30, మే 2020, శనివారం

నిట్టూర్పు - 2

1996లో.. అంటే సరిగ్గా పాతికేళ్ల క్రిందటి మాటిది. అప్పటికి నా వయసు పదేళ్లు. ఆరో తరగతి వేసవి సెలవులు గడుస్తున్నాయి. తర్వాత ఏడు, పెద్ద పరీక్షలు! పైగా ఆ మధ్యనే ఒక పెద్ద స్కూల్లో చేర్పించారు. "భారానికి మించి ఫీజు కట్టి చదివిస్తున్నాను మరి నువ్వు prove చేసుకోవా"లని ఇంట్లో చెప్పారు. లెక్కల ట్యూషన్లో కూడా చేర్పించారు. వేసవి కాలం సాయంత్రం మూడు లేదా నాలుగింటి కల్లా నేను, రమణ, ఉష కలిసి నడుచుకుంటూ బయల్దేరి ట్యూషన్ కి వెళ్ళేవాళ్ళం. ట్యూషన్ కి వెళ్లే దారిలో ఒక సందు ఉండేది దాని నిండా పీతుళ్ళు ఉండేవి మనుషులవీ + పశువులవి కూడా. ముక్కు మూసుకోకుండా దానిగుండా పోగలిగే సాహసమే లేదు. రమణ నేను 'that street full of stools' అని పిలుచుకునే వాళ్ళం. ఎలాగోలా ఆ వీధి దాటిపోతే ట్యూషన్ మాస్టారు ఇంటికి త్వరగా పోవొచ్చని కక్కుర్తి పడి ఆ తావేంటే వెళ్ళేవాళ్ళం.

అలానే ఓ రోజు ఆ పీతుళ్ళ సందులోంచి ముక్కు మూసుకొని వెళ్తుంటే మురికి చొక్కాతో, మచ్చల మొహంతో ఒక పిల్లాడు (ఇంచుమించు మా వయసు వాడే) మమ్మల్ని ఆపి ఆప్యాయంగా నవ్వి "అన్నయ్యా .. మీ ట్యూషన్లో సారు ఎంత ఫీజు తీసుకుంటారు? నన్ను కూడా జాయిన్ చేసుకుంటారా?" అని అడిగాడు. వీధిలో కంపు భరించలేక కొంచెం, వాడి పుసులు కట్టిన కళ్ళు చూడలేక కొంచెం మేము "తెలీదు అడిగి చెప్తాము" అని అక్కడ నుంచి వేగంగా జారుకున్నాము. కొంచెం దూరం వచ్చాక నేనూ రమణ ఒకరి మొహం ఒకళ్ళు చూసుకొని "ఛీ ఛీ ఆడి మొహం చూసావా? లేబరోడు! మాలోడు లాగ ఉన్నాడు ఆడు మన ట్యూషన్ కి రావటం ఏంటి? ఆడి పల్లు చూసావా? యాక్!" అనుకొని వెకిలి వెకిలిగా నవ్వుకుంటూ పోయాము.

తర్వాతి రోజు మళ్ళీ ఆ సందులోంచి వెళ్తే వాడు ఎక్కడ తగులుకుంటాడో నని దూరమైనా సరే వేరే వీధిలోంచి వెళ్ళటం మొదలెట్టాం. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక రోజు అనుకోకుండా మళ్లీ ఆ పిల్లగాడు తారసపడి అడిగాడు "అన్నయ్య మీ సారుని అడిగారా? ఏమన్నారు?" అని. "Sirని అడిగాము, మా ట్యూషన్లో ఖాళి లేదన్నారు, next year try చెయ్యి" అని చెప్పేసి వెకిలిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాము. మళ్ళీ ఆ పిల్లగాణ్ణి చుసిన జ్ఞాపకం లేదు.

----
చేసిన పాపం చెప్పుకుంటే పోతుందని చిట్కాలిస్తారు జనాలు. కానీ ఈ పాపంలో నా భాగమెంత? పదేళ్ల పిల్లాణ్ణైన నా మానసులో అంతటి కాలుష్యం నింపిన వారిదెంత? సమాజానిదెంత? రాజ్యానిదెంత? విద్యా వ్యవస్థదెంత? ప్రాయశ్చిత్తం కావాల్సింది ఎవ్వరికి? నేరమెవరిది? శిక్షలెవ్వరికి? పుసుల కళ్ళ పిల్లగాడు పెద్దాడై ఈ రాత్రి ఏం చేస్తున్నాడు? రమణ అమెరికాలో ఉన్నాడు.

2 కామెంట్‌లు:

  1. 1996లో.. అంటే సరిగ్గా ఇరవై రెండేళ్ల క్రిందటి మాటిది - ???

    రిప్లయితొలగించండి