10, ఫిబ్రవరి 2016, బుధవారం

జంగల్ బుక్!

అడవి మొత్తం కబురు తిరుగుతుంది, ఇప్పుడే తెలిసింది!
చడ్డి వెస్కొని ఓ పువ్వు పూచింది!
పుట్టీ పుట్టగానే దాని బోసిమొల చూస్కొని ఆ చిన్ని గువ్వ సిగ్గుపడిపోయిందంట  .. 
గుడ్డు లోపల ఉన్నంత కాలం దానికి ఏ గొడవలేకుండా ఉండిందంట ..
అసలు ఎందుకు బయటకి ఎందుకొచ్చానబ్బా? అని ఆలోచిస్తూ ఉండిపోయిందంట
అడవి మొత్తం కబురు తిరుగుతుంది, ఇప్పుడే తెలిసింది!
చడ్డి వెస్కొని ఓ పువ్వు పూచింది!



అదో.. ఈ మధ్యన 'జంగల్ బుక్' సినిమా రిలీజ్ అవుతుందనే సరికి నా మస్తిష్కంలో జ్ఞాపకాలు వెనక్కి పరిగెత్తాయి. నా గుండు మీద nostalgia చినుకులు ఒకటికి రెంటికి మూడిటికి అనంతం వర్షించి తడిసి ముద్దైపోయాను!

అయితే, మంచో చెడో, కాలంతో పాటు చాల విషయాలు తెలిసినైగా మరి. పాత విషయాలేవి అప్పుడు కనిపించినట్టు ఇప్పుడిక కనిపించవు. ఒక రెండేళ్ళ క్రితమే One piece లాంటి ఆనిమేలు (animés) కనుగొని, చూసి, తరించి, పరవశంతో మూర్చిల్లిపోతిని కాని అప్పటికీ తెలియలేదు నాకు నా బాల్యంలోని అత్యంత సుందర జ్ఞాపకాల్లో ఒకటైన 'జంగల్ బుక్' కూడా ఒక జపనీస్ ఆనిమే నే అని! ప్రతి కళాఖండానికి ఒక విధాత ఉంటాడని, ఈ కళాఖండం దర్శకుని పేరు ఫుమియో కురోకావ ఊహించితినా నేను? టైటిల్స్ లో ఆయన పేరు ప్రతిసారి ఎలా చూడకుండా దాటి వేసాను! జపనీస్ భాషలో 'ల' కి 'ర' కి వ్యత్యాసం ఉండదు. అందుకే ఆ భాషలో దీన్ని జంగురు బుక్కు షోనేన్ మోగురి అని పిలిచారు. ఓహ్ షోనేన్ అంటే ఏమిటనా? అవి జపాన్లో 'బాలురు కోసం' తయారుచేయబడే ఒక తరహ కార్టూన్ల పేరు.. ఇక్కడ షోనేన్ అంటే 'సాహస బాలుడు' అని చెప్పుకోవచ్చు. 

అంతేనా? షేర్ఖాన్ కి నేపధ్య స్వరం నానా పటేకర్ అందించాడంట, శీర్షిక గీతాన్ని సాక్షాత్తు గుల్జార్ రచించారంట!  ఇవే విషయాలు నాకా రోజు చెప్పుంటే ఏమనే వాన్నో నేను?

ఈ జీవితముందే జీవితము.. అదొక మహా చమత్కార వృత్తాకార చలనము! 

16, అక్టోబర్ 2015, శుక్రవారం

నే.. నే..

సరిగ్గా మనం పుట్టిన సమయాన్నే జన్మించాడో మనిషి

నాలానే .. 
             ఇదేమి? అదేమీ? వారెవరు? వీరెవరు? నాకెవరు? నీకెవరు? నేనెవరు?
                                                .. అని ప్రశ్నల మీద నడకలు నేర్చుకున్నాడు. 
మనిద్దరికంటే ముందరనే .. 
             ఈ ప్రపంచమొక గాజుమేడ అనీ  
                                               .. ఇక్కడి గోడలన్నీ పారదర్శకాలనీ తెలుసుకున్నాడు.
అందరిలానే .. 
             గతం బింగించే పాశం నొప్పిస్తున్నా, భవిష్యత్తు భయం పుట్టిస్తున్నా, 
                                               .. వర్తమానంలో ఊపిరి అందితే చాలనుకున్నాడు. 
నీలానే .. 
             సాహసం లేని మార్గం మీద మమకారం కలుగక, 
                                               ..  ఖర్జూరాలని వెతుక్కొంటూ కఠినమైన ఎడారి మార్గం పట్టాడు. 
అలానే ..  
             ఎడారి మార్గాన కనిపించిన ఒయాసిస్ మీద మనసు పారేసుకున్నాడు .. 
                                               .. పూజలు చేసాడు, మోకరిల్లాడు ..  కవితలు రాసాడు. 
ఇలానే .. 
            ఈ క్షణం ఇదే రీతిలో నిన్నూ నన్నూ  ఇరికించి ఇద్దరికీ అర్థంకాని కవితేదో రాస్తున్నాడు. 

25, సెప్టెంబర్ 2015, శుక్రవారం

కవికి విన్నపం

శోక కవిత్వం రాయమాకు కవి.. నియంత్రించుకో!
వీలయితే ఓ అనాథ కవితని చేరదీసి దాని ముఖానికి నవ్వు అద్ది మాకివ్వు.
ఎలానో చెప్తాము విను ..
కళ్ళు మూసుకొని ప్రేయసిని తలుచుకో,
హృదయంలో ఆమె బింబాన్ని నింపుకో. ఇప్పుడు చూడు!
మెదడులో, మనోవాక్కులో, కవిత్వంలో.. అందం తానంతట అదే పరవళ్ళు తొక్కుతుంది!

భయం వలదు కవి .. ప్రేయసి బింబం పూర్తిగా నీ సొంతం!
బింబాన్ని శోక కవిత్వంతో తడి చేయకు ..
ఊరికే గుండెని నలిపి బింబం పైన వేలిముద్రలు పడనీయకు!
దృష్టి మాత్రం బింబం మీద లగ్నం చేసి కవిత రాసి చూడు
మంచి మంచి పదాలు వాటికవే ద్రోల్లుకొంటు వచ్చి నవ్వుకుంటూ చేరతాయి..
ప్రయత్నించి చూడు ..

మమ్ము బాధించకు కవీ! విన్నవించుకుంటున్నాము ..
నువ్వేదో ప్రపంచ భారమంతా మోస్తునట్టు.. మాకు నీ మీద జాలి కలిగించాలని చూడకు!
నీకు మనసులో నొప్పి కలిగితే దాన్ని కడుపులోకి దిగమింగు!
మా మీద మాత్రం నీ శోకాన్ని కక్కకు!
నీ ప్రేయసి కోసం రాస్తున్నావనుకొని ఒక నాలుగు పంక్తులు రాసి ఇటు వదులు
ఆపై నీ బాధని నీలోనే అరిగిపోనివ్వు.

గుండెలనిండా ఊపిరి పీల్చుకొని వదులు, నిన్న రాత్రి కలని జ్ఞాపకం తెచ్చుకో,
నిజంతో పోల్చుకోకు! ఆ జ్ఞాపకమే నిజమనుకో ..
ప్రేయసి తన కళ్ళతో నిన్ను పిలిచిన వైనం ఓసారి గుర్తు తెచ్చుకో
అరెరే కవి! ఆ ఊహకే నీ పెదవి మీద నవ్వు మెరిసిందే!
అరే! సిగ్గు కూడా పడుతున్నావా కవీ? ఆహ! ముఖం అంతా వెలిగిపోతుందే!
ఆ వెలుగేదో మాకు కూడా పంచిపెట్టు కవీ
మెమెల్లరూ సుఖించెదము నిన్ను అశీర్వదించెదము!

24, సెప్టెంబర్ 2015, గురువారం

ఎందుకు? ఏమిటి?

ఈ వీడియోలో Prof. Feynman చెప్పిన మాటలని తెలిగించాలని ప్రయత్నించాను. చాల శ్రమ అయిపోయేట్టు తోచింది. తెలుగించి సాధించేదేముందిలే అనిపించింది. Prof. Feynman ఆలోచన విదానము, మాటల్లో స్పష్టత చాల జాగ్రత్త గమనించాల్సి ఉంది. దీన్నే జీవితంలో అన్ని విషయాలపైకి అన్వయించుకొని ఎల్లరూ జీవితాన్ని అశ్వాదించుదురు గాక.

ఓ గణిత మేధావి!




ఒక్కో ఆలోచనా ఒక్కో మహా గణితాద్భుతం!
మాట మాటలోనూ సుస్వరం!
ఎంత జ్ఞానం ఎంత జ్ఞానం ఎంత జ్ఞానం!
అనంతం ముందు అసామాన్య వినమ్రత!
మాటలోని కటువైన స్పష్టత!
మెదడున కస్సుమని దిగే స్పష్టత!
అబద్ధం ఆడలేని నీ అమాయకత్వం!

మా మనసుల్లో నిన్నే చూస్తున్నాము,
చేతల్లో నిన్నే అనుకరిస్తున్నాము
నీ గురించే ఆలోచిస్తున్నాము
నువ్వు చూపించిన మార్గాన్నే నడుస్తున్నాము
నీ కలనే మా కలగా తపిస్తున్నాము.

ఒంటరిగా ఆలోచించమని మా తలలకు మమ్మల్ని వదిలేసినావు
మనసుని ఒప్పించుకోమని ఉపదిసించేవు.
మనసుని ఒప్పింప జేసే ప్రయత్నంలోనే మేము గణితాన్ని కనుగొన్నాము!
బలవంతుల్ని చేసావు మమ్ము మహానుభావా!
నీ ఋణమే ఈ అర్థవంతమైన ఆనందము!

ఊరేగింపులో భాజాభజంత్రీల్లో చివరి వరసలోని
సన్నాయి కిర్రు మందని ఏడ్చే వాళ్ళము మేము
ఆకాశ వీక్షణం చేయటం నేర్పించినావు మాకు పక్షిరాజుల ఓలే!
చూస్తున్నాము కొండలు కోనలు సముద్రాలు
అణువణువులో అర్థాన్ని! గణితాన్ని!
అగణితాద్భుత గణిత అద్భుతాలని!

---------------------
భౌతిక శాస్త్రవేత్త రిచర్డ్ ఫైన్మాన్ ని గుర్తు తెచ్చుకుంటూ.. 

22, సెప్టెంబర్ 2015, మంగళవారం

నస!

పడిపోద్ది పడిపోద్ది !
పడిపోయిందా?
ఓరిని! ఇంకా లేదా?

అద్దిగో!
పడిపోవాలి ఇంక మరి  ..
చూడు చూడు .. పడిపోతంది చూడు
హిహి
ఏంటి? ఇంకా పడలేదా?
పడద్ది పడద్ది చూస్తుండు ..

ఊరికే ఏం చెప్పట్లేదు!
అప్పుడు అలాగే మరి
ఇంకెప్పుడో కూడా అలాగే
అక్కడ అలాగే
ఇంకెక్కడో కూడా అలాగే
హిహి
పడిపోతందిగా అసలు, చుస్తన్నావా?

justu missu!
ఇందాకే పడిపోవల్సింది అసలు
కదండీ? అవును కదా?
హిహి
ఇందాక ఇంచుమించు పడిపోయిందనే అనేస్కున్నాంగా అసలు?
హిహి
fools!

సరే కాని, ఏంటి waiting ఆహ్?
మీరు కూడానా?
ఏంటి? మీరు కూడానా?!
హిహిహి
పిచ్చ నా కో!
ఓహ్ sorry!
మీ మంచి కోసమేనండీ!
మీ మీద అభిమానం అంతే ..
నాకేం లాభం చెప్పండీ?
ఇందాకటికి ఇప్పటికి తేడా చూడండి.. చూస్తున్నారా?
హిహి comedy!
complete smash అసలు చూస్తూ ఉండండి!

ఓడియమ్మ!
పడిపోయేదానికి ఎందుకురా గోల?
నిన్న గాలి కనుక ఈ రోజు వీచుంటేనా..
ఏ? కదా?
నిన్న?
మీరున్నారా?
గాలి?
నిన్నండీ ..
గాలి చూసారా మీరు?
ఈ రోజు ఏదో అదృష్టం అంతే
లేకపోతే ఇంత సేపా అసలు!
హిహి

ఏంటి హిందీ యా?
జరూర్ గిర్ జాయేగా!
ఏంటి foreign ఆహ్ మీరు?
It was falling and it will falling it almost falled అండీ .. just look and see?
నువ్వు లోకల్ ఆహ్ బాబూ?
ఏం పని పాట లేదా? పడిపొద్ది అదిప్పుడు ఎలానో ..
మ్మ్ .. ఏం బ్రాంచ్ తీసుకున్నావ్?
పర్లేదు ఇప్పుడు మళ్ళి boom వస్తుందిగా ..
focus చేయమ్మా చాలు.
ఇది ఇప్పుడు పడిపోవటం guaranty.
ఎందుకు time waste చేస్కుంటున్నావు?

finally!
చుస్తాన్నారా?
movement కనపడతందిగా అసలూ!
అదిగో ..
ఇంక smash యెహ్ ...
ఒకసారి పడిందనుకో ..
smash అలాంటి ఇలాంటి smash కాదు మరి
మటాష్ smash అనీ, ఒకటుంటదిలే..
మీరు విన్నారా ఎప్పుడైనా?
మహా smashu?
sorry, మటాష్ smashu ..
హిహి నేను చూడు నేను! మహా smash అంట!
ఏంటో అసలు నా jokes!
విన్నారా?
వినలేదా?
వినుదురు వినుదురు వినుదురు ..

చిలక్కి..
చిలక్కి చెప్పినట్టు చెప్పాను నేను
like one parrot I told అండీ..
వింటేగా
ఇప్పుడు చుడండి పడిపోవటం తధ్యం
మాష్టారు time ఎంత?
వాచీ లేదా? హిహి
ఈ రోజుల్లో అసలు వాచీలు ఎక్కడ వాడతన్నారు?
అందరు చెల్ ఫోనులే!
ఎంత ఉండి ఏం లాభం పడిపోద్దని తెలియట్లేదు

నీయమ్మ జీవితం మీ ఓపికలు మీరు!
ఎంత సేపు wait చేస్తార్రా?
అద్దిగో!
పడిపోవాలి ఇంక మరి  ..
చూడు చూడు .. పడిపోతంది చూడు
హిహి
ఏంటి? ఇంకా పడలేదా?

పడద్ది పడద్ది చూస్తుండు ..

అప్పుడు అలాగే మరి
ఊరికే ఏం చెప్పట్లేదు!
అప్పుడు కూడా అలాగే
అక్కడ అలాగే
ఇంకెక్కడో కూడా అలాగే
హిహి
పడిపోతందిగా అసలు, చుస్తాన్నవా?

justu missu!
ఇందాకే పడిపోవల్సింది అసలు
కదండీ? అవును కదా?
హిహి
ఇందాక ఇంచుమించు పడిపోయిందనే అనేస్కున్నాంగా అసలు?
హిహి
fools!

సరే కాని, ఏంటి waiting ఆహ్?
మీరు కూడానా?
ఏంటి? మీరు కూడానా?!
హిహిహి
పిచ్చ నా కో!
ఓహ్ sorry!
మీ మంచి కోసమేనండీ!
మీ మీద అభిమానం అంతే ..
ఇందాకటికి ఇప్పటికి తేడా చూడండి.. చూస్తున్నారా?
హిహి comedy!
complete smash అసలు చూస్తూ ఉండండి!


-----------------------------------------------------------------
నసనని లాభమని యసలనుకోను!
విసిగి కసిరిన విముక్తి యొసగదని తెలుసును. 
అటులని తీసియూ పారేయలేను!
చెవి కోసుకొని శ్రవణము కోల్పోయిన కలుగునేమో
కొసరైన సుఖము! అండ పిండ బ్రహ్మాండముల యన్నిటా తప్ప- 
ని సరిగా దాపరించు నస ప్రసాద విదాతలారా వంద వందనములు.



19, సెప్టెంబర్ 2015, శనివారం

మధ్యరాత్రి మనసులో మార్పు!

ఒకనాడు ఎవరో ఏదో ఆలపిస్తున్నారు,
చీకట్లో నేనా శబ్దాలను యాచిస్తూ ఆలకిస్తున్నాను!
వింటున్న ఆ మాటల గురించే ఓ తపస్సులా యోచిస్తున్నాను,
దశలుగా ఆ మాటలతో ప్రేమలో పడుతూ వస్తున్నాను!
విని విని నేను వశం తప్పుతున్నాను,
నేను వింటున్నానన్న అక్కరు వారికే మాత్రము లేదు!

పిల్లనుగ్రోవి చెవిలో వారు ప్రేమగా ఊదుతున్న రహస్య మేమిటో నాకు పూర్తిగా అర్థమైతే కాలేదు ..
ఆ వెదురు బొంగుదీ నాదీ ఒకే జాతి!
లోనున్న వెలితి మాయిద్దరికీ సరిగ్గా సమానం ..
కళ్ళని చెమ్మ చేసే ఇలాంటి తీపి సంగీతంలో  కాలాన్ని- ఖాళీలని మర్చిపోతుంటాము ..
సుస్వర మనే పదార్థమే లేకుండుంటే, మేమిద్దర మేనాడో మరణిం చుండే వాళ్ళమేమో!

------
ఈ మధ్యరత్రివేల మనసులో ఏమిటీ కొత్త మార్పు? నిద్ర రాకనా?
లేక కరుణ లేని యీ చీకటి రాత్రి, వారి ఆలోచన నాలో సృష్టిస్తున్న మార్ప?
ఏదేమైనా, నాలో శోకాన్ని నయం చేయటానికి జరుగుతున్న ఈ మార్పును మించిన మందు లేదు.
పిల్లనగ్రోవిలా ఏడవటానికి, నాకు దానికున్నని కనులు లేవు!
-------------------------------------------------------------------------------

ప్రేరణ: తెలుగు వాళ్లకి 'సఖి'గా తెలిసిన తమిళ చిత్రం 'అలై పాయుదే' (అల ఎగిసెనే)లోని కవి వైరముత్తు గారు రాసిన 'ఎవనో ఒరువన్ వాసిక్కిరాణ్' అన్న పాటకి కాస్త దూరపు అనువాదం ఇది. తెలుగులో 'ప్రేమలే నేరమా  ఓ నా ప్రియ' అని వేటూరి రాసినదానికి  - దీనికి ఏ మాత్రం పోలిక లేదన్న విషయం గమనించగలరు. తమిళ మాతృకలోని నిరాకార వర్ణననల ప్రయోగం ఈ పాటని ప్రేమ - విరహం స్థాయికి మించి చాల ఎత్తుకి తీసుకెళ్లిందని నా అభిప్రాయం. 


11, ఆగస్టు 2015, మంగళవారం

ప్రేయసి తలపు

- ప్రాణానికి అత్యంత ప్రియమైన రాగం
                    ఆరోహణం ఎగసి ఎగసి శిఖరాగ్ర తీవ్రతకు చేరి అక్కడే ఆ పై చరియలలో గమకంగా ఊగిసిలాడుతున్న తరుణం!

- ఓ మహానుభావుడు అత్యంత శ్రద్ధగా రాసిన పుస్తకం చదువుతుండగా
                    ఇంకొక పుట దూరంలో మహాసత్యం ఒకటి బోధపదిపోతుందని స్పృహకి వస్తున్న తరుణం.

- తప్పు పొల్లుపోకుండా గుక్కతిప్పుకోకుండా కొనసాగుతున్న కవితా పఠణం..
                     తరువాతి పంక్తిలో వెంట్రుకలు నిక్కపోడుచుకొనే వర్ణన రాబోతుందని తెలిసి ఆత్రం..

- ఎప్పుడో ఆకతాయిగా నాటిన పిచ్చి విత్తనం
                     ఓ ఉదయం అనుకోకుండా చూసేసరికి నన్ను పలకరించి నవ్వుతున్న పచ్చదనం..

- ప్రపంచంలో ప్రతి అణువుకి రుణపడి ఉన్నాననిపిస్తూ 
                      ప్రతి అణువుకి నాతోనే పని యనిపిస్తూ లోలోపల నిరాడంభరత వేషంలో తలకెక్కుతున్న గర్వం. 

- తెల్లారితే ఇంటికి బుజ్జి కుక్కపిల్ల వస్తుందని తెలిసి 
                     ఉత్సాహంతో నిద్రపట్టక ఆనందంతో మనసు పెడుతున్న కలవరం.. 

14, జులై 2015, మంగళవారం

స్పష్టంగా ఒక నాలుగు మాటలు

మనిషి తన జీవితంలో అత్యంత శ్రద్ధగా మరియు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన విద్య ఏమైనా ఉందీ అంటే అది  - స్పష్టంగా మాట్లాడగలగటం. మనిషిగా పుట్టి.., తన మనసులోని ఆలోచనలని పదాల రూపంలో పెట్టలేకపోవటం కంటే నిరుత్సాహకరమైనది, విషాదకరమైనది అయిన  విషయం మరొకటి ఉండబోదు.

స్పషత అంటే ఏమిటి? 

- లోపలి జ్ఞానాన్ని గౌరవిస్తూ.. మనసుని మోసగించకుండా పూర్తి నిజయతీతో మాట్లాడాలని పట్టి పట్టి ప్రయత్నించినప్పుడు స్పష్టీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మానసిక ఆరోగ్యం గలిగిన వారందరికీ జ్ఞానం ఒకే లాగ ఉంటుంది, అందుకనే అందరికి గణితం ఒకే లాగ అర్థమవుతుంది. ఒకరికి సరి అనిపించే గణిత తీర్మానం (theorem) జ్ఞానం పెట్టి చూసినప్పుడు మనుషులందరికీ ఒకే విధంగా సరి అనిపించి తీరుతుంది. తర్ఫీదు లేని కారణంగా అలా చూడలేకపోతే అది వేరే విషయం; కానీ ప్రయత్నించగా ప్రతి మనిషికి గణితం ఒకే లాగ అర్థమవుతుంది అనేది సత్యం. ఇందులో షరతులు లేవు. జ్ఞానం ఒక గణిత పదార్ధం, తర్కం అనేది ఆ లోపలి గణితాన్ని బయటి వాడుకభాషని కట్టిపెట్టే ఒక ఆధారం. మానవులు ఇంత వరకు కనుగొన్న గణితం అంతా ప్రతి ఒక్కరి మెదడుల్లోనూ పుట్టుకతోనే నిక్షిప్తమై యున్నదే. అయితే స్పష్టంగా ఆలోచించాలన్న ఈ తీవ్ర తపన ఉన్న కారణంగా గణిత శాస్త్రజ్ఞులు వాళ్ళ జ్ఞానంలోని లోతుల్ని తెలుసుకొని అక్షర రూపంలో (వాడుకభాషలో) ఆవిష్కరిస్తూ ఉంటారు; సామాన్యులు ఇది చెయ్యరు.. అదే వ్యత్యాసం. చెప్పొచ్చేదేమంటే పూర్తిగా తర్క నియమాలకు మర్యాద ఇస్తూ  వాడుకభాషలో మాట్లాట్టమే స్పష్టంగా మాట్లాట్టం. ఇది ఎలా చెయ్యాలి అనేది మన జ్ఞానాన్ని అడిగితే అదే చెప్తుంది! నిజాయితీగా జ్ఞానాన్ని అడుగుతున్నామా లేదా అనేది ఆత్మసాక్షి పర్యవేక్షిస్తుంది! ఆత్మసాక్షి (honesty) లేని వాళ్లకి స్పష్టంగా మాట్లాట్టం అంటే ఏంటో కూడా అర్థం కాదు!

స్పష్టంగా మాట్లాడితే లాభం ఏమిటీ?

- "నీ మనసులోని ఒక విషయాన్ని  అక్షర రూపంలోకి సందిగ్ధత లేకుండా తర్జుమా చేయలేకపోతున్నావు అని తెలిస్తే..  ఆ విషయం అసలు నీకు అర్థమే కాలేదని అర్థం చేసుకో!" అని నా గురువుమిత్రుడు సోలమన్ ఉపదేశించిన మహా వాక్యం తరచూ గుర్తుకొస్తూ ఉంటుంది నాకు. ఈ వాక్యానికి converse  కూడా సత్యమే. అంటే.. "సందిగ్ధత లేకుండా అక్షర రూపంలో ఒక విషయాన్ని వ్యక్త పరచగలిగిన నాడు నీకు ఆ విషయం బోధపడిందని అర్థం చేసుకో" అని. అంటే, ఎన్ని వాక్యాలు స్పష్టంగా రాయగలిగితే అన్ని విషయాలు అర్థమయినట్టు లెక్క! ఎన్ని అస్పష్ట మాటలు మాట్లాడితే అంత ఆత్మవంచన చేస్కుంటున్నామని లెక్క. జీవితంలో వేరే వ్యాపకం లేకపోయినా.. కేవలం మాటల్లో స్పష్టత కోసం ప్రాకులడినా చాలు, జ్ఞానానికి దారులు వాటికి అవే తెరుచుకుంటాయి! ఎందుకంటే, మాటల్లోని స్పష్టత కోసం చేసే ప్రయత్నాలు అనేకానేక ప్రశ్నలని లేవనెత్తుతాయి .. నిజాయితీగా ఆయా ప్రశ్నల్ని నివృత్తి చేసుకొని మళ్ళి మళ్ళి వాక్యాల్ని అమర్చే ప్రయత్నంలో మన లోపలి జ్ఞానం మనకే ఆవిష్కృతం అవుతుంది. 'అర్థం చేసుకోటం' అన్న ప్రక్రియలోని ఆనందానికి అలవాటు పడ్డ ప్రాణాలకి దాని లాభం ఏంటో ప్రత్యేకించి పరిచయం చేయాల్న? అర్థం చేసుకోటంలో ఆనందం చూడలేని మనిషుంటాడనుకోను. సాధ్యం కాదు. ప్రయత్నం చేయని దుర్భాగ్యులు అయితే ఉంటారు బహుశా.

సమయం సందర్భం ఉండక్కర్లేదా?

- తర్కం విఫలం అయినప్పుడు (అర్థంపర్థం లేకుండా వాగినప్పుడు) అది సాధారణంగా (safe situationsలో) హాస్యంగా మారుతుంది. కాని తర్కం విఫలమైంది అన్న విషయం judge చేయటానికిగాను కాస్త తర్ఫీదు అవసరం. తర్ఫీదు వల్ల పొందిన మానసిక పరిపక్వత స్థాయితో పాటే sense of humor వైశాల్యం కూడా పెరుగుతుంది. ఉదాహరణకి కార్టూన్ బొమ్మలు ఫిజిక్సుకి అతీతంగా వంగిపోతుంటే సాగిపోతుంటే పిల్లలు నవ్వుతుంటారు.. ఏమంటే వాళ్ళకున్న జ్ఞానానికి అవి illogicalగా కనిపిస్తాయి, ఆ absurdityని చూసి పిల్లలు నవ్వేస్కుంటూ ఉంటారు. కాస్త ఎదిగిన వాళ్ళ జ్ఞానానికి అవి ఉత్త చేతి గీతలని తెలిసిపోయి absurdity మాయం అయిపోతుంది. అందుకనే నవ్వు రాదు. కాని, ఇంకాస్త జ్ఞానం పెంచుకుంటే ఆ బొమ్మలు గీసేవాణి చమత్కార శీలాన్ని గమనిస్తూ నవ్వుకోవచ్చు. అందుకనే అన్నీ తెలిసిన జ్ఞానులకి ఏది చుసిన నవ్వొచ్చేస్తుంటుంది! తర్కపరంగా సరియైన విషయాన్నీ అర్థం చేసుకోలేక, absurd అనుకొని నవ్వేస్తే అది వెలికితనం అవుతుంది. ఆలోచనలో (ఫలితంగా వాక్కులో) స్పష్టత పెరిగేకొద్దీ వెకిలితనం తగ్గుతూ వస్తుంది. ఒక చేత్తో ఈ వెకిలితనం నుంచి మనసుని రక్షించుకుంటూ మరొక చేత్తో హాస్యం అనిపిస్తున్న దాన్ని ఆస్వాదిస్తూ  బ్రతకటం కత్తి మీద సాము లాంటిది. కాబట్టి, స్పష్టంగా మాట్లాట్టం అనే విద్యని బాగా పెంపొందించుకొని, అస్పష్ట ప్రేలాపనలోని comedyని ఆశ్వదించటం అనేది win-win వ్యూహం!  అవును సమయానికి తగు మాటలాడవలెను మరి!

మొత్తంగా?

- ఎంత విరుద్ధాభిప్రాయాలు ఉన్న వ్యక్తులైనా సరే, పూర్తి భిన్నమైన ఇతివృత్తాల నుంచి వచ్చిన వారైనా సరే..  కూర్చొని స్పష్టంగా మాట్లాడుకుంటే తర్కం సహాయంతో ఏకాభిప్రాయానికి వచ్చి తీరతారు. మానవులందరూ తర్కానికి ఏకీభవించటానికి గల కారణం పరిణామ క్రమంలో మిగిలిన జీవులన్నిటితో పోటీపడుతూ మనవ ప్రజ్ఞ రూపుదాల్చుకున్న తీరులోనే ఇమిడి యున్నదేమో ననిపిస్తుంది. బహుశా పరిణామ క్రమంలో మానవ మనుగడకి ఏకాభిప్రయాలు చేరుకోవటం అలవరచుకోడం అనే లక్షణం struggle for survivalలో ఎంతగానో ఉపకరించి ఉండాలి. ఏ సమాజాల్లో అయితే ప్రజలు తమని తాము స్పష్టంగా వ్యక్తపరుచుకొనే స్వేచ్చా వాతావరణం పరిస్థితులు కల్పించబడి ఉంటుందో, వాక్కులో హేతుబద్ధతని  శ్రద్ధగా ఆలకించే సంస్కారంగా గల్గిన ప్రజలు ఉంటారో.. ఆయా సమాజాలు వైపరిత్యలను ఎదుర్కొని పురోగమిస్తాయి. తర్కానికి కట్టుబడి క్రమంగా నడుస్తాయన్న నమ్మకంతోనే కోర్టులు, చట్టసభలు అభిప్రాయ బేధాలను తొలగించే వ్యవస్థలుగా మానవులు నియమించుకున్నారు. ఈ వ్యవస్థల్లో జరిగే స్పష్టమైన తార్కిక చర్చలు వాదనలే ఎప్పటికైనా సమాజాల్ని ఉద్ధరించి మనుషుల్ని ఏకం చెయ్యాలి. వితర్క వితండ వాదనలు - భక్తిని భయాన్ని బేధాలని ప్రేరేపించి  కృత్రిమమైన ఐక్యమత్యాన్ని తాత్కాలికంగా తీసుకురవోచ్చేమో కాని, సహజమైన ఏకత్వం జ్ఞానం వాళ్ళ గాక మరి దేని వల్లా సాధ్యం కాదు.

(ఈ తరహాలో ఆలోచించినప్పుడు - 'అసలు భూమి, భూమి మీద జీవం ఉణికి - వీటికి అతీతంగా 'తర్కం' అనే సత్యం ఆదినుంచి (?) ఒకటుండి ఉంటుందా? ఏక కన జీవితం నుంచి ఈ సత్యాన్ని explore మరియు exploit చేసుకుంటూ ప్రాణి చివరికి మానవ 'స్థితికి' పరిణామం చెంది ఉంటుందా? వంటి ప్రశ్నలు సైతం తలెత్తుతూ ఉంటాయి. కాని, "భూమి మీద జీవం ఉనికి ఆరంభానికి ముందు.." అనే ఆలోచన చేయనారంభించిన  క్షణమే మనకి తెలిసి రావాలి, ఇదంతా ఆలోచిస్తుంది మానవ ప్రజ్ఞేనని.. అందుకనే బహుశా తర్కమే ultimate reality అని  'మనకి' అనిపిస్తుండొచ్చని. మెదడు చెడితేకాని illogical illusions వాస్తవాలుగా తోచవన్నది ఇంకొక సత్యం. మరైతే ఈ Illogical illusions కూడా logical realities లో subsetsగానే ఉంటాయన్నది నా అభిప్రాయం. దీన్ని మరొక వ్యాసంలో కూలంకషంగా, వీలైనంత స్పష్టంగా వ్యక్తపరచటానికి ప్రయత్నిస్తాను.)

చివరిగా?

- స్పష్టంగా మాట్లాట్టం ఏమంత సులువు కాదు. వాడుక భాష మీద దృడమైన పట్టు చాల అవసరం (అసలు దీనికే ఒక జీవితకాలం కృషి అవసరమవుతూ ఉంటుంది). ముఖ్యంగా సరైన పదాల ఎన్నిక, వ్యాకరణ ప్రయోగం, తర్క నియమాలు..  వీటిని చాల నేర్పుగా ఉపయోగించుకొని మాటలోని స్పష్టతని fortify చేసుకోవాలి. అంతకంటే ముందు ఆత్మసాక్షికి ఆ ఆలోచనని బాగా నిశితంగా పరీక్షించే అవకాశం, సమయం కల్పించాలి. అలోచించి నిదానంగా మాట్లాడినా పర్లేదు, అర్థవంతంగా స్పష్టంగా మాట్లాడాలి. ఒక సారి చెప్పిన మాట సంతృప్తికరంగా అనిపించకపోతే మరమ్మత్తు చేసి మళ్ళి చెప్పవచ్చును. తప్పేమీ లేదు. మన అజ్ఞానాన్ని మనమైన క్షమించుకోలేకపోతే  ఇంకెవరు క్షమిస్తారు? ఇలా ప్రయత్నించగా ప్రయత్నించగా .. ఏదోక రోజు జీవితంలో అర్థం చేసుకున్నామని మనల్ని మనం సంతృప్తి పరుచుకోటానికి  ఖచ్చితంగా స్పష్టంగా ఒక నాలుగు మాటలు మిగులుతాయి. నాణ్యమైన జీవితం జీవిస్తే ఈ నాలుగు మాటల్లోనే మొత్తం జీవిత పరమర్థాన్నే ఇమిడ్చే స్థాయి జ్ఞానం బోధపడుతుందేమో? ఎవరికి  యెరుక? జీవితం మొత్తం వాక్కులో ఆలోచనలో స్పష్టత కోసం ప్రాకులాడటానికి మించిన పవిత్రమైన, ఉన్నతమైన, సాటిలేని  కార్యం మరొకటి ఉందనుకోను. 

12, జూన్ 2015, శుక్రవారం

ప్రేయసి నవ్వు

ఏమన్నావు..? ప్రేయసి నవ్వు మీద కవిత్వం రాద్దునా?
పదాలు నువ్విస్తావా మరి?
ఎలాంటి పదాలు కావాల్న? సరే చెప్తాను విను -
            - symmetry, simplicity, complexity: అన్నిటినీ కలిపి ఒకే పదంలో ఇమిడ్చి ఇయ్యగలవా?
            - beauty, beauty, beauty, beauty, beauty: ఒకే పదంలో అన్ని సార్లు 'అందం' ప్రతిధ్వనించి వినిపించాలి. అలాంటివి వెవ్వేరు పదాలు  ఒక అరడజను.
            - అంతం + ఆరంభం: రెండు అర్థాలు ఒకేసారి ఉండే పదాలు ఒక రెండు.
            - నెలవంకనీ చుక్కనీ కలిపి ఏమంటారు? ఒకే పదంలో చెప్పాలి! అదొక పదం కావాలి. వీలైతే ఓ పర్యాయపదం.
            - 'కరడుకట్టిన కారుణ్యం' - వినటానికి ఎలా ఉంది? అలాంటి పదం ఒకటి.
            - బలమైన తుమ్ము తర్వాత కళ్ళలో ఉండే ప్రశాంతత ఉంటుందే? దాన్ని కవిత్వంలో ఇమిడిపోయే లాంటి అందమైన పదంగా మార్చి కావాలి.
            - ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి, నిలువుగా, తలక్రిందులుగా - ఎలా చుసిన ఒకే అందం ఇచ్చే చమత్కారం పదాలు ఓ 888 కావాలోయి!
            - చిన్నప్పుడు గుర్తుందా? చీకట్లో వర్షం పడుతుంటే ఒక పెద్ద మెరుపు వచ్చేది .. ఉన్నట్టుండి అంతవరకు చీకట్లో ఉన్న ప్రపంచం క్షణం పాటు పగలు లాగ కనిపించేది? అప్పుడు మనసులో కలిగిందాన్ని ఏమని వర్ణించాలి? భయమా? ఆశ్చర్యమా? ఏదో అందం అర్థమైందన్న సంబరమా? అలాంటి భావనల్ని వర్ణించే పదం కలదా?
            - నీటి అడుగున ఊపిరి బిగబట్టి, ఒక నిమిషం వరకు అలానే బిగబట్టి, ఇంకొక నిమిషం కుడా బిగపట్టి, మూడో నిమిషం కూడా బిగబట్ట ప్రయత్నించి, ఇక ఆపుకోలేక  గబాలున పైకి వచ్చి అంత శ్వాసని ఒకేసారి పీలుస్తున్నప్పుడు ఊపిరి మీద తప్ప వేరే దేని మీదకి దృష్టి పోనీ అనుభూతి తెలుసునా నీకు? దాన్నేమంటారు?
            - మొదటిసారి సముద్రం అలల చివర్న సాహసంగా తొక్కి.. నీళ్ళు చల్లగా ఉన్నాయని ఎవరికైనా చెప్పాలనిపించే అత్యుత్సాహం. ఆ భావనని సరిగా అభివర్ణించే పదం.
            - కరుణకు పరవశించి పోయే బుజ్జి కుక్కపిల్ల పశుత్వంలోని అమాయకత్వము! దీనికో పదం కలదా? అది చివరిగా నా మనసుని వర్ణించుకోటానికి!

నా ప్రేయసి నవ్వుని వర్ణించాలనుకోవటం సూర్యకిరణాన్ని విరిచి జేబులో పెట్టుకోవాలనుకున్నంత వెర్రి ప్రయాస!
ఆ నవ్వు  వెలుతురులో photosynthesis చేసుకొని, గుండె దాహం తిరటానికి సరిపడా cardio-hydrates సమకూర్చుకొంటే దానికదే ఒక ముగింపు!