6, జనవరి 2019, ఆదివారం

దేశాన్ని ఉద్ధరిస్తున్న సైన్సు మేధావులు

ఈ దేశంలో సైంటిస్టులు (అని చెప్పుకొనే వాళ్లలో ఎక్కువ శాతం మంది) ఈ దేశానికీ ఇక్కడి ప్రజలకీ చేస్తున్న ద్రోహం అంతా ఇంతా కాదు.
ఒకడేమో ఇంటర్నేషనల్ లెవెల్ రీసెర్చ్ అంటూ గాల్లో తేలుతుంటాడు, భూమ్మీద కాలు ఆనిస్తే కాలు బెణుకుతుందని భయమంటాడు;
ఇంకొకడు ఇతిహాసాల్లోనే సర్వస్వం ఉందని మెడిటేషన్ లోకి పోతుంటాడు;
మరొకడైతే "ప్రవృత్తి వేరు వృత్తి వేరు" అని ఒక చేత్తో రీసెర్చ్ ఊడపీకి ఇంకో చేత్తో గోమూత్రం తాగి గుటకేస్తాడు; 
ఇంకొకడు వెకిలిగా నవ్వుతుంటాడు;
మరొకడు గర్వంగా నవ్వుతుంటాడు;
మరొకడు ఇండియాలో రీసెర్చ్ చేయటానికి అవకాశం లేదంటాడు;
ఇంకొకడు 'నాకేంటీ?' అంటాడు!
- ప్రతివాడు ఉద్ధండ పండితుడే, ప్రతివాడు మహానుభావుడే, ప్రతి ఒకడు శాస్త్రాన్ని ఔపాసన పట్టేసిన జ్ఞాన గణే .. 'నువ్వు కూర్చుంటున్న భవనం కట్టిన కూలివాణి పిల్లాడికి నువ్వు చేసే పనికొచ్చే పనేంటీ?' అని అడిగితే మాత్రం వెధవల్ని చూసినట్టు చూస్తాడు, పురుగు లెక్క తీసిపారేస్తాడు, "థట్ ఈజ్ నాట్ మై జాబ్" అని ఇంగ్లీషులో కోపగించుకుంటాడు, లేదంటే సంస్కృతంలో శపిస్తాడు!
అడుగడుగునా కనిపిస్తున్న పేదరికం, అజ్ఞానం, సామాన్యుడి దుర్భర జీవనస్థాయి ఆలోచనాస్థాయి చూసి ఈ సైంటిస్టులు, మేధావులూ చలించరు. జనాలు చస్తున్నా వీళ్ళ సైన్సుతో వచ్చి వీళ్ళు ఆదుకొనేదేదీ ఉండదు. దేశంలో ప్రాథమిక విద్య నాశనం అవుతున్నా నామ మాత్రం నిరసించరు, ప్రభుత్వాలు చేసే నిర్హేతుకమైన మూర్ఖమైన చర్యలని వీళ్ళు వ్యతిరేకించరు, కనీసం విమర్శించరు. తమతమ జీవితాలు బాగున్నంత కాలం, తమతమ జీతాలు వస్తున్నంత కాలం, పలుకుబడి పెరుగుతున్నంత కాలం, vanity వ్యాపిస్తున్నంత కాలం, EMI లెక్కలు సరిపోతున్నంత కాలం .. సమాజం అనేది ఒకటుందనీ అది తగలబడుతోందని, జనాలు మూఢత్వంలో మునిగి ఛస్తున్నారని, ఏడుస్తున్నారని, ఏదో ఆశతో అమాయకంగా చూస్తున్నారని వీళ్ళకి కనపడదు.
ఆలోచనని మధించి సమాజానికి జ్ఞానం పంచిపెట్టిన మహానుభావులూ, త్యాగమూర్తుల పరంపరలోని వాళ్లమని చెప్పుకొనే వీళ్ళు నిజానికి సమాజాన్ని మధించి వెన్న తోడుకుంటున్న దర్జా intellectual దొంగలు! వీళ్ళ పుణ్యమాన విద్య చస్తుంది. వైద్యం చస్తుంది. వ్యవసాయం చస్తుంది. కష్టజీవి నైపుణ్యానికి, ప్రాణానికి విలువ చస్తుంది. కొండపల్లి బొమ్మకి సొంత నైపుణ్యం జోడించి imported machine మీద 3D ప్రింటింగ్ చేసి foriegn వెళ్లి చూపించొస్తానంటాడు ఈనాటి మేధావి. కౌరవులు టెస్ట్ ట్యూబ్ బేబీలనేది ఋజువు అవసరంలేని సత్యం అంటాడు ఇంకొంచెం పెద్ద మేధావి. 'మరి మాతృభాషలోకూడా మూడు ముక్కలు మాట్లాడలేకపోతున్న ఈ తరం సామాన్య విద్యార్థుల అవస్థ మాట ఏమిటీ?' అని అడిగితే privitization, globalization, corporetization and competition are real solutions - అని సెలవిస్తాడు అదే తానులో ముక్కైన ఇంకొక మహామహా మేధావి.
సొంత లాభం చూసుకోకుండా పోరాడుతున్న ప్రజా సంఘాలు, జన విజ్ఞాన వేదిక లాంటి సైన్సు ప్రచార సంస్థలూ చేస్తూ వస్తున్న శ్రమవల్లనే కాస్తో కూస్తో ఈనాడు జనబాహుళ్యంలో సైన్సుపట్ల అవగాహన కదులుతుంది. వీళ్ళ సేవకే సమాజం నిజంగా ఋణపడి ఉంది. విద్యావ్యవస్థని హైజాక్ చేసి హై లెవెల్ థింకింగ్ లో విహరిస్తూ, విద్య వ్యాపారంగా మారిపోతుంటే హృదయం లేకుండా చూస్తూ కూర్చునే మేధావి వర్గాని కయితే కాదు.

ఇతివృత్తం: https://www.theweek.in/news/india/2019/01/04/del55-vc-kauravas.html

3 కామెంట్‌లు: