25, సెప్టెంబర్ 2015, శుక్రవారం

కవికి విన్నపం

శోక కవిత్వం రాయమాకు కవి.. నియంత్రించుకో!
వీలయితే ఓ అనాథ కవితని చేరదీసి దాని ముఖానికి నవ్వు అద్ది మాకివ్వు.
ఎలానో చెప్తాము విను ..
కళ్ళు మూసుకొని ప్రేయసిని తలుచుకో,
హృదయంలో ఆమె బింబాన్ని నింపుకో. ఇప్పుడు చూడు!
మెదడులో, మనోవాక్కులో, కవిత్వంలో.. అందం తానంతట అదే పరవళ్ళు తొక్కుతుంది!

భయం వలదు కవి .. ప్రేయసి బింబం పూర్తిగా నీ సొంతం!
బింబాన్ని శోక కవిత్వంతో తడి చేయకు ..
ఊరికే గుండెని నలిపి బింబం పైన వేలిముద్రలు పడనీయకు!
దృష్టి మాత్రం బింబం మీద లగ్నం చేసి కవిత రాసి చూడు
మంచి మంచి పదాలు వాటికవే ద్రోల్లుకొంటు వచ్చి నవ్వుకుంటూ చేరతాయి..
ప్రయత్నించి చూడు ..

మమ్ము బాధించకు కవీ! విన్నవించుకుంటున్నాము ..
నువ్వేదో ప్రపంచ భారమంతా మోస్తునట్టు.. మాకు నీ మీద జాలి కలిగించాలని చూడకు!
నీకు మనసులో నొప్పి కలిగితే దాన్ని కడుపులోకి దిగమింగు!
మా మీద మాత్రం నీ శోకాన్ని కక్కకు!
నీ ప్రేయసి కోసం రాస్తున్నావనుకొని ఒక నాలుగు పంక్తులు రాసి ఇటు వదులు
ఆపై నీ బాధని నీలోనే అరిగిపోనివ్వు.

గుండెలనిండా ఊపిరి పీల్చుకొని వదులు, నిన్న రాత్రి కలని జ్ఞాపకం తెచ్చుకో,
నిజంతో పోల్చుకోకు! ఆ జ్ఞాపకమే నిజమనుకో ..
ప్రేయసి తన కళ్ళతో నిన్ను పిలిచిన వైనం ఓసారి గుర్తు తెచ్చుకో
అరెరే కవి! ఆ ఊహకే నీ పెదవి మీద నవ్వు మెరిసిందే!
అరే! సిగ్గు కూడా పడుతున్నావా కవీ? ఆహ! ముఖం అంతా వెలిగిపోతుందే!
ఆ వెలుగేదో మాకు కూడా పంచిపెట్టు కవీ
మెమెల్లరూ సుఖించెదము నిన్ను అశీర్వదించెదము!

1 కామెంట్‌: