ్చిన పిచ్చి మంత్రాలు చదువుతూ రోజుకి ఉదయం - మధ్యాహ్నం - సాయంత్రం రెండేసి గంటలు చప్పున పూజలు చేసేవాడు. క్యాలెండర్ మీద, తాళం గుత్తి మీద, బట్టల కవర్ల మీద కనిపించిన దేవుడు ఫొటోలకి ఆరతులు ఇచ్చే వాడు. చేసే పనుల్లో చాదస్తం బాగా పెరిగిపోయింది. మాటిమాటికి ఉంగరాలు - గొలుసులు కళ్ళకి  అద్దుకోవటం,  జనాల్ని అడిగిన ప్రశ్నలే అడగటం, లాంచనాల పేరుతో జనాలకి బహుమతులు ఇవ్వటం ఇలా రకరకాల కొత్త అలవాట్లు వచ్చాయి. రాత్రులు మద్యం మితి మీరి సేవించే వాడు, తనలోపల ఒక అగ్ని పర్వతం ఉందని.. దాన్ని అణచిపెట్టి భరిస్తున్న తాను ఓ త్యాగమూర్తినని దొరికిన వాళ్ళకి విసుగు వచ్చేదాక చెప్తుండే వాడు.
అయితే ఒక రోజు జీజో అకస్మాత్తుగా ప్రెస్ వాళ్ళకి ఒక లేఖ రాసి అందులో ఆయన చేస్తూ వస్తున్న విపరీతాన్ని వివరించి, అన్నిటిని త్యజించి దూరంగా వెళ్లిపోతున్నానని.. తన కోసం దయచేసి ఎవరు వెతకవద్దని ప్రార్థిస్తున్నానని సూచించి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. బహుశా తర్వాత ఆయన హోటల్ మూసివేసుంటారు. బహుశా ఆయన మీద సంఘాల వాళ్ళు కేసు పెట్టి ఉంటారు. లేదంటే ఊరుకొని ఉంటారు. కచ్చితంగా రెస్టారంట్ సంఘం వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఉంటారు. పిల్లలూ, భార్య ముఖం చూపించలేక ఆస్తులు అమ్మేస్కోని ఎటైన పోయుంటారు. లేదంటే జీజో గారికి మతిస్థిమితం పోయిందని ప్రచారం చేస్కొని డామేజ్ కాపాడుకొని ఉంటారు. అవేమి మనకి తెలియవు. కాని కచ్చితంగా జీజో జీవితాంతం మళ్ళి ఆ నగరం పరిసరాల్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే ముసలివాడైన ఆ జీజోనే మేము వ్యాలీలో పని చేస్తున్న రోజుల్లో ఓ పాటశాల బయట చెత్త కుప్ప లోంచి ఇంగిలి తిండి తింటూ రోజూ కనిపించేవాడు. కొన్నాళ్ళకి చనిపోయాడు.












============================== సమాప్తం ==================================


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి